ఇరవై తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు గొరుసు జగదీశ్వర రెడ్డితో…

సాధారణం

గొరుసు కథలు కొన్ని చదివాక కళింగాంధ్ర కథకుడేమో ననుకున్నా. కానీ తరవాత తెలిసింది, తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాలలో ఉద్యోగరీత్యా సంచరించి అన్ని ప్రాంతాలవారికీ వారి సొంత మనిషిలాగే కనిపించే భాషలో కథల్రాస్తారని. తెలుగు సాహిత్యంలో గర్వించదగ్గ కథలు రాసే జగదీశ్వర్ అడపాతడపా బ్లాగుల్లో కామెంట్లు మాత్రమే రాస్తుంటారు. అంటే సొంత బ్లాగు మొదలెట్టని అబ్లాగరి. వృత్తిరీత్యా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ఈయనకి జర్నలిజమన్నా, సాహిత్యమన్నా ఎంతో ప్రేమ, మమకారం. మరి ఈ వారం ఈ మధుర కథకుడి చదువు ముచ్చట్లు వినండి…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

నాకు బోర్‌ కొట్టించిన పుస్తకం అని కాదు కానీ, విశ్వనా«థ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవల్ని ఎన్ని మార్లు చదవబోయినా చదవలేక పోయాను. అదే విశ్వనా«థగారి ‘మరియొక విధంబు’ అనే కథని ఏడాదిన్నర క్రితం మంజుశ్రీ గారు ‘విపుల’లో పరిచయం చేస్తే చదివి ‘ఆహా! విశ్వనాథా’ అనుకోకుండా ఉండలేకపోయా – అంత గొప్ప కథ అది. తెలుగు దేశంలో 80 ఏళ్ల క్రితం ‘గే’ కల్చర్‌పై రాసినందుకు జోహార్లర్పించాలనిపించింది.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

పుస్తకాలు కొనక చాన్నాళ్లయ్యింది. ఎందుకంటే నేను పనిచేసే ఆంధ్రజ్యోతి ఆదివారంలో సమీక్షల కోసం నెలకు వందల సంఖ్యలో పుస్తకాలు వస్తాయి. నాకు పండగే పండగ. నమిలినన్ని నమిలి రుచిగా వుంటే మింగడం, లేదంటే ఊసేయడం …. ఇటీవల పూర్తి చేసిన పుస్తకం … బేబీ హాల్‌దార్‌ ‘చీకటి వెలుగులు’ (ఆర్‌.శాంతసుందరిగారి అనువాదం. సారీ! ఇదీ కొనలేదు, శాంతసుందరి గారే ప్రజంట్‌ చేశారు)

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

నా లైబ్రరీలో దాదాపు 15 వందల పై చిలుకే ఉంటాయి. కథాసంపుటాలు, నవలలు, విమర్శనా గ్రంథాలన్నీ కలిపి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

చాలా రోజులుగా చదవాలనుకుని చదవలేని పుస్తకాలు జి.వి. కృష్ణారావుగారి ‘కీలుబొమ్మలు’, తెన్నేటి సూరి ‘ఛెంఘిజ్‌ఖాన్‌’.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి. 

నాకు బాగా నచ్చిన రచయితలు : అభ్యుదయ భావాల్తో రాసే ఏ రచయితైనా ఇష్టమే.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

నా స్నేహితులకు బహుమతిగా ఎన్నిచ్చానో గుర్తులేదు. పోయినేడాది మాత్రం మీ సిక్కోలు జనవిజ్ఞాన వేదిక కుర్రాళ్లిద్దరొస్తే ఓ వందపైనే పుస్తకాలు డొనేట్‌ చేశాను.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నచ్చిన పత్రిక ‘విపుల’ – నాకు నూనూగు మీసాల వయసులో … 76/77ల్లో కాబోలు … మొదలై ఇప్పటికీ అదే సాహిత్య సేవ చేస్తున్నందుకో, లేక తెలుగేతర సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేస్తున్నందుకో గాని విపులంటే ఇష్టం. అలాగే ఒకప్పుడు విజయవాడనుండి వచ్చిన ‘ఆహ్వానం’ అన్నా ఇష్టంగా ఉండేది. అప్పుడప్పుడూ కనబడే సాహిత్యనేత్రం, నెలవారిగా వచ్చే ప్రస్థానం కూడా బాగుంటాయి. మెచ్చని పత్రికలు ‘కో’ – కొల్లలు.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

జనం ఎంతో సీనిచ్చినా నా కంతగా నచ్చని రచన ఏదీ లేదు. ఎందుకంటే నిఖార్సయిన చదువరి పసలేని పుస్తకానికి ఏ సీనూ ఆపాదించడని నా నమ్మకం. ఇలాంటి ప్రశ్నలు ఏ తొట్టి సినిమాలకో వర్తిస్తాయి. ఎందుకంటే అద్భుతం అనుకున్న సినిమా అట్టర్‌ ఫ్లాపయి, అట్టర్‌ ఫ్లాపనుకున్న సినిమా సూపర్హిట్టయినపుడు ఇలాంటి సందేహాలు కలుగుతాయి.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి? 

ప్రస్తుతం చదువుతున్న పుస్తకం: టాల్‌స్టాయ్‌ ‘ఇవాన్‌  ఇల్యీచ్‌ మరణం’

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి? 

నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాలు  ఈ మధ్య కాలంలో గోర్కీ ‘నా బాల్యం’ (అనుకోకుండా ఇదే సినిమా డివిడి చూసి నీరుగారి పోయాను. బాగా నచ్చిన పుస్తకం సినిమాగా వస్తే చచ్చినా చూడకూడదని నిర్ణయించుకున్నాను. గతంలో టాల్‌స్టాయ్‌ ‘అన్నాకెరినీనా’ చదివినప్పుడు కూడా ఈ అనుభవం ఎదురైంది. అన్నట్టు ఈ మధ్యకాలంలో గుండె పిండేసిన సినిమా ‘ఫాదర్‌’ అనే ఇరానీ ఫిలిం). ఇక అత్యంత ఇష్టమైన కథల్లో  (రష్యన్‌వే ) హోవనేస్‌ తుమన్యాన్‌ ‘గిఖోర్‌’, కుప్రీన్‌  ‘ ఒలేస్యా’, అలెక్సి టోల్‌స్టోయ్‌ ‘ ది రష్యన్‌ కారెక్టర్‌’ అనే కథలు. తెలుగులో రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’, ‘స్వీట్‌ హోమ్‌’ పుస్తకాలు ఇష్టం. (ఈ రెండు పుస్తకాల వల్ల ఎంతో కొంత ‘మంచి’ మార్పు చదువరి (ప్రవర్తన) లో వస్తుందని ఘంటాపథంగా నమ్ముతాను).

ఎక్కువగా మాండలీక సౌందర్యాన్ని ఆస్వాదిస్తాను. తెలుగు దేశంలోని ఏ మండల మాండలీకమైనా మధురమే. సీమలో నామిని, ఉత్తరాంధ్రలో పతంజలి, తెలంగాణలో తెలిదేవర భానుమూర్తిగార్ల మాండలీకాలు  మహా ఇష్టం. నామిని ‘ఎప్పుడొస్తే అప్పుడే’ అనే కథని ప్రభుత్వం వారు ప్రైమరీ స్కూలు పిల్లలకోసం పాఠ్యాంశంగా పెట్టాలని నా సూచన.

ప్రకటనలు

5 responses »

  1. గొరుసు ఇంటర్వ్యూ చదివాను. చాలా నచ్చింది. ఒకసారి వాళ్ల ఇంటికి వెళితే నలుమూలల నుంచి పుస్తకాలు వచ్చి పలకరించాయి. గాలికోసం ఫ్యాన్‌ వేస్తే సాహిత్య జ్ఞాపకాలు వీచాయి. టప…టపమని చినుకులు కురిసే ఒకరోజు నాకు, నాలాంటి సాహిత్య మిత్రులకు ఆయన ఎన్నో కబుర్లు వినిపించారు. అవి వ్యక్తిగత భవబంధాల కబుర్లు కావు. ఆరణాల సాహిత్య కబుర్లు. పాలమూరి కూలీల స్వేద పరిమళం, జగదాంబ సెంటర్లో గరీబోల్ల మాటముచ్చట… ఎప్పుడూ గొరుసు గుండె పర్సులో ఉంటాయి. తెలంగాణ, ఉత్తరాంధ్ర సాహిత్య సౌందర్య సమేళనం గొరుసు.
    – ఎం.డి. యాకూబ్‌ పాషా (సాక్షి)

  2. సువాసనలు వెదజల్లే మంచిగంధం చెట్టును కదిలిస్తే అనుభవాలు, జ్ఞాపకాలు, పాటలు, కథలు పువ్వులుగా రాల్తాయి. వాటన్నిటినీ గుప్పెట్లో పెట్టుకొని అరమోడ్పు కన్నులతో హాయిగా గుండెనిండా ఆఘ్రాణించడంలో కలిగే అనుభూతిని గొరుసు ఇంటర్వ్యూ కలిగించింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించిన రష్యన్‌ కథలు ప్రపంచ సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోగల మంచిగంధం పూలు
    – బి. అజయ్‌ప్రసాద్‌

  3. జగదీశ్వర్ గారి ఇంటర్వ్యూ బావుంది. రష్యన్ పుస్తకాల ప్రభావం ఆయనపై ఎక్కువగానే ఉందన్నమాట. మరి వ్యాఖ్యాత నుంచి బ్లాగరిగా ఎప్పటికి మారతారో చూడాలి.

  4. ఇంటర్వ్యూ బాగుంది. బ్లాగరిగా కూడా మారి కథల గురించీ, కథకుల గురించీ మరిన్ని విశేషాలు చెప్తారని ఆశించవచ్చా!

  5. గొరుసు జగదీశ్వర రెడ్డి గారి ఇంటర్వ్యూ చదివాను. చాలా మంచి విషయాలు చెప్పారు . సాహిత్య పరంగా అవి నిర్దిష్టమైనవి. మంచి చదువరి ఎలాంటి పుస్తకాలు చదవాలనో తెలుసుకునే అవకాశం ఈ ఇంటర్వ్యూ ద్వారా కలిగింది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s