కథన కుతూహలుడి కావ్యరేఖలు (రెండవ భాగం)

సాధారణం

batukubataమూలకథలో పాత్రలూ సంఘటనలలో పెద్దగా మార్పులేకుండా ఆధునిక కావ్యంగా ఈ నవలను శీలా వీర్రాజు మలిచారు. కవిత్వం కాబట్టి సంభాషణల్లో లయ కుదర్చడం వల్ల మరింత పదునుదేరాయి. పాత్రల మనస్తత్వంలో మరే మార్పూ లేదు. నవలలో లాగానే యాత్రలకని బయల్దేరిన సుందర్రావు ఎక్కడో చెరువు దగ్గర కూర్చుని తన జీవితంలోకి తొంగి చూసుకోవడంతో కావ్యం ఆరంభమవుతుంది. బతుకుకు అర్థం తగిన ఆధారం దొరకడంలో వుంటుందన్న రియలైజేషన్ తో కావ్యం ముగుస్తుంది. అంటే సుందర్రావు ఆలోచనల గొలుసులతో కవి మనల్ని కథలోకి పట్టుకెళ్లారు. ఆ ఆలోచనలు ఆధునిక అసందిగ్ధతకు లోనుకాకుండా సాఫీగా, సరళంగా సాగడంవల్ల పాఠకుడు ఎక్కడా గందరగోళానికి, అయోమయానికి గురికాడు. ఈ కావ్యం విజయంలో బహుశా ఇదే ప్రధాన రహస్యమనుకుంటా. ‘ఆధునిక’ అనే పేరు వినగానే ఇటీవల ఆందోళన కలుగుతోంది – ఎక్కడ విషయమేమీ అర్థం కాకుండా పోతుందేమోనని. కానీ శీలా వీర్రాజు కవిత్వంలో అస్పష్టతగానీ, డొంక తిరుగుడు గానీ ఏమీ వుండవు. పైగా బంగారు నగకు వజ్రాలు పొదిగినట్టు హృద్యమైన కథకు, నిండైన మూర్తిమత్వమున్న పాత్రలకు, చక్కటి పదచిత్రాల, భావనల కవిత్వం జోడైంది. చిత్రకారుడిగా తాను పరిశీలించిందంతా పాఠకుడికి చూపించే ప్రయత్నమొక్కటే కవి చేస్తే సరిపోదు. శీలా వీర్రాజు ప్రతి వాక్యం కథను మరికాస్త ముందుకు తీసుకెళ్లడాన్ని మనం గమనించాలి.

సైన్యంలో చేరాక సుందర్రావు ఇంటిగురించి గుబులు చెందుతాడు. ఇల్లంటే “తలుపులూ కిటికీలు నాలుగ్గోడల పెంకులపందిరి” కాదంటూనే అదొక “…మమతల కోవెల / అనుబంధాల చిక్కని కొమ్మల చల్లని నీడల చెట్టు / అభిమానాల తేనెసోనల చక్కని పూల పొదరిల్లు” (పే. 29) అంటూ ఇంకా చాలా చెప్తాడు. సైన్యంలో రోజులను జ్ఞాపకం చేసుకుంటూ బెంగాలీ సహచరుడిని ప్రస్తావిస్తారు. నవలలో అతడి జీవితపు తునకకూడా చెప్తారు. కావ్యంలో అదంతా “రక్తం మరకల రసి డాగుల బతుకు పుస్తకం” (పే. 30) అని పూర్తిగా సంక్షిప్తీకరించారు.

శుభలేఖ తీసుకొచ్చినపుడే సుందర్రావు అంతరంగంలోని తనపట్ల ప్రేమ శారదకు అర్థమవుతుంది. “అతని మంచితనానికి, మంచితనంలోని పిరికితనానికి” (పే. 36) ఆశ్చర్యపోతుంది. నవలలో ఏడో అధ్యాయం కావ్యంలో ఆరో ఖండికయింది. శారద స్థాపించిన స్త్రీ సంక్షేమ సమాజానికి చేరిన ఓ అభాగ్యురాలి గురించి వివరంగా చెప్పుకుపోతుంది నవలలో. కానీ కావ్యంలో నాలుగు మాటలే శారదచేత అనిపిస్తారు. అక్కడే మోహనరావు పాత్ర ప్రవేశిస్తుంది. నవలలో దాదాపు ఏడు పేజీలు సాగిన మోహనరావు విచక్షణ రహిత ఆవేశం, పిరికితనమే కాపాడిన వ్యక్తిత్వం కావ్యంలో అతి సంక్షిప్తీకరణ కావడమే కాక అతడి ఆలోచనల్లో వికృతత్వాన్ని సైతం బహిరంగపరచలేదు. (ఈ సన్నివేశాన్ని మాత్రం అరవై ఎనిమిదేళ్ల కవికంటే పద్దెనిమిదేళ్ల నవలాకారుడే చాకచక్యంగా నడిపించాడేమోననిపిస్తుంది.)

వేణికి పెళ్లి సంబంధం వెతకడానికి ఆమె అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఆమె అసలు పెళ్లే చేసుకోనని మొండికేస్తోంది. బాగా ఆలోచించిన సుందర్రావు ఒక దారుణమైన అబద్దమాడమని శారదను కోరుతాడు. శారద – సుందర్రావులు కలిసి వుండబోతున్నట్టు వేణికి చెప్పమని శారదను అభ్యర్ధిస్తాడు. వయసు పెరిగాక ఇందులో మతలబు గ్రహించిన శీలా వీర్రాజు కవిగా ఈ పొరపాటును దిద్దుకున్నారు. లోపల్లోపల కూడా సుందర్రావుకు ఇలాంటి కోరిక వుండనివ్వకూడదని శారదే తనకు తాను ఈ అబద్దం చెప్పడానికి నిశ్చయించుకున్నట్టు కావ్యంలో చిరుమార్పు చేశారు. చిన్నదే అయినా చాలా ముఖ్యమైన మార్పిది. నవలలో సుందర్రావు వ్యక్తిత్వానికున్న మచ్చను చెరిపేయడం. మరి శారద తప్పు చేసిందా అనే ప్రశ్న ఉదయించకుండా వుండడానికి ముందునుంచే అంటే వేణి -శారదల సంభాషణల నుంచే శారదలో బీజప్రాయంగా ఈ ఆలోచన రావడం పాఠకుడ్ని కన్విన్స్ చెయ్యడానికే. కాని ‘మళ్లీ పెళ్లి’ విషయంలో శారద ఆలోచనలు మోహనరావు సంగతిలో స్పష్టంగా అగుపడతాయి. “చిటికడంత భరోసా పిడికెడంత ధైర్యాన్నిస్తుంది / చిగురంత ఆశ గుబురంత బలాన్నిస్తుంది / చినుకంత సాయం చెరువంత సంతోషాన్నిస్తుంది?” (పే. 78) అనడం శారద ఆలోచనల పట్ల పాఠకుడికి ఊతం ఇవ్వడానికే కవి సంధించిన కవితాస్త్రాలు.

శారద తన చిన్ననాటి స్నేహితురాలు సుందరిని కలిసినప్పుడు శుద్ధమైన, సరళమైన కవిత్వంలో వారిద్దరి మధ్యా అనుబంధాన్ని కవి వర్ణిస్తారు. ఇద్దరూ మాటల ప్రపంచంలో మునిగిపోయినప్పుడు “వాళ్ల మధ్య / సంతోషం తుళ్లింది విషాదం పరుచుకుంది / నవ్వులు చిందాయి కన్నీళ్లు వొలికాయి...” అంతే కాకుండా “ వాళ్ల చుట్టూ / బాల్యం సీతాకోక చిలుకై ఎగిరింది / వర్తమానం పావురమై కువకువలాడి తిరిగింది / భవిష్యత్తు కోకిలై కంఠమెత్తి పాడింది / ఆరోజు ఆకలి ఏమైందో జాడేలేదు!  / నిద్ర ఎటుపోయిందో పత్తా లేదు!” (పే. 92) ఎన్ని సంభాషణలు, ఎన్ని సంఘటనలు, ఎన్ని పేరాగ్రాఫులు వర్ణించగలవు – ఇంత అందంగా? ఒక్కో పదచిత్రం చాలు మనం ఆనందించడానికి. భావస్పోరకమై ఆ పాత్రలతో సహానుభూతం చెందడానికి.

శారద స్థాపించిన స్త్రీ సమాజం వార్షికోత్సవానికి, హాజరైన మోహనరావుకు వేణి, మీనలిద్దరూ దగ్గరవుతారు. బతుకులోతులు చూసిన వేణి పెద్దరికం, చదువుకున్న మీన చలాకీతనం రెండూ నచ్చిన మోహనరావుకు వేణి చేసిన అపూర్వత్యాగంవల్ల మీన ఇల్లాలవుతుంది. కావ్యపు పదిహేనో ఖండికలో శారద తండ్రి హయాంలోనే ఆగిపోయిన పత్రిక సుందర్రావు చొరవతో మొదలవుతుంది – నవలకు భిన్నంగా. దీంతో సుందర్రావును నిష్క్రియాపరుడని మరి నిందించలేం. చెల్లెల్లిద్దరూ పెళ్లిళ్లయి వెళ్లిపోయాక సుందర్రావుకు జబ్బు చేస్తుంది. స్నేహితురాలికంటే, భార్యకంటే, అనేకంటే తల్లిలాగా సాకి అపాయం నుంచి సుందర్రావును బయటపడేస్తుంది శారద. మొత్తంగా ఈ ప్రస్తావన కావ్యంలో రెండు వంతులైంది. (పే. 140) ఎలాగైనా సుందర్రావును ఓ ఇంటివాణ్ని చేసెయ్యాలనే శారద ఆరాటం అతడికి విసుగు తెప్పించి యాత్రపేరుతో పారిపోతాడు. కాని తననుంచి తానే ఎంతదూరం పారిపోగలడు? అక్కడ తెలివి తెచ్చుకుని మళ్లీ ఇంటిపట్టు పట్టడం… కావ్యంలోనూ జరిగిందిదే. 

తెలుగు సినిమాలు, కాలక్షేపం నవలలు చదవడానికి అలవాటుపడిపోయిన పాఠకుడు మాత్రం శారద సుందర్రావుల పెళ్లవుతుందా కాదా అనే సందేహంలో పడి గిలగిలా కొట్టుకుంటాడు. కాని గడసరి కవి మాత్రం సుందర్రావుకైన ‘సత్య దర్శనం’ (పే. 192) పాఠకుడి విజ్ఞతమేరకు ఊహించుకోమంటారు. సీరియస్ గా ఉద్యమ సాహిత్యం సీరియల్ గా చదువుకుంటున్న ఈ కాలంలో ఒక చక్కటి రిలీఫ్ గా ఈ నవలనూ, కావ్యాన్నీ నాచేత చదివింపజేసిన జి. ఎస్. చలానికి కృతజ్ఞత.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s