పతంజలి స్మృతికి నామిని అర్పిస్తున్న నివాళి…

సాధారణం

రచయిత, జర్నలిస్ట్, ఆయుర్వేద వైద్యుడు, మహా మనీషి పతంజలి మరణం ఆయన అభిమానుల్లో ఎంతో వేదన కలిగించింది. వారంతా తమ బాధను మాటల్లోనూ, పాటల్లోనూ, చిత్రాల్లోనూ వ్యక్తం చేశారు. తెరచాటుకు పోయిన మరో గొప్ప రచయిత నామిని పతంజలిపై తన అభిమానాన్నిఅక్షరరూపంలో పెడితే పన్నెండు పేజీలయింది. అదిక్కడ యథాతథంగా అందిస్తున్నాను. నా బ్లాగుకీ అవకాశం కలిగించిన నామినికి నా ప్రత్యేక కృతజ్ఞత.                      -దుప్పల రవికుమార్ 

… నా విస్తరాకు …

patanjaligaruరామోజీరావుని నేనేడిపించినానా, ఆయన నన్నేడిపించినాడా అంటే చెప్పడం కష్టం. చూడండి – అమాసను మించిన తమాసా.

సందర్భం ఏమిటిదంటే –

నేను ఈనాడు వాళ్ల న్యూస్ టుడే డెస్క్ లో సబ్బెడిటరుగా ఒకటిన్నర సంవత్సరం దాకా తిరుపతి ఎడిషన్ లో (పని) చేసినాను. నన్ను పర్మనెంటుగా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చునా అనే దానిమింద పదిమందితో పాటు హైద్రాబాదులో నాకు పరీక్ష. ఒకపక్క జ్వరం కాస్త వుండినా తిరప్తి నుంచి మొట్టమొదటిసారి హైదరాబాదు దిగి ఆ బహుళ అంతస్తుల భవనం ఎక్కి పెద్ద పుడింగి మాదిరిగా పరీక్షకు కూచ్చున్నాను. ఒకటిన్నర సమ్మచ్చరం ఈనాడులో చేసినాను, నేను రాసిన వార్తలు కొన్ని వందలు అచ్చయినాయి, ఆమాత్రం టెస్టు నేను రాసి వుండలేనా అనేసి టెస్టు అదరగొట్టేసినానని ఇప్పుడు 25 ఏండ్ల తర్వాత చెప్పేయొచ్చు. కానీ కూడు తినే నోరిది.

టెస్ట్ అంటే ఎట్టవుంటుందంటే ఇంగ్లీషులో కూడా రెండు వార్తలిచ్చి తెలుగులో రాయమంటారు. ఒకటి రెండు తెలుగునే ఇంగ్లీషు టైపు కొట్టి వాటిని తెలుగులో రాయమంటారు. ఇట్లా ఏవో వున్నాయి.

అనువాదం జోలికి అస్సలు పోనేలేదు. గ్యారంటీ ఫెయిల్, ఇంటర్వ్యూ వుండదనుకున్న నాకు ఇచ్చిత్రంగా పాసయినట్టు, ఇంటర్వ్యూకు వుండమన్నట్టు గోడకు అంటించిన కాగితంలో వుంది. ఈ జానా బిత్తెడు వాడికి వెయ్యేనుగుల బలం వచ్చింది.

ఫుల్ మీల్స్ తినేసి ఎగరేసుకుంటా నా పేరు పిలవంగానే ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకెళ్లి రామోజీకెదురుగా చిన్నంతరం, పెద్దంతరం లేకుండా కూచ్చునేసినా.

‘ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేసి జర్నలిజంలోకి ఎందుకొచ్చావయ్యా?’ అనడిగినాడు రామోజీరావు.

కథలూ నవల్లూ రాయొచ్చు అనిసార్ అని చెప్తే ఏమొచ్చి చస్తుందో అని, “నాకిష్టం సార్” అనేసినాను.

ఆ గదిలో ఆయనతోపాటు ఎం. వి. ఆర్. శాస్త్రి అని ఒకాయనా, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు అధికారులూ వున్నారు.

“ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరూ?”అనడిగినాడు రామోజీరావు ఆయనకేదో పెద్ద తెలియనట్టు.

పేరు ఘనంగా వుంది గాబట్టి నేను, “నీలం సంజీవరెడ్డి” అనేసినాను పుసక్కన.

ఆయన మొహం చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఆన్సర్ చీదేసినట్టుండాదని.

తర్వాత ఆయన నాకు రెండో చాన్సు ఇస్తున్నట్టు, చానా ఈజీ ప్రశ్న వేసినాడు.

“ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని ఏది?” అంటూ.

నాకు వొళ్లు పొగలుబొయ్యింది. పేరుకి ఎమ్మెస్సీ అయినా ఆర్ట్స్ లో, జి.కెలో మరీ అంత పూర్ ఏం కాదులో అన్నట్టు,

“అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ హైద్రాబాదే సార్” అన్నాను.

ఆయన దాదాపుగా బిత్తర పోయినాడు.

“అదేందయ్యా, కర్నూలు మనకు రాజధాని కదా అప్పట్లో”, అన్నాడాయన.

ఇదేందిరా ఖర్మా అని సన్నగా వొణుకు ప్రారంభమైపోయింది నాలో.

“మన రాష్ట్రానికి జిల్లాలెన్ని?” అన్నాడు వున్నట్టుండి.

నేను ఒక్క సెకను కూడా ఆలోచించకుండా 22 వుంటే 23 అనో, లేదా 23 వుంటే 24 అనో అనేసినాను. ఇప్పటికీ ఎన్ని జిల్లాలున్నాయో నాకనవసరం.

ఆయనెంత దయగల మనిషంటే నిజంగానే, “ఏమయ్యా, జిల్లాలూ వాటి కేంద్రాలూ అన్నీ చెప్పెయ్. నీకు ఉద్యోగం ఇస్తానమ్మా” అన్నాడు.

నేను రాష్ట్రం మొత్తంమీద పన్నెండు జిల్లాలు మాత్రమే చెప్పగలిగినాను.

ఇంటర్వ్యూ సభ్యుల్లో రామోజీరావు తప్ప మిగతా అందరూ “ఈ గాడిద కొడుకుని పంపిచేయండిక” అన్నట్టు చూస్తున్నారు నన్ను.

రామోజీరావు మాత్రం నన్ను వొదలడం లేదు.

“ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం చెప్పు పోనీ!” అన్నాడు.

నేను మొహం వేళ్లాడేసుకుని నీళ్లు తాగినాను.

నెల్లూరికి నెల్లూరే, చిత్తూరికి చిత్తూరే అన్నట్టు ప్రకాశానికి ప్రకాశమే కదా అని తలదించుకుని, నంగినంగిగా ప్రకాశం పట్టణం అన్నాను, మచిలీపట్టణం మాదిరిగా ఆ వూరూ వుండకపోతుందా అని.

అక్కడున్న వాళ్లంతా ఎంత నవ్వు నవ్వినారో చెప్పలేను.

ఆ ఇంటర్వ్యూ మొదలైన 5 నిమషాలల్లోనే  నేను ఫుట్ బాల్ అయిపోయినట్టు నాకు తెలస్తావుంటే గదా!

రామోజీరావు ఎవరితోనో అన్నాడు.

“చూడయ్యా, పీజీ చేశాడు. ఇతని స్టాండర్డ్ చూడు. ఇంత ఘోరంగా వుందా ఇప్పుడు ఎడ్యుకేషన్? ఒనండాఫ్ ఇయర్ ఇతను ఈనాడులో పనిచేయడమేంటసలు? తిరప్తి ఎడిషన్ వాళ్లకు లైను కలుపు” అనేసి నాతో ఎంతో జాలిగా, అవిటి కొడుకును చూసినంత దయగా, “మీదేవూరమ్మా?” అన్నాడు.

“మిట్టూరు సార్!” అన్నాను.

“బాగా రిమోట్ ఏరియానా!” అన్నాడు.

దైవసాక్షిగా రిమోట్ ఏరియా  అంటే తెలీక, “అంటే ఏంది సార్, ఏమంటారు సార్ మీరు” అనడిగినా.

“సారీ అమ్మా. వెళ్లు” అనేసి పంపించేసినాడాయన.

ఆ ఇంటర్వ్యూ గదిలోంచి ఈనాడు బయటికి రోడ్డుమీదికి ఎట్లా వచ్చినానో కూడా తెల్లానాకు.

-ఇదంతా నేనిప్పుడెందుకు చెప్పినట్టు? ‘సాక్షి’ పత్రికలోకొచ్చి ఈనాడు పెద్దాయన్ని పలచన చేద్దామనా? ఈయొక్క నామిని సుబ్రహ్మణ్యం నాయుడిగారిని ఆయొక్క రామోజీ ఎట్టా మిస్ చేసుకున్నాడో చూడండి అని చెప్పుకుందామనా? ఇదే అవితే నా కళ్లిప్పుడే పోతాయి!

ఎందుకోసరమని చెప్పుకున్నానంటే – నా పతంజలి ప్రభువు ఈ చేపలు పట్టుకునే చెంగణ్ణి, “నాయుడు గారూ!” అని పిలిచి, ‘నా వెనకాన రండి’ అని నన్నెత్తుకుని భుజాలమింద పెట్టుకుని మోసినాడని చెప్పుకోవడానికి!

ఇప్పుడు టీవీ5ని చూసే కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడు పతంజలి కింద పనిచేసేవాడు ‘ఈనాడు’లో. శ్రీనివాసరావు కింద ఇప్పుడు విశాఖపట్నంలో టీవీ9 విలేకరిగా వున్న శశాంకమోహన్ పని చేసేవాడు. ఆ శశాంకమోహన్ కింద నేను పనిచేసేవాణ్ణి. నెలకు 300 రూపాయల జీతం మీద.

ఒకసారి రాత్రి 9 గంటలదాకా నన్ను వడేసి పట్టుకుని నాకేమాత్రమూ వినబుద్ధికాని గోగోల్ ఓవర్ కోటుమీద వుపన్యాసమిచ్చి, “నాయుడుగారూ సైకిలెక్కండి” అని సైకిల్ మీద కోర్చోబెట్టుకుని ఇంటికి తీసుకుని పోయినాడు భోజనానికి పతంజలి.

అన్నంలో వుల్లగడ్డల కూర కలుపుకుని “వుల్లగడ్డలు చానా బాగుండాయి సార్” అని తింటూవుంటే, ప్రమీలమ్మని పిలిచి, “నాయుడుగారు నువ్వుచేసిన బంగాళాదుంపల కూర భలే ఉందని మెచ్చుకుంటున్నాడు ప్రమీ!” అన్నాడు. ప్రమీలమ్మా, పతంజలీ పడీపడీ నవ్వతుండారు.

“ఏం సార్, దీంట్లో అంత నవ్వేదానికి ఏముండాది! వుల్లగడ్డల కూర బాగుందకూడదా ఏంది?” అన్నాను.

“నాయుడుగారూ! మీకొక తమాషా చెప్పనా? ఇది వుల్లగడ్డల కూర కాదోయ్. మాంసాన్ని ఖైమాచేసి వండింది!” అన్నాడు ప్రమీలమ్మను చూపిస్తూ.

“ఇది చియ్యల కూరా! పొండి సార్. మాంసం కూర అంటే తునకలు తునకలుగా వుంటుంది. ఇదేంది ముద్ద మాదిరిగా! ఆమెను చెప్పమనండి ఇది మాంసం కూరేమో!” అన్నా. మొగుడూపెళ్లాలు మల్ల నవ్వేదానికి పెట్టుకున్నారు.

పతంజలి ఇంట్లో తినేదాకా మాంసం కూరను అట్లా ఖైమాచేసి తింటారని నాకు తెల్వనే తెల్వదు.

ఇదట్టా పెడితే, సందేళ డ్యూటిలో వున్న నన్ను టీకి పెల్చి రోడ్డుపక్క గుడిసె దగ్గరికి తీసుకెళ్తాడా – మూడు గంటలు నాలుగు గంటలయినా ఆఫీసులోకి ఆయన రాడు, నన్ను పోనియ్యడు. టీలూ, సిగరెట్లూ, సాహిత్యం!

“సార్, నేను పనిజేసేది మీ కిందకాదు. మీకింద కింద కింద మూడు కిందల కింద పని చేసేవాడిని గదా. వాళ్లేమన్నా అనుకుంటారు సార్. రండి ఆఫీసులోకి పోదాం!” అని అంటా నేను వుంటే ఆయన, “ఇప్పుడు నాయుడుగారూ, చెహోవ్ జీవితాన్ని శుభ్రంగా గడపాలని కోరుకున్నాడు. కానీ ఆయన చచ్చిపోతే ఆయన శవం గూడ్సులో ఉప్పుచేపల మధ్య ప్రయాణించాల్సి వచ్చింది. ఇది లైఫ్ లో ఉన్న ఐరనీ” ఇట్లా ఏవో మాటలు! (ఆయనకేం, ఎడిషన్ ఇన్ చార్జి. పనంతా ప్రకాష్ చూసి పెట్టేస్తాడు.) 

“ఐరనీ అంటే ఏంది సార్?” అంటూ నేను. ఆయన అర్థం చెప్పేవాడు. పాపం కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకో నన్ను ‘తమ్ముడూ!’ అనడం తప్ప ఇంకోమాట అనేవాడు కాదు.

“సార్ లేటయ్యింది. పతంజలి వదిల్తే గదా!” అంటూ పనంతా అయిపోయాక ఆఫీసుకెళ్తే అప్పుడు శ్రీనివాసరావు, “తప్పు తమ్ముడూ! పతంజలి గారు అనాలి”నేవాడు.

పతంజలి ఒకసారి, “నాయుడుగారూ! ‘ఖాకీవనం’ అని నేనొకటి రాశాను. ఇదేమైనా చదివి నాతో ఏమైనా చెప్తారా” అని ‘చతుర’ పుస్తకాన్నొకసారి ఇచ్చినాడు.

నేనొకరోజులో చదివేసి, “ఏమన్నా అర్ధం ఉండాదా? మీకేమిటికీ పోలీసోళ్లతో! థూ నాశనం. దరిద్రంగా ఉండాది సార్. మీ ఊరోళ్ల గురించి ఏమన్నా రాయండి బాగుంటాదు” అనేసినా.

“నాయుడుగారూ! ఒక్కడన్లేదీ మాట. మనకు జనాలలో మంచిపేదు తెచ్చిందోయీ యీ పుస్తకం!” అన్నాడాయన.

ఎప్పుడైనా కులుకు ఎక్కువైపోతే ‘ఓయీ ఓయీ’ అనడం ఆయన వాడిక.

ఆయనకు టాల్ స్టాయ్ అంటే పిచ్చి. పిచ్చి అనే పదం కంటే ఉమాదం అనే పదం వాడడం మంచిది.

ఒకసారి నన్ను పట్టుకుని టాల్ స్టాయ్ గొప్పతనం చెప్పేదానికి కుచ్చునేసినాడు. గంటకాదు, రెండు గంటలుకాదు, మూడు గంటలు కాదు. ఒక రోజంతా ఇల్లు దగ్గరున్నా మెస్ లోనే భోజనం ఇద్దరమూ. ఆయన స్నానం చెయ్యలా. నేనూ చెయ్యలా. ఆయన టాల్ స్టాయ్ ‘ఆరడుగుల నేల’ కథ నాకు మొత్తం పూస గుచ్చినట్టు చెప్పినాడు.

నేను పొగరుగా ఒకేమాట అన్నాను.

“ఆయనంత చెత్త రచయిత ఈ భూమండలం మీద ఇంక పుట్టడు సార్. ఇదా మీరు చదువుకున్న చదువు? నన్ను చదువుకోమనే చదువు?” ఈ మాట నా నోత్లో ఉండంగానే ఆయన చెయ్యిపైకి లేచింది నా చెంపమీద పడేదానికి.

ఒక్క కథకూడా అచ్చుకాని వాడికి అంత పొగరు ఉండకూడదనేది ఆయన ఉద్దేశం ఉండాలనేది నా ఉద్దేశం. నేనూ ఏం తగ్గలా! “కొట్టండి సార్ పర్వాలేదు. ఈ ఆరడుగుల నేల అనేది ఎట్లా మంచి కథో చెప్పండి వింటా. అది ఏ రకంగా చెత్తకతో నేను చెప్తా విందురు” అన్నాన్నేను కుదురుగా. ఆయన సిగరెట్లనే కాలస్తా.

“అది ప్రపంచంలోనే గొప్ప కథ. ఆయనంత పరిశుద్ధమైన రచయిత మరోడు లేడు. రష్యన్ సాహిత్యం, ప్రపంచ సాహిత్యం మీకు బొత్తిగా తెలియదు” అనేసి అన్నాడు ఆయన.

“అది ప్రపంచంలోనే చెత్త కథ. సార్ – కోపం తగ్గించుకుని నేను చెప్పేది వినండి. నేను చదువుకోలా. మేథ్స్ లో వచ్చే సిన్స్, ఫ్రం, దేర్ ఫోర్, వై బికాజ్ ఇట్టాంటి పదాలకు మించి ఇంగ్లీషు నాకు రాదు. మీరొకసారి టాల్ స్టాయ్ ని వుద్దేశించి ఆయనో పెద్ద కౌంట్ అని అంటే కౌంట్ అంటే లెక్కించడం కద సార్. ఆయన్ని నేనెక్కడ లెక్కించేది అని అడిగిన్నాకొడుకుని నేను. మీరు నన్నప్పుడు ఎగతాళి చెయ్యకుండా కౌంట్ అంటే వందలాది ఎకరాలున్న ప్రభువు అని అర్థం చెప్పినారు. గుర్తుండాదా? వందలాది ఎకరాలు ఉన్నవాడూ, వ్యవసాయాల్ని గుర్రాలమీద తిరిగి చెయ్యించేవాళ్లూ మాత్రమే రాసే కథ అది. నాకు మాదిరిగా రెండెకరాలే ఉండి, దానికితోడు ఒక అన్నకూడా ఉన్నవాడు ఆ కథ రాయనే రాయడు. చచ్చినాక ఆరడుగుల నేలచాలు సరే. బతికున్నప్పుడో! ఈ భూమండలాన్నంతా జనాభాతో భాగించేస్తే పాయింట్ల తర్వాత వచ్చేనేల కూడా కావాల నాకు. మీరు రాజు, ఆయన ప్రభువు. ఇద్దరూ దొందూ దొందే!”

ఆ రోజు నా కొచ్చింది చూడూ కోపం. చంద్రబాబు మీద వైఎస్ మండిపడ్డాడు అని పత్రికల్లో రాస్తారే అట్లా నేను టాల్ స్టాయ్ మీద మండిపడ్డాను. ఇంకా నేను ఏం వాగానంటే “మీరు టాల్ స్టాయ్ దే ఇంకో చెత్త పుస్తకం ఫాదర్ ఫెర్గ్యూసన్ గురించి చెప్తిరి. అది ఇంకా చెత్త. భూమిని వేలంలో పాడాలని ఆబగా, ఆశిగా ఫెర్గ్యూసన్ పోతే చచ్చిపోయి తిరిగొచ్చే కథ అదేదో. భూమిని వేలంలో పాడుకుని క్షేమంగా ఫెర్గ్యూసన్ ఇంటికొస్తే టాల్ స్టాయికేం తీపా? కానీ ఆయన రానియ్యడు. అదే మాదిరిగా టాల్ స్టాయ్ దే అన్నా కెరీనినా – రైలుకింద పడి కుక్కచావు చచ్చినట్టు ఆ నవల గెంటలకొద్దీ చెప్పినారు. లంజరికం చేసినంత మాత్రాన ఆ ఆడమనిషి అట్లాంటి చావుచచ్చిపోవాల్నా? నీతేంది సార్, నీది దరిద్దిరంగా…! ఇట్టాంటివన్నీ బూములు బావులు పుష్కలంగా ఉన్నవాళ్లు తప్ప లేనివాళ్లు రాయరు సార్. మీరు చెప్పండి దాస్తావస్కీ ఇట్టాంటి చెత్త ఏమన్నా రాసినాడా? అయన నిత్య దరిద్రుడని మీరే చెప్తిరి. ఆయన చచ్చినా రాసుండడు. ఇంకా ఏ రష్యన్ రచయిత అన్నా బీదాబిక్కీకి ఇట్టాంటి శిక్షలు వేసుంటే చెప్పండి చూద్దాం ఆ టాల్ స్టాయ్ ప్రభువు తప్ప”. తోటకూర కాడ మాదిరిగా ఆయన అట్లానే మెడ వాల్చేసినాడు, నాతో ఏగలేక.

నేను దేశదేశాల సాహిత్యాన్ని చదువుకోలేదని ఆయనకు పెద్ద బాధ. నాకు ఇంగ్లీషు పుస్తకాలిచ్చేవాడు చదవమని చెప్పి. నాకు ఒక వాక్యంలో అన్ని పదాలకూ అర్థాలు దిక్షనీ చూసి తెలుసుకున్నా ఆ వాక్యం అర్థమయ్యేది కాదు. నాకొకసారి కోపమొచ్చేసి, “సార్, నన్నుగాని ఇణ్గ్లీషు పుస్తకాలిచ్చి చదువుకోమంటే మీ మొకంకూడా చూడను” అన్నా. ఆ తర్వాత నన్నెప్పుడూ ఆయన “ఇంగ్లీసు పుస్తకాన్నిచ్చి చదువుకోండి నాయుడు గారూ” అని అననే అనలేదు.

టాల్ స్టాయ్ మీద చర్చ జరిగినాక ఒక రోజు, “నాయుడుగారూ! మిమ్మల్ని మెప్పించేది ఒకటి రాయాలని మహా దురదగా ఉంది. మీఊరి వాళ్లమీద మీరొక పెద్ద కథా, మా ఊరోళ్లమీద నేనొక పెద్ద కథా రాద్దాం. నాలుగే నాలుగు రోజుల్లో రాసెయ్యాలి. ఇద్దరం రాసేసి ‘చతుర’కు పంపిద్దాం”, అని సవాలేసినాడాయన.

నేనూ కూచ్చున్నా, ఆయనా కూచ్చున్నాడు.

నేను “పాలపొదుగు” అనేది రెండు రోజులలో రాసినా, పతంజలి “రాజుగోరు” అనేది నాలుగైదు రోజులకు రాసినాడు. ఒకరిదొకరం చదువుకున్నాం. ఆయనొకేమాట అన్నాడు.

“నాయుడుగారూ! మీరు మీకథను ఎట్టి పరిస్థితుల్లో ఎడిటర్ కి కూడా అర్థం కాకూడదనీ, అది అచ్చుకాకూడదనీ రాశారు. నేను ఇది ఎలాగైనా అచ్చయిపోవాలనీ రాశాను. అదీ తేడా!”

“రాజుగోరు” నవల రాయకముందు ఆయన రాసిన కథలన్నా, ఖాకీవనం నవల అన్నా నాకు పట్టేవి కావు. “రాజుగోరు” నవల ఎంత గొప్పదంటే అలమండలో పుట్టి పెరిగినవాడు తప్ప మరో నరమానవుడు రాయలేని పుస్తకమది. రావిశాస్త్రి ఎక్కడా తొంగికూడా చూడడు.

ఆయనా, నేనూ ఇద్దరమూ చతురకు ఎయిర్ పార్సిల్ లో పంపించినాము. ఖచ్చితంగా మూడో రోజుకే చతుర ఎడిటర్ చలసాని ప్రసాదరావునుంచి నాది తిరిగొచ్చేసింది. “రాజుగోరు” నవలకి యాక్సెప్టెన్స్ కార్డు కూడా నా కథ తిరిగొచ్చిన ఎయిర్ పార్సిల్లోనే వచ్చింది.

చలసాని ప్రసాదరావుకి పాపం చెముడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పతంజలి ఏమన్నాడంటే, “నాయుడుగారూ చెవిటి మేళానికి పాలపొదుగు సొగసు అర్థమవుతుందా?” అనేసి అన్నాడు.

ఆ టయంలో “పాలపొదుగు”ను చదివిన ప్రకాష్ కూడా అక్కడే వున్నాడు. ఆయన పతంజలితో, “ఏంటండీ! వేషాలేస్తున్నారా? “రాజుగోరు” అచ్చుకాకపోవడమేమిటి? పాలపొదుగు అచ్చు అవడమేమిటి? నాయుడుగారిని మీరు పొరపాటున నాయుడుగారు, నాయుడు గారు అని అంటున్నారు. ఆయన నాయుడుగారు కాదు, సైనాయుడుగారు. సైనేడ్ వేసుకున్నవాడు రుచీపచీ చెప్పలేక చస్తాడు గదా, అలాగే మన సైనాయుడు రచనను జనలు చదవలేరు చస్తారు” అన్నాడు.

ముప్పూటలా నన్ను పోషిస్తూ కుడా ప్రకాష్ ఆ మాట ఎందుకన్నాడంటే – నేనేమైనా రాస్తే అది ఎవరికైనా అర్థమవ్వాలికదా అనే పేపరు భాషలో భయాందోళనలతో!

ఈనాడులో వుద్యోగం పోయిందికదా. ఇంక మావూరికెళ్లిపోయినాను. రెండు మూడు రోజులు వోర్లో, మూడు నాలుగు రోజులు ప్రకాష్ వాళ్ల ఇంట్లో.

“నాయుడుగారూ! రేణిగుంటలో ఒకస్కూలు పెట్టకూడదూ! లక్షలు సంపాదిద్దురుగానీ!” అన్నాడొకసారి పతంజలి.

“మీ గురువు రావిశాస్త్రికి మించి రచయిత అయిపోదామని గదా గుల!” అని అన్నా.

ఇంతలో దాసరి నారాయణరావు “ఉదయం’ పేపరు పెట్టడం ఆయన అక్కడకు – ఆ దరిద్రపు హైదరాబాద్ కు వెళ్లిపోవడం జరిగింది. నేనొకసారి మావూరినుంచి రేణిగుంటకొచ్చి ఆయన్ని కలిస్తే, “నాయుడుగారూ రడీగా వుండండి. నేను ఉదయానికి వెళ్యున్నాను. మీకక్కడ ఉద్యోగం చూస్తా వచ్చేద్దురుగానీ” అని సామానుతోపాటు లారీ ఎక్కేసినాడు.

ఆయన హైదరాబాదుకు పోయిన కొంతకాలానికి నాకు ఉత్తరం.

“నాయుడుగారూ! అర్జంటు. వచ్చేయండి. చార్జీలకు డబ్బులున్నాయా? వెంటనే వచ్చేయండి”.

నేను వెంటనే బయలుదేరేసి, “పతంజలి స్వామీ! రెండేండ్లు పనిచేశాక టెస్టుపెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాడు దాసరి నారాయణరావు. రామోజీరావు ఇంటర్వ్యూ చాలు నాబతుక్కి. ఇంగ్లీషుతో ఇంటర్వ్యూలతో నేను వేగలేను. నేను తిరిగి వెళ్లిపోవాల్సిందే గదా” అన్నా హైదరావాదు వెళ్లి ఆయన సీటు ముందు కూర్చోని.

నిజంగా సిగరెట్ ఫ్యాక్టరీ పక్కనవుండిన ఆ ఉదయం రేకులషెడ్డులో నేను సొర్గాన్ని చూస్తిని. మహామహులు ఆ ఉదయంలో వున్న సబ్ ఎడిటర్లు. అంబటి సురేంద్రరాజు, గుడిహాళం, మురళి, రామ్ ప్రసాద్, ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, కెఆర్ మూర్తి, ఇప్పుడు ప్రెస్ అకాడెమీ చైర్మన్ అయిన దేవులపల్లి అమర్, ఇప్పటి లాయర్ మాడభూషి శ్రీధర్, మహామహులు అని ఎందుకంటున్నానంటే ప్రతి గన్నయ్య చేతిలోనూ దెయ్యం మాదిరిగా ఒక ఇంగ్లీషు పుస్తకం. నీషే అంట, ఆక్టోవియాపజ్ అంట, కంటస్తం పెడితే తప్ప నోరు తిరగని పేర్లు.

అక్కడ వులిక్కిపడాల్సింది ఏమంటే ఆడపిలకాయలు కూడా భలే చదువుకున్న వాళ్లే. ఒక్క చిన్న వూరినుంచివచ్చిన నాకు ఇది విచిత్రమే. మృణాళిని, ఇప్పటి ఆంధ్రజ్యోతి ఫీచర్స్ ఎడిటర్ వసంతలక్ష్మీ, సత్యవతి.

patanjali_aj-262x300అందరిలోకీ అఆఇఈలు రాంది నిజంగా నాకొక్కడికే. నాకున్న ఒకే ఒక అర్హత నాయెనకన పతంజలి కొండ.

అందరూ ఇంగ్లీషు వచ్చినవాళ్లే. అందరూ టెస్ట్ రాసి పాసయి ఇంటర్వ్యూలోనెగ్గి సబ్ లుగా చేరినవాళ్లే. వాళ్లజీతంతో సమానంగా నాకూ ఇప్పించి వాళ్ల సరసన ఈ గులకరాయిని కూచ్చోబెట్టేసినాడు పతంజలి.

ఏం మంత్రం వేశాడోగానీ నాకు ట్రైనింగ్ కూడాలేదు. దేవీప్రియ కింద “ఆదివారం ఉదయం”లో పడేశాడు. నాతోకూడా అంబటి సురేంద్రరాజు. నాకు దేవీప్రియ ఎప్పుడైనా ఇంగ్లీషు వ్యాసం ఇచ్చి తెలుగు చేసెయ్యమంటాడేమోనని వుచ్చ. సురేంద్రరాజు వుండాడులే అని ధైర్నం. అంత టెంసం పగవాడికి కూడా వద్దు.

ఉదయం పదిరోజుల్లో ఇంక ప్రారంభమవుతుందనగా పతంజలి, “నాయుడుగారూ! ఇట్లా ఎడిటర్గారి దగ్గర కొస్తారా ఒకమాటు” అని పిలుచుకుపోయాడు. కాబిన్ లోకి పోయి ఎడిటర్ ఎ.బి.కె. ప్రసాద్ కి నమస్తే చెప్పి నోర్మూసుకొని గమ్మునుండాను.

“చూపులకు అట్లా వుంటాడుగానీ మన ఎడిటోరియల్ స్టాఫ్ మొత్తానికీ తెలివైనవాడు. ఇతని గురించి నాకు మొత్తం తెలుసు. మీరు ఇతనికి ఒక కాలమ్ ఇస్తున్నారు, ఇతను రాస్తున్నాడు. ఇతనితో మీరేం మాట్లాడక్కర్లేదు. నాయుడుగారూ! మీరొక కాలమ్ ప్లాన్ చేసుకోండి. బుధవారం బుధవారం మీరు కాలమ్ రాస్తున్నారు” అని అన్నాడు పతంజలి.

సబ్ ఎడిటర్లలో అందరికీ నాకేంది? కాలమేంది? ఇట్లాంటి విచిత్రాలు కూడా జరుగుతాయా అని ఆ అజామాబాద్ అంతా ముక్కున వేలేసుకునే పనే.

ఇంక అంతే. ఎడిట్ పేజీని వసంతలక్ష్మీ చూసేది. నేను ఎడిటర్ కి కానీ, పతంజలికికానీ, ఎడిట్ పేజీ చూసే వసంతకి కానీ, ఏరోజూ నేను రాసింది చూపించేది లేదు. కంపోజ్ చేయించి నేను బ్రోమైడ్ తీసుకుని ఇచ్చేవాణ్ణి.

ఆరువారాలు పచ్చనాకు సాక్షిగా… రాసేసరికి పతంజలి నాకొక వుత్తరం చూపించినాడు. “నాయుడుగారూ! నమస్కారమండీ మీదగ్గర జాగ్రత్తగా వుండాలండోయీ. ఎక్కడికో వెళ్లిపోయేటట్లున్నారు. మమ్మల్ని గుర్తుంచుకుంటారా?” అని అంటా.  

వుత్తరం చూస్తే అది ఏమ్వీఎల్ ది.

“నేను ముఖ్యమంత్రినైతే మూడేళ్లేమీ ఖర్మ ఎప్పుడూ నామినినే విద్యాశాఖామంత్రిగా పెట్టుకుంటా” అంటూ – నేను రాసిన “మూడేళ్లూ విద్యాశాఖమంత్రినే!” అనేది చదివి – రాసిన ఉత్తరమది. అప్పట్నుంచీ ‘ఈనాడు’ ముందు వెళ్తుంటే అబ్బో నేనెంత పొగరుగా ఆ బిల్డింగును చూసేవాణ్నో చెప్పలేను.

పత్రికల్లో పని చెయ్యాలంటే జిల్లాలెన్నో తెలియాల్నా? వాటికి ముఖ్య కెంద్రాలు తెలియాల్నా? రామోజీరావూ! పత్రికల్లో పని చెయ్యాలంటే ఏమీ తెలియఖ్ఖర్లా! ఒక్క పతంజలిలాంటివాడు వెనకానవుంటే చాలు, చిటికేసినంతలో ప్రఖ్యాత రచయితా అయిపోవచ్చు. జర్నలిస్టూ అయిపోవచ్చు! అని తమాషాగా ఈనాడు ముందు నిలబడి నోరు తెరిచి అనేవాణ్ణికూడా.

నాకు ఊపిరాడేదికాదు. ఆంధ్రదేశం మొత్తం మింద నక్కతోక తొక్కిన రచయిత ఎవరన్నా వుంటే అది నేనే!

నాబట్టా అని రాస్తే అది అచ్చు అయిపోయేది. లంజా అని రాస్తే అది అచ్చయిపొయ్యేది. ఇంతలో నాకు పెండ్లి కుదిరింది.

“నాయుడుగారూ! మీకు సొంత పెళ్లాం ఒకటీ, సొంత పొయ్యి ఒక్కటీ, ఇంకా సొంత కలం ఒకటీ!” అని వెక్కిరించేవాడు.

నేను హైద్రాబాద్ లో పతంజలి ఇంట్లో తిన్నన్నిసార్లు మా అత్తగారి ఇంట్లో అయినా తినివుంటానా! ఎన్ని నీసులు? ఒకటా రెండా?

కోడి గుడ్దును అర్థం చేసి అన్నకూ తమ్ముడికీ పెట్టని తల్లి మా జిల్లాలో లేదు నాకు తెలిసి.

మా చంద్రబాబుకు, రామ్మూర్తికి కూడా మా అమ్మణ్ణమ్మ కోడి గుడ్డును సగంచేసి పెట్టిన తల్లే! కానీ పతంజలి రాజు. ఆ ఇంట్లో ఎన్నెన్ని వుంటాయి అంటే కోడిగుడ్లూ, కోడికూరా, పొటేలికూరా, చేపలూ, నెండ్రకాయలూ!

నాకు తెలిసినంతలో 1984 చివర్న ఉదయం మొదలైందనుకుంటా. ఒక పక్క పచ్చనాకు సాక్షిగా… ఇంకో పక్క పాలపొదుగు అచ్చవతా ఉండాయి. అనవసరంగా పేరు. పది రూపాయల కష్టానికి నూటాపది వచ్చేస్తున్నట్టు. బలేబలే చదువుకున్న వాళ్ల మధ్యఏమీ చదువుకోని నేనే హీరో.

మా అక్కచావుతో ఆ మత్తంతా పోయింది. ‘ఉదయం’లో పనంతా అయిపోయినాక ఇంతికొచ్చి మా అక్కలేని మా అమ్మనీ, నాయన్నీ, ఆ పసిబిడ్డనీ తల్చుకోని తల్చుకోని బోల పానుకోని ఏడ్వడం! ఇట్టాంటి రాతలవల్ల ఏమైనా ఈ చావు సంభవించిందా అని ఒకటే మనేద. రుచిగా ఏమన్నా తింటావుంటే ఈ తిండి 30 ఏండ్ల వయసుకే మా అక్కకు లేకపాయనే అని దిగులు. నా మొకం చూసి, పతంజలేొకసారి, “అవునండీ, నాయుడుగారూ చచ్చింది మీ అక్కగారా, ఇంట్లోవుందే నీ కొత్త పెండ్లికూతురా? అని తిట్టినాడు.

కానీ మేం బతికింది అట్లా! మా అమ్మా మా అక్కా నేనూ ముగ్గురమూ ఒకరి కొంగులు ఒకరం పట్టుకుని తిరిగిన వాళ్లం.

ఇంతలో ఆంధ్రజ్యోతి హైద్రాబాద్ ఎడిషన్ పెట్టినారు. ఎ.బి.కె. నన్ను దాంట్లోకి రమ్మన్నాడు. పతంజలికి ఎట్లా చెప్పాలో అర్థం కాలా.

పిల్లి మాదిరిగా ఆయనకెదురుగా కూర్చుని, “సార్, రెండు నిమిషాలు నోరు తెరవకుండా నేను చెప్పేది వినండి. నన్ను ఎబికె జ్యోతికి రమ్మన్నాడు. నేను పోతుండాను. ఇక్కడ నాకు ఏం కొదవ అని అక్కడికి పోతావున్నట్టు చెప్పండి. ఆంధ్రజ్యోతి వాళ్లి తిరప్తిలో కూడా తొందరలో ఎడిషన్ పెడతారంట. నన్నక్కడికి పంపిస్తానని కూడా ఎబికె మాటిచ్చినాడు. నేను రేణిగుంటలో ఉద్యోగం చూసుకుంటా మా వూళ్లోనే కాపరం ఉండి నా తల్లిదండ్రులకు ఆ పసిబిడ్డకు తోడుగా వుండిపోతాను సార్” ని బొరోమని ఏడ్చేసినా.

నావి మరీ నంగి ఏడుపులు అని ఆయన ఆత్మలో కూడా అనుకోని వుండడుగానీ అప్పటికీ ఆయన ఒప్పుకోలా.

“నాయుడుగారూ! మీ తీరే నాకు విచిత్రంగా వుంది. నోరుమూసుకోని హైద్రాబాద్ లోనే వుండండి. తిరప్తి వొద్దు. మీరక్కడికెళ్లి ఏం చేస్తారు? ఇక్కడి అవకాశాలు అక్కడ ఉండవు. జర్నలిస్టులకు ఇక్కడ స్థలాలిస్తారు. బాగా రాసుకోవచ్చు. ఇంకేం మాట్లాడొద్దు. ఆ పాపని ఇక్కడికి తెచ్చేసుకోండి. ఇక్కడ సాక్కుందురు చక్కగా! లేచెళ్లి పని చూసుకోండి” ఇదీ ఆయన వాటం.

నేను నేరుగా ఆంధ్రజ్యోతికొచ్చి ఎ.బి.కె.ని కలిసినా. ఎ.బి.కె. నన్ను తీసుకొని జ్యోతి ఎం.డి. జగదీష్ ప్రసాద్ కేబిన్ లోకి వెళ్తుండగా “సార్ ఇంటర్వ్యూ ఏం చెయ్యడు గదాసార్ ఆయన! రెండు సెకండ్లలో నన్ను బయటకు పంపించెయ్యండి” అని అన్నా.

“నువ్వు రారా మగడా” అని ఎ.బి.కె. నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి జగదీష్ ప్రసాద్ తో, రే అబ్బాయ్ జగదీషూ! చాకులాంటి వాడు. నీకు తెలీదులే. ఉదయం నుంచి పట్టుకొచ్చేశా” అన్నాడు.

జగదీష్ ప్రసాద్ నా బిత్తర చూపుల్ని భరించలేక, “కూర్చోండి” అని అంటూ వున్నా యజమాని ముందు కూర్చోవడం ఎందుకులెండి అని మర్యాదకు పోయినట్టు యాక్సన్ చేసేసి పట్టూ పరుగు!

నేను జ్యోతిలో చేరిన సంగతి చెప్పాలంటేనే భయమేసేసేంది పతంజలికి. ఒకరోజు ఆలస్యం చేసి పెద్ద తప్పుచేసి రెండోరోజు ఆలస్యం చెయ్యలేక చేసేసి మూడోరోజు పతంజలి ఇంటికి పొయ్ చెప్పేసినా.

“నాయుడుగారూ మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఇది అన్యాయం. మీ ఖర్మ” అని ఆయన అంటావుంటే నేను తలొంచుకుని జారుకుంటా వుంటే, “సొంతంగా ఉద్యోగం కూడా సంపాయించడం ఏమీ బాగా లేదండీ నాయుడుగారూ!” అని ఎత్తి పొడిచినాదు.

ఆంధ్రజ్యోతి ఆఫీసు బంజారాహిల్స్ లో. నేనుండేది శంకరమఠం దగ్గర. అయినా ఇల్లు మార్చలా. పతంజలిని మాత్రం ఇంటికెళ్లి అప్పుడప్పుడూ కలిసే పనే.

అట్లా ఏడెనిమిది నెలలయ్యిందో లేదో తిరుపతి జ్యోతి ఎడిషన్ ప్రారంభమైంది. మా వూరొచ్చేసినా.

1987 మొదట్లో వొచ్చేసిన వాణ్ణి అయనకొక జాబు రాసుంటే వొట్టు. 1988లో మా నాయన చచ్చిపోయినాడు. మా అమ్మ మా అక్కను తల్చుకోని ఏడ్చే వాటం చూస్తే ఆమెకూడా చచ్చిపోతుందని భయమేసి దేముడి సత్యానికన్నట్టు సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, మినికన్నడి సేద్యం వొరసబెట్టి రాసేసినా. 1991లో మా అమ్మ ఇప్పటి పతంజలి వయసంతలోనే చచ్చి పూడిసింది. ఇదేందితా 85లో ఒకరు, 88లో ఒకరు, 91లో ఒకరా… అని దిగులు. 1994లో నేను చచ్చిపోతానేమో ఒకవేళ అని బిత్తర.

94 దాటినాక నాకు కాసింత వూపిరాడింది. పతంజలి ఎగతాళి చేసినట్టు సొంత రచనలు ఇన్నిచేసినా పుస్తకాలు అచ్చయిన కబుర్లు కానీ, చావు కబుర్లు కానీ ఆయనకు ఫోనుచేసి కానీ జాబురాసి కానే చెప్పిన పాపానపోలా. దీన్నంతా ఆయన కృతఘ్నత అనుకునేవాడో ఏం కర్మో!

1998 ఆగష్టులో నాకు ఆంధ్రజ్యోతి వీక్లీకి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయింది. అప్పట్లో నేను గడపతొక్కింది రెండే ఇండ్లు. ఒకటి పతంజలిదీ, రెండు తోట వైకుంఠానిదీ.

పతంజలి ఇంటికి పోయి, సిగరెట్టు ముట్టిస్తూ, “సార్, వీక్లీకి ఈ హైద్రాబాద్ కు వొచ్చి చచ్చినా. ఏమన్నా రాయండి సార్” అనడిగినా, పదకొండేళ్ల తరవాత ఆయన మొకం చూసి.

“ఆ సిగరెట్టు అక్కడ పారేస్తారా నాయుడుగారూ! సొంతంగా సిగరెట్టొకటీ!” అని ఆయన ఎగతాళి. చేతిలో ఉన్నదాన్ని పారేయించి ఆయనిచ్చిందాన్ని తాగనిచ్చాడు.

చివరకు ఆయన వీక్లీకి రాసిందేమంటే ‘పతంజలి ఆయుర్వేదం’. వారం వారం ఒక పేజీ. అడసూ, ఫోన్ నెంబరు ఇచ్చి కింద వేయమన్నాడు. అందువల్ల ఆయన డిక్షనరీలోనే లేని బిజినెస్సు అనే పదం వాడి అది పెరుగుతుందన్నాడు.

ఆయన చెప్పినట్టే వేసినా. మూడు వారాలయ్యే సరికి మా ఎం.డి నన్ను కిందకి రమ్మని పిలిపించినాడు.

“అదేంది నామినీ! ఎవరో ఆయుర్వేదం డాక్టరుది అడ్రసూ, ఫోను నెంబరు వేస్తున్నావంట. తీసెయ్” అనేసి అన్నాడు.

నేను దీనికి జగదీష్ ప్రసాద్ ఎదురుగుండా కుర్చీలో చక్కాముక్కాళ్లు వేసికుని కూర్చొని, “చూడండి సార్. ఆయన ఆయుర్వేద వైద్యుడూ కాదు పాడూ కాదు. పతంజలి. ఇక్కడ తిరుగులాడే జర్నలిస్టులందరి కంటే పనోడు. ఆయననేవోడే లేకపోతే నేననే వోడే మీ ఎదురుగా కూర్చుని వుండను. మీరంటూ ఉంటారు చూడండి ‘నామినీ ఇది నా ఆబ్లిగేషను’ అని. అట్లా ఆ పేజీ నా ఆబ్లిగేషను” అనేసి అన్నా.

ఎం.డి తలకాయ గీరుకొని, “నిన్నెవురన్నా ఆ పేజీ తీసెయ్ మని అంటే అట్లాగే అట్లాగే అని అంటూ అది వేస్తూనే ఉండు. నాతో మాట్లాడినట్టు వాళ్లతో మాట్లాడొద్దు. సరేనా?” అన్నాడు.

నేను సరే అని చెప్పి ఒకాయన చెప్పినా, రెండాయన్లు చెప్పినా ఆ పేజీ పతంజలి రాసినన్ని వారాలూ వేస్తూనే ఉన్నా.

జగదీష్ ప్రసాద్ తో చెప్పి ఆ ఆయుర్వేద పేజీకి అయిదారు వేల రూపాయల చెక్కొకటీ! దాన్నిచ్చేప్పుడు నేనెంత సిగ్గుపడినానో పతంజలి అంత పొంగిపోయినాడు. కుడుమిస్తే పండగనే వెర్రి మారాజు.

సరే. ఆంధ్రజ్యోతిని మూసేసినారు. 2001 జనవరి 1న ముందూ వెనకగా నాకు ఇంటికి సీ సుబ్బారావూ, పతంజలీ ఫోను చేసినారు.

“ఏమోయీ నాయుడుగారూ! ఆంధ్రజ్యోతిలో మీకెంతిచ్చీ వోరు ఏటి?” అంటూ పతంజలి.

“12వేలు సార్” అన్నాన్నేను.

“నేను నెలనెలా 15 అరేంజ్ చేస్తా. చెప్పాపెట్టకుండా తిరుపతికెళ్లిపోతే అక్కడికొచ్చి తన్నేయగలను” అనేసి ఆయన.

రాజుగదా, కోటలు దాటే మాటలు. ఆయనే ఆయన్ని మోసుకోలేక ఎన్ని అగచాట్లు పడినాడో అందరికీ తెలుసు. నన్ను మోస్తాడంట. అదాయన గుణం.

“నేరుగా ఇంటికొచ్చేయండి” అని ఒకరోజు ఫోను. నేరుగా ఇంటికెళ్లిపోతే “అవునోయ్ నాయుడుగారూ! మీకు మన రామకృష్ణారెడ్డి తెలుసుగదా” అనేసి అన్నాడు పతంజలి.

ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కాసింత చెప్పాల. మామూలుగా జర్నలిస్టులంతా వీలైతే కట్ డ్రాయర్ లో పెట్టుకుని సిగరెట్లు కాల్చేస్తూ వుంటారు. ఈ రామకృష్ణారెడ్డి అట్లాకాదు. కేప్ స్టెన్ప్యాకెట్టు అగ్గిపెట్టె చొక్కా పై జేబులో పెట్టుకుని తిరిగిన మొగలాయి. ఈ రామకృష్ణారెడ్డి పతంజలి నాణ్యంలో 10% వున్నవాడు కూడా. నన్నాయన “ఏమబ్బా నామినీ!” అనేవాడు. నేను ఆయన్ని “ఏమబ్బా కేప్ స్టెన్” అనేవాణ్ణి. ఇంతకుమించి మేమిద్దరం ఒకముక్క మాట్లాడుకున్న పాపాన పోలా. ఇప్పుడీయన ‘సాక్షి’లో ఏదో పొజిషన్ లో వున్నట్టు వింటూనేవున్నా.

బాపూ రమణా, వైఎస్సు కేవీపీ అని స్నేహాల గురించి చెప్తావుంటారు కదా, పతంజలి నాతో అన్నదాన్ని బట్టి ఇది మూడో జంట. పతంజలీ రామకృష్ణారెడ్డీ. ఇంతకంటే నేను చెప్పలేను. ఈ రామకృష్ణారెడ్డి సాహిత్యం గురించి ఎప్పుడూ మాట్లాడంగా కూడా నేను వినలా. రామకృష్ణారెడ్డి అప్పట్లో పతంజలితో కంటే మోహన్ తో, ప్రకాష్ తో తిరిగేవాడు జాస్తిగా.

పతంజలి ‘సాహితీ వైచిత్రి’కి కూడా రామకృష్ణారెడ్ది మూర్చపోయింది లేదు. పతంజలి అమాయక చక్రవర్తి అని నమ్మిన రామకృష్ణారెడ్డి పతంజలిని కడదాకా భుజాలమీద ఎత్తుకుని తిరిగినాడు.

రామకృష్ణారెడ్డికి నాగురించి చెప్పి యాభయ్యో, లక్షో పెరికి నాకు కొంచెం వూపిరాడేటట్టు చేద్దామని పతంజలి నన్ను ఇంటికి పిలిపించిన కథ.

“నాయుడుగారూ! మన చేతినిండా టీవీ సీరియల్స్ ఉన్నాయి. వాటినన్నిటినీ మీకు చూపిస్తా. మీరు రాయాలి మీకు నెలకు 25 వేలు, అడ్వాన్సు 50 రామకృష్ణారెడ్డితో చెప్పి!” అన్నాడు.

నాకు ఏకకాలంలో అన్ని అవయవాలకూ చెమట్లు పట్టేసినాయి. అమ్మో! ఇప్పుడీయన టీవీ సీరియల్స్ చూపిస్తాడా! “సార్, ఊపిరుంటే వుప్పమ్ముకుని బతకతా” అని అనబోతున్నానో లేదో, “నాయుడుగారూ గాభరాపడకండి. అత్తో కోడలో ఓకటుంటుంది. అది దేనికో ఒక దానికి టీ ఇస్తుంది. ఆ టీ ఉప్పగా వుందని విసిరి కొడుతుంది! దట్సాల్. ఒక్క వారం అయిపోతుంది. నోర్మూసుకుని మీరు రాస్తున్నారు” అనేసి అన్నాడు.

“సార్, నేనెక్కడ రాస్తాను సార్ అవన్నీ” అనేసి అన్నా.

“రేయ్ నంజికొడకా. పైకి లెయ్ రా. ప్రపంచ సాహిత్యాన్నంతా చదువుకున్న వాడినిరా, మార్క్ వెజ్ అంటే స్పెల్లింగ్ రాదు నీకు. నేను మేధావినా నువ్వు మేధావివా? నేను రాయంగా లేంది నువ్వు రాయలేవు ఆ ఆడంగి రాతలు. అప్పటికి నేను ఆడంగి రాతలు రాసే వాణ్ణన్నమాట. అహాహా వోహోహో! అబ్బో! బాగా పొగురు పట్టిందే! భార్యాబిడ్డల కోసం నానా చంకలూ నాకాలండీ. లైఫ్ లో ఐరనీ అంటే ఏంటనుకున్నారు. అన్నేవోడు లేకపోతే సరి” అనేసి తిట్టినాడు. నేను నవ్వతానే వుండిపోయినా.

ఆ తర్వాత రెండు మూడుసార్లు ఆయన ఫోన్ చేసిన పిలకాయల చేత లేడని చెప్పించేసి, పిల్లల స్కూళ్ల సీజను అయిపోయినాక 2001 జూన్ కంతా తిరప్తికి తిరిగొచ్చేసినా. 2004లో అనుకుంటా. ఆయన సెల్లు నెంబరు సంపాయించి సోక్రటీసాయన సెల్లునుంచి ఫోను చేసినా. ఎందుకంటే ఒక వారమంతా ‘కె ఎన్ వై పతంజలి రచనలు’ అనే పుస్తకం చదివి.

ఆయన్ని సంతోషపెట్టాలని చెప్పి నాలుగు వేలకు డి.డి. తీసి కొరియర్ చేసి “సార్, గెలుపు సరే… బతకడం ఎలా? ఆ ఎగతాళి పుస్తకాల్ని కొన్ని పంపించండి” అంటే అయిదో ఆరో పంపించి ఫోన్ చేసినాడు.

“ఏమోయి నాయుడుగారూ! డిడిలు కాదు నాక్కావాల్సింది. మీనుంచి నాకు అంకితం ఎప్పుడోయీ! ఒక్క పుస్తకం కాని నాయుడుగారూ, నాకు అంకితం ఇవ్వకపోయారో పురుగులు పడిపోతారు” అని మాట్లాడినాడు.

ఆ తర్వాత ఆయన ఫోను చేసింది లేదు. నేనూ చేసింది లేదు.

‘సాక్షి’ ఎడిటర్ అయిన అయిదారు రోజుల్లో “నాయుడుగారూ! నేనిప్పుడు ‘సాక్షి’కి ఎడిటర్ నోయీ! మీరు వైఎస్ నయినా సరే తిడుతూ ఒక కాలమ్ రాయాలి. దొంగమాటలు మాట్లాడకూడదు. మీరు ఏమి రాస్తే అది అచ్చు అవుతుంది. నామాట వినండి. మీరు రాయాలి. నేను రాస్తున్నాను అని చెప్పండి. చెప్పండి. నా ఎడిట్ పేజీలో మీ కాలమ్ లేకుండా ఏమిటి నాన్సెన్స్. నాయుడుగారూ! మీరు రాస్తున్నారు. ఎప్పుడు రాస్తున్నారు. పంపించండి. మీరు రాస్తున్నారు…”

ఆయన బతికుండాంగా ఇదంతా రాసి సంతోషపెట్టాల్సిన ఈ దొంగముండాకొడుకు ఆయన చచ్చిపోయినాక రాసిందిదీ!

– (నామిని సుబ్రమణ్యం) నాయుడు గారు.

ప్రకటనలు

26 responses »

 1. మొత్తానికి నామిని గారి రాత మళ్ళీ చదివే భాగ్యం మీ బ్లాగులో కలిగింది మాకు! ఈ అవకాశం కలిగించిన కీర్తి శేషులు పతంజలి గారికి రుణపడి ఉంటాము.

 2. నామిని ‘పచ్చనాకు సాక్షిగా’ గురించి ‘ఉదయం’లో పతంజలి రాసిన సమీక్ష ఇన్నేళ్ళయినా గుర్తుంది. అలాగే
  రారా చనిపోయినపుడు ఆయన రాసిన సంపాదకీయం కూడా అద్భుతమైనది.
  పతంజలితో సాన్నిహిత్యం గురించి నామిని చెపుతున్న సంగతులు ఎంతో హృద్యంగా ఉన్నాయి. రవికుమార్ గారికి ప్రత్యేక అభినందనలు.

 3. చాలా రోజుల తరువాత నామిని గారిని చదివే అద్రుష్టం కలిగించి నందుకు అబినందనలు. రెండో బాగం కోసం ఎదురు చూస్తూ.

 4. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు. ఈరోజుకు కూడా బ్రతుకు సౌందర్యం “నామినీ” వర్ణించినట్టు ఎవరూ వర్ణించలేరు. నేను తెలుగు పుస్తకాలు చదవటం మానేసిన తరువాత కూడా ఎక్కడైనా “పాత జ్యొతి సంచికలు” కనపడితే కేవలం ఆయన కోసం చదివేదాన్ని. అపుడేపుడో “సుజాత” గారి బ్లాగ్లో ఆయన ఫోటొ చూసాను. త్వరగా మిగతా భాగాలు పబ్లిష్ చేయండి.

 5. sir, namini ante evaro naku ivale telisindi patanjali gari to parichayam unna vyakti ante goppavare ayyuntaru aayana writing style pakka yasalo chala bagundi so thanq for this inka idi chadivina tarvata writer lu ante modatlo ami teliyani varani tarvata anta kottaga telusukuntarani aayana Msc mths chesi journalism loki ravadam chusi telisindi interview is very interesting

 6. అర్ధాంతరంగా అపేసాడు, పతంజలి – సాక్షి ఆదివారం లోని తన శీర్షికని. ఆతని తెలుగు సాహిత్యం కూడా ఎక్కడా దొరకడంలేదు, “out of print” అని అంటున్నారు.

 7. స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అయినా కొందరికున్నీఅనుమాన నివృత్తి కోసం… ఈ వ్యాసాన్ని నామినిసార్ నాకివ్వలేదు. ఒక చిత్రకారునిద్వారా నాకందింది. ఆయన నామిని అనుమతి తీసుకుని నాకిచ్చినారు. అంచేత ఈ వ్యాసం ఎక్కడా ప్రచురితం కానట్టే. ఇక్కడ స్పందనను యథాతథంగా నామినికి చెప్తే, ఇలా భాగాలుగా విడగొట్టినందుకు బాధపడ్డారు. పాఠకునికి నా భావమంతా ఒకేసారి తెలియకపోతే ఎట్టా అన్నారు. నేను దీన్ని వూరించి అందరికీ అందిద్దామన్న వుద్దేశంతో ఇలా చేయలేదు. యూనికోడ్ లో టైపు చెయ్యడం, బ్లాగులోకి ఎక్కించడం మొదలైన పనులు అంత త్వరితంగా చెయ్యలేని నా అశక్తత వల్ల మాత్రమే భాగాల ఆలోచన నాకొచ్చింది. పాఠకులు నన్ను మన్నించాలి. అంచేత దీనినంతటినీ ఒకే వ్యాసంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వ్యాసం టైపు చేస్తున్నంతసేపూ ఒకపక్క నవ్వుతూనే దుఖం ముంచెత్తింది. (కళ్లలో నీళ్లు, పెదవులపై నవ్వు)
  ఇక వ్యాసం మొదట్లో ప్రచురించిన ఫోటో ‘సాక్షి’లో బొమ్మలుగీసే అన్వర్ చిత్రించినది. ఆయన ఫ్లికర్ లోనుంచి నేను ఎత్తేసినది.
  అన్నట్టు దీంతోపాటు ‘ప్రాణహిత’లో ఎన్. వేణుగోపాల్ రాసిన “పతంజలిగారితో మూడు దశాబ్దాలు” తప్పక చదవండి. http://www.pranahita.org/2009/04/patanjalaigarito/

 8. “ఇక్కడ స్పందనను యథాతథంగా నామినికి చెప్తే, ఇలా భాగాలుగా విడగొట్టినందుకు బాధపడ్డారు. పాఠకునికి నా భావమంతా ఒకేసారి తెలియకపోతే ఎట్టా అన్నారు”
  భాగాలుగా విడగొట్టకుండా ఇచ్చి ఉంటే బాగుండేది అని నిన్నే వ్యాఖ్యానిద్దామనుకుని కూడా మీకు సాంకేతిక మైన కారణాలు ..టైపు చెయ్యడం, కాపి చెయ్యడం, మళ్ళీ దిద్దుకోవడం గట్రా..
  అన్ని ఎల్ల వేళలా..అన్ని సందర్భలాలోను సరి కాదు. అలాగే నామిని గారిది కూడా.

 9. పచ్చనాకు సాక్షిగా నామినికో లేఖ…

  “కష్టి పడాల కూడు తినాల” అని మంచి మాట చెబితివి కదరా నా బట్టా! యాడికి పోయినావురా నామినోడా? దోవన బొయ్యే చీమని కూడా మంచీచెడ్డా అడిగేటోడివిగదరా, అసలు నీకు ఈడ మేమనేటోల్లం ఒకరం సావలేక బతకతావుండామని చీవ గుట్టినట్టన్నా వుందంటరా నా బట్టా? ఈడ వూర్లో కోడిపుంజులు తెగ బలిసి కొట్టుకుంటా వుండాయిరా, దొబ్బుకుపోయి కోసకతినడానికి నీ సావాసకోపులు యాడికి బోయినార్రా? బీకిది ఇంకా ఎండనకా వాననకా ఎనుములు మేపతానే వుండాదిరా సామీ. పండి రాలిపోయిన చింతకాయలు, ఎండి మట్టిలో కలిసిపోతా వుండాయి. మేమేరిస్తాములేగాని నువు రా సామీ. ఎన్ను మీద గువ్వలు, ఏడి మీ నామిని సుబ్బరమన్నెం నాయడని? ఎక్కిరిస్తా వుండాయి. నువ్వు రాయేమిరా మిట్టూరోడా? “మీ ఇండల్లో జరిగే ఇషయాలనే కతలుగా రాయండబ్బా” అని అందరిని తట్టి లేపితివి గదరా సామీ! నువ్వు రాయవేమిరా నామినోడా? యాడ ఎలాంటి కష్టిం పడతన్నావో గదరా సామీ? లేక నీ పెళ్ళాం జెప్పినట్టు ట్రాక్టర్లు కొనేదానికి పెట్టుకున్నావంటరా నా బట్టా? అసలు మాకు తెలీక అడగతా వుండామురా… మేము కుచ్చుంటే కత లేస్తే కత చెప్పినోడివి కదా, ఇప్పుడు కతలు జెప్పేదానికి నీకు మనిషులే లేరంటరా సామీ?

  పచ్చనాకు సాచ్చిగా చెప్తా వుండామురా దచ్చిన తట్టు నారప్ప కొడకా, ఇంకా ఇక్కడ మేము దుక్కి దున్నేదానికి బూముల్లేక, దూకిచావడానికి బావుల్లేకుండానే వుండామురా. నువ్వు మా కతలు జెప్తావని ఆశగా వుండామురా మిట్టూరోడా. నువు ఇంకా ఇంకా కతలు రాయకపోతే మా యందరి మీద ఒట్టురా నా బట్టా!

  ఇట్లు

  నీ నీలావతి, బక్కత్త, బీకత్త, బుధవారపాయన, ఎంకటలచ్మి, పెరుగు సాయిబు, కడుపత్త, రామస్తానం … ఇంకా ఎందరో…. ఒక్క నీ పెళ్ళాం ప్రెబావతి తప్ప. (నామిని గారికి క్షమాపణలతో…)

  ఇది October 16, 2007 at 2:41 PM (మనసులో మాట) మా నువ్వుశెట్టి బ్రదర్స్ బ్లాగులో వారి రాతల కై చేసిన విన్నపం, తన దృష్టి కి పోతుందన్న కొద్ది పాటి స్వార్ధం తో…
  ఇక్కడ వాఖ్య గా
  http://nuvvusetty.wordpress.com/2007/10/16/%e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf/

 10. ఇంతకీ ఈ స్పందన గురించి నామిని ఏమన్నారు? ఫోన్ చేసి మాట్లాడదామని పీకుతుంది కానీ నేనూ, నామినీ మాట్లాడుకోట్లేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.

 11. “ఆ ఫలానా పేపరోడు వారానికి ఐదు వేలిస్తా ఒక వ్యాసం రాయరా నాయనా అంటే రాసే దానికి బుద్ది పుట్టక ఇట్టా కూచోని ఉన్నాన్నేను! ఎవరు మన గురించి మతింపుగా ఏం రాస్తే ఏమి లే గానీ , రాసే బుద్ధి పుర్రెలో పుట్టాల్నా వద్దా? ఎవురో రాయి రాయి అంటే రాసేదానికా నేనుంది? అదిగో అట్ట బొయ్ సూడు, సగం సగం రాసి వొదిలేసిన కతలు ఎట్టా పడేసున్నాయో, ప్రెబావతిని అడుగు! కాబట్టి తల్లా, నువ్వింక ఈ “ఎప్పుడు రాస్తావు సా ఏమి రాస్తావు సా ” అని అడిగేదానికి పెట్టుకోమాక. ఇంగ నిలిపెయ్”

  పైన నువ్వుశెట్టి గారి డిమాండ్ లాంటిది నేను నామిని దగ్గర పెడితే ఆయన ఇచ్చిన జవాబు ఇది. కాబట్టి ఆయనంతట ఆయన రాస్తే తప్ప ‘నువ్వు రాయాలి సా” అని మనం ఎంత వెంటపడ్డా లాభం లేదూ లేదూ! అందుకే నేనిక నిలిపేశా!

 12. పతంజలితో తన సాన్నిహిత్యం గురించి రాసాడు నామిని. అంతా చదివాక, నా మనసంతా నామినే ఆక్రమించాడు. ఆంజనేయుడు మహాకాయుడై రాముణ్ణి బుజాల మీద పెట్టుకు మోస్తుంటే రాముడేం కనబడతాడు!!

  “ఆయననేవోడే లేకపోతే నేననే వోడే మీ ఎదురుగా కూర్చుని వుండను.” 🙂

 13. పతంజలి గారి మీది Tribute కాస్త, నామిని గారి రచనాచమత్క్రుతి కి మట్టి గొట్టుకు పొయినట్టు అనిపిస్తుంది, నామిని గారిని ఇంతగా అభిమానించె వాళ్ళున్నారు , వీరి అనందం కొసం రవి గారు ,అబ్బూరి గారి గురించిన నామిని గ్నాపకాలు , బాపుగారి మొగలాయితనమ్మీద నామిని గార్రాసిన Article కూద సేకరించి పెడితె బావుంటుంది.
  పతంజలి గారూ మీ Place ని ఇట్టా వాడుకుంటున్నందుకు ఎకసెక్కం చెస్తూ “తాడీ మొహన్రావు గాడి శిష్యుదు అనిపించుకంటున్నారు సాయబు గారు అనుకుంటూ మరీ మాకు ఇనపడెంతగా అంతగా నవ్వనక్కర్లేదు, busy గా వున్నామండి పనులన్ని ఐ పొయాక మేమూ అటెసి వొస్తాంగా అప్పుడు సూస్కుందాం లెండి.

 14. పతంజలి గారి గురించి నామిని గారు రాసిన రాతను చదవటంకంటే అద్భుతమైన అనుభవం మరొకటి ఉండదు. తెలుగు సాహిత్యంలో ఇద్దరూ రెండు సమానమైన కొండలు. మా అన్నయ్య, బావగారు తిరుపతిలో ‘ఈనాడు’ లో పనిచేసే రోజుల్లో నామిని గురించి చాలా చెప్తూ ఉండేవారు. అప్పట్లో ‘ఈనాడు’, ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ తెలుగు జర్నలిజం రంగంలో మూడు సింహాల్లా తలపడటం (మంచి ఆరోగ్యకరమైన పోటీ అది) మరచిపోలేని అనుభవం. ఈ మూడు పత్రికలూ, ఎందరో దిగ్గజాల్లాంటి జర్నలిస్టులను అందించాయి. నామిని రాతలు ‘ఆంధ్రజ్యోతి’ లో ఒక ప్రత్యేక ఆకర్షణ. తన తర్వాత ఎంతో మంది యువరచయితలకు స్ఫూర్తిగా నిలిచారు ఆయన. అదే విధంగా పతంజలి. పతంజలి ఆయుర్వేద వైద్యుడి అవతారం ఎత్తిన తర్వాత ‘జ్యోతి’ వీక్లీలో వచ్చిన ఆయన వ్యాసాలు – ఇప్పటికీ నా దగ్గిర ఉన్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s