ప్రపంచీకరణ్ వెర్సస్ పతనీకరణ

సాధారణం

ప్రతి ఏడాది ఎంతో నిష్టగా తెలుగు కథా సాహిత్యాన్నంతా కాచివడపోసి, ఆణిముత్యాల్లాంటి కథలను ఏరి, కథా సిరీస్ మనకందిస్తున్న కథా సంకలనలలో ‘కథ – 2002’ ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. ఆర్థిక సంస్కరణల పేరిట గ్లోబలైజేషన్ కు ప్రపంచ దేశాలు వ్యాపార ద్వారాలు బార్లా తెరిచినపుడు ఏర్పడిన పరిణామాలు (మంచివి కానివ్వండి, చెడ్డవి కానివ్వండి) ఆయా దేశాల ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తూనే వుంటాయి. ఇదే విషయాన్ని ఈ కథా సిరీస్ ఎడిటర్ పాపినేని సివశంకర్ తన పరిచయ వాక్యాలలో సులువుగా బోధిస్తారు. 

‘ప్రపంచీకరణ’ దాని పర్యవసానం ‘పతనీకరణ’ ఈ రెండూ మానవ సంబంధాలను, మానవీయ విలువలను కొంత పుంతలు తొక్కిస్తున్నాయి. 20వ శతాబ్దపు చివరి దశకంలో 1990లో నగరాలు, పట్టణాలు, మార్పు జరిగేదే. కానీ ఆ మార్పును 21వ శతాబ్దపు మొదటి దశకంలో అంటే 2000లో నగరాలు, పట్టణాలు, గ్రామాలలో జరిగిన అభివృద్ధితో పోల్చిచూచినప్పుడు ఆ తేడా కనిపిస్తుంది. ఎక్కడినుండి ఎందుకు డబ్బు వస్తుందో తెలియడం లేదు. ఆ డబ్బును మన రాజకీయ నాయకులు ఎలా వినియోగిస్తున్నారో అంతు చిక్కడం లేదు. అభివృద్ధి జరగడం లేదా అంటే సమాధానం చెప్పలేం. పేదరికం తరిగిపోతోందా అంటే అవుననలేం. ఇలా ధనిక, పేద తారతమ్యం బాగా పెరిగినాక సంఘంలో సామాజిక విలువల పరిస్థితి అతలాకుతలం అయిన నేపథ్యంలో ఆ సంక్షుభిత వాతావరణం అంతా సాహిత్యానికి ముడిసరుకు అవుతుంది. అలాంటి బరువైన వస్తువుతో కథాసృజన చేసి, ఆ ఏడాది సామాజిక వాతావరణాన్ని సాధ్యమైనంత నిజాయితీగా ప్రతిఫలించిన 14 కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. 

వాడ్రేవు చినవీరభద్రుడు ‘ప్రశ్నభూమి‘తో ప్రారంభమయిన ఈ కథా సంకలనం అఫ్సర్ రాసిన ‘గోరీమా‘ కథతో సమాప్తం అవుతుంది. రాత్రి ఎనిమిదిన్నరప్పుడు రేషన్ డిపోమీదకి రైడింగుకి వెళ్లిన ఎమ్మార్వోగారు తన పెళ్లాం చేయి పట్టుకున్నారని, ఎంపిపి రామినాయుడు కోర్టుకెళ్లడంతో ప్రారంభమైన ఎపిసోడ్ రచయిత నేర్పరితనం వల్ల, గడుసుతనం వల్ల, అద్భుతమైన కథాసంవిధానం వల్ల రాజ్యానికి వున్న నేర స్వభావం మనిషిలో మెదిలో అహంభావ, అవినీతి స్వభావాల మూలాలను అన్వేషించే వేదాంత ధోరణిలోకి మారుతుంది. ఈ కథల్లో ‘రాజ్య పురుషుడి తొడలమధ్య వేలాడే ఒక మేఢ్రం’ లాంటి అస్వతంత్ర అధికారుల ఆత్మలు రాజ్య వ్యవస్థపై సంధించిన సూటైన, వాడైన, పదునైన ప్రశ్నలున్నాయి. రాజ్య స్వరూప స్వభావాల్ని, డొల్లతనాన్ని ఎండగట్టి చిత్రించిన ఈ కథ ఒక చక్కటి కథగా మంచి కథగా గుర్తుంచుకోవచ్చు. 

మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘పెండెం సోడాసెంటర్‘ గ్లోబలైజేషన్ దారుణ విపరిణామాలను చర్చించిన మరో మంచి కథ. నమ్మిన ఆదర్శం కోసం సర్వనాశనానికి సైతం వెరవని చంద్రయ్య, అతడి కొడుకు క్రిష్ణమూర్తులను మనం నిజ జీవితంలో చూడగలమా? వట్టి వేళ్లు, నిమ్మకాయ, అల్లంలతో తయారైన పానీయాలు, షర్ బత్ లకుతోడు దేశభక్తులందరికీ అడ్డాగా నిలిచింది పెండెం సోడా సెంటర్. కోకోకోలా, పెప్సీలు దేశంలోకి రావడాంతోటే ఆద్రసులు లేకుండా పోయాయి. ఈ కథ భారతదేశంలో నిలువనీడకూడా లేకుండా మట్టికొట్టుకుపోయిన అనేక చిన్న, సన్నకారు చేతివృత్తుల వారి అందరి జీవితాలను మనకు గుర్తుకు తెప్పించి హృదయాన్ని బరువెక్కిస్తుంది. ‘దూద్ బఖష్’, ‘జమీన్’, ‘న్యూబాంబే టైలర్స్’ లాంటి చక్కటి, చిక్కటి మేలిమి కథలందిస్తున్న మహమ్మద్ ఖదీర్ బాబు తెలుగు కథ మీద మనకెంతో విశ్వాసం, నమ్మకం పుట్టిస్తాడు. 

ఇనాయతుల్లా తన ‘నిచ్చెన‘ కథలో ఫ్యాక్షనిస్టులు తమలో తాము పోట్లాదుకుంటూ, ‘కిష్టన్న’లాంటి ఎందరో అమాయక అనుచరుల జీవితాలను బలితీసుకుని వాళ్ల కుటుంబాలను ఎలా రోడ్డుపాలు చేస్తున్నారో వర్ణిస్తారు. రాజకీయ పరమపదసోపాన పటంలో నిచ్చెన మెట్లెక్కేది ఫ్యాక్షన్ నాయకులైతే, పాముల నోట్లో పడేది అమాయక అనుచరగణమే.

బెజ్జారపు రవీంద్ర దగాపడ్డ గాయపడ్డ తెలంగాణను ఆర్తితో ప్రతీకాత్మకంగా చెప్పిన కథ ‘నిత్య గాయాల నది‘. తెలంగాణా హైస్కూలు పిల్లలకు ‘కొమరం భీం’ గురించి తెలియదని ఆ కథలో ఆవేదన చెందుతారు. కానీ నిజానికి ఇవాళ భారతదేశంలో ఎంతమందికి జాతిపిత మహాత్ముడు తెలుసును? మరెంతమందికి ఆయన జీవితంలో ఆచరించి చూపించిన గాంధేయ విలువలు బోధపడుతున్నాయి. మనకు ఇవాళ మనవికాని సంస్కృతుల గురించి, మనవారు కాని పెద్దమనుషుల గురించి ఎక్కువ తెలుసు. ఐదవ తరగతి సాంఘిక శాస్త్రంలో ఆస్ట్రేలియాలో పండే పంటలగురించి, ఏడవ తరగతిలో అమెరికాలో ఖనిజాల గురించి చదువుకునే సిలబస్ వుంది. దాస్యపాలననుంచి ప్రజలను విముక్తిచేయాలని తమ ధన, మాన, ప్రాణాలొడ్డిన అమరజీవులను గురించిన చదువుకునే తీరిక మనకెక్కడిది? చదివించుకునే తీరికా కోరికా మన ప్రభుత్వానికెక్కడివి?

రొయ్యలకోసం, చేపలకోసం నమ్ముకున్న నేల చెరువవుతోందని గుండె చెరువైన రైతుల ఆత్మవేదనను కాట్రగడ్డ దయానంద్ తన ‘గుండ్లకమ్మ తీరాన‘ కథలో వర్ణిస్తారు. ‘ఆవు, పులి, మరికొన్ని కథలు‘ అన్న కథలో డాక్టర్ వి. చంద్రశేఖరరావు మ్యాజిక్ రియలిజం ప్రక్రియను ఎంతో ప్రతిభావంతంగా ఉపయోగిస్తారు. ఈ సంకలనంలో చోటుచేసుకున్న ఒకే ఒక ఉత్తరాంధ్ర (నా ప్రాంతీయ దురభిమానాన్ని పాఠకులు మన్నింతురు గాక!) కథకురాలు కమలకుమారి తన ‘చూపు‘ కథతో జీవితాన్ని సరికొత్త కోణంలో విశ్లేషిస్తారు. తెలంగాణ కథా చరిత్ర రచనలో కథకులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కె. శ్రీనివాస్ తన పదిపేజీల వ్యాసంలో విపులంగా చర్చిస్తారు.

పద్నాలుగు కథలు – ఒక వ్యాసంతో కలిపి రెండువందల పద్నాలుగు పేజీల ఈ ‘కథ – 2002’ నలభై ఐదు రూపాయలకే కథాసాహితి అందిస్తోంది. మార్కెట్ లో దొరకకపోవచ్చును గాని, కథాభిమానులు ఎవరిదగ్గరైనా ట్రై చేసి తప్పక చదవండి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s