‘పైరగాలిలో విహారానికి స్వాగతమ్!’

సాధారణం

pinalagarraకళింగాంధ్ర కవిత్వతీరాన మన గుండెను, గుండెలోతులను, మనసును, అందులో సుడులు తిరుగుతున్న ఆవేదనలను ప్రతిభావంతంగా అక్షరీకరించిన బలమైన కెరటం ఆర్. రామకృష్ణ. శబ్దాడంబరాలు లేకుండా, అలంకారాల అలంకరణలు లేకుండా, అల్లబిల్లి పదాలతో తన హృదయాన్ని ఆవిష్కరించే విలువైన ప్రయత్నం చేసిన రామకృష్ణ కవిత్వం “పినలగర్ర” పరిచయం ఈ వ్యాసం ఉద్దేశం.

కవికీ కవి సృజించిన కవిత్వానికీ దగ్గర సంబంధముంటుందని మరోమారు నిరూపించిన “పినలగర్ర”లో కవిత్వమంతా కవిలాగానే ఎంతో నిరాడంబరంగా వుంటుంది. ఎంత నిరాడంబరత అంటే… ఈ బిజీబిజీ గజిబిజియుగంలో మనం నిర్లక్ష్యం వహించేంత. బలమైన ప్రచారం జరిగితేనో తప్ప, గడుసైన వివాదం ఏర్పడితేనో తప్ప, నలుగురూ దానిగురించి నాలుగు రకాలుగా అనుకుంటేనో తప్ప ఇటీవల మనమేమీ చదవడం మానేశాం. చూడడం మానేశాం. చర్చించుకోవడం మానేశాం. అలాంటి ప్రచారార్భాటపు ఫెళఫెళ హోరులేని ఈ స్వచ్ఛమైన కవిత్వం ఆస్వాదించాలంటే ప్రస్తుత తరపు పాఠకుడికి పొసగని పని. ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా ఈ పుస్తకం మిస్సయి, మంచి కవిత్వాన్ని అనుభవించే అవకాశం మిస్సవుతాం. …అంత నిరాడంబరత.

పల్లెనుంచి ఉద్యోగరీత్యా కూతవేటు దూరంలో వున్న పట్టణానికి వలసపోయిన కవి నోస్టాల్జిక్ గానమీ “పినలగర్ర”. ‘జముకుల పాటగాడు’తో మొదలైన ఈ కవితాప్రస్థానం ‘పండగ వెళిపోయాక’తో ముగుస్తుంది. రెండింటిలోనూ పాములు వేర్వేరు విషయాలకు ప్రతీకలు కావడం యాదృచ్చికం. ‘అతని పాటను పాయసంలా తాగిన జనం / తెల్లవారి / బుక్కెడు గంజి కోసం అతడు / ఇల్లిల్లూ తిరుగుతుంటే / ‘గిన్నె తెచ్చుకున్నావా’ అని వాళ్లు అడిగినపుడు / నాకు తెలిసింది / రాత్రి అతని చుట్టూ తలలూపినవి నాగుపాములని‘ అని మొట్టమొదటి కవితలో పాములను అంటబడని తనమనే మకిలి మనసుకు ప్రతీకగా చిత్రిస్తే, చివరి కవితలో ‘పండగ వెళిపోయాక / పాములు మళ్లీ పైకి లేస్తాయి / నిశ్శబ్దంగా‘ అని పండగను ఓట్ల పండగగా, పాములను రాజకీయ నాయకులుగా ప్రతీకాత్మకంగా చిత్రించారు కవి.

కొత్తగా ఏర్పరుచుకున్న పట్టణవాసం కవిని ఊపిరి ఆడనీయక ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాస్త గాలి పీల్చుకుని సేదదీరుదామని తూరుపు సంద్రానికి పోతే ఒకటికి బదులు మూడు సముద్రాలు కనిపించాయి. మొదటిది ఉప్పనీటి సముద్రం. దాని గురించి చెప్పినపుడు కవి చిన్నపిల్లాడై పోతాడు. రెండోది జలరి జన సముద్రం. దీనిగురించి గానం చేసినపుడు కవిలోని ప్రగతి కాముకుడు పల్లవిస్తాడు. వారి బాధను తన బాధగా అనుభవిస్తాడు. మూడోది వీటన్నింటివల్ల జనించిన కన్నీటి సముద్రం. కవి ముని అవుతాడు. మీరూ కావాలనుకుంటే “మూడు సముద్రాలు” కవిత చదవండి.

ఇక పట్టణవీదుల్లో సంచారం చేస్తున్నపుడు దారిలో ఓ ముసలమ్మ కనిపిస్తుంది. ఆమెకూడా తన మాదిరిగానే పట్టణంలో బతుకుతెరువు కోసం వచ్చినట్టు కవికి అనిపిస్తుంది. “నగరంలో నా తల్లీ” అంటూ కవితను ఆలపిస్తారు. ఇంటికి చేరినాక తన పిల్లల్ని చూసినపుడు పల్లెలో బాల్యం గుర్తొస్తుంది. ఇంట్లో ఓంటరిగా బిడ్డనొదిలి ఆదరాబాదరాగా పొలంపనిలో చేరిపోయిన తల్లులవెత తలపుకొస్తుంది. పనిచేయక తప్పని ఆర్థిక సంకటం – బిడ్డను వదిలేసి వచ్చేశానన్న మానసిక సంకటం – పొలంలో పని ఇలా ముగిసిందనగానే అలా ఉరుకులు పరుగులు మీద ఇంటికి చేరి బిడ్డను అక్కున చేర్చుకోవడం “పాప తల్లి” అని రెండు కవితలతో కవి వర్ణిస్తారు. పట్టణంలో తనపని తాను చేసుకుంటున్నపుడు పల్లెలో పొలంపని గుర్తుకొస్తుంది. వెంటనే చెప్పిందే “ఉడుపుల మడి” కవిత. అదివింటే మనకు కూడా ‘అబ్బ… ఈ రోజున గదా / తాగిన బుక్కడు గంజి / కడుపున అమృతమయింది’ అన్నమాట నిజమనిపిస్తుంది. పల్లెలో చింతచెట్టు కింద వృద్ధులంతా, చెరువు దగ్గర యువకులంతా, బావికాడ మహిళలంతా, తోటలో పిల్లలంతా గుమికూడి ఎన్నెన్నో ఊసులు పంచుకునేవాళ్లు. కానీ తన పట్టణంలో బతుకొక పద్మవ్యూహం. ఈ ఊహ మనసులో తళుక్కుమనగానే కవి “వాళ్లు మాట్లాడుకునే వాళ్లు” అన్న కవితను చెప్తారు.

నగరంలో నడుస్తుంటే భూతాల్లాగా నిలిచే భవంతులు దర్శనమిస్తాయి. ఒకప్పుడు అదే చోట అంతే పరిమాణంలో మహావృక్షాలుండేవి. కాని అవి నిన్నూ నన్నూ నమిలేసే భూతాల్లా కనిపించేవి కావు. ఇంకా మరెంతమంది వస్తే వారందరినీ రారమ్మని ఆహ్వానించి ఆథిథ్యమిచ్చే ఆత్మీయుల్లాగా నిలిచేవి. అది జ్ఞప్తికొచ్చినపుడు కవి ‘ఒక ఎడారి ఒక ఎండమావి’ కవితను అల్లగలరు. టీ కొట్టుదగ్గర టీ తాగుతున్న కవిని “నాయనా” అని చెయ్యి చాపుతూ ముసలమ్మ బిచ్చమడుగుతుంది. ‘ఏ బిడ్డలచేత బహిష్కరింపబడిన తల్లో ఆమె / ఏ భర్తచేత బయటకు నెట్టబడిన భార్యో ఆమె / ఏ నిర్లక్ష్యనికి గురికాబడ్డ ఆడతనమో ఆమె’ అని “వృద్ధ్యాప్యం ఆమె పేరు” కవితగా గానం చేస్తారు. అది విన్న మనకూ “చేతినున్న టీ గ్లాసులోంచి పాలువిరిగిన వాసనొస్తుంది”.

తన పల్లెలో గోరింటాకు ఏరి, సానమీద నూరి, అరిచేతులమీద చందమామంత పెట్టి, అన్ని జాగ్రత్తలూ తీసుకుని రాత్రంతా పండనిస్తే, తెల్లారేసరికల్లా అరచేతుల్లో సూర్యోదయమయ్యేది. కానీ, ఇప్పుడో… టౌన్ లో ‘ఇనిస్టెంట్ సూర్యోదయం’ అవుతుంది. కోను కొనుక్కొస్తే అరగంటలో చేతుల్నిండా ముగ్గులు రెడీ. ఇలా పదాల పూలరేకుల నడుమ తన హృదయాన్ని ఆవిష్కరించిన రామకృష్ణ కవితా సంపుటి “పినలగర్ర”లో ఏ కవితకు ఆ కవిత విడివిడిగా వున్న పుష్పాల్లా కనిపించక అంతా ఒకే దండగా అల్లినట్టనిపిస్తుంది.

అంతా పల్లె సౌందర్యం తలచుకోవడమేనా, గతాన్ని నెమరువేసుకుంటూ తడికళ్లు తుడుచుకోవడమేనా అంటే కాదు. కవి ఇష్టనిష్టాలను కూడా కొన్ని కవితల్లో ఆవిష్కరించారు. ‘పాటరాని వాణ్ని పాతిపెట్టండి’ కవితలో “గాయపడిన గుండెలోచే పాట పుడుతుంది / శిథిలమవుతున్న జీవిత శకలాలనుంచే / పాట ప్రాణం పోసుకుంటుంది” అంటారు. ఇక్కడే “గుప్పెట్లో గులాబీలు పట్టుకుంటే పాట పుట్టదు / గుండెకు గాయం చేసుకోవాలి” అన్నప్పుడు గుంటూరు శేషేంద్రశర్మ గుర్తుకొస్తారు. ‘ఇష్టం’ అన్న కవితలో “పాటపాడే గొంతంతే ఎంతో ఇష్టం” అని మరోమారు గుర్తుచేస్తారు. “పాటల పినలగర్ర” కవితలో “పాడారా తండ్రీ పాడు / నా పాటల పినలగర్రా పాడు / చిట్లిన నీ వీపు చిందిన రక్తరాగాలు పాదు / దుక్కిబెడ్డల మధ్య దొరికిన దుఖాన్ని పాడు / నీ ఆశల వెచ్చదనాన్ని పాడు / నా రాగాల రెల్లుపూవా పాడు” అంటే మనలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. “కవిత్వం ఇలా చదువుకుందాం”లో కవిత్వానికి “నీలోకి నువ్వు చూసుకున్నప్పుడు / నీలో కాసే వెన్నెలేరా కవిత్వం” అని నిర్వచనం చెప్తారు. ఎంత నిరాడంబరంగా, సాదాసీదాగా, డొంకతిరుగుడు లేకుండా చెప్తున్నారో చూడండి: “హాయిగా కవిత్వాన్ని చదువుకో / నిష్కల్మషంగా నీ గుండెను కడుక్కో / ఎలా చదవాలంటావా / కళ్లు తుడిచిన చేత్తో రాసినది కవిత్వం / చెమర్చిన కళ్లతోనే చదువుకుందాం”. ఇంత సూటిగా చెప్పకుండా దానిని థియరీతో గజిబిజి చేస్తే వచ్చేదే అరిస్టాటిల్ కెథార్సిస్ సిద్ధాంతం. ఆ పెద్దాయన చెప్పిన నాటక లక్షణాన్ని ఎంత సౌమ్యంగా, గడుసుగా ఈయన కవిత్వానికి ఆపాదించారో చూశారా!

దేశంలో రగులుతున్న రాజకీయ రావణకాష్టం మీద కొన్ని చెణుకుల్లాంటి కవితలున్నాయి. చుండూరు సంఘటనకు స్పందనగా ‘శవం చెప్పిన జవాబు’, ఒక శాసనసభ సభ్యుడు కొందరు దళిత యువకులను గుండు కొట్టించినపుడు ‘విశాల హృదయం’, ముష్టి యుద్ధంలా సాగుతున్న మతపుటుగ్రవాదమ్మీద ‘మతోన్మాదమొక రాసక్రీడ’, భారత్ – పాక్ బస్సు దౌత్యంపై ‘ఆప్ కీ చీనీ బహుత్ మీఠీ హై’ అంటూ కొన్ని కవితలున్నాయి. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరిశిక్ష పడ్డ ముద్దాయిలపై ఆ శిక్షను రద్దు చేయలని కోరుతూ రాసిన ‘ఉరితాడు ముడి విప్పుదాం’ కవితలో “మనం శిక్షించాల్సింది నేరస్తుల్ని గాదు / నేరాల్ని శిక్సించాలి / నేరాలకు ప్రేరేపించే పరిస్థితులను శిక్షించాలి / మనసుల్లోని మకిలి కడుక్కోవడానికి / శిక్షలు ప్రజాస్వామికం కావాలి” అన్న మాటలు ప్రజాస్వామికవాదులందరూ అలోచించాల్సినవి. ఈ కవితా సంపుటిలో రెండు కొంచెం పెద్ద కవితలున్నాయి. అందులో ఒకటైన ‘సముద్రమా నీ పేరు బీభత్సమా”లో సునామీలాంటి ప్రకృతి విపత్తు ప్రజల్లో సృష్టించిన అల్లకల్లోలం ఎవరికి చేటు చేస్తుందోకదానని అవాక్కవుతారు. “ఇది అశాంతి కాదు / ఇది అలజడి కాదు / పంచభూతాల తోడు… ఇది కుట్ర / నువ్వే గెలిచావు – నువ్వే గెలిచావు / ఎవర్ని గెలిచావు / పేదవాడి గుండె బద్దలుచేసి గెలిచావు / ధనవంతుడి కాళ్లుకడిగి మరీ గెలిచావు” అని నిజాన్ని బట్టబయలు చేసిన కవి అభినందనీయుడు.

“పినలగర్ర” కవితా సంపుటిలో కేవలం కళింగాంధ్ర ప్రాంతపు సమస్యలే చిత్రించారనలేము. ఇందులోని విషయం (సారం) విశ్వకాలికమూ విశ్వజనీనమూ. దానికి కారణం, మొత్తం కవితా సంపుటిని పరిశీలించినపుడు, కవి వ్యక్తిత్వమేనని అర్థమవుతుంది. అన్నిచోట్లా పల్లెలు అంతర్ధానమవుతున్నాయని, బతికి బట్టకట్టిన పల్లెలు పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటున్నాయనే ఎరుక కవికుంది. (ఇదే విషయాన్ని ‘మా ఊరికి కొందరు మనుషులు కావాలి‘ అంటూ కవికూడా అర్ధంచారనుకోండి.) కాని, పువ్వులకు సువాసనల పరిమళం అబ్బినట్టుగా కవివాడిన భాషవల్ల మనమీ ‘పినలగర్ర’ను హృదయానికి హత్తుకుంటాం. ఈ మాటల పరిమళం ఒక్కొక్కటిగా ఆస్వాదించండి: “గడపలో కూర్చుంటే వాడి కళ్ళు / చీకటి గవ్వాసలవుతాయి” (పే. 23), “నా అడ్డాళ్లలో అగ్గి పోసినట్టయ్యింది” (పే. 33), “అరచేత మొలిచిన అగ్నికుండల్ని మోస్తూ“, “నువ్వు సీర సిలకట్టేసి” (పే. 36), “బాకీ బతుకులు బాగును ఊహించలేవమ్మా” (పే. 42) లాంటి మాటలు మన చెవులకు వీనుల విందుగా వుంటాయి.

ఇక రామకృష్ణపైన నా వ్యక్తిగత ఫిర్యాదు, ఈయన తరచూ కవిత్వం రాయకపోవడమేమిటని? ఈ కవినుండి తెలుగు సాహిత్యలోకం మరిన్ని మంచి కవితలను డిమాండ్ చేయాలి. దానివల్ల మాత్రమే తరువాత రాబోయే సంపుటాలు మరింత వన్నెదేరుతాయి. మరింత మనల్ని అలరిస్తాయి. మరింత పాఠకుల్ని ఆలోచనలో పడేస్తాయి. కవి తన భావ వ్యక్తీకరణలో మరింత రాటుదేలాలి. తన భాషను మార్చాలి. ఐర్లండులో ఒక మత్స్యకాత గ్రామంలో జె. ఎం. సింగ్ నివశించేవాడు. తరువాత స్కాలర్ షిప్పు దొరికి ఒక పెద్ద యూనివర్శిటీలో చదువుకుంటూ పట్టణపు వాడుక ఇంగ్లిషులో నాటకాలు రాసేవాడట. ఒకసారి డబ్ల్యు. బి. ఈట్స్ మహాశయుడు శనివారం డిన్నర్ కు వచ్చాట్ట. సింగ్ ఫలానా గ్రామంనుంచి వచ్చాడని విని, నాటకాలు రాస్తాడని తెలుసుకుని గట్టిగా మందలించాట్ట. ఆ తర్వాత ఎప్పుడు నాటకం రాసినా ఆరు నెలలు ముందుగానే తన సొంతూరులో మకాం పెట్టి, ఆ మూడ్ లోకెళ్లి అదే భాషలో నాటకాలు రాశాడు. అప్పుడే పేరుకు పేరు, నోబెల్ బహుమానం వచ్చాయి. ఇందులో కవులే కాదు సృజన కళాకారులు ఎవరైనా మొహమాటాలకు పోవలసిందేమీ లేదు.

ఈ సంపుటిలో రెండు మూడు కవితల్ని మరోలామార్చి రాస్తే బాగుణ్ణు. ‘నూతికి ఏతామేసి‘ కవిత ముగింపు ఇలా వుంది: ‘నూతిగట్టుమీద అతని యాతన చూసి / వడలిన అతని వయసు చూసి / సడలిన అతని శక్తి చూసి / నాలుగడుగుల దూరంనుంచే / నవ్వుకుంటూ పోతుంది నది” అంటే ఎవరు ఎవరిని చూసి ఎగతాళి చేస్తున్నట్టు? ‘చిరంజీవి సౌభాగ్యవతికి‘, ‘పాప ఏడుస్తుంది‘ కవితలు ఏ విధంగానూ రామకృష్ణనుండి ఆశించకూడనివి. ‘అనుభవం అద్దమైతే‘ అనే కాస్త పొడవు కవితలో ముగింపు వాక్యమిది: “నిశ్శబ్దపు శిలాఫలకాల క్రింద / చైతన్య రాజుకుంటుంది“. అదసలే శిలాఫలకం. దానికింద ఏం రాజుకుంటే ఏం లాభం? ఏ చిన్న మార్పయినా శిలాఫలకం ఎదురుగా జరగాలి. తొలి కవితా సంపుటిలో సాధారణంగా కనిపించే మరో స్వల్ప లోపం కవితలను ఏదో ఒక క్రమంలో అమర్చకపోవడం ఇందులోనూ కనిపిస్తుంది. ఇవి భూతద్దంలో చూసిన తప్పిదాలు. తాటిముంజులో నీరులాంటి ఈ కవిత్వ ఆస్వాదనకు ఇవేవీ అడ్డురావు. ముఖపత్ర చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ అందమైన ముఖచిత్రం గీసాడుగాని ఆ రైతుకు చొక్కా వేయకపోవలసింది. దాంతో కవిత్వపు ఆత్మను పట్టుకోలేకపోయాడనిపించింది. ముందుమాటకారుడు కవిశివారెడ్డి మాత్రం కవితాత్మను పట్టుకుని పాఠకుడికి లైట్ హౌస్ లాగా నిలబడడం విశేషం.

కవిత్వంలో కళింగాంధ్రనుంచి వినిపిస్తున్న మరో బలమైన గళం రామకృష్ణ. ఈ “పినలగర్ర” కవితా సంపుటి మీరూ చదవండి. మరో నలుగురు మిత్రులచేత చదివించండి. చిక్కని కవిత్వానికి చక్కని ప్రచారమీయండి. దీని ఖరీదు 50 రూపాయలు మాత్రమే. ఈ పుస్తకం పొందదలచుకున్నవారు కవిని 94401 75465 నెంబరులో సంప్రదించండి.

ప్రకటనలు

2 responses »

  1. ఇంత సుదీర్ఘ సమీక్షా అనుకుంటూ ప్రారంభించినప్పటికీ మొదలెట్టాక వదల బుద్ధి కాలేదు.. 🙂

  2. సమీక్ష అద్భుతంగా ఉంది. ప్రతి కవితనూ చదివి ఆస్వాదించాలని ఉంది. నిజంగానే నిరాడంబరత కారణంగా ఇలాంటి కవితా సంకలనాన్ని చదివే అవకాశం చేజారిపోవచ్చును. కొని చదవడం చాలా అవుసరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s