ఇరవై ఎనిమిదో వారం చదువు ముచ్చట్లు అఫ్సర్ తో…

సాధారణం

సాధారణంగా చదువు ముచ్చట్లను ప్రతివారం బ్లాగులతో పరిచయమున్న వ్యక్తులనే అడుగుతూ వస్తున్నాగాని, దీని పరిధిని మరింత పెంచాలని రచయితలను, కవులను, కొందరు విమర్శకులను కూడా ప్రశ్నలు పంపిస్తున్నాను. అయితే ప్రింట్ కున్న పవిత్రత (సేక్రెడ్ నెస్) ఇంకా జాలానికి రాలేదేమోనని నాకనిపించడానికి కారణం రచయితలు స్పందించకపోవడమే. బహుశా ఈ బ్లాగు స్థాయి కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారేమో, నాకు తెలీదు. సరే, ఈ వారం ప్రసిద్ధ కవి, విమర్శకుడు అఫ్సర్ తో చదువు ముచ్చట్లివి. తెలుగు కవి అఫ్సర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈయన అమెరికాలో బోధన సాగిస్తున్నారు. బోధన, పరిశోధన, అధ్యయనంలో పూర్తిగా తలమునకలుగా వున్న అఫ్సర్ సమయాన్ని కేటాయించి ఇంత విపులంగా తన చదువు ముచ్చట్లు చెప్పినందుకు థాంక్స్ తెలుపుకుంటూన్నా. మరి చదవండి….

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

ఇది కొంచెం కష్టమయిన ప్రశ్న. ఇంకా అలాంటి పుస్తకం చదవలేదు. బహుశా చదవలేనేమో! నాకు వున్న సమయాభావం వల్ల, ఇప్పటికే చదవని చాలా మంచి పుస్తకాలు మరీ ఎక్కువగా వుండడం  వల్ల – బోరు పుస్తకాల బారిన నేను పెద్దగా పడలేదు.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఏక సమయంలో మూడు నాలుగు పుస్తకాలు చదవడం నాకు అలవాటు. కాని  మూడు రకాల పుస్తకాలు – వచనం, కవిత్వం, విమర్శ – తీసుకుంటాను సాధారణంగా. అలా ఇప్పుడే పూర్తయినవి:

Orhan Pamuk The Other Colors.

Daniyal Mueenuddin In Other Rooms, Other Wonders

Kazim Ali, The Fortieth Day

ఈ మూడు పుస్తకాలు ఈ వారం పూర్తయ్యాయి. ఇందులో Orhan Pamuk The Other Colors చదవడం ఇది మూడో సారి. నాకు చదవడం మీద వున్న ఆసక్తి రాయడం మీద లేదు. Orhan Pamuk లో కూడా అదే నాకు బాగా నచ్చింది. ఒక రచన ఎందుకు చదవాలనిపిస్తుందో తనని తాను వొక శాస్త్రవేత్తలా పరిశీలించుకునే సుగుణం అతనిలో నాకు కనిపించింది. ఈ మూడు పుస్తకాలు నా చేతికి వొకే సారి రావడం యాదృచ్చికం. కాని, ఆ మూడు పుస్తకాల్లో ఒక అంతస్సూత్రం వుంది. మూడు భిన్న కోణాల నించి వాళ్ళు ఒకే వాస్తవికతని చూస్తున్నారు.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి? మీకు నచ్చిన లైబ్రరీలు?

పెద్దగా లేవు. నాది చిన్న లైబ్రరీ మాత్రమే. కొన్న పుస్తకాలు అన్నీ జాగ్రత్త చేసుకుని వుంటె, చాలా పెద్ద లైబ్రరీ వుండెదేమో మరి!  పురాణం గారు మంచి మాట అనేవారు “ పుస్తకం అనేది మీరు దాచుకున్నా వుండదు. దాని రెక్కలు అసహనమయినవి. అది ఎలానూ ఎగిరిపోతుంది.” నిజమే అనిపిస్తుంది. నేను వున్న చోటల్లా  మంచి లైబ్రరీలు వుండడం నా అదృష్టం అనుకుంటాను. ఖమ్మం సెంట్రల్ లైబ్రరీ, విజయవాడ టాగూర్ లైబ్రరీ, హైదరాబాద్ అమెరికన్ లైబ్రరీ, అన్వేషి, మాడిసన్ మెమోరియల్ లైబ్రరీ, ఇప్పుడు ఆస్టిన్ పెర్రె కాస్త్రనదా లైబ్రరీ. చివరికి ఆస్టిన్ పబ్లిక్ లైబ్రరీలో మంచి హిందీ పుస్తకాలూ దొరుకుతున్నాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

పెద్దగా లేవు. ఒక సారి అనుకున్న తరవాత చదవకుండా వుండగలగడం నాకు సాధ్యం కాదు. ఇక పూర్తి చెయ్యడం అంటారా అది ఆ రచయిత సామర్ధ్యాన్ని బట్టి వుంటుంది.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

పథేర్ పాంచాలి నేను ఒకటికి పది సార్లు చదివిన పుస్తకం. అది మద్దిపట్ల సూరి అనువాదం. చదివినప్పుడల్లా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది ఈ నవల. నేను చెప్పే నవల కోర్సులో కూడా ఈ నవల ఇంగ్లీషు అనువాదాన్ని, సత్యజిత్ రే సినిమాని తప్పని సరి పాఠ్య పుస్తకంగా వాడాను. నవల మీదా, సినిమా మీదా ఆసక్తికరమయిన చర్చ జరిగింది. కాని, సినిమా కంటే నవల ఎక్కువ మందికి నచ్చింది. ఆ నవల మొదటి సారి చదివినప్పుడు నేను తొమ్మిదో తరగతిలో వున్నాను. ఇప్పటికీ ఏడాదికి వొక సారయినా చదువుతాను.

శ్రీపాద అనుభవాలూజ్నాపకాలూ కూడా తరచూ చదివే పుస్తకాల్లో వొకటి. అది ఆ కాలం నాటి సామాజిక చరిత్రలా అనిపిస్తుంది.

హిందీలో నాకు అలాంటి అనుభూతినిచ్చిన పుస్తకం హరివంశ్ రాయ్ బచ్చన్ “క్యా భూలూ.(..క్యా యాద్ కరూ(…”

ఇటీవలి కాలంలో నాకు బాగా నచ్చిన రచయిత Orhan Pamuk. రచనలో సమాజాన్ని, ఆత్మకథనాన్ని జోడించడంలో అతని సంఘర్షణ ఎప్పుడూ నన్ను ఆకట్టుకుంటుంది. అలాంటి లక్షణం ఆరబిక్ ఆధునిక సాహిత్యంలో చూశాను మళ్ళీ. ఇప్పటి కాలంలో ముస్లిం అస్తిత్వం సరిగా అవగాహనకి రావాలంటే వీళ్లని చదివి తీరాలి. అల్జీరియా స్తీల రచనలు మరో వైపు బలమయిన వ్యక్తీకరణలు. ఆసియా జెబార్ లాంటి వాళ్లు నవల రూపాన్నే మార్చేశారు.

తెలుగులో మనకి గొప్ప నవలా రచయితలున్నా, 1980 ల తరవాత కొత్త తరం ఒత్తిళ్లని చెప్పే నవల లేదు. ముస్లిం దేశాల రచయితలు నవలకి కొత్త రూపు రేఖల్ని ఇస్తున్నారు. హిందీలో గీతాంజలి, నాసిరా శర్మ, అబ్దుల్ బిస్మిల్ , కన్నడంలో పుట్టప్ప, ఉర్దూలో ఇంతెజార్ హుస్సేన్ లాంటి వాళ్లు ఈ దిశగా బాగా రాస్తున్నారు. మనం పాకిస్తానీ రచయితలని బాగా చదవాలి అనిపిస్తోంది. వాళ్లు వచనంలో విప్లవం తీసుకు వస్తున్నారు. ఇప్పుడు తెలుగు సాహిత్యం వున్న పరిస్తితిలో ఆ వేగాన్ని అందుకోడానికి మనకి ఇంకో పాతికేళ్లు పైనే పట్టవచ్చు. తెలుగు సాహిత్యం ఇంకా కవిత్వపు వుక్కు కౌగిలిలోనే వుంది. కవిత్వం వల్ల సాహిత్య వేగం మందగిస్తుంది. మనది కుంటి నడక అయ్యింది. అలా అని మంచి కవిత్వం అక్కర్లేదని కాదు. కవిత్వంలో మనం దొంగ వేషాలు ఎక్కువ వేస్తాం. వచనంలో అది వీలు పడదు. కొత్త తరంలో తెలుగులో సైదాచారి, దెంచనాల, గురుస్వామి, కనుమూరి జాన్ , సుధాకర్  ఎండ్లూరి , జూకంటి, ఇక్బాల్ చంద్, ఖాజా, నామాది శ్రీధర్ లాంటి కవులూ – గుడిపాటి, కాత్యాయని, వేణు లాంటి విమర్శకులూ – అశోక్ కుమార్ పెద్దింటి, రహమతుల్లా, కూర్మనాథ్ , వినోదిని, మల్లీశ్వరి, ఒమ్మి రమేష్ బాబు లాంటి కథకులూ – ఏం రాసినా చదువుతాను.

బ్లాగ్ లోకం ఇటీవలి నా ఇన్స్పిరేషన్ . ‘కూడలి ‘ తప్పక చూస్తాను. నిజానికి మామూలు సాహిత్య పేజీల కన్నా బ్లాగుల్లో మంచి రచనలు రావడం, సాహిత్య భవిష్యత్తు బ్లాగులే నిర్ణయిస్తాయేమో అన్న ఆశ కలుగుతోంది. పుస్తకం లాంటి బ్లాగులు గొప్ప విజయాలు. ఈ మాట, ప్రాణహిత రేపటి సాహిత్య సంకేతాలు. విమర్శ బాగా అభివృద్ధి కావచ్చు అనిపిస్తోంది ఇప్పటి ‘ఈ’ సాహిత్యాన్ని చూస్తే!

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు? 

లెక్క పెట్టలేదు. మేం పుట్టిన రోజులకి మామూలుగా పుస్తకాలే బహుమతిగా ఇస్తాం.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

 ప్రశ్నకి నేను సరిగా సమాధానం చెప్పలేను. తెలుగులో నేను బాగా ఇష్టంగా చదివే పత్రిక అంటూ లేదు. అన్నిటి కన్నా విపుల నయం, సాహిత్య విలువలకి వస్తే. గుడిపాటి వార్త ఆదివారంలో అప్పుడప్పుడూ మంచి వ్యాసాలు వేస్తారు. సాక్షిలో తపన కనిపిస్తుంది హిందీలో హంస్ తప్పక చదివే పత్రిక. ఇంగ్లీషులో గ్రాంటా, పారిస్ రెవ్యు, పొయెట్రీ, లండన్ బుక్ రెవ్యూ తప్పక చదువుతాను.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

తస్లీమా నస్రీన్ ‘లజ్జ’. అది చిన్న పుస్తకమే అయినా నాకు చాలా సమయం తీసుకుంది పూర్తి చెయ్యడానికి! అది జర్నలిజానికీ, కథకీ సంకర శిశువు.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

కామిలా షంసీ బ్రోకెన్ వర్సెస్ . అది పాకిస్తానీ నవల. సాహిత్యంలో రాజకీయాలు ఎలా మాట్లాడవచ్చో, అవి నవలా శిల్పంలోకి ఎలా వొదిగించ వచ్చో తెలుస్తుంది ఈ నవల చదివితే!

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

తెలుగులో: గురజాడ ఉత్తరాలు, శ్రీ పాద అనుభవాలూజ్నాపకాలూ , శ్రీ శ్రీ సంపుటాల్లో వచన విభాగం, బైరాగి నూతిలో గొంతుకలు, రా రా అనువాద సమస్యలు, బుచ్చిబాబు అంతరంగ కథనం, కౌముది అనువాదంలో నాగర్ కళ్యాణ మంజీరాలు, అన్వర్ నాయన సంకలనం, జూలూరి  తెలంగాణా సంకలనం పొక్కిలి, నండూరి విశ్వదర్శనం, చలం మ్యూజింగ్స్ , ప్రస్తుతం ముళ్ళపూడి కోతికొమ్మచ్చి.

ఇతర భాషల రచనలు – ముఖ్యంగా ఉర్దూ, హిందీ : ఫైజ్ కవిత్వం, కుర్ర్రతులయిన్ హైదర్ ఆగ్ కా దర్యా, కృష్ణ బలదేవ్ వైద్ ఉస్కా బచ్ పన్ కథలు . ఇవి కొన్ని మాత్రమే.

ప్రకటనలు

13 responses »

 1. Afsar gaari chaduvu mucchatlu baagunnaayi. intha patana anubhavam, rachanaa silpam vunna afsar gaaru telugulo taginanni rachanalu cheyyakapovadam anyaayam. aayana kalam nunchi marinta vimarsa raavaali

  ravi

 2. aksharam..adhyayanam..abhyaasam…ivi maanava pragathiki sopaanaalu.. aithe, ee padaalanni a aksharamtone praarambham ayyayi….Aashcharyamgaa, Afsar koodaa…
  sir, mee chaduvu alavaatlani chaduvutu unte, o pustakaanne chadivinattugaa undi….
  thanks,
  harikrishna mamidi

 3. aandhralo vunnanta kaalam afsar gaarini kalavalekapoyaane anna baadha nunchi ravi kumara gaaru nannu konchem vimuktam chesaaru. ee chaduvu mucchatlu chaduvtunte, aayanato maatlaadutunnatte vundi. goppa chaduvari, sunnitamayina kavi, andamayina vachanam..
  swati

 4. “మనం పాకిస్తానీ రచయితలని బాగా చదవాలి అనిపిస్తోంది. వాళ్లు వచనంలో విప్లవం తీసుకు వస్తున్నారు. ఇప్పుడు తెలుగు సాహిత్యం వున్న పరిస్తితిలో ఆ వేగాన్ని అందుకోడానికి మనకి ఇంకో పాతికేళ్లు పైనే పట్టవచ్చు. తెలుగు సాహిత్యం ఇంకా కవిత్వపు వుక్కు కౌగిలిలోనే వుంది.”

  This guy is smoking crack!!

 5. Here, I would like to share something! I have met Afsar gaaru as a writer only in blogs!ha ha !hi hi! look at me and my ignocence{ignorance:) word? courtesy:film “roja”} and took him to be a promising young writer and started sending comments: ofcourse, encouraging comments! Anyway, Sir, Is it not interesting thing?…

 6. అఫ్సర్ తనకు రాయడం మీద కన్న చదవడం మీద ఎక్కువ ఆసక్తి అనడం చాల బాగుంది. ఏ మంచి రచయితకైనా తప్పనిసరిగా వుండాల్సిన గుణమది. అలాంటి రచయిత వల్ల లోకానికి ఎక్కువ మేలు. తెలుసుకోవలిసింది ఏమీ లేదు, ఇతర్లకు చెప్పాల్సింది చాలా వుంది అనుకునే రచయితల వల్ల వాళ్లకే గాక లోకానికి కూడా నష్టం.

  ‘లజ్జ’విషయంలో అఫ్సర్‍ వ్యాఖ్యానం పూర్తిగా సరైనది. నవల ఒక పట్టాన చదివించదు. దానికి కారణం ఏమిటో ఒక్క మాటలో ఆఫ్సర్ చాల బాగా చెప్పారు.

  కవిత్వం-వచనం విషయంలో అఫ్సర్ మరి కొందరు మితృలు అలా ఎందుకు అనుకుంటున్నారో మరింత వివరంగా చెబితే బాగుంటుంది. ఇది తెలుసుకోవలసిన, ఆలోచించాల్సిన విషయం అనుకుంటాను. ‘కవిత్వం వల్ల సాహిత్య వేగం మందగిస్తుందా’?. ఏమో! తెలుగులో సాహిత్య సమస్యలకు కారణం అది కాదేమో!
  -హెచ్చార్కె

  • అఫ్సర్‌ ఫటాఫట్‌ చదువుతుంటే నా చెవుల్లో టపాటపామని బాణాసంచా పేలిన శబ్దం విన్పించింది. జవాబులన్నీ సూపర్బ్‌. ఆయన ‘లజ్జ’ నవలపై చేసిన కామెంట్‌కు వత్తాసు పలుకుతున్నాను. నాక్కూడా అది ఏదో రిపోర్ట్‌ చదువుతున్నట్లే అనిపించింది. నిజానికి అది మనిషిలోపలి వాక్యూమ్‌ని తీయాల్సిన నవల. సరిగ్గా రాసుంటే చదివే వాడికి చెమటలు పట్టి, నిక్కరు తడిసిపోయుండేది.
   ఇన్నాళ్లకి ఫటాఫట్‌లో అఫ్సర్‌ కనిపించడం సంతోషంగా ఉంది. హాయ్‌ అఫ్సర్‌!
   – గొరుసు

 7. హెచ్చార్కె :

  మంచి మాటకి థ్యాంక్స్.

  ఈ కాలంలో నాలుగు మాటలు కూడా కరువై పోతున్నాయి కదా!

  కవిత్వం మీద నాకు కోపం ఏమీ లేదు. ఇప్పటికీ వొక తక్షణానుభూతిని చెప్పడానికి కవిత్వమే గొప్ప సాధనం. తెలుగు వాళ్ళం దానికి అవసరానికి మించిన ప్రాధాన్యం ఇచ్చామన్నదే నా ఆవేదన. ఉదాహరణకి : గురజాడనీ , శ్రీ శ్రీ ని కూడా కేవలం కవులుగా చూడడం వల్ల, వాళ్ళకీ/ మనకీ అన్యాయం జరిగింది. గురజాడ కథల్ని గురించి మనం పెద్దగా మాట్లాడం. శ్రీ శ్రీ అసలు ఎందుకు వచనం రాశాడొ ఇప్పటి దాకా సరయిన అంచనా లేదు. అది కేవలం కవిత్వం మీద మనకి వున్న విపరీతమయిన మమకారం వల్ల.

  కొత్త కథకులు తెలుగులో జీవితాన్ని గురించి కొత్త సంగతులు చెబుతున్నారు. తెలంగాణా, రాయలసీమ కథకులు జీవితాన్ని దగ్గిరగా చూస్తూ రాస్తున్న కథలు కవిత్వ వుప్పెన కింద ఎటో పోతున్నాయి. నవల ద్వారా కేశవ రెడ్డి రాస్తున్న నిత్య నవీన జీవన కథ చర్చలోకి రాకుండా పోతోంది.

  కవిత్వాన్ని ప్రేమిస్తూనే, వచనం వైపు చూపు సారించాలని నా విన్నపం.

  యోగి కి కూడా నేను చెప్పాలనుకున్నది అదే. పాకిస్తానీ రచయితల మీద నాకు ప్రత్యేకమయిన ప్రేమ లేదు. పాకిస్తానీ టెర్రరిస్టులు వెరు, సామాన్యులు, రచయితలు వెరు. (ఆనంద్ పట్వర్ధన్ డాక్యుమెంటరీలు ఈ విషయం చెబ్తాయి) నిజంగానే వాల్ల సాహిత్యం మన తెలుగు సాహిత్యం కంటే మేలు. దానికి కారణం వాళ్ళు కవిత్వం మీద కంటే వచనం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడమే. ముఖ్యంగా నవల. గట్టిగా మాట్లాడాల్సి వస్తే, కేశవ రెడ్డి తరవాత వొక తెలుగు నవలా రచయిత పేరు మీరెవరయినా చెబితే నేను సంతోషిస్తా. పాపులర్ రచయితలు యండమూరి, మల్లాది లాంటి వాళ్ళకి వున్న సీరియస్నెస్ కూడా మన నవలాకారులకి లేదు.

  సాహిత్యం అంటే కవుల గురించి మాట్లాడ్డం, కవుల గురించి రాయడం మాత్రమే అనే ధొరణి నించి బయట పడాలి. వొక కవి వైపు నించి ఈ మాట వినిపించడం ఆశ్చర్యమే అయినా ఇది నిజం.

  అఫ్సర్

 8. ఐ యామ్ సారీ, అఫ్సర్‍, మిత్రవాక్యం మీద విసుక్కున్నావు, అదీ యోగి గారి పరుష వాక్కుతో కలిపేసి. ‘కవిత్వం వల్ల సాహిత్యవేగం మందగిస్తుంది’అనే సాధారణీకరణను, తెలుగు సాహిత్య సందర్భంలో ఆ సాధారణీకరణ అన్వయాన్ని ప్రశ్నించడమే… ఇంకొక వ్యూ పాయింట్ ని వివరంగా తెలుసుకోడమే.. నా కామెంట్‍ వుద్దేశం.
  తెలుగులో కవిత్వం ఎంత విరివిగా వస్తున్నదో వచనం అంత విరివిగా వస్తున్నది. విరివి వేరు క్వాలిటీ వేరు అనడం సరైనదే గాని, అది రెండు ప్రక్రియలకూ వర్తిస్తుంది. తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, అల్లం రాజయ్య, నామిని సుబ్రమణ్యం నాయుడు, మధరాంతకం నరేంద్ర, ఓల్గా, ఆర్‍. చంద్రశేఖర‍ రావు, ఖదీర్‍ బాబు, ఒమ్మి రమేష్‍ బాబు, ఎస్. జ‍య‍, సుంకోజు దేవేంద్రాచారి, కాశీభర్ల వేణుగోపాల్‍, చంద్రలత, కూర్మాచారి, వి. ప్రతిమ… ఇలా చాల మంది చక్కని వచనం రాస్తున్నారు. కవిత్వం మీద ఎక్కువ ఆసక్తి వుండీ వచనం కూడా రా‍స్తున్న నువ్వు, నేను, చినవీర భద్రుడు, పాపినేని వంటి వాళ్లం దీనికి అదనం. ఇంకా రాస్తున్న వేముల ఎల్లయ్య, ఇప్పుడు మన మధ్య లేని పతంజలి, నాగప్పగారి సుందర రాజు వచన రచనలో గొప్ప వైవిధ్యం చూపించారు. కేశవ రేడ్డి తరువా మరొ్కరు లేరే అని కలత చెందడం రెటరికల్‍గా బాగూంటుందేమో, శ్రీశ్రీకి ముందు వెనుక శూన్యం అన్న అజంతా మాట లాగ, కాని, అది నిజం కాదు. కేశవ రెడ్డి చాల మంచి రచయిత. కాని ఆ రెటరిక్‍ అవసరమైనంత కాదు. ‘మునెమ్మ’ను ఇంగ్లిష్‍ లోకి అనువదించి ఇతర భాషల వాళ్లకి ఇచ్చి చూడు. అందులో ‘సహజ’ క్రూరత్వం, ప్యాషన్ అని కొందరు మితృలు మెచ్చుకున్న లక్షణం ప్రత్యేకించి రాయ‍ల సీమదీ కాదు, ఏ సీమదీ కాదు. నిజానికి ఆ యాటిట్యూడ్‍ వెనుక ఒక అన్యాయం వుంది. రాసీమను ఫ్యాక్షన్ సీమగా చూసే అన్యాయం. సయీద్‍ ‘ఓరియంటలిజం” స్థాయిలో ఎదుర్కొన వలసిన అన్యాయమది. ‘మునెమ్మ’ ఆ అన్యాయానికి దోహదం చేసిందని నా అభియోగం.
  ఇక, సాహిత్య విమర్శ కవిత్వాన్ని పట్టించుకున్నంతగా వచనాన్నిపట్టించుకోక పోవడం ప్రధానంగా లాజిస్టిక్స్ విషయం అనుకుంటున్నాను. సాధారణంగా వచనం బయటి వ్యాఖ్యానాన్ని కోరదు. అది సెల్ఫ్ ఎక్స్ ప్లనేటరీగా వుంటుంది. వ్యాఖ్యానానికి, అదనపు వివరణకు కవిత్వం ఇచ్చినంత అవకాశం/అవసరం వచనం ఇవ్వకపోవడం ఏ భాషలోనైనా వుండేదే. తెలుగులో విమర్శ వ్యాఖ్యానం స్థాయిని దాటకపోవడం తప్పక ఆలోచనీయమే.
  నవలలు ఎక్కువగా ఎక్కువగా/గొప్పగా రాని మాట నిజమే. రఘు నవలికలు అనదగిన పెద్ద కథలు సమర్థంగా రాశారు. సీమ నుంచి కొన్ని మంచి నవలలు వచ్చాయి. ఆ మాటకొస్తే, యండమూరి, మల్లాది వంటి వారు కూడా పెద్దగా రాసిమచి లేదు ఈ మధ్య. ఈ సమస్య అమ్మకాలదీ, గిరాకిది కూడా.
  మొత్తం మీద, మనల్ని మనం క్రిటికల్‍గా చూసుకోవలసిన అవసరం వుంది గాని, నిరాశ పడాల్సిన పరిస్థతి లేదు. అలాగే, కవిత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం అనే కారణం వల్ల తెలుగు సాహిత్యం వచనాన్ని నష్టపోయిందనుకోవడమూ కుదరదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s