అంతరంగ ఆవిష్కరణ

సాధారణం

manavasamajamకుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడమంటే మీకు తెలుసా? రంగనాయకమ్మ మాటలు మీరు ఎప్పుడైనా చదివారా? అదే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడమంటే. రంగనాయకమ్మ తాను నమ్మినవీ, తన తర్కానికి లొంగినవీ, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి తాను రాసినవీ… అన్ని వ్యాసాలు కలగలిపి ఇటీవల “మానవ సమాజం” అనే పుస్తకంగా వెలువరించారు. ఈ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను. 

ఈ “మానవ సమాజం : నిన్న – నేడూ – రేపూ” అనే బృహత్తర వ్యాస సంకలనంలో వ్యాసాలు, ఉత్తరాలు, సమీక్షలు, ఇంటర్వ్యూలు, గతంలో ప్రచురితమైనవీ కానివీ కలిపి ఎనభై వ్యాసాలున్నాయి. మిగిలిన రంగనాయకమ్మ కథలు, నవలలు చదవడం ఒక ఎత్తు. ఈ ఒక్క వ్యాస సంకలనం చదవడం ఒక ఎత్తు. కాగా మార్క్స్ రచించిన ‘కాపిటల్’ గ్రంథానికి రంగనాయకమ్మ రచించిన పరిచయం చదవడం ఒక్కటే మరో ఎత్తు. మార్క్సిజం పట్ల మన ఆలోచనను, సమాజ సంబంధాలపట్ల మన అవగాహనను విస్తృతం చేసే ఈ “మానవ సమాజం” వ్యాసాలు చదవడం ద్వారా రంగనాయకమ్మ రచయిత హృదయానికీ, తర్కించే మేధకు మనం దగ్గర కాగలుగుతాం. రకరకాల కోణాలలో ఆమె ఆలోచనలను ఈ వ్యాసాలు ఆవిష్కరిస్తాయి. ప్రవాహ సదృశమైన ఆమె శైలి కొత్త, పాత తేడాలు లేకుండా ఇటు పాఠకులకు, అటు రచయితలకు కూడా మంత్రముగ్దులను చేస్తుంది. ఎన్నో విషయాలు నేర్పిస్తుంది.

పుస్తకంలోని అంశాలను పరిశీలిస్తే ‘వివిధ అంశాలపై…’ అన్న తొలి విభాగంలో పంతొమ్మిది వ్యాసాలు, ‘స్త్రీలకు సంబంధించి…’ విభాగంలో పదకొండు స్త్రీవాదానికి సంబంధించిన వ్యాసాలు, ఆరు ‘పుస్తక సమీక్షలు’ మూడో విభాగంలోను, ‘సినిమా సమీక్ష’ అనే నాలుగో విభాగంలో ఎనిమిది సినిమా వ్యాసాలు, ‘ఉత్తరాలు’లో పదహారు మందికి వివిధ సందర్భాలలో రాసిన ఉత్తరాలు, చివరి విభాగం ‘రాజకీయాలపై…’ మరో ఇరవై వ్యాసాలతో ఉన్నాయి. మార్క్సిజాన్ని తేలికగానూ, క్లుప్తంగానూ యువతరానికి చెప్పాలన్న ఉద్దేశంతో ‘మానవ సమాజం : నిన్న – నేడూ – రేపూ’ అన్న వ్యాసంతో ఈ సంకలనం ప్రారంభమవుతుంది. ఈ రోజు మనం చూస్తున్న ఈ నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థ ఎలా ఈ సమాజంలోకి ప్రవేశించిందీ, దానిని నిరంతరాయంగా కొన్ని శక్తులు ఎలా కొనసాగనిస్తుందీ, దాని విముక్తితోనే సాధ్యమయ్యే సమసమాజ నిర్మాణానికి ఎలా బాటలు వేయవలసిందీ ఈ వ్యాసంలో చాలా సరళంగా రంగనాయకమ్మ వివరిస్తారు. మార్క్సిజంపై రచయితకున్న అచంచల విశ్వాసం మనకు ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది.

వృద్ధుల సమస్యలకు వృద్ధ ఆశ్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం చూపించలేవని ‘వృద్ధుల సమస్యలకు వృద్ధ ఆశ్రమాలే పరిష్కారమా!’ అనే వ్యాసంలో చర్చిస్తారు. వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు దూరం చేసుకుంటున్నట్టు పైకి అగుపిస్తున్నదే కాని దానికి మూలాలు వారి బాల్యంలోనే పడుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ప్రైవేట్ స్కూళ్లపట్ల మోజు పెరిగిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా డబ్బులు పెట్టి పేరున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఏళ్ల తరబడి తల్లిదండ్రులకు దూరంగా వుండడంవల్ల వారికి సొంత తల్లిదండ్రులపై మమకారం వుండట్లేదు. తల్లిదండ్రులపట్ల, వారి ఇష్టానిష్టాల పట్ల, వారి కష్టసుఖాల పట్ల, వారి విశ్వాసాల పట్ల ఏమాత్రం అవగాహనలేని పిల్లలు తీరా తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఏ ఆశ్రమాల్లోనో పడేయడం పెద్ద ఆశ్చర్యపోవలసిన సంగతి కాదు. మరి యువతరానికి వృద్ధాప్యం కూరలో కరివేపాకులా, మామిడిపండులో టెంకలా చులకన కాకుండా ఎలా వుంటుంది! కుటుంబంలో వృద్ధులకు తగిన స్థానం, గౌరవం ఇచ్చినపుడు వారు వృద్ధాశ్రమంలో పడిగాపులు పడనక్కరలేదు. వృద్ధాశ్రమంలో చేరిన తరువాత వారు పనిచేసే తీరులోనే మార్పు కోరుకోవడం రంగనాయకమ్మ సంస్కరణవాదం, కాగా అసలు వృద్ధాశ్రమాలే వుండకూడదని కోరుకోవడం ఆమె విశాల మార్క్సిస్టు అవగాహనకు నిదర్శనం. కానీ ఇప్పటికే వృద్ధాశ్రమాలు పూర్తిగా వ్యాపార స్థాయికి ఎదిగిపోయాయి. ఈరోజో రేపో టీవీల్లో, పేపర్లలో వాటిపై ఆకర్షణీయ ఆఫర్లతో ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపోకూడదు.

ఇదే మాదిరిగా ‘పనిమనుషులు కూడా మనుషులే’ అనే వ్యాసంలో ఇంటిపని, బైటిపని గురించి ఎన్నో సంగతులు చెప్తారు. ఇదే సంగతి కొన్ని ఇతర వ్యాసాల్లో చర్చిస్తారు. పనిమనుషుల పట్ల దయకలిగి వుండాలనుకోవడం రచయిత సంస్కరణ అభిలాష అయితే అసలు పనిమనుషుల అవసరం లేకుండా కుటుంబ సభ్యులందరూ పని విభజన చేసుకుని శ్రమైక జీవన సౌందర్యం కనబరచాలనుకోవడం రచయిత పాఠకునికి అందిస్తున్న పరిణత సామాజిక అవగాహన.

జార్జి ఆర్వెల్ రాసిన ‘ఏనిమల్ ఫామ్’ నవలలో నెపోలియన్ పంది అధికారం హస్తగతo చేసుకున్నాక, అక్కడ మిగతా పాలిత జంతువుల్లో ఏ చిన్న అసంతృప్తి కనిపించినా నెపోలియన్ పెంచే కుక్కలు అదే పనిగా మొరిగి వాటన్నింటి దృష్టిని మరలుస్తాయి. ఆ నవలలో మాదిరిగానే మన పాలకులుకూడా అనవసర విషయాలకు నానా హంగామా చేసి ప్రజల దృష్టిని అవసర విషయాలనుంచి మళ్లించి తప్పుదోవ పట్టిస్తుంటారు. అలాంటి ఒక హంగామాను రంగనాయకమ్మ ‘బంగారు పతకం తెస్తే ఇండియానే రాసేసేవారే’ అన్న వ్యాసంలో మన ప్రభుత్వ ప్రాధాన్యాలను ఎద్దేవా చేస్తారు. జిల్లా కేంద్రాల్లో వున్న స్టేడియంలో క్రీడల అభివృద్ధి పేరిట జరుగుతోన్న అవినీతి ఆగడాలను చూస్తే రచయిత మండిపడతారేమో!

చలం శతజయంతి ఉత్సవాలపై అతడి దొంగ భక్తులందరికీ అంటించిన వ్యాసాల చురకలు రెండున్నాయి. ఒక్క చలానికే అనికాదు, శిబిరాలుగా విడిపోయిన సాంస్కృతిక కళాకారులంతా చేస్తున్న పని ఇంచుమించుగా అదే – ఉత్సవ విగ్రహల ఊరేగింపు. వారంతా సమాజానికి ఏం చెప్పదలచు కున్నారనేది గాలికి వదిలేయడమే. స్త్రీవాదానికి సంబంధించిన వ్యాసాలు కేవలం స్త్రీలకేకాదు పురుషులకు కూడా కనువిప్పు కలిగించేవే. ఈ విషయాలన్నీ సంప్రదాయపు గుడ్దితెరలు కమ్ముకున్న స్త్రీలు అంగీకరించడం కష్టం. ఈ వ్యాసాల్లో చెప్పినట్టుగా స్త్రీ పురుష సంబంధాలు వుండడం వారికి కష్టం. కానీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని కాదంటే, కూడదంటే తప్పేమో, పాపమేమో అనుకునే బాపతే చాలామంది. దీనికి తోడు పురుషాహంకారం మూర్తీభవించిన మగవారు పలికే పలుకులు, చెప్పే మాటలు, రాసే రాతలు, తీసే సినిమాలు, సృష్టించే సాహిత్యం అన్నీ ఆ పాత కుళ్లుకంపు కొట్టే ఫ్రేమ్ వర్కుని ఏమాత్రం కదల్చ(లే)నివి. సుప్రీంకోర్టు ఒకప్పటి ప్రధాన న్యాయమూర్తి స్త్రీల ఆధ్యాత్మిక సభలో అవాకులూ చెవాకులూ పేలడంపై రంగనాయకమ్మ వ్యాసం ‘మేము దేవతలుగా వుండం! మనుషులుగానే వుంటాం!!’ నిప్పులు కురిపించింది. భావదాస్యంలో మగ్గే వ్యక్తులు ఎంత చదువుకున్నా, ఎన్ని పదవులు పొందినా బుద్ధులు మాత్రం కొద్దేనన్న సంగతి ఇలాంటి వ్యక్తులే బహిరంగంగా ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి రచనలు విరివిగా వచ్చినప్పుడే వాళ్లలో కొంతైనా ఆలోచన అంకురించేది.

సినిమా సమీక్షల్లో “మాంగల్యానికి మరో ముడి”, “నిశాంత్” లపై సమీక్షలు చదివిన తర్వాతైనా నేటి పత్రికల్లో సినిమా సమీక్షలు చేస్తున్న రచయితలు సిగ్గుపడాలి. స్టార్ డమ్ కిస్తున్న విలువలో వెయ్యోవంతైనా కథమీద, కథనం మీద, ఏ భావజాలాన్ని ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారన్న విషయం మీద దృష్టిపెడితే బాగుణ్ను. నేటి మన సినిమా సమీక్షలకు ఇవి మార్గదర్శకాలు. “ఎదురీత” సినిమాపై సమీక్ష రచన ఓ ప్రయోగం. సామాన్య ప్రేక్షకుడు ఆ సినిమా చూసిన తరువాత పాఠకులతో తన అనుభూతిని పంచుకోవడమే ఈ వైచిత్రి. “మరో చరిత్ర” సినిమా గురించి రచయిత ఇలా అంటారు: “వర్గ శత్రు నిర్మూలనం తప్పంటారు కొందరు. వర్గ శత్రువు విషయంలో అది తప్పో కాదో గాని, పదహారేళ్ల పిల్లలకు, చదువు సంధ్యలతో ఆరోగ్యకరమైన ఆలోచన విధానంలో పెరగవలసిన పిల్లలకు ఈ సినిమా రకం సందేశాలిచ్చే దర్శకుల్ని, నిర్మాతల్ని, రచయితల్ని నిర్మూలించే కార్యక్రమం మాత్రం అత్యవసరంగా తక్షణం చేపట్టవలసిన కర్తవ్యంగా కనపడుతోంది. అది తప్పు కాదనిపిస్తోంది.” (1976 జూన్). పాపం అప్పటి సినిమాలు చూసిన రచయిత అలా అన్నారు. మరి పదో తరగతి తర్వాతే తల్లిదండ్రులయ్యే సినిమా ‘చిత్రం ది పిక్చర్’ (తెలుగు సినిమాయే – ఈ కిరణాలు తిమిర సంహరణాలు వారిది) నిర్మాత దర్శకుల్ని ఏం చెయ్యమంటారో!

సినిమాల్లో ‘శంకరాభరణాన్ని’ అభినందించినట్టే రచనలలో ‘హంపీ నుంచి హరప్పా దాకా’ (తిరుమల రామచంద్ర), ‘పచ్చనాకు సాక్షిగా’ (నామిని సుబ్రమన్యం నాయుడు) తదితరులను మనసారా మెచ్చుకోవడం గమనిస్తాం. ఇక చివరి వ్యాసమైన ‘కొండని తవ్వి ఎలకని కూడా పట్టనట్టు’ బాలగోపాల్ సైద్ధాంతిక ధోరణిపై రాసింది. రాగో నవల “సరిహద్దు” విడుదలైన తరువాత బాలగోపాల్ ప్రచురించిన “మనిషి – చరిత్ర – మార్క్సిజం” వ్యాసం తెలుగులో మార్క్సిస్టు మేధావుల్లో కల్లోలం రేపింది. “కల్లోల కాలంలో మేధావులు : బాలగోపాల్ ఉదాహరణ” పేరిట ఎన్. వేణుగోపాల్ కూడా ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ “మానవ సమాజం”లో రంగనాయకమ్మ రాసిన ఈ వ్యాసంలో బాలగోపాల్ ఏ విధంగా మార్క్సిజం నుంచి మిస్ గైడ్ అయ్యారో, కొన్ని ఖాళీలున్నాయని తాను భావించింది మార్క్సిస్టు సిద్ధాంతంలో కాదని, బాలగోపాల్ అవగాహనలోనని సూత్రీకరిస్తారు. ఈ క్రమంలో తెలుగు మేధావులందరికీ చురకలు అంటిస్తారు. ఎలా వ్యక్తిగత వూహాపోహలతో సిద్ధాంతాన్ని తప్పుడు చిత్రీకరణలు చేస్తారో విపులంగా వివరించారు.

చాలా సరళంగా సాగిన ఈ రచనల్లో కొ.కు. మీద విమర్శలు చాలా ఆసక్తిదాయకంగా వున్నాయి. కథకు బదులుగా కధ అనడం, సమష్టికి బదులు సమిష్టి ప్రయోగించడం, (కృత్రిమానికి బదులు) కుత్రిమం లాంటి పదాల వాడుక నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు. గద్దర్ చొక్కాలేకుండా టీవీ ఇంటర్వ్యూలలో కనిపించడాన్నిసూటిగా ప్రశ్నిస్తారు. దీనితో నిజంగానే గద్దర్ తలకు రంగు వేసుకోవడం మానుకోవడమే కాకుండా, చొక్కా కూడా ధరిస్తున్నారు. ఈ సునిశిత విమర్శకు సున్నిత మనస్కులు కారా మేష్టారు కూడా మినహాయింపు కాకపోవడం గమనించాలి.

ఎనభై వ్యాసాలతోనాలుగు వందల పేజీల ఈ హార్డ్ బౌండ్ పుస్తకం ఖరీదు కేవలం ఎనభై రూపాయలే. సీరియస్ గా ఆలోచించే పాఠకులతో పాటు వర్ధమాన రచయితలందరూ విధిగా అధ్యయనం చేయవలసిన పుస్తకం ఈ “మానవ సమాజం” మిగతా రంగనాయకమ్మ రచనలకంటే భిన్నం. ఈ పుస్తక పఠనం ద్వారా మన ఆలోచనలను విస్తృతపరుచుకోవడమే కాకుండా రచయిత అంతరంగాన్ని కూడా ఆవిష్కరించగలుగుతాం. మరి మీరూ చదువుతారుగా.

ప్రకటనలు

8 responses »

 1. రవికుమార్‌గారూ,
  మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ఇలాంటి పరిచయాలు బాగా ప్రాచుర్యమున్న పత్రికల్లో వస్తే ఎంతో మందిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ పెట్టుబడీదారి పత్రికల్లో ఇలాంటి పుస్తకాలు పరిచయాలకి నోచుకోవు. ఎందుకంటే వీటిలోని సారాంశం వాళ్లకి సెగలా తగులుతూ ఉంటుంది కాబట్టి.
  – గొరుసు

 2. మాలతి చందూర్ వ్రాసిన భార్యల మీద భార్యల కథని విమర్శించే వ్యాసం, వ్యభిచారానికి లైసెన్సింగ్ డిమాండ్ చేసేవాళ్ళని విమర్శించే వ్యాసం, వృద్ధుల సమస్య గురించి వ్రాసిన వ్యాసం ఇలా అనేక వ్యాసాలు నన్ను కూడా ఆలోచింప చేశాయి.

 3. ఇందులో మీరు ప్రస్తావించిన కొన్ని వ్యాసాలు, సినిమా సమీక్షలు వేరే వేరే చోట్ల చదివాను. మాంగల్యానికి మరోముడి సమీక్ష ఒకపక్క నవ్విస్తూనే మరో పక్క చాలా సీరియస్ గా ఆలోచింపజేస్తుంది.

  నాలుగు వందల పేజీలు కాదు పదహారు వందల పేజీల పుస్తకమైనా సరే, వ్యాసాలైనా సరే విపులంగా బోరు కొట్టని పద్ధతితో రాయడం ఆమె సొంతం. రంగనాయకమ్మ గారి విమర్శలు,విధానాల మీదే కానీ వ్యక్తుల మీద కాదు కాబట్టి ఎవరూ వాటికి అతీతం కాదు.ఇంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రవి గారికి ధన్యవాదాలు! తప్పక కొని సీరియస్ గా చదవాల్సిందే!

 4. బాల గోపాల్ వేసిన ప్రశ్నలకి నేను కూడా సమాధానాలు చెప్పగలను. గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని అర్థం చేసుకోవడం సులభమే కానీ అర్థమైనా అంగీకరించని వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బాల గోపాల్ ఒకరు.

 5. Russiaku peristroika, glassnosthlato charamageetam paadina Gorbhachevlaa manaku Baalagopaal cheyaalanukunnaru. kaani daanini ikkadi medaavulu mumdugaane ardham chesukoni aayana avakaasa vaadaanni tippikottaaru. ayanaku javaabu amarudaina com.Mahesh baaga ichcharu.

 6. ఈ పుస్తకం గురించి చాలా బాగా విశ్లేషించారు. అభినందనలు. రంగనాయకమ్మ గారు ఏ అంశం మీదైనా విమర్శ చేశారంటే… అది నన్నయ్య మహాభారతం భాషలో చెప్పాలంటే… ‘ దారుణాఖండల శస్త్ర తుల్య’మే! దానికిక తిరుగుండదు. ఆ తీవ్రత వ్యక్తుల మీద కాకుండా అంశం మీదే. అలాంటపుడు కారా మేష్టారు లాంటి వారు ‘సున్నిత మనస్కు’లైనా, కాకపోయినా ‘మినహాయింపు’ ఎందుకుంటుంది?

  ఈ మర్యాదల, పరస్పర పొగడ్తల సాహితీ ప్రపంచంలో విలువైన విమర్శ అరుదైపోతోంది. విమర్శ ఎలా ఉంటుందో ఈ తరానికి పరిచయం చేయాలంటే… ఈ ‘మానవ సమాజం’ చదవమని చెప్పాలి.

  ‘లతాజీ! తగదీ శ్రద్ధాంజలి!’ అనే వ్యాసం ఈ పుస్తకంలోదే. చాలా బావుంటుంది. సైగల్, ముఖేష్, రఫీ , గీతాదత్ తదితరుల పాటలను పాడి, వాటిని రికార్డులుగా విడుదల చేసి, ‘శ్రద్ధాంజలి’ ఘటించటం లతా మంగేష్కర్ పరంగా ఎంత తప్పో చెపుతారు. గీత పాడిన‘మేరే సుందర్ సప్నా…’ను ఇప్పుడు లత పాడితే … ‘ఏనాటి నుంచో గీత కంఠంలో వింటూ ఉన్న ‘మధుర స్మృతి’ని చెరిపెయ్యడమే’ అంటారు.
  సంగీతాభిమానుల గుండె చప్పుడు కదా ఇది?

 7. బాల గోపాల్ హైకోర్టు లాయర్. అతను కూడా బూర్జువా వర్గానికి చెందిన వ్యక్తే కదా, అందుకే అతనిలో బూర్జువా భావాలే ఉంటాయి. నేను వ్రాసిన “నీటి ఘోష” కథ మా ఇంటిలో వాళ్ళకి చూపించాను. http://viplavatarangam.net/2009/06/14/26 ఈ కథ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే మా తాత (మా అమ్మగారి నాన్న) కూడా భూస్వామే.

 8. పింగుబ్యాకు: పుస్తకం » Blog Archive » నా అసమగ్ర పుస్తకాల జాబితా -2

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s