కొండను తవ్వి….

సాధారణం

toletiవైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు.

ఆ విషయం చాలామందికి తెలియదు. “ది మౌల్డ్ ఇన్ డాక్టర్ ఫ్లోరేస్ కోట్ : ది రిమార్కబుల్ ట్రూ స్టోరీ ఆఫ్ ది పెన్సిలిన్ మిరకిల్” అన్న పుస్తకం (2004)లో ఎరిక్ లాక్స్, పెన్సిలిన్ తయారీ కృషిలో నార్మన్ హీట్లే పాత్రకూడా మరువలేనిదని చెప్తాడు. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమిం ఆ పెన్సిలిన్ తెట్టు వలయాన్ని మొదటిసారి చూసి, నోట్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఒక దశాబ్దం తర్వాత ఫ్లోరే, అతడి సహచరుల సమష్టి కృషితో పెన్సిలిన్ తయారయిందని ఎంతమందికి తెలుసు? రెండో ప్రపంచ యుద్ధం నుంచి పెన్సిలిన్ విరివిగా వాడకంలోకి వచ్చాక కతంతా మనకు తెలిసిందే. 

* * *

1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన ఏడుగురు ప్రభువుల్లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏలుబడిలో కేవలం 10 సంవత్సరాల (1938 సత్యాగ్ర్హ ఉద్యమం నుంచి 1948 రజాకార్ ఉద్యమం వరకు) దుర్మార్గ పాలనను మొత్తం అతడి పరిపాలనకు, అంతకంటే అన్యాయంగా మొత్తం నిజాముల పాలనకు ఆంటగడుతున్నాం.

ముల్కి : ముస్లిం సాహిత్య సంకలనంలో ‘వక్రీకరణకు గురైన ముస్లిం పాలకుల చరిత్ర – నిజాం చరిత్రకు చెదలు ‘ అన్న వ్యాసంలో సంగిశెట్టి శ్రీనివాస్ ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్తారు. చిత్రమేమిటంటే ఆ ‘దుర్మార్గ ‘ నిరంకుశ ఏడో నిజాం 1967లో మరణించినపుడు శవయాత్రలో లక్షలాది జనం పాల్గొన్నారు. అంతకంటే వింత – నిజాంకు సంతాపం ప్రకటించిన నిండు శాసనసభలో పోటీలుపడి కాంగ్రెస్, రిపబ్లిక్, కమ్యూనిస్ట్, జనసంఘ్ నాయకులు ఆయనను, ఆయన సేవలను కొనియాడడం.  ఈ వ్యాసంలో శ్రీనివాస్ ఒక అప్పీల్ చేస్తారు. చరిత్రగతిలో వక్రీకరణకు గురైన, తెరమరుగైన తెలంగాణ ముస్లిం సాహిత్య వికాసాన్ని, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రజా చైతన్యానికి వారధులుగా నిలిచిన యోధులను నేటి తరానికి సమగ్రంగా పరిచయం చెయ్యాలంటారు.

* * *

రష్యాను ఏలిన పాలకుల్లో అత్యంత కౄరుడిగా ముద్రపడిన జోసెఫ్ స్టాలిన్ మరీ అంత ‘పచ్చి నెత్తురు తాగే రకం’ కాదంటూ తోలేటి జగన్మోహన రావు మనకీ ‘రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా’ పుస్తకంలో చెప్తారు.

ఇదంతా చరిత్ర రచనాక్రమంలో జరిగిన తప్పిదాలను (!) దిద్దుబాటు చేసే ప్రయత్నం. ఇదో నూతన సాహిత్య ప్రక్రియగా ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. కొన్నిసార్లు తప్పుడు వ్యూహాలతో, మరికొన్ని సార్లు ఒక వర్గ ప్రయోజనాన్ని కాపాడే ముందస్తు జాగ్రత్తలతో అరుదుగా ఇంకొన్నిసార్లు అప్పటి ప్రపంచానికి వాస్తవాలు తెలియక చరిత్ర రచనలో ఏర్పడిన మకతికలను తొలగించి తిరిగి రాయాలంటే… వాస్తవాలు తెలియజెప్పాలంటే ఆ పని కొత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే ఆయా సంఘటనలమీద, వ్యక్తులమీద, సిద్ధాంతాలమీద, పాత అభిప్రాయాలు, పాత వాదనలు, పక్షపాత నిందలు, దుష్ప్రచారాలు అప్పటికే జనబాహుళ్యంలో నిస్తృతంగా ప్రచారమై వుంటాయి. నిశితమైన పరిశోధన చేసి, నికషమైన ఫలితాలను పొంది, నిష్పక్షపాతంగాకొత్త వాదన (పాయింట్ ఆఫ్ వ్యూ)ను కొత్త తరం పాఠకులకు తెలియచెప్పాల్సి వుంది. అంతకంటే ముందుగా, ముఖ్యంగా ఏ వర్గం, ఏయే ప్రయోజనలను ఆశించి ఆ పాత ప్రచారం ముమ్మరంగా గావించిందో వివరించాలి. ఆ విషయాల పట్ల కొత్తచూపు పొందడం వల్ల పాఠకుడికి చేకూరే ప్రయోజనమేమిటో స్పష్టపరచాలి. ఇదంతా చేయగలిగితే చరిత్ర దిద్దుబాటు రచనలు తమ ప్రయోజనాన్ని సాధించినట్లు. ప్రక్రియాప్రంగా తెలుగు సాహిత్యానికి కొత్తదేమీ కాకపోయినప్పటికీ, అరుదుగా జరిగే ప్రయత్నమిది.

ప్రపంచీకరణ నేపథ్యంలో మన జీవితంలో ఏర్పడిన అల్లకల్లోలాన్ని, గందరగోళాన్ని చక్కటి వ్యంగ్య అధిక్షేపణలతో ‘లక్ష్మీకటాక్షం’, ‘కప్పడాలు ‘ వంటి కథలలో చిత్రించిన తోలేటి తెలుగు సాహితీప్రియులకి చిరపరిచితులు. తన శైలికి భిన్నంగా ఈమారు ఒక బృహత్తర బాధ్యతను తన భుజానవేసుకుని, చరిత్రలో జరిగిన ఒక పక్షపాత ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టడానికి లోతైన పరిశోధన చేశారు. ఫలితాలు ఈ ‘రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా’ పుస్తకం ద్వారా వెల్లడించారు. బూర్జువా చరిత్రకారులు స్టాలినుకు అంటించిన బురదను కడగడానికి చేసిన ప్రయత్నమే ఈ గ్రంథ రచన. 

‘తొలిపలుకు’లోనే ఈ పుస్తకం ఉద్దేశం స్పష్టంగా చెప్పారు. ఇదంతా స్టాలిన్ గురించి కాదు. పెద్ద ఎత్తున సైన్యంతో ఆయుధాలు, బలగంతో జర్మనీ రష్యాపై యుద్ధానికి తెగపడింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పెద్ద దేశాలకు ‘కమ్యూనిస్ట్ రష్యా’ అసలు నచ్చడం లేదు. ఎటునుంచి, ఎటువంటి సహకారంలేని స్టాలినిస్టు రష్యా మొదట్లో ఓడిపోయి (నట్టయి) మళ్లీ ఒక్కసారి తన శక్తులన్నింటినీ కూడదీసుకుని యుద్ధరంగంలో విజృంభించి ఎలా జర్మనీని ఓడించగలిగిందనేది చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశం.  కళ్లు మిరముట్లు గొలిపే రష్యా విజయం వెనక, అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసిన అప్పటి ఆ దేశపు ఏలిక స్టాలిన్ కృషి, శ్రమ ఎంతోవుంటుంది. వాటిని అంచనా వేయడం ద్వారా స్టాలినుకు పునర్ వైభవం కల్పించినట్టవుతుందని రచయిత ఆశ.

ఇందుకుగాను తాను చెప్పదలచుకున్న అంశాన్ని పది అధ్యాయలుగా విభజించుకున్నారు. యువ విద్యార్థులకు పాఠం చెప్పే తరహాలో సరళాతి సరళమైన రీతిలో విషయాన్ని వివరించుకుంటూ వచ్చారు. ఇందువల్ల అక్కడక్కడా పునరుక్తులు తప్పలేదు. ఈ విషయాలు మనకిలా అందివ్వడానికి మార్షల్ ఝుకోవ్ లాంటి ‘లోపలి’ మనుషుల రచనలమీదా, జోసెఫ్ డేవిస్ లాంటి ‘బయటి’ మనుషులమీదా ఆధారపడ్డారు. సోషలిస్టు రష్యా విజయగాధను వర్ణించడంలో లీనమైన రచయిత తెలుస్తూనో, తెలియకుండానో స్టాలిన్ ఆరాధనలో పడిపోతారు. ఇదే ఈ పుస్తకంలో కనిపించే పెద్ద లోపం. ఇలా తన్మయంగా చేసే స్టాలిన్ భజనవల్లే ‘తొలిపలుకు’లోని ఉద్దేశం పక్కదారి పట్టడమే కాకుండా ఎలాంటి వాక్యాలు రాయవలసి వచ్చిందో చూడండి: ‘శత్రువుతో చేతులు కలిపి సోవియట్ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి ప్రయత్నించిన వారిని (స్టాలిన్) నిర్దాక్షిణ్యంగా అణచివెయ్యడం జరిగింది. శత్రు పంచమాంగదళ నిర్మూలన కార్యక్రమంలో అనివార్యంగా కొంతమంది నిరపరాధులు కూడా బలయ్యారు.‘ (పేజీ. 6) అంతేకాదు, 207వ పేజీలో పోల్చి చూపించిన రాజకీయ ఖైదీల వివరాలున్నాయి. (1939లో మొత్తం ఖైదీల సంఖ్య 20 లక్షలు మాత్రమే. ఇందులో 4,54,000 మంది మాత్రమే రాజకీయ ఖైదీలు. 1937 – 39 కాలంలో లేబర్ క్యాంపుల్లో మరణించిన ఖైదీల సంఖ్య 1,60,000 మాత్రమేనట.) అయితే వాక్యం ప్రారంభంలో ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం’ అని రచయిత చేర్చడం మరిచిపోలేదు. ఈ పుస్తకం చదవడం పూర్తిచేశాక స్టాలిన్ మీద తప్పక సానుభూతి కలుగుతుంది. అంతవరకు రచయిత సఫలమైనట్టే. ఆనక జార్జి ఆర్వెల్ రాసిన “ఏనిమల్ ఫామ్” నవలను చదవడం వల్ల పాఠకులకు వింత అనుభవం కలగడం తథ్యం. 

చిన్నమాట: ఎంతో శ్రమకోర్చి వేలాది పుటలు చదివి, గాలించి, సేకరించిన సమాచార గుచ్ఛమంతా చివర్లో చేర్చిన ‘ముఖచిత్రం గురించి’ అన్న రెండు పేజీల వ్యాసం ముందు తేలిపోతుంది. అందులోనూ చివరి రెండు పేరాగ్రాఫులూ అక్షర సత్యాలు.

రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా (తోలేటి జగన్మోహన రావు)

సూర్య ప్రచురణలు, హైదరాబాద్

పేజీలు 294 వెల రూ. 150.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s