గుండె తడి పెట్టించే ఆత్మీయ ‘పరిచయాలు’

సాధారణం

parichayaaluకవి, విమర్శకుడు, అనువాదకుడు, సామాజిక విశ్లేషకుడు, పత్రికా సంపాదకుడు, సహృదయుడు, విప్లవ నిబద్దతను అణువణువణువునా జీర్ణించుకున్న ఎన్. వేణుగోపాల్ తాజా వ్యాస సంకలనం “పరిచయాలు”ను ఈ వారం పరిచయం చేసుకుందాం.

కథలు, నవలలు, నాటికలు, కవిత్వం వంటి సృజనాత్మక ప్రక్రియలకు సంబంధించిన ప్రచురణలు మనదేశంలో చాలా ఎక్కువ. అవికాక ఇతర విశ్లేషణాత్మకమైన పుస్తకాలు ప్రచురించడం తెలుగులో చాలా పరిమితం. అదే పాశ్చాత్యులు దీనికి భిన్నంగా సృజనాత్మక గ్రంథాలకంటే అపరిమితమైన సంఖ్యలో విశ్లేషణగతమైన పుస్తకాలు వెలువరిస్తుంటారు. వాటిని రాసేవారు, దానితోపాటు కొని చదివేవారు అక్కడ అధికం. మనకిక్కడ పరిమితం. ఇటీవల అనువాద సాహిత్యం పెరుగుతున్నకొద్దీ మనకు కూడా నెమ్మదిగా అలాంటి పుస్తకాలు రాసే అలవాటు అబ్బుతోంది. రుచి అలవడుతోందన్నమాట.

అయితే మనదేశంలో విడుదలవుతున్న, ప్రచురితమవుతోన్న ఇలాంటి పుస్తకాలను పరిశీలించినపుడు అత్యధిక శాతం గ్రంథాలు ఆయా రచయితలు వివిధ పత్రికల్లో పలు సందర్భాలలో రాసిన వ్యాసాలను సంకలనపరచడమే కనిపిస్తోంది. ఉదాహరణకు అమార్త్యసేన్ ప్రచురించే పుస్తకాలను పరిశీలించండి. వివిధ విశ్వవిద్యాలయాలలో ఇచ్చిన ప్రసంగాలు, వివిధ పత్రికలలో ప్రచురించిన వ్యాసాలు, అక్కడా ఇక్కడా బహిరంగ సభలలో ఉపన్యాసాలను కలిపి గుదిగుచ్చి ఏదేని ఒక విషయంపై ఆయన అభిప్రాయాలుగా ప్రచురిస్తున్నారు. తెలుగులో ఈ పద్ధతే యథాతథంగా కొనసాగుతోంది. దానికి కారణం మన పాఠకులమీద రచయితలకున్న అనుమానాలే. కొత్త విషయం నేరుగా పుస్తకరూపంలోకి వెళ్లినపుడు ఆదరిస్తారో లేదోనన్న ఆందోళన, అర్థమవుతుందో లేదోనన్న భయం. అదే ఏదో ఒక పత్రికలో వ్యాసంగానో సీరియల్ గానో వచ్చిందనుకోండి, దాని గురించిన అవగాహన పాఠకులకు వుంటుంది. అలాగే ప్లానింగ్ కూడా రచయితకు సులువవుతుంది. అంతేకాక సమీక్షకులకు పని సులువవుతుంది. దానితో అమ్మకాలూ ఆశాజనకంగా వుంటాయని తాపత్రయం. అంతే అంతకుమించి ఏమీలేదు. ముఖ్యంగా కొత్త విషయాలను సరికొత్తగా చెప్పడం లేదా రాయడం చేతకాక మాత్రం కాదు. కానీ ఇటీవల విడుదల అయిన రామచంద్రగుహ “ఇండియా ఆఫ్టర్ గాంధీ“, నందన్ నీలేకని “ఇమాజినింగ్ ఇండియా” లు పాఠకులకు ఒక విషయాన్ని నేరుగా ఆ రచనలద్వారా పరిచయం చేసిన గ్రంథాలకు తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇందులో మొదటిది వెయ్యి, రెండోది ఐదువందల పేజీల పుస్తకాలు కావడం మరో విశేషం. వల్లంపాటి వెంకటసుబ్బయ్య తీవ్రఅస్వస్తులు కావడానికి కొద్దిరోజుల ముందర ప్రచురించిన “ఆధునిక రాయలసీమ సాహిత్యంలో సాంస్కృతిక సామాజిక విశ్లేషణ” ఇలా నేరుగా తన అభిప్రాయాలను పాఠకులతో పంచుకున్నదే. ఇలాంటి ప్రయత్నాలు భారతీయ సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో విరివిగా జరగాలని కోరుకుందాం.

ఈ వారం పరిచయం చేసుకుంటున్న “పరిచయాలు” వ్యాససంపుటి కూడా వివిధ పత్రికలలో ఇంతకుముందు వెలువడిన వ్యాసాల సమాహారమే. ఇందులో పరిచయమైన వారు సామాన్యులు కారు. కొందరు సృజనకళాకారులు. మరికొందరు ఉద్యమకారులు. ఇంకొందరు సామాజిక పరివర్తకులు. మొత్తానికి అందరూ ప్రజాజీవనంలో మార్పుకోసం పరితపించినవారు. ఆ ప్రయత్నంలోనే తమ జీవితాలను అర్పించుకున్నవారే కావడం గమనించాల్సిన విషయం.

మనిషి మరణించిన తరువాత ఆ మనిషి కృషిని గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించడం, ఆ వ్యక్తి సమాజంలో తన వారసత్వ ఆంశగా మిగిల్చిపోయిన స్ఫూర్తిని మననం చేసుకోవడం, భావితరాలకు ఆ వ్యక్తి మూర్తిమత్వ విశేషాలు అందజేయడం వెరసి మరణించిన మనుషులను స్మృతులలో బతికించుకోవడానికి ప్రయత్నం చేయడం మామూలు సంగతి కాదు. ఆ వ్యక్తులమీద అవ్యాజానురాగం, వారి కృషిమీద అనంతమైన విశ్వాసం, సమాజగమనం పట్ల నిశిత దృష్టి, సామాజిక మార్పులపట్ల సమగ్ర అవగాహన వుంటేనే సాధ్యంకాని విషయం ఇదంతా. ఈ పుస్తకం పూర్తిచేసిన వెంటనే వేణుగోపాల్ సాగించిన కృషిపట్ల మనకెంతో గౌరవం కలుగుతుంది. కంటతడి పెట్టించే ఈ పరిచయాలు చదివిన తరవాత నాకనిపించింది వేణుగోపాల్ తో సన్నిహిత స్నేహం సంపాదించుకుని చనిపోవడం మంచిదని. మనమెప్పటికీ బతికుండిపోతాం.

ఒద్దిరాజు గోపాలరావు అంటే నేటితరానికి తెలియదు. (ఆ మాటకొస్తే నేటి తరానికి ఎవరు తెలుసు కనుక? సినిమా తారలు, క్రికెట్ క్రీడాకారులు తప్ప!) ఆయన పరిచయంతో ఈ వ్యాసాల పరంపర ప్రారంభమవుతుంది. ‘తన గురించి మాట్లాడడమంటే ఏ క్షణాన కనురెప్పల కట్టలు తెగి దు:ఖం భళ్లున లోకంమీద విరుచుకుపడుతుందో అని గుండెలు చిక్కబట్టుకుని ఒక ఆహ్లాదకరమైన అనుబంధాన్ని అవగాహన చేసుకోవడమన్న మాట. తన గురించి రాయడమంటే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుకు, ఒక అపురూప మాన సంబంధానికి, పనిపట్ల విసుగులేనితనానికి, స్థిర సంకల్పానికి అక్షరాలు తొడగడమన్నమాట. …”అంటూ సాగే ఆ పరిచయం గోపాలరావు వ్యక్తిత్వాన్ని, ఆయన కృషిని కవితాత్మకంగా వివరిస్తుంది. గోపాలరావు మరణంతో సాహితీ మిత్రులు ఒక సున్నితమైన పువ్వును, విలువైన వజ్రాన్ని కోల్పోయారని చెప్తారు. సృజన పత్రిక వెలువడినంత కాలం ఎంతమంది కళాకారులను తయారుచేసిందో కదా! రచయితలు పత్రికలను నిలబెడతారా? లేదంటే పత్రికలే రచయితలను తయారుచేస్తాయా? అన్నది ఎడతెగని చర్చ. ఒక విషయాన్ని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. 70వ దశకంలో తెలుగు సమాజానికి ఒక తరపు తెలుగు రచయితలను, కవులను, ఉపన్యాసకులను, సామాజిక విశ్లేషకులను తయారుచేసి, అందజేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా సృజనదే.

కామ్రేడ్ ఈశ్వరి ఆత్మహత్యా ప్రయత్నం ఒకరకంగా సమాజం చేసిన హత్య. గడచిన ఆరునెలల్లో దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటిదే. ఆమెను పరిచయం చేసిన వేణుగోపాల్ “ఒలికిపోయిన పాలు కళ్లముందరే నేలలోపలికి బొట్టుబొట్టుగా ఇంకిపోతున్న దృశ్యం. చెయిజారిన గాజుబొమ్మ పడిపోయి వెంటనే శకలాలు శకలాలుగా చెదిరిపోతున్న శబ్దం..” లాంటి వాక్యాలతో ఆమె జీవితాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆమెకు కన్నీటి నివాళులర్పిస్తాం. కొండపల్లి సీతారామయ్య కుమార్తె డాక్టర్ కరుణ తండ్రిబాటలోనే సమాజసేవలో జీవితాన్ని తరింపజేసుకున్నపుడు మనకు ఆశ్చర్యం అనిపించదు. తనకు పేరు ప్రఖ్యాతులు రావడంపట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించని ఆ మహనీయురాలి నిశ్శబ్ద కృషికి ప్రతి బుద్ధిజీవీ కృతజ్ఞతలు తెలిపి తీరాల్సిందే. “విభాతసంధ్యలు”తో తెలుగు పాఠకలోకానికి ఎప్పటికీ గుర్తుండిపోయే సివి సుబ్బారావును ‘తెగిపోయిన వెయ్యి అనుబంధాల పాట’ వ్యాసం పరిచయం చేస్తుంది. వరవరరావు జ్ఞాపకం మీద చెప్పిన మార్క్సిస్టు మహోపాధ్యాయుల కొటేషన్లకు మూలాలు, అసలు రూపాలు వెతికే పని ఒకసారి వేణుగోపాల్, సివిలమీద పడిందట. ఇలాంటివి చదివినప్పుడు అసూయతో కుళ్లిపోవడం సరే, వీరి మేధోకుశలతకు కారణాలు తెలుస్తాయి.

తెలుగు సాహిత్య చరిత్రను మార్క్సిస్టు దృక్పథంలో అక్షరబద్దం చేసిన కెవిఆర్ చివరి ఉపన్యాసం శ్రీకాకుళంలో ఇచ్చినట్టు తెలిపిన వ్యాసం ‘ఆయన కేక భువన ఘోష – ఆయన రచన అంగారవల్లరి’. కెవి. రమణారెడ్డి మరణంతో తెలుగు సాహిత్యలోకం ఒకగొప్ప విమర్శకుని పోగొట్టుకుంది. సాహిత్యంలో అనితర సాధ్యమైన కృషిచేసిన వ్యక్తుల మరణాంతరం వారిమొత్తం సాహిత్య కృషిని ఒకే లేదా బహుళ సంపుటాలుగా తీసుకువచ్చే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరంగా సాగుతున్నాయి. కెవిఆర్ సమగ్ర రచనలు కూడా అదేతీరుగా రావడం ఒక తక్షణ చారిత్రాకావసరంగా విరసం గుర్తిస్తే బాగుణ్ణు.

సున్నిత మనస్కుడు రాప్తాడు గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకుని ఈ లోకమ్మీద పగతీర్చు కున్నాననుకున్న భ్రమాజనిత ఆత్మత్యాగంపై రాసిన విపుల వ్యాసం ‘అతడు బయలుదేరాడు’ కథాసంపుటికి వెనుకమాటగా వచ్చింది. ఇప్పుడిక్కడ ఆ వ్యాసాన్ని ప్రచురించడం సందర్భోచితం. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో అర్పించిన నివాళి వ్యాసాలు పురుషోత్తం, పొట్లపల్లి రామారావు, జనార్ధన్, లింగమూర్తి, రాంమోహన్, విప్లవ కమ్యూనిస్ట్ సంప్రదాయంలో ఒక శకం అనదగ్గ కె. ఎస్.గా సుపరిచితులైన కొండపల్లి సీతారామయ్య, పెండ్యాల దామోదరరావు, అలిశెట్టి ప్రభాకర్ తదితరులు కేవలం హక్కుల ఉద్యమకారులో, రచయితలో, కవులో కారని, ఒక్కోవ్యక్తిలో అనేక పార్శ్వాలు ఇమిడి వున్నాయని బోధపరుస్తాయి.

విప్లవ ఆలోచనలకు కొండపల్లి సీతారామయ్య అందించిన ఐదు సృజనాత్మక అన్వేషణలుగా వేణుగోపాల్ పేర్కొన్న అంశాలు ఈ దేశంలో ప్రజా ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేసేవారు తప్పక గుర్తించవలసినవి. గ్రామీణ ప్రాంతాల విప్లవానికి కె. ఎస్. అందించిన నూతన ఒరవడి, జాతుల ఉద్యమాలను, వర్గపోరాటాన్ని కె ఎస్ అనుసంధానించిన తీరు, ప్రపంచ విప్లవ పోరాటాలను అధ్యయనం చేసి ఆయన అందించిన గెరిల్లా జోన్ పెర్ స్పెక్టివ్ మొదలైనవి ఆయా అంశాలను వ్యాసకర్త వివరిస్తారు. సాహిత్య విమర్శలో మరో మేరునగధీరమనదగ్గ త్రిపురనేని మధుసూదన రావు సాహిత్య కృషిని అంచనావేసిన వ్యాసం ప్రతి సాహిత్య విద్యార్థి కంఠస్తం పెట్టవలసిందే. ప్రాచీన, ఆలంకారిక, భూస్వామ్య, పెట్టుబడిదారీ సాహిత్య విమర్శ సిద్ధాంతాల నుంచి మౌలిక తెగతెంపులు (రాడికల్ రప్చర్) చేసుకున్న మార్క్సిస్టు విమర్శ ప్రయాణం సుదీర్ఘం. దానికి మద్దుకూరి చంద్రశేఖరం నుంచి రాచమల్లు రామచంద్రారెడ్డి దాకా కొనసాగించిన సాహిత్య విమర్శకులు అనేకులు. అయితే వీరుగాని, కొకుగాని, కెవిఆర్ గాని చేయని మరో ముఖ్యమైన పని త్రిపురనేని మధుసూదనరావు చేశారు. సాహిత్య విమర్శకూడా వర్గపోరాట సాధనమవుతుందన్న స్పృహ త్రిపురనేని సాధించడమే ఆ విశిష్టత అని వేణుగోపాల్ చాటిచెప్తారు. తత్వశాస్త్రం, సాహిత్య చరిత్ర, వాదవివాదాలు, సమకాలీన సాహిత్య రాజకీయ సాంఘికాంశాలు అనే నాలుగు రంగాలలో త్రిపురనేని సాధించిన కృషి గురించి వివరిస్తారు. గొప్ప ఉపన్యాసకుడు కూడా అయిన త్రిపురనేని చెదురుమదురుగా వున్న సాహిత్య కృషికూడా అంతటినీ ఒకచోట గుదిగుచ్చి అందించడం భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేసేదిగా అవుతుంది.

సమకాలీన అన్వయ విమర్శకుల్లో అద్వితీయులనదగ్గ వల్లంపాటి వెంకటసుబ్బయ్యను ఎట్లా అర్థం చేసుకోవాలో వివరించి చెప్పిన వ్యాసం కూడా ప్రస్తుతించదగ్గదే. సైద్ధాంతిక పటుత్వం లేకపోవడం, దృక్పథ స్పష్టత లేకపోవడం వల్లంపాటిలో వున్న ప్రధాన లోపాలుగా గుర్తిస్తూనే ఆయన తెలుగు సాహిత్య విమర్శకు అందించిన చేర్పును అంచనావేయడం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. నచ్చనిదాన్ని చీల్చిచెండాడిన రారా ప్రభావంలోవుండి కూడా, అభిప్రాయ భేదాన్ని ఖండఖండాలుగా నరికి పోగులుపెట్టిన త్రిపురనేని మధుసూదనరావుకు సమకాలికుడయి వుండికూడా వల్లంపాటి మృదువైన సాహిత్య విమర్శ చేశారనడం అక్షర సత్యం.

ఫైజ్ అహ్మద్ ఫైజ్, బీరేంద్ర చటోపాధ్యాయ, ఇస్మత్ చుగ్తాయ్, నిరంజన, కోట శివరామ కారంత్, తగళి శివశంకర్ పళ్లై, సర్దార్ అలీ జాఫ్రీ, ఇపిడబ్ల్యు కృష్ణరాజ్, మిహయిల్ షోలకోవ్, యాసర్ అరాఫత్, మహమూద్ దర్వీష్ వంటి జాతీయ, అంతర్జాతీయ మహనీయుల కృషి, శ్రమదమాలను కొండను అద్దంలో చూపించినట్టు వేణుగోపాల్ తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. ఈ సంపుటంలో వున్న పరిచయ వ్యాసాలన్నీ చనిపోయిన వ్యక్తుల విశిష్ట కృషిని, వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తే, ఒకేఒక్క వ్యాసం ఇప్పటికీ బతికున్న వ్యక్తిపై వుంది. ఆ వ్యాసం మహాశ్వేతా దేవిపైన. చాలా ఆత్మీయమైన ఈ వ్యాసం చదివాక మహాశ్వేత కుటుంబ నేపథ్యం తెలిశాక, ఆమె చేస్తున్న సామాజిక, సాహిత్య పోరాటాల గురించి పెద్దగా ఆశ్చర్యపోము. ఆమె తండ్రి మనీష్ ఘటక్ నవలాకారుడు. తల్లి ధరిత్రీదేవి రచయిత. మేనమామ సచిన్ చౌధురి ఇపిడబ్ల్యు వ్యవస్థాపక సంపాదకుడు. చిన్నాన్న రిత్విక్ ఘటక్ సినిమా దర్శకులు. సహజీవనం చేసిన బిజన భట్టాచార్య అభ్యుదయ నాటకకర్త. కొడుకు నబురణ్ భట్టాచార్య కవి, సామాజిక ఉద్యమకారుడు. అదీ సంగతి!

వందోపేజీ దాటిన తర్వాత అచ్చుతప్పులు అక్కడక్కడా పంటికింద రాళ్లలాగా ఇబ్బంది పెట్టాయి. నాకు తెలిసి స్వేచ్ఛాసాహితి ప్రచురణల్లో ఇన్ని అచ్చుతప్పులున్న మొదటి పుస్తకమిదే. వ్యాసం పూర్తయిన వెంటనే ఆయా మహనీయుల జనన మరణాల తేదీలు అడుగున ఇచ్చివుంటే బాగుండేది. ఒక మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతినిచ్చిన ఈ పుస్తకాన్ని తప్పక చదవండని చెప్తూ ముగించే ముందొక మాట. వ్యాసం ప్రారంభంలో చెప్పినట్టుగా సాహిత్య విమర్శకు సంబంధించి గాని, సామాజిక చరిత్రకు సంబంధించి గాని నేరుగా ఒక పుస్తకాన్ని రాసే సమర్ధత, అర్హత వున్న వేణుగోపాల్ ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.

“పుస్తక పరిచయాలు”

(ఎన్. వేణుగోపాల్)

స్వేచ్ఛాసాహితి ప్రచురణ.

పేజీలు 194, వెల రూ. 50

ప్రకటనలు

5 responses »

  1. బావుందండి. మీరు ఆ ఇమేజింగ్ ఇండియా నీ, ఇండీయా ఆఫ్టర్ గాంధీ ని కూడా ఏమన్నా సమీక్షించారా!? ఏదన్న మంచి తెలుగు సమీక్ష తెలిసింది ఉన్నా కూడా, ఆ “బోళ్డు లెటర్స్” కి లింకేసేయమని అభ్యర్ధన.

  2. “నాకు తెలిసి స్వేచ్ఛాసాహితి ప్రచురణల్లో ఇన్ని అచ్చుతప్పులున్న మొదటి పుస్తకమిదే” – ఇలాంటి విమర్శల మీద నాకో పోస్టెయ్యాలని కోరిక. కానీ ప్రెస్ తో ప్రత్యక్ష అనుబంధాలున్న ఈ అతి చిన్న బ్లాగ్లోకంలో ఆ సాహసం చేయలేక పోతున్నాను.నా తాట తీస్తారు – సబ్జెక్టు లేకుండా రాయకని :);అందుకని నాదో చిన్న విన్నపం లేక అర్జీ; ఓపిక చేసుకొని, అసలు తెలుగు పభ్లిషింగ్ ప్రాసెస్ – తెలుగు రచయిత ఎలా రాస్తున్నాడు నుంచి తెలుగు పుస్తకం ఎలా విక్రయించ బడుతోంది అన్న విషయం వరకు ఓ సమగ్రమైన వ్యాసం రాయగలరా? దయచేసి.

  3. రేరాజు గారూ, వ్యాసం నచ్చినందుకు సంతోషమ్. అయితే బుక్ పబ్లిషింగ్ గురించి నాకు కూడా ఏమీ తెలియదు. మన ప్రింటింగ్ అనుభవం అంతా గ్రీటింగ్ కార్డులు కొట్టించడం వరకే. కానీ ఒకసారి పరుచూరి శ్రీనివాస్ గారు పబ్లిషింగ్ విషయాలమీద విపుల వ్యాసమో, మరోటో రాస్తానన్నట్టు గుర్తు. లేదా పబ్లిషింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న లేదా తమ పుస్తకాలు తామే అచ్చువేస్తున్న రచయితలెవరన్నా దీనిమీద స్పందించాలి. నిజమే.

  4. వారితో పరిచయం లేదు – అహా మీతో కూడా లేదనుకోండి; కానీ ఇలా బ్లాగు ముఖతగా అడగేయలేదా గానీ,
    మీకు పరిచయం ఉంటుంది కాబట్టి ఓ సారి తట్టి చూద్దురూ (టచ్ చేయండి అని); లేదా కొణతం దిలీప్ తో వేయించినా సరే! ఐ థింక్ శ్రీనివాస్ వేస్తేనే కరెక్టు – ఆయనేగా తెగ ఇరుడైట్ ఇంటర్వ్యూ ఇచ్చారు;తెలుగు పబ్లిషింగ్ నిరాశాజనకంగా ఉంది అన్నది ఆయనే అనుకుంటా – అదేదో రాస్తే, కాస్త చూద్దామని.

    సరే ఎవరితోనో ఒకరితో ఇలాంటి వ్యాసం వేయించి పుణ్యం కట్టుకోండి.అలాగే,ఆ వ్యాసం వచ్చాక నా బ్లాగులో ఓ మాటేయడం మర్చిపోకండి.ముందస్తు ధన్యవదాలు.(ఇక మీరేమ్మాటాటకండి.మీరీపని చేయిస్తున్నారు.అంతే!)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s