కళింగాంధ్ర యువకవుల సంకల్పం

సాధారణం

sarvajit

ఉగాది అంటే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. సాహితీ ప్రియులకు మాత్రం ఉగాది అంటే గుర్తొచ్చేది ఆనాటి కవి సమ్మేళనాలే. కవిత్వంలో చెయ్యి తిరిగిన రచయితలంతా ఒకచోట చేరి తమ కవిత్వాన్ని చరణాలు పల్లవులు పద్యపాదాలు ఏమీ లెక్కచేయకుండా చదివిందే చదువుతూ… ఓహో.. వాటిమీద ఎన్ని జోకులో… వీటికి భిన్నంగా 2007లో శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. కారా మాష్టారికి సన్మానం, జిల్లాకు చెందిన 14 మంది యువ కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనం ముగిసిందాకా బాపూజీ కళామందిరంలో ఆశీనులైన సభికులెవ్వరూ కదల్లేదు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ సంస్కృతీ వారసత్వ సంస్థ (ఇంటాక్) ఈ కవితలన్నింటినీ “సర్వజిత్ సంకల్పం” పేరుతో ప్రచురించింది. ఈ వారం ఈ కవితా సంకలనం పరిచయం చేస్తున్నాను.

కవి సమ్మేళనానికి, కవితా సంకలనానికి మార్గదర్శిగా వ్యవహరించిన దూసి ధర్మారావు మాటల్లో చెప్పాలంటే ‘కవిత్వం సంగతికొస్తే ఉగాది అన్గానే మావికొమ్మలూ, కోయిలమ్మలూ, వేపచిగుళ్లూ వీటినే అటూ ఇటూ తిప్పి రాయడం కవులకు ఆనవాయితీ. అందుకు భిన్నంగా యువకవులంతా సమకాలీన సమస్యల మీద కలాలు ఝుళిపించడం విశేషం. సమాజంపట్ల రాబోయే తరాలకుగల బాధ్యత మనకు ఆనందం కలిగించింది’. (పే. 6) సంకలనంలో ఏ కవిత చదివినా ఈ సంగతి మనకు తేటతెల్లమవుతుంది.

శ్రీచమన్ చదివి వినిపించిన రెండు కవితలతో ఈ సంకలనం ప్రారంభమవుతుంది. జర్నలిస్టుగా జీవితంలో వెలుగు చీకట్లను దర్శించడం చేత విరుద్ధమైన రెండు కవితలను ఆయన రాయగలిగారు. ‘గాదెలు నిండుగా ధాన్యం / మాయమైంది దైన్యం‘ అని కొత్త వెలుగు కవితలో అనగలిగిన కవి ‘నేను మూడుపూటలా తిని చాలా రోజులైంది’ అని మాకు ఉగాదుల్లేవు కవితలో చెప్పారు. ఉన్నవారికి ఉగాదినాటి పంచాంగశ్రవణం లాభనష్టాల లెక్కలు తేల్చే వసంత గణితం’ అంటారు. లేనివారికి మండిపోతున్నది ధరలే కాదు. వారి కడుపు కూడా.

సర్వజిత్తుకు స్వాగతం కవిత చదివిన మేడూరి వెంకట సూర్యలక్ష్మికి శ్రోతలు పదపదానికి హర్షధ్వానాలు చేస్తూనే వచ్చారు. ప్రతి పంక్తిలోనూ సమకాలీన సంగతులపై కవితాత్మకంగా విసుర్లు చల్లిన సూర్యలక్ష్మి కవితను పాఠకులు చదవాలి. ‘కిందటేడాది వ్యయనామ సంవత్సరం / అప్పుడు వ్యయానికి స్వాగతం చెప్పి మోసపోయాం / ఆదాయం పది పాళ్లంది. అందులో సగం వ్యయమంది / అదంతా ఒట్టి మోసం / ఎవరిదో తెలియదు దోషం‘ అంటారు. ఇక ఆ ఏడాది ఉగాది రెండు రోజుల్లో పడింది కదాని రెండు రోజులు పండుగ జరుపుకున్నాం. ‘సర్వజిత్ నామ సంవత్సరమా… / స్వాగతం చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నాం / కాని సవాలక్ష సందేహాలతో చస్తున్నాం / నేడే ఉగాది అన్నారు పండితులు / కాదు కాదు రేపు అన్నారు పండిన తలవారు / సర్వజిత్తులూ నీదగ్గర వుంటే / మా ఎత్తులేం కావాలి? మా జిత్తులేం చెయ్యాలి?’ అని ప్రశ్నిస్తారు. ఈమె పండగలకీ పబ్బాలకీ కాకుండా నిత్యం కవిత్వం రాస్తే బాగుణ్ను. కళింగాంధ్రనుంచి మరో కావ్యగళం వినిపించేది.

బ్రాహ్మణతర్ల నుంచి వచ్చిన మరో యువకవి కంచరాన భుజంగరావు ఉగాది పిట్ట కవితలో గ్లోబలైజేషన్ క్రమంలో కళింగాంధ్రలో వస్తున్న మార్పుల్ని రికార్డు చేశారు. ఉగాది పిట్టను ఒక మెటాఫర్ గా నిలిపి తాను చెప్పదలచుకున్న అంశాన్ని – పచ్చని శ్రీకాకుళంలో చిచ్చుపెట్టిన కాస్మోపాలిటినిజాన్ని – చాలా సరళంగా, అందరికీ తెలిసిన మాటల్లో చెప్పేశారు. జాద సీతాపతిరావు ఉగాదిని స్త్రీగా చూశారు – సర్వజిత్ సుందరి కవితలో. లాలిత్యంగా సర్వజిత్తును ఆహ్వానిస్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గెలుపు పిలుపు సర్వజిత్తుకు ఆహ్వానం పలికారు కె. ఎస్. కళ్యాణి. ‘గగనంలో సగమైన మా మహిళామణులందరమూ / సహజమైన మా హక్కుల కోసం పోరాడుతూనే వున్నాం’ అంటూ స్పష్టమైన గొంతుతో స్త్రీవాదపు టెరుకను కనపర్చారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఆచార్యునిగా పనిచేస్తున్న ఎమ్. ఏ. వి. రామకృష్ణ తన హైటెక్ ఉగాది కవితలో బోల్డన్ని టెక్నికల్ పదాలు వాడారు. అయితే అవేవీ సాంకేతికాంశాలుగా కాక, వర్తమాన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరణాలుగా సహకరించాయి. ప్రపంచకప్ క్రికెట్ అభిమానులకు చురకలంటించారు.

సర్వజిత్ ఉగాది కోయిలా! అంటూ చింతాడ తిరుమలరావు ఎన్నో కోరికలు కోరుతారు. అకస్మాత్తుగా జీవితం నుంచి అదృశ్యమైపోతున్న అంశాల గురించి ఇందులో కవి ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆ ఆందోళనను గానం చెయ్యమని ఉగాది కోయిలను అర్ధిస్తారు. అదికూడా కవి హృదయం నుండో, ధనికవర్గం నుండో, కరోవైపునుండో కాకుండా, ఉగాదుల ఉషస్సులకు నోచుకోని బతుకుజీవుల మనస్సులోతుల్లోంచి గానం చేయమని అభ్యర్థిస్తారు. సతీష్ శాండిల్య తన నాలుగు మినీ కవితల్లో కవి హృదయాన్ని ఆవిష్కరించారు. ‘ఆలోచించే మెదడు /  ఆచరణలో పెట్టి సాధించాలని‘ కోరుకుంటారు. మంతిన వాసుదేవాచారి తన కలం కలవరం కవితలో గమ్మత్తుగా ఉగాది విశేషాలు వివరిస్తారు. ఉగాది రోజు ఉదయమే కవిత్వం రాయడానికి కూర్చుంటారు కవి. కానీ కలం తిరగబడింది. కవిత్వం అంటే ఏమిటో జ్ఞానోదయం చేసింది. ఎలా పడితే అలా కవిత్వం రాసే కవులందర్నీ కడిగి పారేసింది. ‘మెప్పుకొరకు రాయకోయ్ కవిత్వం తుప్పుపట్టి పోతావ్’ అని సరదా కవిత్వం రాసేవారిని హెచ్చరిస్తుంది. కవి చేయాల్సిన పనులు ఉద్బోధిస్తుంది.

కాలస్పృహలో దాసరి రామచంద్రరావు యువతకు అక్కరకొచ్చే హితోక్తి చెప్పారు. ‘పోటీపడిన ప్రతిసారీ / గెలుపు పరిపాటి కాదు / జయకీర్తి ఒక్కటే చరిత్ర కాదు / ఓటమిలోని స్ఫూర్తికూడా ఒక్కోసారి శాశ్వతమౌతుంది’. ఎంతో నిబద్దత లేకపోతే ఇలాంటి మాటలు రాయ్లేరు. పర్సనాలిటీ డెవలప్ మెంట్ సిరీస్ లో నవలలు, వ్యాసాలు వస్తున్నాయి. బహుశా ఆ విభాగంలో చేర్చల్సిన కవిత ఇదేమో. ‘అనుభవాల నేపథ్యం వర్తమానం / గుణపాఠాల సారాంశం భవిష్యత్తు’ అంటారు ఉగాదంటే నాకిష్టం కవితలో నంబూరి రంగారావు. తనకు ఉగాది ఎందుకిష్టమో వివరమైన పదచిత్రాల్లో చెప్తారు కదిలించే ఝంఝామారుతాలు కవితలో అరుణ్ బవేరా. రెండు రోజుల ఉగాది అంశాన్ని ప్రశ్నించడం సాకుతో అనేక ప్రశ్నలు లేవనెత్తుతారు. కవితను ఒకటికి రెండుసార్లు చదివినప్పుడు సంక్లిష్టమైన వర్తమాన సమాజంపై ఏహ్యతతో పాటు గుండెలోతుల్లో దాగున్న నిరాశా కనిపిస్తాయి. ఈ నిరాశను కవి తరిమికొట్టాలి. అన్ని రకాల దౌష్ట్యాలపై అక్షర సమరం సాగించేవాడే కవి. నిరాశాచాయల్ని తన దరి చేరనివ్వకూడదు. కవి లోకమంతా సమర్ధంగా సమరం సాగించినపుడు ‘ప్రజల నిర్ణయానికి పట్టాభిషేకం‘ తప్పక జరుగుతుంది. సమాజాన్ని కదిలించే ఝంఝామారుతం కవిత్వమేనన్న ఎరుక అరుణ్ బవేరాకుంది. కళింగాంధ్ర ఆశలు పెట్టుకోదగ్గ కవి. ‘ప్రజాసాహితి’ మాసపత్రిక సంపాదకులైన పి. ఎస్. నాగరాజు రెండుగా చీలిన భూగోళం కవిత ఈ సంకలనంలో చివరిది. ‘మట్టిబతుకుల / ఆకుపచ్చని అగ్రహారాల ఆరోహణ / చెమట మబ్బుల / శ్రమపూర్వక యుగావిష్కరణ‘మే అసలు సిసలు ఉగాదని నిర్వచిస్తారు ఈ కవితలో.

తూరుపు పొడుపు శ్రీకాకుళం యువకవుల ఆకాంక్ష ఆవిష్కరణ ఈ “సర్వజిత్ సంకల్పం” ఉగాది యవనికగా కవులు ఆలపించిన అక్షరభేరి ఇంత శక్తిమంతంగా వుంటే, స్వేచ్ఛాశ్వేత యవనికలో వీరిని పల్లవించమంటే ఖచ్చితంగా ఇంకెంత పదునుగా, నవ్యంగా, విప్లవాత్మకంగా తమ కవితాగానాన్ని ఆలపిస్తారో కదా అనిపించింది. ఇంతటి వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టాలని చేపట్టాలని తలంచిన అప్పటి జిల్లా కలెక్టర్ వి. ఎన్. విష్ణుగారికి, ఈ ప్రయోగాన్ని తన చేతులమీదుగా నిర్వహించి, విజయం సాధించిన ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావుగారికి కళింగాంధ్ర సాహితీలోకం కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విరివిగా జరగాలని కోరుకుందాం. వెలలేని ఈ 14 మంది యువకవుల కవితా సంకలనం “సర్వజిత్ సంకల్పం” చదవాలనుకునేవారు దూసి ధర్మారావుగారిని (9908101809) సంప్రదించగలరు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s