ఇరవైఆరో వారం చదువు ముచ్చట్లు కస్తూరి మురళీకృష్ణతో…

సాధారణం

కస్తూరి మురళీకృష్ణగారి రాతలు-కోతలు బ్లాగు పూర్తిగా చదవకముందు ఆయనో కరడుగట్టిన హిందుత్వవాది అని అనుకున్నాను. అప్పటినుంచి ఆయన బ్లాగు చూస్తున్నా చదివేవాడిని కాను. కానీ, ఇంతలో ఆయన ఆంధ్రభూమి వీక్లీలో రాస్తున్న నవలల పరిచయం శీర్షిక చదవడం మొదలుపెట్టాక, మళ్లీ మురళీకృష్ణగారి బ్లాగు చదవడం ఆరంభించాను. కానీ అవన్నీ తీర్చని సందేహాలెన్నో ఈ వారం మీరు చదవబోతున్న చదువు ముచ్చట్లు తీర్చాయి. పుస్తకాలను ప్రిజుడీస్ తో చదవకూడదని నాకు పాఠం చెప్పాయి. అసలింత విరివిగా ఎలా రాయగలుగుతున్నారని తల బద్దలుకొట్టుకుంటున్న నాకు, అసలిన్ని పుస్తకాలు ఎలా చదవగలుగు తున్నారా అని నోరెళ్లబెట్టుకునేలా చేశాయి యీ జవాబులు. మరి మీరూ చదవండి ఈ వారం కస్తూరి మురళీకృష్ణగారి చదువు ముచ్చట్లు….

 

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
పుస్తకం బోరు కొట్టటమంటే నా ఉద్దేశ్యంలో ఆ పుస్తకాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకునే మానసిక స్థితిలో మనములేమని అర్ధం. కాబట్టి, నేను చదవలేని పుస్తకాన్ని తాత్కాలికంగా పక్కన పెడతాను. మళ్ళీ కొన్నాళ్ళకు తీసి చదువుతాను. అప్పుడూ చదవలేకపోతే, మళ్ళీ పక్కన పెట్టి కొన్నాళ్ళకు మళ్ళీ ప్రయత్నిస్తాను. కాబట్టి నాకు బోరుకొట్టి వదిలేసిన పుస్తకాలు లేవు. ఉదాహరణకు, అలైస్ వాకర్ రచించిన కల పర్పుల్ మొదటి నాలుగు పేజీలు చదవగానే గజిబిజి అనిపించి పక్కన పెట్టేశాను. కొన్నాళ్ళ తరౌవాత మళ్ళీ చూస్తే పరమాధ్భుతమయిన పుస్తకమని తేలింది. ఆ పుస్తకాన్ని అక్షరాంజలిలో పరిచయంకూడా చేశాను. కాబట్టి మీ ఈ ప్రశ్నకు నా సమాధానం బోరుకొట్టటం పుస్తకం తప్పు కాదు. రచయిత ఆలోచనలను అందుకునే స్థితిలో పాఠకుడు లేడని అర్ధం.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
 ఈ ప్రశ్నకు కూడా సమాధానం కొంచెం కష్టమే. నేను నెలకు కొన్ని వేల రూపాయల పుస్తకాలు కొంటాను. లైబ్రరీలన్నిటిలో నాకు సభ్యత్వముంది. పత్రికలు రివ్యూకు పుస్తకాలిస్తాయి. ఇవికాక, నేను అద్దె లైబ్రరీలనుంచీ పుస్తకాలు తెచ్చుకుంటాను. కాబట్టి, నేను ఇటీవలకొన్న పుస్తకాల జాబితా ఇవ్వటం కష్టం. అలాగే, నేను పుస్తకాలు చదివే పద్ధతి కాస్త భిన్నంగా వుంటుంది. నేను పది పుస్తకాలు ఒకేసారి ఆరంభిస్తాను. ఒకటి కాస్త రొటీన్ కాగానే ఇంకోటి తీసుకుంటాను. అది విసుగొస్తూంటే ఇంకోటి. ఇలా ఒకేసారి పది పుస్తకాలు పూర్తవుతాయి. ప్రస్తుతం నా టేబిల్ మీద వీ ఎస్ నైపాల్ పుస్తకం, a way in the world,  o hanlon రాసిన  filming love stories, ముక్తినూతల వెంకట సుబ్బారావు రాసిన, కాళికాసహస్రనామావళి, సావర్కర్ రాసిన హిందూ పద్ పద్షాహీ, కే ఎస్ లాల్ రాసిన  history of the khaljis స్వామీ అభేదానంద రాసిన  life after death లాంటి పుస్తకాలున్నాయి. ఇవికాక కథల సంకలనాలు, నవలలు వున్నాయి.

 

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
 నా లైబ్రరీలో 7000 పుస్తకాలున్నాయి దాదాపుగా. ఇంకా చేరుతూనే వున్నాయి. రెండు గదులలో నాలుగువైపులా షెల్ఫులనిండా పుస్తకాలున్నాయి. ఇటీవలే షెల్ఫులను గోడదాకా extend చేశాను.

 

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
నేను చదవాలనుకున్న పుస్తకం నాకు దొరుకుతుంది. దొరికిన పుస్తకం చదువుతాను. జొ మిల్ గయా ఉసీకొ ముఖద్దర్ సమఝ్ లియా, జొ ఖోగయా మై ఉస్కొ భులాతా చలా గయా. దొరకని దాని గురించి ఆలోచిస్తూంటే ఉన్నవి పోతాయి. జీవితంలో ఇతర విషయాలలో నయినా, పుస్తకాల విషయంలోనయినా నాది ఇదే పద్ధతి.
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి. 
ఇది కఠినమయిన ప్రశ్న. నాకు నచ్చిన రచయిత నచ్చని రచయిత అంటూ లేదు. ప్రతి రచయిత తన జీవితానుభవాలనే అక్షర రూపంలో ప్రడర్శిస్తాడు కాస్త కల్పన జోడించి. వీరి జీవితం బాగుంది, వీరిది బాగాలేదు అనగలమా? అయితే, అందరు రచయితలకన్నా విశ్వనాథ వారిని నేను ప్రత్యేక పీఠంపై కాస్త ఎత్తున వుంచుతాను. ప్రతి సెప్టెంబర్ నెలలో ఆయన పుస్తకాలన్నీ మరోసారి చదువుతాను. ఆయన పుస్తకాల జాబితా చాలా పెద్దది.
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
నాకు బహుమతులెవ్వరూ ఇవ్వరు. నేనెవరికీ బహుమతులివ్వాను. కాంపిమెంటరీలను బహుమతులుగా పరిగణించకూడదు. కానీ, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున అమ్మ, అన్నయ్య, చెల్లెలు, నా భార్యు నాకు పుస్తకాలు కొనుక్కోమని డబ్బులిస్తారు. నేనుమాత్రం వారికింతవరకూ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వలేదని వారూ ఏమీ అనుకోరు. 
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
ఇది అర్ధంలేని ప్రశ్న. నచ్చకపోయేటన్ని పత్రికలు తెలుగులో లేవు. ఉన్న పత్రికలన్నిటిలో నేను రాస్తున్నాను, ఒక్క సాక్షి, రచనలలో తప్ప.
8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
నేను వేరే ఎవరి అభిప్రాయాన్నీ పట్టించుకోను. వాళ్ళు పొగిడారు కదా అని చదవను. మీ ఈ ప్రశ్నకు, మొదటి ప్రశ్న సమాధాన్ని చదువుకుంటే సమాధానం వచ్చేస్తుంది.
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
మీ ఈ ప్రశ్నకు సమాధానం రెండో ప్రశ్న సమాధానంలో వుంది. మళ్ళీ ఇంకో జాబితా ఇవ్వటం బావుండదు.

 

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
మీ ఈ ప్రశ్నకు సమాధానం, అయిదో ప్రశ్న సమాధానంలో వుంది. ఏ రచయిత పుస్తకం చదివితే, ఆ రచయితలా ఒక్క రచన చేసినా నా జన్మ ధన్యం అనుకుంటాను. కానీ రాసేటప్పుడు నాలాగే రాస్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావం మాత్రం నా ఆలోచనల్లో స్పష్టంగా తెలుస్తుంది.
ప్రకటనలు

2 responses »

  1. “ఏ….డు వేల పుస్తకాలా?” మురళీ కృష్ణ గారూ అన్ని పుస్తకాలు మీరొక్కరే ఏం చేసుకుంటారు గానీ…..!

    రవి కుమార్ గారూ, మీ సందేహమే నాదీ! ఇంత విరివిగా ఎలా రాయగలుగుతున్నారా అని ఆశ్చర్యపడుతోంటే , ఇంత విరివిగా చదవడానికి ఇంత టైమెక్కడిదా అని !

  2. ఒక పుస్తకాభిమాని ఇంట్లో – ఏడు వేల పుస్తకాలు పర్సనల్ లైబ్రెరిలో ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మురళీకృష్ణ గారు ఎవరినో ఇంప్రెస్స్ చెయ్యాడానికి అలా చెప్పారని అనుకోరాదు. అంత కంటే ఎక్కువ పుస్తకాలు తమ లైబ్రెరిలో ఉన్నవారున్నారు. పుస్తకాలు కొనాలన్నా వ్రాయాలన్న ఆ మాత్రం మనోద్రేకం ఉండాలి. ఇక ఒబామాకి, నాలుగు రోడ్ల కూడలి మధ్య నిలబడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కి , దలైలామకి ఉన్నది ఆ ఇరవై నాలుగు గంటలే!. ఈ టపాలో వ్యాఖ్య చదువుతున్న మీకు కూడా ఉన్నది అంతే సమయం.

    దొరకని దాని గురించి ఆలోచిస్తూంటే ఉన్నవి పోతాయి. జీవితంలో ఇతర విషయాలలో నయినా, పుస్తకాల విషయంలోనయినా నాది ఇదే పద్ధతి. చక్కని మాట మురళీకృష్ణ గారు! అభినందనలు!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s