ముప్పయ్యో వారం చదువు ముచ్చట్లు హెచ్చార్కెతో…

సాధారణం

కొందరు డబ్బుతో కులుకుతారు. ఇంకొందరు నచ్చినవి తింటూ కులుకుతారు. కొందరు చదువుతూ కులుకుతుంటారు. నేనేమో నా బ్లాగువల్ల కులుకుతున్నాను. ఎంత కులుకంటే… నా కళ్ళు ఎప్పుడో నెత్తిమీదికి చేరిపోయాయి. ఈ పదిహేను నెలల బ్లాగు ప్రయాణంలో వందకు దాటి పరిచయ వ్యాసాలు, ఐదు వందలకు దాటి కామెంట్లు, వీటికి మించి సాహితీ ప్రపంచంలో నేను నోరు తెరుచుకుని, కళ్లు చిట్లించుకుని చూసే పెద్దపెద్ద తలకాయల్తో పరిచయాలు… అహాహా నా కులుకుకు లెక్కలేకపోతుంటే… ఇంతలో నాకెంతో నచ్చే హెచ్చార్కె సార్ ఊసులు ఈ వారం చదువు ముచ్చట్లుగా నా బ్లాగు మిత్రులకు అందజేస్తుంటే…. ఎలాగుందో మీకెవరికైనా తెలుసా…. నా కులుకు కైపు, నిషాల సంగతి తర్వాత… ముందు హెచ్చార్కె చదువు ముచ్చట్లు వినండి మరి….

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)   

సాధారణంగా ఆ సంగతి మొదట్లోనే తెలిసిపోతుంది. ఆపేస్తాం. కనుక, ఒక పుస్తకం ‘ఎందుకు చదివానురా బాబూ’ అనిపించడం వుండదు. మొదట్లో ప్రామిసింగ్‍గా వుండి తరువాత బోరు కొట్టించే పుస్తకాలతోనే తంటా. గుర్తున్న మేరకు నా అనుభవంలో అలాంటి పుస్తకం రాణి శివశంకర శర్మ గారి ‘లాస్ట్ బ్రాహ్మిన్’. ఆ పుస్తకం నాతో కొనిపించినందుకు సౌదాకు ఫోన్ చేసి, నిరసన తెలియజేశాను J. అరుణ గారి ‘ఎల్లి’ వంటి గొప్ప నవలతో పాటు ఈ పుస్తకం కొని, అదే రోజుల్లో చదవడంతో మరీ బాధేసింది.  ‘లాస్ట్ బ్రాహ్మిన్’ బ్రాహ్మణ జీవితాన్ని హృద్యంగా చెబుతూ మొదలవుతుంది. చాల తొందర్లోనే మోసం చేస్తుంది. రచయిత తనది కాని, తనకు తెలియని అస్తిత్వాల మీద తిట్లు, మెచ్చికోళ్ల స్థాయికి దిగజారడం వల్ల పుస్తకం బోరు కొట్టిస్తుంది.  అస్తిత్వ పరంగా చూస్తే… ఆత్మ స్తుతి (కొండొకచో నిందా స్తుతి), పర నింద (కొండొకచో సెలెక్టివ్ ప్యాట్రనైజేషన్) కూడా దర్శనమిచ్చి కోపం తెప్పిస్తాయి.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

మితృడు బల‍రాం పుస్తకాల షాపు (మాయి బుక్స్) మూసేస్తుంటే, తన ఇంటికి వెళ్లి కొన్ని మంచి పుస్తకాలు కొన్నాం. అందులో మార్క్వెజ్‍ ‘లివింగ్‍ టు టెల్‍ ది టేల్‍’ బాగా నచ్చింది. ఒక భావుకుడిగా, జర్నలిస్టుగా, రచయితగా మార్క్వెజ్‍ పడిన తపన, ఫీలయిన బాధ్యత, కథాకథనంలో మెలకువలు గొప్పగా వున్నాయి. పుస్తకం చదివే ఆనందంతో పాటు ఒక మనిషిగా ఆత్మవిశ్వాసం పెంచుకోడానికి అది నాకు చాల వుపయోగపడింది. ‘హండ్రెడ్ ఇయ‍ర్స్ అఫ్ సాలిట్యూడ్’ అనే మహా కావ్యం వెనుక ‘అసలు కథ’ను రీట్రేస్ చేయడం, అందులో పాఠకులుగా మనమూ పాల్గొనడం అదనపు ఆనందం. స్వయంగా మార్క్వెజ్‍ అన్నట్లు, రాయడానికి వున్న ట్రిక్కులన్నట్లోకీ గొప్ప ట్రిక్కు ‘నిజం చెప్పడమే’నని ఆ రెండు పుస్తకాలు కలిసి నిరూపిస్తాయి.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

‘లైబ్రరీ’ మరీ పెద్ద మాట, మరీ పెద్ద కోరిక. నా పగటి కల, లైబ్రరీ మనదే అయితే, ఎంచక్కా ‘ఒక చేత్తో సిగరెట్‍ మరొక చేత్తో పుస్తకం’ భలే బాగుంటుంది. ఇంట్లో పుస్తకాలు… ఫరవా లేదు, బాగానే వున్నాయి. చిన్న ఇల్లు. స్థలం చాలదని రెండు మూడు సార్లు నిజామాబాదులో, సత్తుపల్లిలో జె.సి.ఎస్. ప్రసాదు, బత్తుల వెంకటేశ్వర రావు పేరిట నడిచే గ్రంథాలయాలకు, పొద్దుటూరులో అటువంటి మరో లైబ్రరీకి అప్పటికి వున్న పుస్తకాల్లో చాల మటుకు ఇచ్చేశాం. ఇలాంటి లైబ్రరీలు హైదరాబాదులో, అన్ని వూళ్లలో మరిన్ని వుంటే బాగుంటుంది. అక్కడే నలుగురు కలుసుకుని పుస్తకాల గురించి మాట్లాడుకోడం, రాసిన కవిత్వం, కథలు చదువుకోడం జరిగితే చాల బాగుంటుంది! (అక్కడే ఎవరైనా టీ స్పాన్సర్ చేసి, దాన్ని వ్యాపారాత్మకంగా వుపయోగించుకున్నా తప్పేం లేదనుకుంటా). ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోలేం గాని, ప్రత్యామ్నాయ సంస్కృతి అనీ మరొకటనీ ఏమేమో మాట్లాడుతుంటామని… నాతో సహా… మనందరి మీద కోపం. (వింటున్నారా, గుడిపాటి గారూ!)

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

తెలుగులో ఆనాటి కవిత్వం… వేదుల తదితరులు రాసిన పుస్తకాలు ఎన్ని వీలయితే అన్ని చదవాలని చాల ఇష్టంగా వుంది. మితృలను అడగడం, వాళ్లు వున్నాయి, కాస్త అటక మీంచి తీయాల్సుందని అనడం, ఆ పని ఒక పట్టాన కుదరకపోవడం జరుగుతోంది. (తెలుగెమ్మే చదివానని పేరే గాని, అప్పుడు ‘పోస్టరేసి పోస్టరేసి జిమ్మె వాయె’ గాని, అలాంటి మంచి/అవసరమైన పుస్తకాలు సంపాదించి చదవడం కుదర లేదు.) మహా భారతం (తెలుగు మేరకైనా) ఆసాంతం ఎంజాయ్ చేయాలని వుంది. టి.టి.డి. వారి పుణ్యమా అని అన్ని పర్వాలు సంపాదించి, ఆది పర్వం ఆదిలో వుండగానే, వూరిడిసి వచ్చాను. ఇంటికి వెళ్లగానే పారాయణం అంటారే అలా చదవాలనుకుంటున్నా. మన భారతం వంటి ఇతిహాసం, ఆ స్థాయిది, మరే జాతికి లేదని నాకొక మూఢ నమ్మకం వుంది. నమ్మకం మూఢమో వాస్తవికమో తేల్చుకోడానికైనా వీలయినంత త్వరగా శ్రద్ధగా చదవాలి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

చాల మంది తెలుగు వాళ్ల అభిరుచే నాది కూడా. శ్రీ శ్రీ, రంగనాయకమ్మ , జాక్‍ లండన్, హెమింగ్వే, మార్క్వెజ్‍ అంటే చాల ఇష్టం. 1) మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి, అనంతం, 2) బలిపీఠం, ఇదే నా న్యాయం, 3) కాల్‍ అఫ్ ది వైల్డ్, వైట్‍ ఫ్యాంగ్, సీ ఉల్ఫ్, 3) ‘ఫార్ హూమ్ ది బెల్ టోల్స్’‍, ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. జాక్‍ లండన్ కథలంటే ప్రాణం. ‘కాల్‍ అఫ్ ది వైల్డ్’ చదువుతుంటే బక్ అనేది ఒక కుక్క అని నాకు అనిపించలేదు. అది మనిషనీ, నేనే అనీ అనిపించింది. కుక్కతో మాట్లాడించడం లాంటి పనులేమయినా చేశారా అంటే అదీ లేదు. దాదాపు ఎక్కడా జంతు సహజాతాల (ఇన్‍ స్టింక్ట్స్) పరిధి దాటకుండానే ఆ ఎఫెక్ట్ సాధించా‍డు రచయిత. హెమింగ్వే ‘కిల్లర్స్’, ‘స్నోస్ అఫ్ కిలిమంజారో’. మరి కొన్ని కథలు కూడా గొప్ప ఆనందమిచ్చాయి; లండన్ కథల్లో మాదిరి పాత్రలతో ఐడెంటిఫై కాకపోయినా. ‍

తెలుగు కవిత్వంలో ఇప్పటికీ ‘నమోశివాఇ’. నగ్నముని, మోహనప్రసాద్, శివారెడ్డి, వరవరరావు, ఇస్మాయిల్‍ కవిత్వం చదువుకోడం ఇష్టం.

(మనస్సు అసలేమీ బాగో లేనప్పుడు మా పవన్ గాడి దగ్గరో, జాహ్నవి దగ్గరో తెచ్చుకున్న క్రైమ్ థ్రిల్లర్లు ఎలాగూ వున్నాయి (రంగనాయకమ్మ గారు నా క్షుద్ర పాఠకత్వానికి కోప్పడినా). చిన్నప్పుడు మద్రాసు ఎం.వి.ఎస్. పబ్లికేషన్స్ , ఆధునిక గ్రంథమాల వాళ్లు ప్రచురించిన కృష్ణమోహన్, వి. ఎస్. చెన్నూరి, కొమ్మూరి సాంబశివరావు తరహా పేపర్ బ్యాక్స్ ఇప్పుడు లేకపోవడం బాగో లేదు. పాపం, మధుబాబు ఒక్కరే ఆ కర్తవ్యం నెరవేరుస్తున్నట్లున్నారిప్పడు J)

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

బహుమతిగా అనడం కుదరదేమో. అమెరికాకు వస్తూ ఒకరిద్దరు మితృలకు వాళ్లు అడిగిన నాలుగైదు పుస్తకాలు తెచ్చి ఇచ్చాను. మితృలు సాకం నాగరాజ మాకు ప్రేమగా పంపిన మంచి పుస్తకాలు నిజంగా గొప్పగా వున్నాయి, నామిని ‘విస్తరాకు’ సహా.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

‘ఇండియా టు డే’ (తెలుగు) కొన్న తరువాత దాదాపు సాంతం ఇష్టంగా చదువుతాను. ఇంగ్లిష్ లో ఫ్రంట్‍ లైన్ బాగుంటుంది. సాహిత్యం అయితే… ‘ఆంధ్ర జ్యోతి’ ‘వివిధ’లో వ్యాసాలూ కవితలు, సండే మ్యాగ్‍ లో కథలు, ‘వార్త’ సండే మ్యాగ్‍లో సాహిత్య వ్యాసాలు, కథలు, కవితలు నాకు బాగుంటున్నాయి. సాక్షి సాహిత్యం పేజీ కూడా బాగుంటోంది. సాక్షిలో ఉన్నట్టుండి గాలిబ్‍-మార్క్స్ వుత్తరాలు వేయడం వంటి అరుదైన పనులు జరుగుతుంటాయి. మిగిలినవి… నవ్య, రచన వంటివి… చూడడం నాకు కుదరడం లేదు. ఇటీవల ‘చినుకు’ చాల బాగుంటోంది. ఒక బులెటిన్ స్థాయి పత్రికను అంత సీరియస్‍ గా, వుపయోగకరంగా, చదివించేట్టుగా నడపడం గొప్ప విషయం. విశ్వేశ్వర రావు గారు ‘కవితా’ పేరుతో చాల మంచి ప్రయత్నం మొదలెట్టారు. నేను రెండు సంచికలే చూడగలిగాను. ఆ రెండు సంచికలను మో, ఖాదర్‍ బాగా ఎడిట్‍ చేశారు. (ఇలాంటివి ఆన్లైన్ లో దొరికేట్టుంటే బాగుంటుంది. విదేశాల్లో వున్న వాళ్లకు ‘వూళ్లో’ వున్న ఫీలింగ్‍ ఇవ్వగలుగుతాయవి.) సృజన మళ్లీ, అప్పటంత బాగా వస్తే బాగుణ్ను. వి వి అనుకుంటే అది సాధ్యమే. అవసరం కూడా. కవిత/కథ పంపితే అచ్చుకు ముందే ఒక అందమైన వుత్తరం వి వి నుంచి, వావ్. అలాంటి అట్మాస్ఫియర్ లేకుంటే, అన్ని తరాల్లోనూ వుండే నా లాంటి ‘లావారిస్’లకు ఎలా సార్! 

….ఇక మెచ్చని పత్రిక అంటారా… ‘నాకయితే కాకవులే కానరారు సిరి సిరి మువ్వా’ J

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

“ఒక దళారీ పశ్చాత్తాపం’.  ఇందులో ఏముందబ్బా అనిపించింది నాకు. నిజానికి చివర్లో కాస్త పుస్తకం చదవడం వదిలేశాను.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

రెండు పుస్తకాలు చదువుతున్నాను. ఒకటి… ‘కళా ప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర’. వచనం చాల రమణీయంగా వుంది. మానవ సంబంధాల విషయంలో పుస్తకం కలిగించే నులివెచ్చని ఫీలింగ్స్ ఆయన మంచి మనస్సుకు అద్దం పడతాయి. ఆయన గురించి ముందస్తుగా‍ నాకేమీ తెలియదు. పుస్తకం చదువుతుంటే, చాల మంచి మనిషి అయివుంటారని బలంగా అనిపించింది. రెండవది… పాబ్లో నెరూడా పద్యాలు, ‘ది పొయెట్రీ అఫ్ పాబ్లో నెరూడా’ చదువుతున్నాను. అందులో ఇప్పటికిప్పుడు ‘ది హైట్స్ అఫ్ మఛూ పిఛూ’ చదువుతున్నా. చిన్నపిల్లవాడు ఒక జెయింట్ ను చూస్తున్నప్పుడు కలిగే అనుభూతికి లోనవుతున్నా. వాస్తవికత పునాది మీద ఊహా లోక విహారం, అందులోనూ మనిషి మీద మమకారం… నిజంగా అద్భుతం. పాబ్లో! నేన్నిన్ను ప్రేమిస్తున్నా.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

బాగా చిన్నప్పుడు హైస్కూల్‍ దశలో మహా ప్రస్థానం, కృష్ణ పక్షం;  ప్రీ యూనివర్సిటీ కోర్స్ సమయంలో రంగనాయకమ్మ గారి ‘ఇదే నా న్యాయం’,‍ ఆ తరువాత, శ్రీ శ్రీ అనువదించిన ఏంజిలా కాట్రోచ్చి రచన ‘రెక్క విప్పిన రెవల్యూషన్’. వీటితో పాటు ఆ రోజుల్లో చదివినది… టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్ లు ‘గతి తార్కిక భౌతిక వాదా’న్ని పరిచయం చేస్తూ రాసిన పుస్తకం తెలుగు అనువాదం (అనువాదం చాల బాగా వుండిందని జ్ఙాపకం). అవి మనిషిగా, రచయితగా నన్ను ప్రభావితం చేశాయి. ఇటీవల బాగా ఇష్టపడిన పుస్తకాలు జాక్ లండన్ ‘సౌత్ సీ టేల్స్’,  కల్యాణ రావు ‘అంటరాని వసంతం’, మార్షల్‍ బెర్మాన్ ‘అడ్వెంచర్స్ అఫ్ మార్క్సిజం’.  బెర్మాన్ రచన… మనం మార్క్సిస్టుల కార్యాచరణ గురించి ఏమనుకున్నా, మార్క్సిజం లోని సౌందర్యాన్ని వదులుకోనక్కర్లేదని భరోసా ఇస్తుంది. మిగిలిపోయే ప్రశ్నలకు జవాబులు వెదుక్కోడానికి ప్రోత్సాహమిస్తుంది (వాటిని ప్రశ్నలుగా బతకనిస్తుంది).

ప్రకటనలు

14 responses »

 1. HRK.. you are so sweet. Why because you are a learned child. Interview is very warm and interesting. I would like to ask one more question: What would “chinna chinna ghatanala” hrk ask if he happen to interview Mr. Abaddam?

   • రెండ్నిమిషాలు భారంగా..

    తూనిక రాళ్ళు మోసుకుంటూ తిరిగేవాడి చూపు ఎప్పుడూ
    ముల్లు మీదే ఉంటుంది-
    చూసి చూసీ చూపు కొసబారి పొతుంది
    మోసి మోసీ పిడికిలి బండబారి పోతుంది-

    తూనిక రాళ్ళు మాత్రమే మోసుకుంటూ తిరిగేవాడు
    చివరకు.. ఓ తూనిక రాయిలా మారిపొతాడు ..
    అది తట్టు రాయిలా దారి కాచి మరీ తగిలి..
    చిట్లిపొయే కాలి బొటన వేళ్ళను చూసి
    పలకలు పలకలుగా నవ్వుకుంటుంది-
    రక్తపు మరకల వీర తిలకాలతో విర్రవేగుతుంటుంది-
    మట్టిని చీల్చుకు వచ్చిన పచ్చదనంపై విచ్చిన కెంజాయ రంగుల్ని
    తల పైకెత్తి చూడలేక.. వేర్ల కోసం కలుగులు తవ్వుకుంటూ పోతుంది
    చరిత్ర శిథిలాల కిందో నిర్మాణాల కిందో కసిగా కదులుతూ
    చీకటిని కోకతి వేళ్ళతో పెకలించలని అవస్థ పడుతుంది

    వెలుతురులో చీకటిని వెతికే వాడి మెలకువ్ ఏ స్వప్నాన్నీ రచించదు
    వేర్ల శాఖోప శాఖల మధ్య అల్లుకున్న సాలెగూడు
    ఏ చిగురునూ పుట్టించదు

    ఏదేమైనా.. తూనిక రళ్ళను మోసుకుంటూ తిరిగేవాడొకడు కావాల్సిందే
    కాని, వాడు తూనికకు బదులుగా రళ్ళను కాకుండా ఇంకేమైనా ఇవ్వగలగాలి
    తూచలేని తనాన్ని ప్రేమించగలగాలి..
    తూనిక రాళ్ళను మాత్రమే మోసుకుంటూ తిరిగేవాడి వద్ద వాటికి జాగా మిగలదు..

    ఎన్ని చెప్పినా..
    తూనిక రాళ్ళను మోసుకుంటూ తిరిగేవాడ్ని ప్రేమించేంతగా ద్వేషించలేం..
    ద్వేషించేంతగా ప్రేమించలేం..
    అలాగని.. నిషేధించనూలేం-

    అందుకే…
    తూనిక రళ్ళను మోస్తూ తిరిగేవాడు
    తనలో ఓ తూనీగను దాచుకొవాలని మరచిపోకూడదు..
    ఆ తూనీగ చేతిలో ఓ తూనిక రాయిలా ఓయలూగదం మానకూడదు..
    ఎందుకంటే..
    తూనిక రళ్ళు మోసుకుంటూ తిరిగెవాడు
    తూనిక రాయిగా మారడం విషాదాల్లోకెల్లా విషాదం-

    — శ్రీధర్ బాబు పసునూరు

 2. హెచ్చార్కె అభిమాన రచయిత జాక్ లండన్ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా “వైట్ ఫాంగ్” ఈ మధ్యనే స్టార్ మూవీస్ లో చూశాను. నవల ఎలా రాసివుంటాడా అని చదవాలని కోరిక కలిగింది. ఇప్పుడు మళ్లీ సార్ గుర్తు చేశారు.

 3. అయ్యో, “మాయి” బుక్స్ మూసేసారా. నేను కొన్ని మంచి పుస్తకాలు తెచ్చుకున్నానక్కడ. “వ్లదీమర్ నబొకొవ్ కలెక్టెడ్‌స్టోరీస్” వాటిలో ఒకటి. బలరాం గారికి పుస్తకాల గురించి బాగా తెలుసు. మన అభిరుచికి తగినవి సజెస్ట్ చేయగలరు కూడా.

 4. నిజంగా, భలే ఐడియా, శ్రీధర్‍! రెండు పుస్తకాలు పరస్పరం తారసపడితే ఏం మాట్లాడుకుంటాయి (రెండింటి మీద సంతకం ఒక్కటే అయినా)? ఒక పుస్తకం మరో పుస్తకాన్ని ఏమడుగుతుంది? వాటి మధ్య మాటలు ఎలా నడుస్తాయి? రెండింటి మధ్య పూర్తి అంగీకారం వుండి వుంటే రెండు వేర్వేరు పుస్తకాలే వుండేవి కాదు గనుక, ఒక పుస్తకం మరొక పుస్తకాన్ని అడిగే ప్రశ్నలు తప్పకుండా వుంటాయి. బహుశా, మొట్టమొదట, తమను జిడ్డులా అంటుకుని వదలని సంతకాన్ని బాగా ఆడిపోసుకుంటాయనుకుంటా.

  • In a lighter vein HRK cleverly referred to ‘Death of the Author’. HRK seems to be possessive of his writings (for that matter any writer is so). But, at his core, HRK dreams to pen poems sans authorship, or Authorship. In my personal opinion, HRK would have been a better writer, if his roots were not in dogmatic left camps.

 5. I think HRK would have been a better writer if he was not constructing his words in the midst of clouds of cigarette smoke. 🙂

  Naresh, these days I am hearing so much about the link between a “Better Writer” and “Dogmatic Left Camps”, to the extent that that link is beginning to be used as a postmodern cliche. However I fail to understand in what sense those two subjects are linked. Are you saying just because of his roots (I wonder why you think his roots do not go deeper than the dogmatic left camps)his is not a better writer? aahem.. are you suggesting HRK is not a better writer? 🙂

 6. నరేష్, ‘డెత్‍ అఫ్‍ ది ఆథర్‍’ విషయమై మీ అబ్జర్వేషన్ నిజమే. వాస్తవికత, కల రెండింటి విషయంలో అది నిజమేనని ఒప్పేసుకుంటున్నా. ఇక ‘డాగ్మటిక్‍ లెఫ్ట్’ సంగతి. ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అని చెప్పడానికి ఒక కాలు నరికి మరీ చూపించే ‘పిడివాదం’ (డాగ్మటిజం‍) ఎప్పుడూ హానికరమే. (కుందేళ్లకే కాదు, వేటగాళ్లకు కూడా హానికరమే). అది చెప్పడానికి, దేవతా వస్త్రాల కథలో రాజుగారు బట్టలేసుకోలేదని చెప్పిన పిల్లాడిలా, కవి ఎప్పుడూ మెలకువగా వుండవలసిందే. కాకపోతే, పిడివాదం ‘లెఫ్ట్’కు పరిమితం కాదు. లెఫ్ట్, రైట్‍, సెంటర్‍ అన్నిట్లో వుంటుంది. దాన్ని విమర్శిస్తున్నట్లు కనిపించే వాళ్లలో కూడా వుంటుంది. దాన్ని లెఫ్ట్ కు పరిమితం చేయడంలో వున్న పిడివాం మరీ ప్రమాదకరం. అది ఎక్కడున్నా సృజనాత్మకతకు, ప్రత్యామ్నాయ ఆలోచనలకు, డెమోక్రసీకి నష్టకరంగానే వుంటుంది. 2+2-4 వంటి డాగ్మాలు లేకుండా పని నడవదు, జీవితం గడవదు. జీవిస్తూనే, భిన్నంగా (కూడా) ఆలోచించడం సరైనదని అనుకుంటాను. మమతా! బెటర్‍ రైటర్‍ అనేది తులనాత్మకమైన మాట. ఇంతకంటే బాగా వుండాలని అందరి గురించి అందరం ఆశిస్తాం. Not only hrk, nobody can be ‘better’ than what he ‘is’. He/She can/must aspire to be.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s