కథన కుతూహలుడి కావ్య రేఖలు

సాధారణం

velugurekhaluకొంతమంది పెద్ద రచయితలు వర్ధమాన రచయితలకు ప్రక్రియ విషయంలో ఒక ఉచిత సలహా పారేస్తుంటారు – ఏదో ఒక ప్రక్రియలోనే చక్కటి కృషి చెయ్యమని. అదృష్టవశాత్తూ సాహిత్య అధ్యయనం విషయంలో మాత్రం అన్ని ప్రక్రియల సాహిత్యాన్ని చదవమంటారు. (సాహిత్య రంగానికి భిన్నంగా ఆర్థిక రంగంలో గుడ్లన్నీ ఒకే పొదుగు కింద పెట్టొద్దని అంటుంటారు. వీలైనన్ని ఎక్కువ వ్యాపార నిర్వహణలను సంపద పెరుగుతున్న కొద్దీ చూడమంటారు – విచిత్రంగా). కానీ విస్తృతంగా అధ్యయనం చేస్తున్నరచయితలకు, పాఠకులకు మాత్రం క్రమంగా ఈ విషయం తెలిసొస్తుంది – జీవితాన్ని, జీవిత సారాన్ని, జీవిత చలనసూత్రాలను ఒడిసిపట్టిన సృజనశీలురందరూ అనేక సాహిత్య ప్రక్రియలలో ఏకకాలంలోనే కృషి చేశారని. తెలుగు సాహిత్యంలోనూ ఇలాంటి రచయితలు రాశిలో తక్కువైనా వాశిలో శ్రేష్టమైన వారున్నారు. అలాంటి వారిలో శీలా వీర్రాజు ఒకరు. కథ, కవిత్వం, నవల, వ్యాసం, విమర్శ, అనువాద ప్రక్రియలతో పాటు చిత్రలేఖనం, సంగీత రంగాలలో కృషి కొనసాగిస్తూ వస్తోన్న శీలా వీర్రాజు సమగ్ర సాహిత్య అధ్యయనం జరగాల్సి వుంది.

నూనూగు మీసాల లేలేత ప్రాయం పద్దెనిమిదేళ్ల వయసులో శీలా వీర్రాజు నవల రాశారంటే నమ్మడం కష్టమేమీ కాదుగానీ, 1957లో ప్రజామత వారపత్రికలో ప్రచురితమైన “బ్రతుకుబాట” సీరియల్ ను 1961లో “వెలుగు రేఖలు” పేరుతో ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ ప్రచురించిన నవలను చదివినప్పుడు మాత్రం దిగ్భ్రమకు గురికాక తప్పం. సరిగ్గా అర్థ శతాబ్ది తర్వాత అదే నవలను “బతుకుబాట” నవలా కథన కావ్యంగా తిరగరాసి ప్రచురించారు. ఆ నవలనూ, కావ్యంగా మారిన నవలాకథనకావ్యాన్నీ పరిశీలించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

రెండు పదులు నిండని వయసులో రచయిత రాసిన నవలంటేనే ఆ ఈడుకు సహజంగా వుండే ఈడేరని కోరికలు స్వైరకల్పనలుగా ఎదిగి మన నరాలని జివ్వుమనిపిస్తాయనుకోవడం సహజం. దీనికి పూర్తి భిన్నంగా శీలా వీర్రాజు తన “వెలుగు రేఖలు” నవలను రచించారు. పరిణతి చెందిన వ్యక్తిలాగానే కాక, చేయి తిరిగిన రచయితలాగా కూడా కథనాన్ని, సంభాషణలను నడిపించారు. ఎలాంటి వయసు ప్రలోభాలకు లోనుకాకుండా, లొంగకుండా సూటిగా, స్పష్టంగా, ఎక్కడా తప్పులు ఎంచలేని రీతిలో కథ చెప్పేశారు. కథన విధానం, కథా సంవిధానంలోకి వెళ్లేముందర కథనొక్కసారి పరిశీలిద్దాం.

సుందర్రావు దురదృష్ట జాతకుడు. బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని చెల్లి వేణితో తమకేమీకాని సీతమ్మనే ధర్మాత్మురాలి పంచన చేరుతాడు. తన కూతురు మీనా, పెంపుడు పిల్లలు వేణి, సుందర్రావులు వేరుకాదన్నట్టుగా సీతమ్మ పెంచి పెద్దచేస్తుంది. డిగ్రీ పాసైన సుందర్రావు ఒకరోజెవరికీ చెప్పా పెట్టకుండా సైన్యంలో చేరిపోతాడు. కానీ యుద్ధంలో కుడిచేయి పోగొట్టుకుని తిరిగి ఇంటికి చేరుతాడు. బాబాయి మరణించగా ఇంటి భారాన్నంతా సీతమ్మే భరించడం చూసి ఆవేదన చెందుతాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు మూగగా ఆరాధించిన శారదను చూద్దామని వెళితే ఆమె భర్త చనిపోయాడని తెలిసి కుంగిపోతాడు. కుడి చెయ్యిలేని సుందర్రావును ఆదుకోవాలని స్నేహితురాలు శారద తలచి మీనాకు ఉద్యోగమిప్పిస్తుంది. స్నేహమూర్తి శారద సుందర్రావు సాయంతో స్త్రీ సంక్షేమ సంఘాన్ని స్థాపిస్తుంది. వేణి పెళ్ళికి సాయం చేస్తుంది. సుందర్రావుకు మంచి సంబంధం వెతుకుతుండగా అతడికది నచ్చక యాత్రలకని బయలుదేరుతాడు. ఆ యాత్రా విహారంలోనే రియలైజ్ అవుతాడు. ఉత్సాహంగా ఇంటికి చేరుకుంటాడు – పెళ్లికి సిద్ధమై. కథగా చూస్తే ఇంతే.

ఈ నవల పాత్ర చిత్రణలో మనం గమనించాల్సింది ఇందులోని అన్ని పాత్రలూ నిండైన మూర్తులు కావడం. ఏవీ బోలు పాత్రలు కావు. ప్రతి పాత్రా ప్రధాన కథను ముందుకు నడిపించడానికి ఉపకరిస్తూ సాగుతుంది. అనవసరమైందంటూ ఏమీ లేదు. ముఖ్య కథా గమనానికి ఉపకరించక పోయినట్లయితే ఆ పాత్ర అసలు రానేరాదు. ఉదాహరణకు సుందర్రావును పెంచిన బాబాయి మనకెక్కడా కనిపించడు. కేవలం సూచ్యం. మన ప్రేమను, అభిమానాన్ని, కృతజ్ఞతను సీతమ్మ పిన్నికే అందిస్తాం. పేదరికం తెచ్చిన జబ్బువల్ల ఆమె మరణించినపుడు మనమూ దుఖిస్తాం. వేణి భర్త పరంధామయ్య, శారద స్నేహితురాలైన సుందరి భర్త మనకసలు పరిచయమే కారు. ఇదే రీతిలో మీనా, శారద పనిమనిషి మనముందు ఎంతసేపుండాలో అంతసేపే వుంటారు. అంత పకడ్బందీగా పాత్రల చిత్రణ చేయడం చేయి తిరిగిన రచయితలకే చెల్లింది. కాని పద్దెనిమిదేళ్ల శీలా వీర్రాజు ఆ ప్రతిభను సమర్ధంగా కనపరిచారు. సంభాషణలు నడిపించిన తీరూ అంతే. వేణి బాధ్యతలు మీద వేసుకుని పెద్దరికంతో ఆరిందాలాగా మాట్లాడుతుంది. బాధ్యతలు ఎరిగి, సాహిత్య అధ్యయనం అలవాటున్న శారద, సుందర్రావుల మాట తీరు తక్కువ పదాలతో ఎక్కువ అర్థమిచ్చేట్టుగా వుంటుంది. బిడియస్తుడు మోహనరావు మాటలు కూడా అతడి స్వభావానికి తగినట్టుగానే వుంటాయి.

తన పెళ్లి కుదిరిందని చెప్పడానికి వెళ్లినప్పుడు మాత్రమే సుందర్రావు మనసును శారద తెలుకుంటుంది – అదీ అన్యాపదేశంగా. కానీ అప్పటికే పెళ్లిమాట పిడుగుపాటు లాంటిదే. ఆ షాక్ నుండి తేరుకుని శారద దంపతులతో ఎంతో కలుపుగోలుగా, స్నేహంగా మసిలాడు. యుద్ధంలో చెయ్యి పోగొట్టుకుని ఇంటికి చేరిన సుందర్రావుకు శారద తన పెనిమిటిని కోల్పోయిందన్న సంగతి తెలిశాక నిజంగానే ఎంతో వ్యధ చెందుతాడు. అక్కణ్ణించి శారదకు స్నేహితుడిగానే వ్యవహరిస్తాడు. ఆమెను ఎప్పటికైనా సొంతం చేసుకుందామన్న ఆలోచన కూడా రానివ్వడు. తనవల్లనే సుందర్రావు జీవితం మోడువారిన చెట్టులాగా తయారయ్యిందని శారదకు ఆత్మన్యూనత. అందుకే సుందర్రావు జీవితాన్ని ఎలాగైనా సరిదిద్దాలని ఆమె తాపత్రయం. అతడి కోసం మంచి సంబంధం వెతుకుతుంది.

రచయిత సుందర్రావును ప్రధాన పాత్రగా చేసుకుని కథ చెప్పినా ఇందులోని స్త్రీ పాత్రలే మన హృదయాలను గెలుచుకుంటాయి. మానవత్వానికి మరో రూపంగా నిలిచిన సీతమ్మ ‘తన కుటుంబపు’ జ్యోతిని వెలిగించడానికి తాను కొవ్వొత్తిలా కరిగిపోతుంది. అలాగే వేణి కూడా అమాయకురాలు. చెల్లి మీనా స్వచ్ఛమైన మనసును సంతృప్తపరచడానికి తన ప్రేమను త్యాగం చేసుకుని, రెండో పెళ్లివానితో వివాహానికి సిద్ధమవుతుంది. దానికి ముందర తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఒంటరి అన్నయ్య జీవితంలో మరింక వెలుగులు పూయవని పెళ్లే వద్దనుకుంటుంది. శారద సుందర్రావులు అబద్దమాడి ఆమెను వివాహానికి అంగీకరింప జేస్తారు. అలా వేణి కూడా మన మన్ననలను పొందుతుంది. ఇక శారద పాత్ర సరేసరి. ఈ నవలలో ప్రధాన పాత్ర నిజానికి శారదదే. నవల కథనాన్ని సుందర్రావు పరంగా చెప్పినప్పటికీ రచయిత హృదయంలోని కీలక భూమిక వహించిన పాత్ర శారదదే. ఒకవైపు ఉత్తమ స్నేహశీలిగా, మరోవైపు సంఘ సంస్కర్తగా, ఇంకోవైపు బంధువులకు ఆత్మీయురాలిగా, మరింకోవైపు నిస్వార్థపరురాలైన శారద బహుముఖీన వ్యక్తిత్వంతో అలరారుతుంది.

ఇరవై ఒకటో శతాబ్దపు పాఠకునికి సుందర్రావు నిష్క్రియాపరత్వం చిరాకు తెప్పించినా అతడి మంచితనం, ఆలోచనల్లోని సూటిదనం, విధి కలిగించిన విపత్తులు సుందర్రావుపై సానుభూతి కురిపించేలా చేస్తాయి. ఒకవైపు సంఘ సంస్కరణ అభిలాష మెండుగా వున్న శారద మరోవైపు పెళ్లిలోనో లేదా ఏదోఒక ఆధారం దొరకడంలోనో జీవిత పరమార్థం ఇమిడి వుందనుకోవడం రచయిత అపరిణతి. కాని, రచనా సమయంనాటి కాలాన్ని, రచయిత వయసును దృష్టిలో పెట్టుకుని నవలంతా చదివినప్పుడు ఈ దోషం అసలు కనిపించదు సరికదా, నవలలో మరిన్ని కొత్త వెలుగులు గోచరిస్తాయి.

ఆ ప్రాయంలోనే రచయితకు బహుశా చిత్రలేఖనంలో అభినివేశం వుండివుండాలి. లేకపోతే నవలలో వర్ణనలు అలా సాగలేవు. ప్రదేశాన్నో, పరిస్థితినో వర్ణిస్తున్నపుడు ఒక్కో వాక్యమూ చదువుతున్న పాఠకుడికి ఒక మనోజ్ఞమైన దృశ్యం మనసులో రూపుకడుతుంది. అలాంటి ఒక దృశ్యంతోనే నవల ప్రారంభమవుతుంది. నిశ్చలమైన చెరువునీటిలోకి వంగి తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ రచయిత తన గతాన్ని తలచుకుంటుంటే కన్నీటి చుక్క జారిపడి ప్రతిబింబం చెదిరిపోతుంది. మొదటి పేరా చదవగానే పేజీలు, వాటిలోని అక్షరాలు మాయమైపోయి, సుందర్రావు అక్కడి వాతావరణంతో సహా మనముందు ప్రత్యక్షమవుతాడు. ఇది కేవలం చిత్రకారుడికే సాధ్యమైన కూసువిద్య.

కథానాయకుడి ఎస్కేపిస్టు ధోరణి, ప్రధాన పాత్ర పెళ్లికి మితిమీరిన ప్రాధాన్యత నివ్వడం వంటి అంశాలతో ముడిపడిన వస్తుపర విశ్లేషణను వదిలిపెట్టి, శైలీశిల్పం, కథా సంవిధానం, పాత్ర చిత్రణ వంటి విషయాలను పరిశీలించాం. శీలా వీర్రాజు ఈ నవల రాసిన ఐదు దశకాల తర్వాత ఇదే నవలను కవిత్వీకరించడానికి పూనుకున్నారు.

…ఆ “బతుకుబాట” నవలా కథన కావ్యం పరిచయం వచ్చేవారం…

ప్రకటనలు

3 responses »

  1. శీలావిని, ఆయన కొత్త పుస్తకాన్ని పరిచయం చేయడం చాల బాగుంది. రాసేవాళ్లు ఏదో ఒక ప్రక్రియకు పరిమితం కావాలనుకోడం ఏమంత మంచి ఆలోచన కాదనుకుంటాను. మనకున్న మంచి రచయితలు గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర, బైరాగి, తిలక్‍, విశ్వనాథ ఎవరూ అలా పరిమితం కాలేదు. పరిమితం కాకపోవడం వల్ల వాళ్లు నష్టపోయింది ఏమీ లేదు. అలా వాళ్లు పరిమితం అయివుంటే, మనం చాల నష్టపోయే వాళ్లం. ఆ మధ్య ఎవరి ఇంట్లోనో బుచ్చిబాబు కవిత్వం పుస్తకం దొరికితే చదివాను. ఎంత బాగున్నదో!
    శీలావి మాదిరి, సాహిత్య ప్రక్రియలలోనే కాకుండా బొమ్మలు వేయడం వంటి ఇతర కళా రూపాలలో కూడా కృషి చేసే వాళ్లు ఇవాళ ఇంకెవరైనా వున్నారా? అంతే కాదు, కుందుర్తి తరువాత కథాకావ్య ప్రక్రియను కొనసాగించడం శీలావి ప్రత్యేకత. అలాంటి రచయితను, ఆయన ఇటీవలి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రవికుమార్‍ను అభినందిస్తున్నాను. రవికుమార్‍ లేదా మరెవరైనా ఆయనతో ఆయన కృషి, అనుభవాల గురించి మాట్లాడిస్తే చాల వుపయోగకరంగా వుంటుంది.

  2. హెచ్చార్కెగారు,

    >>మన్నించాలి. ఇక్కడ పరిచయం చేసిన “వెలుగురేఖలు” నవల కొత్తది కాదు. చాలా పాతది. 1961లో ఆదర్శ గ్రంథ మండలి ప్రచురించింది. శీలావీ తర్వాత దానిని కొత్తగా ప్రచురించినట్టు లేదు. ఆయన కథలను విడివిడిగా సంపుటాలుగా వేశారు. కవిత్వాన్ని ఒక బృహత్ సంపుటంగా వేసారు. “మైనా” కూడా తిరిగి ప్రచురించారు. కానీ ఎందుకో “వెలుగురేఖలు” మాత్రం వదిలేశారు. లేకపోతే వేసిన సంగతి నాకు తెలీదా?

    >>ఆయనతో ఇంటర్వ్యూ అన్నది మంచి ఆలోచన. నేను ప్రయత్నించే కంటే ఆంధ్రజ్యోతి వారి నవ్యలో రచయితలతో ఇంటర్వ్యూలు చేస్తున్న అరుణ పప్పుగారిని రిక్వెస్ట్ చేస్తాను.

  3. 1961 సంగతి చెప్పి ‘సరిగ్గా అర్థ శతాబ్ది తరువాత’ అనే సరికి కన్ఫ్యూజ్‍ అయినట్లున్నాను. అయినా పరవా లేదు. జ్ఙాపకం చేయడం కూడా అభినందనీయమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s