కలతరేపే అంతర్లోక విహారి కాశీభట్ల

సాధారణం

tapanaతెలుగులో రచయితలు లెక్కలేనంతమంది వున్నప్పటికీ ప్రక్రియాపరమైన రచనలు చేసేవారు చాలా తక్కువ మంది. ఇక చైతన్యస్రవంతి విధానంలో నవలలు రాసే వారిని లెక్కపెడితే ఒక్కచేతివేలే మిగిలిపోతాయి. జేమ్స్ జాయిస్ తన ‘యులిసిస్’ నవలతో ఈ ప్రక్రియకు ఎక్కడలేని పాపులారిటీ కల్పించారు. తెలుగులో చైతన్యస్రవంతి పద్ధతిని శ్రీశ్రీ, బుచ్చిబాబులాంటి కొద్దిమంది రచయితలు ప్రయోగించినా, అత్యంత సమర్ధంగా తన “అంపశయ్య” నవలలో ఉపయోగించిన నవీన్ ను ఇక్కడ తప్పక తలచుకోవాలి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మనసును, ఆ మనసులోని ఆలోచనలను అక్షరబద్దం చేయడమనే అద్భుత సాహసకార్యం చదివి తీరాల్సిందే. ఆ పేరులోనే వున్నట్టు చైతన్యస్రవంతి (స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్) లో మానసిక చేతనలోని ప్రతి ఆలోచనధారను రికార్డు చేయడమే. వేగవంతమైనదేది అనే యక్షప్రశ్నకు మనోవేగమని జవాబుచెప్పి ధర్మరాజు గొప్ప మెప్పుపొందాడు. అంతటి వేగవంతమైన, తర్కరహితమైన, అసంబద్దమైన అలోచనలను రికార్డ్ చేయడమంటే మాటలా? ఒకవేళ రికార్డు చేసినా, చదివి అర్థం చేసుకోవడం పాఠకునికి ఎంత పెద్ద ఎక్సర్ సైజు అవుతుంది!

అలాంటి క్లిష్టమైన టెక్నిక్ తో నవలరాసి మంచి కథాంశాన్ని అందజేస్తున్న విశిష్ట తెలుగు రచయిత కాశీభట్ల వేణుగోపాల్. 1999 తానా-స్వాతి నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతి “తపన” నవలతో గెలుచుకున్నారు. ఆ నవలను ఈ వారం పరిచయం చేస్తున్నాను. తానా ప్రతినిధి జంపాల చౌదరి మెచ్చుకున్నట్లుగా ఈ నవలలో కథా వస్తువు, పాత్ర చిత్రణ, కథనశైలి, భాషా ప్రయోగం చాలా ప్రత్యేకమైనవి.

కథగా చూసుకుంటే పెళ్లయి పదిహేనేళ్లయినా ఒకర్నొకరు అర్థం చేసుకోకుండా ఎవరి ఆత్మవంచన ముసుగులలో వారు పూర్తిగా మునిగిపోయిన భార్యాభర్తలు ఒకానొక రోజు వారిద్దరిమధ్యా ఏర్పడిన అగాథాన్ని పూడ్చుకుంటారు. ఇంతే కథ. ఉత్తమ పురుషలో సాగే కథనంతో భర్త దృష్టికోణంనుంచి కథ చెప్పడం రచయిత ఎంచుకున్న శిల్పం.

బాగా చదువుకుని, ఉత్తమ సాహిత్యంతో పరిచయం వుండి, పెద్ద వ్యాపారం చేస్తున్న కథకుడు భార్యమీద అసంతృప్తితో, అసహనంతో, అర్థం చేసుకోలేనితనంతో తాగుడుకు అలవాటుపడతాడు. సంపన్నురాలు, విద్యావంతురాలు అయిన భార్య కుటుంబ నేపథ్యంవల్ల ఏర్పడిన మానసిక వాతావరణంతో కట్నంపోసి కొనుక్కున్న సరుకుగా భర్తను దారుణంగా నిర్లక్ష్యం చేస్తుంది. నిద్రమాత్రలకు అలవాటు పడుతుంది. పెళ్ళినాటి నుంచే మొదలైన దూరం క్రమంగా పెరిగి, పెరిగి రోజుల తరబడి మాట్లాడుకో(లే)ని దుస్థితికి చేరుస్తుంది. 

ఇదే దంపతులకు ఎంతో ఆత్మీయ స్నేహితులైన మరోజంట విమల శాస్త్రులు వీరికి పూర్తిగా విరుద్ధం. ఆనందానికి, అభిమానానికి, ఆత్మీయతకు మారుపేరనదగ్గ కుటుంబం వారిది. పదిహేనేళ్ల కథకుడి కాపురంలో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకమారు భార్యాభర్తలు ఏకమవ్వడం ఒక శరీర దాహం తీర్చుకునే నీరసప్రక్రియ. అందులో ఆధ్యాత్మికత లేదు. అంతకంటే ముఖ్యంగా ఆనందం లేదు. కథకుడి భార్య హైమవతి నెల తప్పుతుంది. కథకుడి సంతోషానికి పట్టపగ్గాల్లేవు. శాస్త్రి కుటుంబాన్ని భోజనానికి పిలుస్తారు. శాస్త్రి దంపతులు ఒక బహుమానం తెస్తారు. వొక చిన్న వుత్తరమూ రాస్తారు. దాంతో కథకుడి కుటుంబం చక్కబడడం అలావుంచితే పాఠకుడి హృదయం ఆర్థ్రమవుతుంది. బరువెక్కుతుంది.

మన జీవితాల్లో కూడా తల్లిదండ్రులతో, భార్య / భర్తతో, స్నేహితులతో, కలిసి పనిచేసేవారితో మనస్పర్థలు వస్తుంటాయి. అభిప్రాయభేదలు తలుత్తుతాయి. అగాధాలు ఏర్పడుతాయి. కాని మనం దేనికోసం ఏమీ వదులుకుంటున్నాం? స్థిరంగా వుండని వాదాలకోసం విలువైన మానవ సంబంధాలను త్యాగం చేయడం ఎంతవరకు సబబు? అక్కడలేని మూడో వ్యక్తి గురించి అవాకులు చెవాకులు పేలడం ఎవరి మేలుకోసం చేస్తుంటాం? అయితే నవల ఉపరితలంలో ఇవేవీ కనిపించవు. కేవలం ఆలోచనలే. కథకుడి ఆలోచనలే కనిపిస్తుంటాయి. ఆ ఆలోచనల ధారను అర్థం చేసుకోవాలంటే పాఠకులకు ఇంగ్లిషు, తెలుగు, సంస్కృత సాహిత్యాల, భాషల పరిచయం వుండాలి. రచయిత నవలలో ప్రయోగించిన భాష తీరును అవగతం చేసుకోవాలంటే పాఠకుడికి చాలా ఓపిక, విస్తృత పఠనం వుండాలి. దీని గురించి నవల ప్రారంభంలో రచయిత ఏమంటున్నారో చూడండి:

ఈ ‘సామాన్య పాఠకుడు’ అనబడే సోమరి పాఠకుని నిద్రలేపి, వాడి మెదడుకి వ్యాయామం కలిగించాల్సిన అవసరమూ, బాధ్యతా సీరియస్ గా కలంపట్టిన ప్రతి ఒక్కరిమీదా వున్నాయని నేను భావిస్తున్నాను” అంటారు కాశీభట్ల. ఎక్సర్ సైజ్… అదీ మెంటల్ ఎక్సర్ సైజ్… చేయించడం రచయిత ఉద్దేశం.

ఈ నవలను ప్రముఖ కవయిత్రి జయప్రభ విశ్లేషిస్తూ ఇలా ఆంటారు. “వేణుగోపాల్ రాతలు ‘బాగుంటాయని’ నేను చెప్పలేను. ప్రపంచం మొత్తంమీద ఉండే దిఖాన్ని… చీకటినీ ఒక్కచోటికి చేర్చి… కుప్పపోస్తే… అది బాగుంటుందా? దాన్ని చదివి అలసిపోయి, చిందరవందర అయిపోయి, జవాబులు దొరకని ప్రశ్నల శరపరంపరకెరయై, గాయపడి బాధతో కొట్టుకుంటూ… ఇదేనా బాగుండడం?” ఆధునిక జీవితంలో మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట జీవితాన్ని, అతి గడ్డు, విషమ జీవితాన్ని అంతే సమర్ధంగా సాహిత్యంలో చిత్రించడానికి ఎంచుకున్న ప్రక్రియ కాశీభట్ల వేణుగోపాల్ అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఇలాంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే జీవితాన్ని, జీవితపు చలనసూత్రాలను మనం మరింత స్పష్టంగా ఆకళించుకోగలుగుతాం. నవ్య కవిత్వంగానీ, ఆధునిక చిత్రకళగానీ చూడండి. అర్థం చేసుకోవడానికి ఎంతో క్లిష్టంగా వుంటుంది. వాటిని అర్థం చేసుకోవడంలో మరో సౌలభ్యం వుంది. రచయిత అంతా చెప్పకపోవడం వల్లా, లేదా అస్పష్టంగా చెప్పడంవల్లా పాఠకుడు తన బుద్ధిని ఉపయోగించి, ఊహించుకునే వీలుంది. అదే కాశీభట్ల వేణుగోపాల్ చెప్పిన మానసిక వ్యాయామం.

వాహిని బుక్ టస్ట్ ప్రచురించిన “తపన” నవల 45 రూపాయలే. తప్పక మీరూ చదవండి. నచ్చితే రచయిత అంతకుముందు రాసిన “నేనూ-చీకటి”, తర్వాత రాసిన దిగంత” నవలలు వెతికివెతికి మరీ చదువుతారు. ఛాలెంజ్!

తాజాకలం: నవలలోని కథకుడికి రాబిన్ ఎస్. శర్మ రాసిన బెస్ట్ సెల్లర్ “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారి”ని నా పర్సనల్ ప్రిస్క్రిప్షన్ గా సజెస్ట్ చేస్తున్నా అనంటే నా సాహితీమిత్రులు నాపై కోప్పడరు కదా! మరింత వివరంగా వచ్చే వారం…

ప్రకటనలు

6 responses »

  1. పరిచయం బాగుంది రవి కుమార్ గారు. ఈ నవల నాకూ చాలా యిష్టం. ఇక ప్రిస్క్రిప్షన్ల విషయానికొస్తే సాహిత్యంలో సగానికి సగం కథానాయకులకు “ఆల్కెమిస్టు”, “సెవెన్ హేబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్”, “వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్” లాంటి పుస్తకాల్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చేమో. కానీ ఓ రచయిత చెప్పినట్టు:

    “The fact of storytelling hints at a fundamental human unease, hints at human imperfection. Where there is perfection there is no story to tell.”

    కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తేనే మంచిది.

  2. @ కొత్తపాళీ,

    🙂 అలాంటి పాత్రలుండే సాహిత్యమే మనకు సరైన ప్రిస్క్రిప్షనేమో. మనుషులుగా మనం బయటపెట్టుకోలేని imperfectionsని మనతో పంచుకుంటాయా పాత్రలు. మనకూ ఓ జట్టుందన్న దిలాసా కలిగిస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s