పోస్ట్ మోడర్న్ ప్రేమికుల కోసం…

సాధారణం

sambaramవర్తమాన ఘటనలను అర్థం చేసుకోవడానికి, గతపు నడవడికను అవగాహన చేసుకోవడానికి, ఈ రెండింటి పునాదిగా భవిస్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి మార్క్సిజపు ఆలోచన సరళి తోడ్పడినంతగా మతే ఇతర భావధార సాయమందించదు. ఈ కారణం చేతనే రాజకీయం, ఆర్థికం, విజ్ఞానరంగం వంటి సమస్త శాస్త్రాలతో పాటు సాహిత్యం కూడా మార్క్సిస్టు అవగాహనతో అధ్యయనం చేయడం, కృషి సాగించడం మరింత జనసామాన్యాన్ని చేరడానికి దోహదం చేస్తాయి. ప్రజాశేణులకు మరింత ఉపకారం చేయడానికి సహకరిస్తాయి. రాజులు, తేదీలు నుంది చరిత్ర నిర్మాతలు ప్రజలేనన్న అవగాహనవైపు చరిత్ర రచనా శాస్త్రాన్ని మళ్లించిన ఘనత మార్క్సిస్టు చరిత్రకారులదే. ఇక సాహిత్యంలో మార్క్సిజం అందించిన నూతన దృష్టితోనే పుట్టిన సకల సాహిత్య సృజన రూపాల్లో, సారంలో విశిష్టమైనవిగా నిలిచి, పురోగామి, అభ్యుదయ దృక్పథంతో వుండి, అన్ని సమయాల్లోనూ ప్రజాపక్షాన్నే వహించాయి.

వర్గపోరాట స్పృహను పుణికిపుచ్చుకున్న ఈ సాహిత్యం విస్తరిస్తున్న కొద్దీ అస్తిత్వ మూలాల అణ్వేషణను కొందరు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో జనమందరి గురించి మాట్లాడడం, రాయడం కాకుండా, తమ గురించి తామే మాట్లాడుకోవడం, రాసుకోవడం ప్రారంభమైంది. ఇలా ‘ప్రత్యేక’ వ్యక్తీకరణలను పోస్ట్ మోడర్న్ తత్వం అనడం మరీ విషయాన్ని తేలిక చేసినట్టవుతుంది. ఎవరి ఆవేదనలు వారు, ఎవరి ఆకాంక్షలు వారు, ఎవరి బాగోగులు వారు తెలియజెప్పుకునే తీరుతో ముందుకొచ్చిన అస్తిత్వ వాదాలలో క్రమంగా బలపడినవి స్త్రీవాదం, దళిత వాదం, ప్రాంతీయ వాదాలు. ఇవి ధోరణులుగా మొదలై క్రమంగా తెలుగు సామాజిక రంగంలో ఉద్యమరూపం ధరించి, ఈ నేలలో వేళ్లూనుకుని ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టాయి.

ఆధునికానంతర సాహిత్యం వెలువడి మూడు దశాబ్దాలు దాటుతున్నా అటు ప్రాచీన సాహిత్యాన్ని అభిమానించేవారు గాని, ఇటు ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నవారు గాని సరిగా అవగాహన గావించుకోలేక పోతున్నారు. పోస్ట్ మోడర్న్ సాహిత్య తీరును, దాని ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని సరిగా అంచనా వేయలేక పోతున్నారు. ఇక పోస్ట్ మోడర్న్ రచయితలమని భావించుకుంటున్న వారుకూడా సరిగా వివరణలు చేయలేకపోతున్నారు. దీనితో ఎవరి ప్రిజుడిస్ జ్యూరిస్ డిక్షన్ లలో వారుండిపోయి, మొత్తంగా సాహిత్య ప్రయోజనాన్ని నీరుకారుస్తున్నారు. ఎవరి ద్వేషాలు వారు వెలిగక్కుతున్నారు. కాని ఇటీవల పోస్ట్ మోడర్నిజంపై సరికొత్త వెలుగును ప్రసరింపజేస్తూ హెచ్చార్కె సాహిత్య వ్యాసాలు “సంబరం” సంపుటి వెలువడింది. ఈ పుస్తకం పరిచయం ఈ వారం…

తెలుగు సాహిత్య వీధుల్లో పోస్ట్ మోడర్న్ సాహిత్య ప్రక్రియలను ఆహ్వానించిన వారిలో హెచ్చార్కె ఆద్యులు. వివిధ సాహిత్య పేజీల వేదికలపై ఈ పోస్ట్ మోడర్న్ ధోరణులను, ఈ ప్రక్రియల ఆవశ్యకతలను, వాటిని అర్థం చేసుకోవలసిన తీరును గురించి నొక్కి వక్కాణిస్తూ ఆయన చేసిన ప్రయత్నాలే ఈ వ్యాస సంకలనం.

“1960 దశకంలో మొలకెత్తి, 1970 దశకంలో లోకాల్ని ఊపేసిన ఆలోచనలు, ప్రవర్తనా రీతులు మోడర్నిస్టు పరిభాషకు లొంగవు కాబట్టే మోడర్నిజం పని అయిపోయిందని అంటున్నాం. మోడర్నిజంలోని సంస్థీకరణ, పవిత్రీకరణ పరిభాష ఈ ఆలోచనలకు, ప్రవర్తనారీతులకు ఇంకెంత మాత్రం నప్పదు. ఈ జీవన సందర్భాన్ని, దీనినుంచి పుట్టుకొచ్చిన పరిభాషనే పోస్ట్ మోడర్నిజం అంటున్నాం. పోస్ట్ మోడర్న్ సందర్భంలో – పకడ్బందీ నిర్మాణం కన్న యాదృచ్ఛికత (స్పాంటేనిటీ), సమగ్ర సత్యం కన్న ముక్కలు ముక్కల వాస్తవికత (ఫ్రాగ్మెంటేషన్), వేర్వేరుగా సాగే ఆలోచనా ఆచరణల కన్న చర్యాచర్చ (డిస్కోర్స్), కేవల పని ప్రదేశం కన్న దైనందిన జీవితం (ఎవిరిడే లైఫ్), ప్రకటిత నిబద్దత కన్న వాస్తవ నిమగ్నత (ఇన్వాల్వ్ మెంట్), అనిర్దిష్టత కన్న నిర్దిష్టత (కాంక్రీట్), డీక్లాసిపై కావడం వంటి సెంటిమెంట్ల కన్న వాస్తవిక ఉనికి / గుర్తింపు (ఐడెంటిటీ), నిర్మాణవాదం కన్న అనిర్మాణ వైఖరి (డీ కన్ స్ట్రక్షన్) – ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటాయి. మరోమాటలో చెప్పాలంటే మోడర్నిజం వేటిచుట్టూ ఆరాధన (ఫెటిష్)ను సృష్టించిందో అవి వెనుకంజవేసి మోడర్నిజం వేటిని మార్జినలైజ్ చేసి ఈసడించిందో అవి మన్నన (లెజిటమసీ) పొందాయి.”

దాదాపుగా పోస్ట్ మోడర్నిజం అంటే ఏమిటో తెలియజెప్పే ఈ నిర్వచనం అర్థం కాకపోతే తప్పకుండా ఈ పుస్తకంలోని ఒకటి తక్కువ రెండు డజను వ్యాసాలని ఒకటికి రెండుసార్లు తప్పక చదివితీరాల్సిందే.

దళితవాద కవిత్వం తనను తాను ఆవిష్కరించుకుంటూ తెలుగు నేలంతా పరుచుకుంటున్నపుడు దానిని ఎద్దేవా చేసినవారిలో వేగుంట మోహనప్రసాద్ ఒకరు. ఆయనకు సమాధానం చెప్తూ రాసిన ‘దళితవాదులకు వచన కవిత ఎందుకు నిషిద్ధం?” వ్యాసం ఆంధ్రప్రభ సాహితీ గవాక్షంలో మొదలైన చర్చ. దీని తరువాత అన్ని దినపత్రికలలోనూ నెమ్మదిగా ఈ వివాదం రాజుకుంది. అప్పుడు ఆ సంక్షుభిత సమయాన మొత్తంగా దళిత కవుల పక్షాన నిలబడి దొరికినన్ని వేదికలపై హెచ్చార్కె భీకర పోరాటం చేశారు. కొత్త తరపు కొత్త భాష ఆవశ్యకతను వివరించారు. ఆకాంక్షల వ్యక్తీకరణలో అనివార్యమైన మార్పులను అర్థం చేసుకొనమని అర్థించారు. ఈ ఉద్యమ కవితను అర్థం చేసుకున్నట్టుగానే కనిపిస్తూ తప్పుదోవ పట్టినట్టు మాట్లాడిన కొప్పర్తిలాంటి విమర్శకులకు కొత్త భాష నేర్చుకొండని సలహాలిస్తారు.

కవి సిద్ధార్థ రాసిన ‘దీపశిల’ కవిత్వానికి రాసిన హెచ్చార్కె ముందుమాట ‘దస్ స్పేక్ సిద్ధార్థ’లో “పూర్తిగా అర్థమయ్యేసరికి పద్యం మరో అర్థాన్ని తొడుక్కుంటుంది. మాటలకు అర్థాలు మారిపోతాయి” అంటారు. ఆ సందర్భంలోనే “నిన్న రాంభట్లగారికి తెలిసిన గురజాడ ఇవాళ బిఎస్ రాములుకు తెలిసిన గురజాడ ఒక్కరేనంటారా?” అని ప్రశ్న వేస్తారు. మనకెంతో ఆసక్తి కలుగుతుంది. గబగబా పేజీలు ముందుకుతోడి ఫుట్ నోట్స్ తిరగేస్తాం. విశాల సాహిత్య అకాడెమీ ప్రచురించిన బిఎస్ రాములు రచన “కన్యాశుల్కంను ఎలా చూడాలి?”లో “…కన్యాశుల్కంలో శూద్రుల సమస్యలేదు. శూద్ర, దళిత స్త్రీల సమస్య కాదది. జనాభాలో 80 శాతానికి పైగా గల ప్రజల జీవితం కాదది. ఈ దేశంలో మూడు శాతం మాత్రమే గల అగ్రవర్ణ బ్రాహ్మణ జనాభా సమస్య అది” అని అన్నప్పుడు మన విశ్వాసాలు తలకిందులవుతాయి.

(నా బ్లాగు పాఠక మిత్రులకు యీ పర్సనల్ నోట్ – ఆ తరువాత రాములుగారి వ్యాసం కోసం అన్వేషణ మొదలుపెట్టా. కథానిలయం ఇంకా పూర్తి స్థాయి లైబ్రరీగా అవతరించలేదు, అలా కావడానికి మరికొన్ని దశాబ్దాలు పడుతుందేమో కాబట్టి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రయత్నించా. అక్కడ ఆ వ్యాసమున్న “సాహిత్య చరిత్రను కొత్తగా తిరగ రాయాలి” పుస్తకం దొరికింది. ఆ వ్యాస సంపుటిలో చివరన వున్న నాలుగు వ్యాసాలు మన విశ్వాసాలను చెదరగొట్టేవే. వెంటనే రాములుగారికి ఫోన్ చేశాను. డబ్బులు పంపి ఆయన రాసిన పుస్తకాలన్నింటిని విడతలువారీగా తెప్పించుకుంటున్నాను. ఇక ఆ వ్యాసాల్లో కన్యాశుల్కం పైనే కాదు, శ్రీశ్రీపైన కూడా విమర్శ వుంది. వాటిని కొత్తగా చూడడమెలానో తెలుస్తుంది. ఆ ముచ్చటలన్నీ వివరంగా తర్వాత. కానీ శ్రీశ్రీ 99వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఆయన భక్తాభిమానులను చూసినప్పుడు నాకు కలిగిన నిర్లిప్తతకు నెమ్మదిగా వ్యాసరూపం ఇచ్చే అంశాలు రాములు, కంచ ఐలయ్య, రంగనాయకమ్మ గారలు అందించారు.)

1997లో ఆంధ్రప్రభలోనే ప్రచురించిన ‘ఒక సంక్షుభిత సందర్భం : పోస్ట్ మోడర్నిజం’ వ్యాసంలో హెచ్చార్కె తన మనసును ఆవిష్కరించారని చెప్పాలి. పోస్ట్ మోడర్నిజం ఒక వాదం (ఇజం) కాదని, అది ఒక పరిస్థితి (కండిషన్), ఒక సందర్భం (కాంటెక్స్ట్) అని నిర్ద్వందంగా చెప్తారు. మోడర్నిజమయినా, పోస్ట్ మోడర్నిజమయినా – జీవితం పట్ల కవిత్వం (రచన) అవలంబించే వైఖరి ప్రధానమైనదని స్పష్టపరుస్తారు. ఈ “సంబరం” సాహిత్య వ్యాస సంకలనంలోని వ్యాసాలన్నీ వేటికవి విడిగా వున్నట్టు అనిపించవు. ఒకదానికొకటి పొడిగింపుగా, మొత్తంగా అన్నీ ఒక్కటే (పార్ట్స్ ఆఫ్ ది హోల్)గా కనిపిస్తాయి. సాహిత్య విద్యార్థులలో ఒక ఉత్సుకతను రేకెత్తించే ఈ వ్యాసాలన్నీ, అందులో పేర్కొన్న అనేకానేక కవులూ, వారి కవిత్వమూ, సామాజిక ఉద్యమాలు, కొందరు విమర్శకుల వాదాలూ అన్నీ కలిపి ఒక ప్రత్యేక పాఠంగా పనికొస్తాయి. సీరియస్ గా సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారు తప్పక కొని చదవాల్సిన ఈ పుస్తకం రెండు రీడింగుల్లోనే పెన్సిల్ గీతలతో (అండర్ లైన్లుతో) నిండిపోవడం ఖాయం.

“మీరు చదివారా?” పాఠకులైన మీతో చిన్న సంఘర్షణను పంచుకోవాలనుకుంటున్నాను. మార్క్సిస్టులు ఎందుకంత సీరియస్ గా పోస్ట్ మోడర్నిజాన్ని వ్యతిరేకిస్తున్నారు? ప్రాంతీయ, ప్రత్యేక ఆకాంక్షలను ఎందుకంత సీరియస్ గా పోస్ట్ మోడర్నిజం పట్టించుకుంటోంది? ఈ రెండింటి మేలు కలయికను మనం ఊహించలేమా?

ఒక స్పందన »

  1. మార్కిస్టు చరిత్రకారులపై సమాచారంకన్నా అపోహలే ఎక్కువగా హిందుత్వవాదులు ప్రచారం చేశారు. ప్రస్తుతం భారత దేశంలో ఉండే చరిత్రకారులు రెండురకాలే. ఒకటి ప్రొఫెషనల్ చరిత్ర కారులు మరొకరు హిందుత్వవాద చరిత్ర పోషకులు.

  2. నాకు తెలిసి .. ప్రాంతీయ ప్రత్యేక ఆకాంఖ్షలు పోమోలో అంతర్గతభాగం. అదే కాది, వ్యక్తి వరకూ, వ్యక్తిలోనే ఉండే వైరుధ్యాల వరకూ కూడా. కానీ ఆ సూత్రీకరణ కూడా పూర్తిగా సరికాదు.
    మర్క్సిజం అంటే సిద్ధాంతం, దాణికి కట్టుబడి ఉండటం. అసలు సిద్ధాంతమే లేదు పొమ్మటుంది పోమో.
    ఎనీవే, ఆసక్తికరమైన సంకలనం పరిచయం చేశారు. ధన్యవాదాలు.

  3. మీరు పెట్టిన టైటిల్ చూడగానే ప్రేమికుల్లో “పోస్ట్ మోడర్న్ ప్రేమికు”లని ఒక కొత్త వర్గముందా అని ఆశ్చర్యపడ్డాను 🙂

    కొన్ని పోలికలున్నా పోస్ట్ మోడర్నిజమూ అస్తిత్వవాదమూ ఒకటి కాదు. తెలుగు విమర్శ యీ తేడాని పెద్దగా గుర్తిసున్నట్టు లేదు.
    ప్రాంతీయ, ప్రత్యేక ఆంక్షలని పట్టించుకుంటున్నది అస్తిత్వవాదం అనవచ్చు, పోమో కాదు. నిజానికి existensialismకి అస్తిత్వవాదం సరైన పదం కాదు. ఎందుకంటే దాని సృష్టికర్త సార్త్రే ప్రకారం అది ఒక వాదం కాదు! సరే ఆ విషయం పక్కన పెడితే స్త్రీ, దళిత, ప్రాంతీయ మొదలైన ప్రత్యేక వాదాలు అస్తిత్వవాద ఆలోచనల ప్రభావంతో మొదలయ్యాయి అనడం సమంజసం. వీటికీ మార్క్సిజం లాగే ప్రత్యేక సిద్ధాంతాలున్నాయి. పోమో వీటికి మద్దత్తునివ్వదు. మో పోమో కవి కాని అస్తిత్వవాద కవి కాదని నా అభిప్రాయం.
    ఇక, మార్క్సిజానికి ప్రత్యేక అస్తిత్వవాదాలతో పొత్తు కుదిరే అవకాశం ఉంది కాని పోమోతో కుదిరే అవకాశమే లేదు. కొత్తపాళిగారు చెప్పినట్టు వాటికెప్పుడూ చుక్కెదురే.
    మార్క్సిజంలో వర్గాలు ఆర్థిక అసమానతలవల్ల ఏర్పడేవి. అసమానతలనేవి ఆర్థికేతర కారణాలవల్లకూడా ఏర్పడతాయని మార్క్సిజం ఒప్పుకుంటే అది ప్రత్యేక అస్తిత్వవాదాలతో కలిసినట్టే. కానీ అలా ఒప్పుకుంటే వారు నిర్వచించిన వర్గాలలో అంతర్గత వర్గాలు ఏర్పడి అంతర్పోరాటాలు మొదలవుతాయి. ఇది వాళ్ళ వర్గపోరాట స్పృహని దెబ్బతీస్తుంది. అంచేత వాళ్ళు ఒప్పుకోడం లేదు.

    ఈ సంబరం పుస్తకాన్ని పుస్తకాల షాపులో తీసి చూసి కొనకుండా మళ్ళీ పెట్టెయ్యడం ఇప్పటికి రెండుసార్లు జరిగింది. ఈ సారైనా కొంటానేమో చూడాలి!

  4. పింగుబ్యాకు: The Road to Proletarian & Women’s Revolution » Blog Archive » ఇతర వర్గవాదాలు అన్ని సందర్భాలలో పని చెయ్యవు

  5. హెచ్చార్కె వ్యాసాల మీద ఆలోచనాత్మకమైన వ్యాసం అందించిన రవికుమార్ గారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం మీద ఇంకా చర్చ జరగాలి. అంటే, పోస్టు మోడర్నిజం మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం వుంది. ఈ మాటని తెలుగులో ఏ సందర్భంలో ఉపయోగించాలి? ఎలాంటి రచయితలకి ఇది వర్తిస్తుంది? తెలుగు సాహిత్యానికి దీన్ని ఎలా అనువర్తింప చెయ్యాలి?

    చాలా కాలం క్రితం అఫ్సర్ ‘ఆధునికత- అత్యాధునికత” పుస్తకం వెలువడింది. ఆ పుస్తకం మీద చాలా కాలం చర్చ కూడా జరిగింది. మొన్న ఇంటర్వ్యూలో అఫ్సర్ గారు ఆ విషయం ఏమన్నా ప్రస్తావిస్తారా అని చూసా. ఈ లోపే ‘సంబరం’ మీద రవి గారు రాసారు. అఫ్సర్ గారు ఆ విషయం మీద ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? హెచ్చార్కే వ్యాసాలకూ అఫ్సర్ గారు ఆ పుస్తకంలొ రాసిన విషయాలకూ ఏమన్నా సంబంధం వుందా? ఈ విషయం నేను అఫ్సర్ గారికి రాసాను. ఆయన ఇంతవరకూ తిరిగి రాయలేదు.

    హెచ్చార్కే గారు ఇక్కడ రాయడం గమనించి, ఇప్పుడు హెచ్చార్కె గారిని అడుగుతున్నా.

    అఫ్సర్ గారి ఆ పుస్తకం నుంచి ఇప్పటి వరకూ సాగిన ఈ చర్చలో సాధారణ అంతస్సూత్రం ఏమన్న వున్నదా? కొత్త పుస్తకం నేపధ్యంలో హెచ్చర్కే గారి నించి సమాధానం ఆసిస్తూ…

    రవీంద్ర పి.

  6. ‘సంబరం’ను పరిచయం చేసిన దుప్పల రవికుమార్‍ కు, వ్యాఖ్యానించిన మితృలకు కృతజ్ఙతలు. మహేష్‍ గారూ! ప్రొఫషనల్‍, హిందూత్వ… రెండూ కాని గొప్ప చరిత్రకారులు ఉన్నారు. డి.డి.కోశాంబి, రొమెల్లా థాపర్‍, ఇర్ఫాన్‍ హబిబ్‍ ఎట్సెటరా. తెలుగులో హైదర‍బాద్‍ బుక్‍ ట్రస్టు వీరివి కొన్ని పుస్తకాలు ప్రచురcచింది. కొత్తపాళీ గారి మాట నిజమే గాని, ‘అసలు సిద్ధాంతమే లేదు పొమ్మ’నడం పోస్ట్ మోడర్న్ వైఖరి కాదు. సిద్దాంతీకరణ (థిరిటైజేషన్‍) కూడా జీవితంలో భాగమే. ‘ఇంకా వుంది’, ‘ఈ భావన తప్పు కూడా కావచ్చు’ అనే వైఖరి ‘పోమో’ భావుకులలో కనిపిస్తుంది. మార్క్సిజంలో (గతి తార్కిక భౌతికవాదంలో) కూడా ఆ వెసులుబాటు వుంది. ఏదైనా… ఏ ఆలోచన అయినా జీవన కార్యాచరణలో నిగ్గు తేలవలిసిందే, మెరుగుపడవలసిందే. వర్గపోరాట కార్యాచరణలో పలు అస్తిత్వ సమస్యలను పట్టించుకో(లే)కపోవడం నిజమే. అందుకే, పలు అస్తిత్వాల ప్రజలు జనరల్‍ వర్గ పోరాట పథానికి భిన్నంగా, తమ కోసం తాము పోరాడక తప్పదు. పోరాట ప్రజల మధ్య సాలిడారిటీ కోసం కొందరు మార్క్సిస్టులు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఐడెంటిటీ సమస్యలు పరిష్కారం అయ్యే క్రమంలో వర్గపోరాటం మరింత నిగ్గుతేలుతుంది. కామేశ్వర రావు గారూ! తెలుగులో ‘అస్తిత్వం’ అనే ఒకే మాటను ‘అస్తిత్వవాదం’ (ఎగ్జస్టెన్షియలిజం), అస్తిత్వ వుద్యమాల (ఐడెంటిటీ మూవ్మెంట్స్)… రెండు వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అర్థాలలో వాడుతున్నారు. ఆ రెండు ఒకటి కావు. మొదటిది ‘బీయింగ్‍ అండ్‍ నథింగ్‍నెస్‍’లోని ‘బీయింగ్‍’కు, జనరల్‍ హ్యూమన్‍ ఎగ్జిస్టెన్స్ కు సంబంధించినది. రెండవది సామాజికమైన ‘ఐడెంటిటీ’కి సంబంధించినది. రవీంద్ర గారూ! అఫ్సర్‍ ‘ఆధునికత- అత్యాధునికత’, ‘సంబరం’ పుస్తకాల మధ్య సంబంధం లేదు. వాటిలో విషయం, వాటి సందర్భాలు భిన్నమైనవి.

Leave a reply to ravindra స్పందనను రద్దుచేయి