ఆదివాసుల పొలికేక – ‘అడవి తల్లి ‘

సాధారణం

januఇదివరలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన “నాన్న” పుస్తకాన్ని పరిచయం చేసుకున్నాం. కేరళలో హిందీ ప్రొఫెసర్ ఈచర వారియర్ వేదనాభరిత గాధను సి. వనజ తెలుగు పాఠకులకు అందించారు. అదే కేరళనుంచి మరో గొప్ప పుస్తకాన్ని అదే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఆ పుస్తకం సి. కె. జాను అసంపూర్తి ఆత్మకథ “అడవితల్లి”ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

2003 ఫిబ్రవరి 19వ తేదీన కేరళలో వైనాడ్ జిల్లాలోని ముతాంగ రిజర్వ్ ఫారెస్టులో ఆందోళన చేస్తున్న గిరిజనులపై జరిపిన పోలీసు కాల్పులలో ఒక గిరిజనుడు, ఒక కానిస్టేబుల్ చనిపోయారు. అప్పుడు ఆ ఆందోళనలో ప్రముఖంగా వినిపించిన పేరు సి. కె. జాను. ఎలాంటి సర్టిఫికేట్లు, డిగ్రీలు లేని జాను పాఠశాల చదువుకు చాలా దూరం. కేరళ ప్రభుత్వం చేపట్టిన ‘అక్షరాస్యత’ కార్యక్రమాల్లో చదవడం, రాయడం నేర్చుకున్న జాను ఆ తరువాత ఒక ప్రజా ఉద్యమానికి నయకురాలవడం యాదృచ్చికం కాదు. మూడు పదుల ప్రాయం నిండకుండానే భారతదేశమంతటా పర్యటించి, నాలుగు పదులలోనే ప్రపంచమంతా చుట్టివచ్చి ఆదివాసీల అసలు సిసలు సమస్యల గురించి, పరిష్కారాల గురించి సభలలో, సమావేశాలలో కీలక చర్చలకు పెట్టడం అపురూపమైన విషయం.

అబ్బురపరిచే తన జీవనయానాన్ని సి. కె. జాను మలయాళంలో చెప్పుకుపోతుంటే ఆంగ్లవార పత్రిక ‘ది వీక్’లో చిత్రకారుడు భాస్కరన్ అక్షరరూపమిచ్చారు. దానిని ఎన్. రవిశంకర్ ఇంగ్లిషులోకి అనువాదం చేయగా, ప్రముఖ స్త్రివాద రచయిత్రి పి. సత్యవతి తెలుగు పాఠకులకు అందించారు. ఎంతో సరళంగా, సాఫీగా సాగిన అనువాదం మనలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది.

రెండే భాగాలుగా సాగిన ఈ అసంపూర్తి ఆత్మకథలో చెప్పిన విషయాలే ఇంత హృద్యంగా ఆకట్టుకుంటే చెప్పని విషయలు ఇంకెంత ఆసక్తికరంగా వుంటాయోకదా అనిపిస్తుంది. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అమ్మాయి జాను ప్రకృతిలో ఎలా మెలిగిందో, ఎలా పెరిగిందో, ప్రకృతి శక్తిగా ఎలా ఎదిగిందో ఈ పుస్తకం చెప్తుంది. దుర్భరమైన పేదరికం కావడంతో తల్లి జానును వేరే ఊర్లో మేరీ కుట్టి అనే టీచర్ కూతుర్ని ఆడించే పనిపిల్లగా గడిపి, ఆవిడకు వేరేచోటికి బదిలీ అయినతర్వాత సొంతగూటికి చేరుకుంటుంది. ప్రకృతి సంపదంతా తమదనుకునే గిరిజనం చిందిస్తున్న స్వేదానికి ఖరీదుకట్టే షరాబులా మధ్యలో భూస్వామి రావడం వారికి అయోమయం కలిగించే అంశం. ఆదివాసీల బలహీనతలను ఆసరాగా చేసుకుని భూస్వాములు కొనసాగిస్తున్న ఆగడాలను మౌనంగా భరించడం అలవాటు చేసుకున్నారు.

ఆ క్రమంలోనే భూస్వాములకు వ్యాపారులు, దళారులు తోడై జలగలుగా మారి రక్తాన్ని పీల్చేస్తూ, మరోవైపు తమ సొంత ప్రకృతిలో ఉనికికూడా కనుమరుగైన వేళ వారికి కనువిప్పు కాకపోతే ఇక అంతే. ఆ జాతి మనుగడలో వుండదు. దీనిని గుర్తెరిగిన జాను ప్రజలను సమీకరించి ఉద్యమించింది. జాను చెప్పిన కథలో అంతర్లీనంగా వున్న మరికొన్ని అంశాలను మనం తప్పక గమనించాలి. దోపిడీ నూతన రూపాల్లో జరగడాన్ని ఆమె వర్ణిస్తుంది. ధనిక భూస్వాములు కటిక బీదలైన ఆదివాసీ స్త్రీ పురుషులను నలుగు చుక్కల సారా, బీడీకట్ట, ఒక్కోసారి చీర చూపించి దోచుకుంటున్నారని చెప్పినప్పుడు కోపమొస్తుంది. ఇవికూడా ఇవ్వకుండానే కొత్త రకంగా వారి భుజాలమీద చేతులువేసి మాట్లాడి, తమ ఇళ్లలో భోజనం పెట్టి, మర్యాదలు చేసి వారి సర్వస్వాన్ని దళారులు దోచుకుంటున్నారని ఆమె నోటివెంట విన్నపుడు ఆవేశం కట్టలు తెగుతుంది. కానీ పేదలపక్షమని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలు సైతం వెర్రిపోకడలు పోతుంటే కోపం ఆవిరవుతుంది. నిస్సహాయులమవుతాం.

(హెచ్. బి. టి ప్రచురణ ‘నాన్న’లో కూడా ప్రొఫెసర్ ఈచర వారియర్ చేతికి అందివచ్చిన కొడుకును పోగొట్టుకున్నపుడు పార్టీలోని పెద్దపెద్ద నాయకులు కూడా సహాయం అందించకపోవడం గురించి మాత్రమే కాకుండా న్యాయపోరాటంలో ఎలా అడ్డుతగిలిందీ వివరించారు.)  అదే కేరళ రాష్ట్రంలో పార్టీ గిరిజనులను సైతం ఎలా ‘వాడుకుంటోందో’ జాను మాటల్లో వింటే చాలా బాధనిపిస్తుంది. అన్ని పార్టీల్లో మాదిరిగానే కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యంతే వుండడం మనం చూస్తున్నదే. జాగ్రత్తగా గమనిస్తే జిల్లాస్థాయి నుంచి దేశస్థాయివరకు అన్ని రాష్ట్రాలలోనూ ఈ చోద్యం మనం గమనించవచ్చు. అదేమిటంటే పార్టీ కార్యకర్తలు జీవితాంతం అలాగే (అంటే పోస్టర్లు అంటించడంలోనూ, జెండాలు మోయడంలోనూ) గడుపుతున్నారు. ఒక్కో కేడర్ నాయకుడు మాత్రం దశాబ్దాల తరబడి కుర్చీకి అంటుకుని వదలకపోతే ఎవరుమాత్రం ఏం చేయగలరు?తరతమ భేదం లేకుండా అన్ని పార్టీల్లోణూ, సంఘాల్లోనూ ఇది గమనించవచ్చు. అటువంటి సంకుచిత దృక్పథాల మధ్య ఇమడలేకపోయిన జాను స్వతంత్రంగా పోరాటం ప్రారంభించడం అనివార్యం.

సి. కె. జాను పరిమిత సంఖ్య బలగంతో శక్తిమంతమైన సామ్రాజ్యంతో, ఢీకొంటున్నది వేలాది ఎకరాల భూమిని సెజ్ ల పేరిట తనకిచ్చేయమని కాదు. ఐటి పార్కులకో, బిటి పార్కులకో కోట్లాది రూపాయల ప్రభుత్వ సబ్సిడీ కానే కాదు. వారడుగుతున్నదల్లా వాళ్ల ఆకాశం, వాళ్ల నీరు, వాళ్ల నేల, వాళ్ల కొండలు వాళ్లకుంచేయమని. అవేవీ మన ప్రభుత్వాలకు నచ్చవు. అందుకే నిరసన ప్రదర్శకుల మీద కాల్పులు జరిపించడాలు, రౌడీమూకల్ని పేదల గుడిసెల మీదకు పంపించడాలు.

అసలు సిసలు భారత నిర్మాతలు సి. కె. జానులాంటి మహిళలే. రండి ఇలాంటి వ్యక్తుల మాటలు ఆలకించడానికైనా ఈ పుస్తకం చదివితీరాలి.

అడవితల్లి (సి. కె. జాను అసంపూర్తి ఆత్మకథ)

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s