ముప్పైరెండో వారం చదువు ముచ్చట్లు జ్ఞానప్రసూనగారితో…

సాధారణం

 prasuna ప్రతి ఇంట్లో హడావిడీ జీవితం ఐపోయింది. చదువు, ఉద్యోగాలు అంటు పరుగులెత్తడం. ఉమ్మడి కుటుంబాలు కావు. మంచి మాటలు చెప్పే పెద్దవాళ్లు లేరు. మరి జీవిత ప్రయాణంలో తగిలే ఒడిదుడులు , ఆటుపోట్ల సమయంలో బామ్మ, అమ్మమ్మ తప్పక గుర్తొస్తుంది కదా. మరి ఆ బామ్మ కూడా మనతో సమానంగా కంప్యూటర్ ముందు కూర్చుని బ్లాగు రాస్తుంటే ?? ఈ ఆలోచన వింతగా ఉందా. కాని 70 ఏళ్లకు పైబడ్డ జ్ఞానప్రసూనగారు చురుగ్గా , క్రమం తప్పకుండా సురుచి అనే బ్లాగును నిర్వహిస్తున్నారు. ఆ బ్లాగు టైటిల్ తగ్గట్టే ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి. ఎన్నో మంచి మాటలు చెప్తారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ల్నప్పుడు, అక్కడ వాళ్లందరు ఏదో చిన్న పెట్టి పట్టుకుని టక్కు టక్కుమంటూ ఉంటారు. బోర్ కొడుతుంది అంటే కొడుకు తెచ్చిచ్చిన లాప్ టాప్ తో కష్టపడి టైపింగ్ నేర్చుకుని పిల్లల సాయంతోనే బ్లాగు మొదలెట్టి , తనకు తెలిసిన ఎన్నో మంచి పద్యాలు, కథలు, పురాణా విశేషాలు చెప్తుంటారు. బ్లాగ్ అంటే ఆలోచనా తరంగం.ఇది ఇంత పరిధిలోనే వుండాలి, ఈవిషయం పైనే వ్రాయాలి అనే నియమం లేదు. ఒక్కొక్క తరంగానికి ఆలోచనా రూపం ఇవ్వడమే! ఒక వర్ణన, ఒకడైరీ,  ఒక ఆశ్చర్యం,  ఒక ఆనందం,  ఒక పొగడ్త, ఒక వేదన. ఏదైనా కావచ్చు. దీనిలో అంతస్సూత్రంగా ఒక గొంతు వుంటుంది. అది స్వానుభవాలని, అభిప్రాయాలని, ఆశని వెలువరిస్తుందనే మాట ప్రతి బ్లాగరూ ఒప్పుకుంటారు. అమెరికా కనిపెట్టనేలా?పెట్టితిరిబో మనవాళ్ళు వెడలనేలా?వెడలితిరిబో వెనుకకు రాకపోనేలా? అడుగంటెన్ బామ్మల ముద్దుముచ్చటల్! అంటూ విదేశాలనుండి వచ్చిన మనవడు వెళ్లిపోయాక ఆవిడ పడ్డ బాధ అందరికీ బాధ కలిగిస్తుంది. ఉద్యోగాలు చదువుల వేటలో వెళ్లినవారి బామ్మలు, అమ్మమ్మలు అందరూ ఇలాగే బాధపడతారేమో… 

ఇలా వివిధ అంశాలపై, మంచి మంచి మాటలు అందించే జ్ఞానప్రసూన గత ఏడవ, ఏనిమిదవ దశకంలో పత్రికా పాఠకులకు సుపరిచితుడైన రావూరి వెంకట సత్యనారాయణగారి కుమార్తె. మరి ఈ వారం ఈమె చదువు ముచ్చట్లు వినండి… 

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

రెండు పేజీలు  చదవగానే  తెలిసిపోతుంది. తప్పుకుంటాను. రచయితా(త్రి) పేరు కూడా గుర్తుపెట్టుకోను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

పిలక గణపతి శాస్త్రి గారి “హేమపాత్ర”.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ఒకప్పుడు నాలుగు అలమరా నిండా పుస్తకాలు ఉండేవి. ఈ మధ్యే చాలా పుస్తకాలు ఇచ్చేశాను. ప్చ్.అలమరాలన్నీ బక్కచిక్కిపోయాయి..

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

వాజపేయిగారి 51 కథలు.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

లత , రంగనాయకమ్మ, మునిమాణిక్యం, పురాణం  సీత, వేదుల శకుంతల, మాలతి చందూర్, చలం, బుచ్చిబాబు, ముక్తేవి భారతి.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

నా పుస్తకాలు, నాన్నగారివి ఇచ్చాను. అలాగే నాకు నేను రెండు పుస్తకాలు బహుమతిగా ఇచ్చుకున్నా. 🙂

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నవ్య, ఋషి పీఠం, దివ్యధాత్రి, ఆంధ్రభూమి మాసపత్రిక, స్వాతి మాసపత్రిక, దైవం, ప్రమిద, కౌముది.

 8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
  చెప్పడం ఇష్టం లేదు.
 

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

 ఇప్పుడేమీ లేదు. 

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

శరత్ సాహిత్యం.

11. ఆనాటి , నేటి రచనల మీద మీ అభిప్రాయం ?.

ఆనాటి రచనలు, సంప్రదాయ సిద్ధంగా, కొన్ని హద్దులలో, చక్కని భాషలో ఉండేవి. కొంత శాతం ప్రజలు చదివేవారు.  రాను రాను సామాజికమైన మార్పులు జరిగాక, భాషాపరంగానూ, తీసుకునే అంశాలలోనూ మార్పులు వచ్చాయి.  చదువు అందరికి అందుబాటులోకి వచ్చాక, స్వతంత్ర భావాలతో రచనలు ప్రజల దగ్గరకు నడిచాయి. రచన అనే వృక్షం కొమ్మలు , రెమ్మలు వేసి, కొత్త  కొత్త పుంతలు తొక్కింది.  పుస్తక సంపద పెరిగింది, రచన పల్చబడింది. రచయితకి కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చి,మీకిష్టమైనపుడు   ఏదైనా రాయండి  అనే పరిస్థితి రాజుల కాలంలో ఉండేదేమో. సాహిత్యంతో వ్యాపారం చేయడం, దానితోనే జీవితంలో డబ్బు సంపాదించుకోవాలి అనే వత్తిడి రావడంతో రాయక తప్పదు అని రచనలు చేస్తున్నారు.  మనసులో భావాలు సుళ్ళు తిరిగి ఇక రాయకపోతే నిలువలేను రాయక తప్పదు అన్నప్పుడు చేసే రచనకి, ఈ టైముకి , ఈ పద్ధతిలో ఇన్ని పేజీలు రాయాలి అన్నపుడు చేసే రచనకి తేడా తెలుస్తుంది.  ఒక ఆశయం కోసం, ఒక నీతి కోసం, ఒకే దారిలో భాషను పోషించుకుంటూ పటిష్టమైన అంశాలతో , వాకృనచాని భావాలతో చేసిన  రచన ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. సామాన్య ప్రజకి తెలిసేలా రచన చేయాలంటే  భావదారిద్యము, భాషా  పఠనం కాకూడదు.  అందుకే రాశిగా  వస్తున్నా రచనలలో వాసి కెక్కేవి   కొన్నే అనుకోవచ్చు.

12. మంచి రచన ఎలా ఉండాలి అంటారు ?

రచన చదివితే ఉత్సాహము, ఉద్వేగమూ  కనిపించాలి.  అది చదువుతుంటే కూర మాడిపోతున్నా గుర్తు రాకూడదు 🙂 . ఊహాలోకంలో ఉన్నా,కాస్త వాస్తవమూ ఉంది,  ఓహో ఇది ఇలా జరిగే అవకాశమూ ఉంది అనిపించాలి.  మనిషిని ఉన్నత స్థితికి చేర్చాలి కాని పతనానికి దారి వేయకూడదు.  సాహిత్యమూ, సినిమాలూ, టీవీ లు  మనుష్యులపై ముఖ్యంగా యువతరంపై  ఎనలేని ప్రభావం చూపిస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని రచనలు చేయాలి. బంధుత్వాలను,  మానవతను, సేవను, లలితకళలను , శ్రమలోని విలువను తెలిపే రచనలు రావాలి.

.. .. .. .. .. .. .. .. .. .. .. ..

(ఈ ఇంటర్వ్యూ తీసుకున్నదీ, పరిచయం రాసిందీ జ్యోతి వలబోజు గారు. అక్కయ్యకు కృతజ్ఞతలు.)

ప్రకటనలు

12 responses »

 1. ఈ వయసులో జ్ఞాన ప్రసూన గారి ఉత్సాహం, తపన కలివిడితనం చూస్తుంటే ఒక్కోసారి సిగ్గేస్తూఉంటుంది, మనమెందుకు ఇలా ఉండలేకపోతున్నామా అని! వారిచ్చిన పుస్తకాలను బహుమతిగా అందుకున్న స్నేహితుల్లో నేను కూడా ఉన్నాను.ఆమె సాహితీ సేవను మెచ్చుకోకుండా ఎలా వుండగలం? మృదుభాషి,”ఇంటికి రావే అమ్మడూ ఒక సారీ”అంటూ ఆప్యాయంగా పిల్చే జ్ఞాన ప్రసూన గారితో ఇంతకుముందు కూడా సాహితీ కబుర్లు పంచుకున్నాం అందరమూనూ!

 2. ధన్యవాదాలు……

  ఉపోద్ఘాతంలోని ఒక మాట ఛిన్నా భిన్నం చేసింది – దేనిని ? ఎందుకు ? 🙂

  మంచి మాట చెప్పే పెద్దవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఉన్నారు….వినేవారు ఉన్నారా అన్నది ప్రశ్న.. 🙂

  ఆపైన రావూరి గారు, ఏడవ ఎనిమిదవ దశాబ్దంలోని పాఠకులకే కాదు……అంతకు ముందు ఎన్నో దశాబ్దాల క్రితమే “వడగళ్ళు”తో ప్రసిద్ధం…కాబట్టి ఉపోద్ఘాతం కొద్దిగా మార్చండి.. 🙂

 3. ఈ పుట పరిచయంలో చక్కగా .. ” .. ఈవిషయం పైనే వ్రాయాలి అనే నియమం లేదు..” అని వ్రాసిన మీకు చివరలో ఏమైందో నాకు అర్దం కాలేదు, “..(.. పరిచయం రాసిందీ జ్యోతి వలబోజు గారు..) ..” అంటూ ప్రచురించారు .. తెలుగుని మీరు ప్రోత్సాహించక పోయినా ఫరవాలేదు, కానీ దాని రూపాంతరం చేసి వం(సం)కర భాష చెయ్యొదని మనవి.

  రాయడానికి మరియూ వ్రాయడానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన విషయాలలో మీకు చెప్పేంతటి విషయ ఙ్ఞానం నాకు లేదు కానీ, ఈ విషయంలో మాత్రం మీరు నన్ను మన్నించి ’రాయడాన్ని’ మార్చి ’వ్రాస్తా’రని ఆసిస్తున్నాను

  • ఏదనండి ఉడుతా ప్రయత్నం. భాష విషయంలో నేను మీ అంత సద్దుకు పోయేవాడిని కాదండి. నాకు తెలిసిన చాలా కొద్ది విషయాలలో ఇది ఒకటి. ఏదో త్రాచు పాములా కాకపోయినా బురద పాముకి కూడా ఆ పౌరుషం ఉంటుంది కదండి, అందుకే ఈ బుస.

 4. చక్రవర్తిగారు, మన్నించాలి. మనమెలా మాట్లాడుతామో అలానే రాయాలని నా అభిమతం. మనం వాడే పలుకుబల్లు, మన ప్రాంత వైయక్తిక మాండలిక పదాలు, యాస తదితరాలు కూడా రాతలోకి తీసుకురాగలిగితే ఇంకా మంచిది. భాషను నాలుగు పలకల ఫ్రేములో బంధించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. సంప్రదాయాలలాగా, నాగరకతలాగా, భాషకూడా నిరంతరం మారేది. దానిని మారనివ్వండి. కొంతమంది అలా మారకుండా చేసిన ఎన్నో ప్రయత్నాలు వ్యర్థాలయ్యాయి. అది నిరంతరం మారుతూనే వుంటుంది. అయితే పాత భాషలు చనిపోకుండా ప్రయత్నించాలన్నా… వాడుకభాషను సాహితీవేత్తలు నుంచి సామాన్యప్రజలంతా గుర్తించి గౌరవిస్తేనే తప్ప సాధ్యం కాదు. మరోసారి ఈ విషయంపై మీ అభిప్రాయాలను పునస్సమీక్షించుకోండి.

  • రవిగారూ,

   మీ స్పందన తీరు చూస్తుంటే నాకు అదేదో పాత సామెత గుర్తుకు వస్తోంది. “నిద్ర పోతున్న వాళ్ళను మేల్కొలపవచ్చు, కానీ .. “, అలా తప్పు చేస్తూ అక్కడతో ఆగ కుండా దాన్ని సమర్దించుకుంటూ అది తప్పు కాదు అనేటటువంటి వాళ్ళలో మీరు ఉన్నారని అర్దం అయింది. అలాగే పిచ్చోడి దగ్గరకు వెళ్ళి, నువ్వు పిచ్చోడివి అని చెప్పడం కూడా పిచ్చితనమని మరోసారి ఋజువైంది నాకు మరోసారి ఙ్ఞానోదయం అయ్యింది. కాబట్టి మీకు నేను ఏమి చెప్పినా అది మీ చెవికెక్కపోగా మీరు మరింత వికృతంగా స్పందించే అవకాశం ఉన్నందున, నేను ఈ చర్చని ఇంతటితో ముగిస్తున్నాను.

   అసందర్బంగా ప్రేలితే మన్నించండి.

 5. చంద్రుడి వేపు వేలు చూపిస్తే, చంద్రున్ని వదిలేసి, వేలిలో వంకర్లు వెదకడం బాగోదనుకుంటాను 🙂

 6. కొన్ని వివరాలు చేర్చడం మర్చిపోయాను. జ్ఞానప్రసూనగారు, తన స్నేహితురాలు శ్రీలక్ష్మి కలిసి ఆంధ్రప్రభ దినపత్రికలో ఓ చిన్నమాట అనే రెగ్యులర్ కాలం నిర్వహించారు. అవన్నీ కలిపి మాటల పందిరి అనే పుస్తకంగా అచ్చువేసారు. సత్యనారాయణ వ్రతకథ, షిర్దీ సాయి అష్టోత్తరం, కృష్ణబాబా జీవితగాధ రాసారు. ప్రస్తుతం దైవం మాసపత్రికలో తులసీదాస్ రామచరిత మానస్ ని తెలుగులోకి అనువదించి రాస్తున్నారు.

 7. ప్రసూన గారితో ప్రధమ పరిచయం ప్రమదావనంలో.. తరువాత ప్రత్యక్ష పరిచయం ఏదో షూటింగ్ నిమిత్తం స్నేహితురాలు శ్రీలక్ష్మిగారితో మా ఆఫీసుకే రావడం. మంచి కలివిడితనం, హుందాతనం ఉన్న స్నేహశీలి. ఇహ నేను పుస్తకాలు అందుకొన్నాను పుస్తక ప్రదర్శనశాలలో. అప్పుడే అయిపోయిందా అన్నట్లుంది ఇంటర్వ్యూ. , మంచి ఆలోచనలే చేయండి అంటూ సందేశం ఇచ్చే ప్రసూన గారు టి.వి షూటింగ్ లో ఆవిడ మనోభావలని చక్కగా వెల్లడించారు. అభినందనలు ప్రసూన గారు.

  “చంద్రుడి వేపు వేలు చూపిస్తే, చంద్రున్ని వదిలేసి, వేలిలో వంకర్లు వెదకడం బాగోదనుకుంటాను :)… ”

  ॒ hrk గారు నాకెందుకో ఈ వాక్యం బాగా నచ్చింది. చంద్రుడిలో ఎప్పుడు లోపం ఉండదండి. మచ్చ మచ్చ అంటారు కాని, చూపించే వేలు సక్రమంగా చూపిస్తే వెలికితీయగల్లిగే వ్యక్తిత్వం ముందు చంద్రుడి మచ్చ ఏపాటిది. అంతేనంటారా? 🙂

  • anan gaariki
   maa naannagaari vadagallu chinnapustakam eppudo yuvabhaarati vaalluu prachurinchaaru.
   vetapaalem grandhaalayamlo paata vadagallanni vunnaayani vinnaanu. okasaari velli choosiraavaali.
   gnana prasuna

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s