ఐదేళ్ళ తెలుగు కథ

సాధారణం

తెలుగు సాహిత్య అభిమానులకు విజ్ఞప్తి. కథా సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్న పాఠకులకు ఈ విన్నపాన్నిప్రసిద్ద కవి, విమర్శకుడు, పాఠకుడు అఫ్సర్ చేస్తున్నారు. దయచేసి ఈ చిన్న నోట్ ను చదివి, సహృదయంతో సహకరించాల్సిందిగా ఈ బ్లాగు పాఠక మిత్రులను కోరుతున్నాను.

ఐదేళ్ళ తెలుగు కథ

ప్రతి అయిదేళ్ళకీ కథ మారుతుందా? మారవచ్చు. ఇప్పుడు తెలుగు కథ మారుతున్న వేగాన్ని చూస్తూంటే, గత అయిదేళ్ళలో వచ్చిన వస్తు, శిల్ప పరమయిన మార్పుల్ని గమనిస్తే, అయిదేళ్ళ మార్పుని ఒక అంచనా వెయ్యవచ్చని అర్ధం అవుతుంది. ఈ మార్పు మొత్తం తెలుగు సమాజంలో వస్తున్న మార్పు. దీనికి ప్రాంత, లింగ, మత, కుల తేడాలు లేవు. అలాంటి మార్పుని ప్రతిఫలించే కొన్ని ఊత్తమ కథల్ని ఎంపిక చేసి, ఒక సంకలనంగా తీసుకు రావాలని మా సంకల్పం. అందులో భాగంగా మా మొదటి సంకలనం కోసం 2005 నించి 2009 వరకు వచ్చిన కథలని పరిశీలనకి తీసుకుంటాం

అయిదేళ్ళ కథశీర్షికన 2010 లో ఈ సంకలనం వెలువడుతుంది. ఈ సంకలనం యథతధంగా తరవాత ఇంగ్లిష్ లో కూడా ప్రచురించాలని ప్రస్తుత ఆలోచన.

ఈ సంకలనం కోసం మీరు ఈ 2005 నించి 2009 మధ్యలో చదివిన మంచి కథల్ని సూచించండి. . మీరు సూచించిన ప్రతి కథనీ మేము చదివి, మా సంకలనంలో ప్రచురణకి పరిశీలిస్తాం.

సంకలనాలకు సాధారణంగా వైయక్తిక లెదా సంస్థాగత ఉద్దేశాల పరిమితి వుండడం ఇటీవల మనం గమనిస్తున్నదే. అలాంటి పరిమితులేవీ లేకుండా ఏ రకంగా చూసినా ఇది ఉత్తమ కథ అనుకున్నదల్లా మా సంకలనంలో వుండాలని మా తపన. మీ సూచనలు లేకుండా ఇది సాధ్యం కాదు.

అన్ని ప్రాంతాలకూ , అన్ని మాండలికాలకూ, అన్ని ధోరణులకూ సంబంధించిన అచ్చ తెలుగు కథల సంకలనం మా సంకల్పం.

మీ సూచనలు పంపండి. అచ్చంగా ఒక ఉత్తమ సంకలనం మనం తీసుకు వద్దాం.

మీ సూచనలు అఫ్సర్ (afsarteluguATgmail.com) కైనా లేదా గుడిపాటి (gudipati8ATgmail.com) కైనా పంపించండి.

ప్రకటనలు

14 responses »

 1. “ఈ మధ్యకాలంలో నేను చదివిన అత్యద్భుతమైన కథ అరుణపప్పు గారు రాసిన “వర్ద్ క్యాన్సర్”. తెలుగు కథా రచనను మార్చే కథ అనిపించింది.”
  Oh really? Where is the “story” in it? వాగాడంబరం తప్ప అందులో కథ యేది? It’s more like verbal diarrhea than word cancer

 2. @కొత్తపాళీ: అదే తెలుగు కథలోని మార్పెందుకు కాగూడదు? రాబోయే మార్పుకూడా మీ మూసకు అనుగుణంగా ఉంటేనే మార్పా? లేక మీరు ఆమోదిస్తేనే మార్పా? మార్పు స్వరూపం ఎలా ఉండాలో మీరే నిర్దేశిస్తారా? అది కథో వాగాడంబరమో మీరు నిర్ణయిస్తే అది అందరూ ఒప్పేసుకోవాలా?

  నాకు ఆ కథ నచ్చింది. ఒక నవీన పోకడకి నాందిలా అనిపించింది. నాకు తెలిసి ఆ “కథ” చాలా మందిని ఆకట్టుకుంది. కాబట్టి ప్రతిపాదించాను. అంతకు మించిన కథలుంటే మీరు ప్రతిపాదించండి. వాటిని చదివి మేమూ తరిస్తాము. అంతేకానీ ఈ “verbal diarrhea” మీకు తగదు.

 3. ఏమిటీ ఐదేళ్ళ కథల సంకలనమా ? బాగుంది…శుభాభినందనలు – బోలెడు రాయాలని ఉంది కానీ, ఇప్పుడు ఆ సోదంతా ఇక్కడెందుకు – ఇప్పుడు టూకీగా చెబుతా, తరువాత నా బ్లాగులో నాలుగు పుటలు రాస్తా, పుఠం పెడతా – 🙂

  నాకయితే ఈ ఐదేళ్ళలో – రచయితత్రులయిపోవాలని పెన్ను పుచ్చుకుని పేపరు మీద వీరంగం చెయ్యటమే కనపడ్డది కానీ, వీరంగం వెయ్యటంలో తప్పేమీ లేదుగా, అవును – మానసిక రోగులూ వేస్తారు – 🙂 –

  సరే అలా పక్కనెడితే – ఈ ఐదేళ్ళలో నాకు నిజంగా నచ్చిన కథ ఒక్కటీ లేదు…వ్యర్ధ పదాలూ, అక్కరలేని దీర్ఘ సమాసాలు, సంధులు, విశేషణాలు వాడకుండా ఉన్న ఒక్క కథ చూపించండి….ఈ కాలంలో తమ తోటి వారు ఎంతో మంది రాస్తున్నారు అనీ, నేనేనా రాయలేనిది అని — లేని ఆవేదన తెచ్చిపెట్టుకుని రాసిన “త(త్రి)” లు బోలెడు మంది….

  అయితే చప్పట్ల బృందం సహాయంతో, భూమి భారం సంగతేమో కానీ మన సాహితీ ప్రపంచం అతిభారమయిన, ఎవరూ మోయలేని అనవసర పాపంతో మస్తకాభిషేకం చేయించుకొంటోంది…..కథల్లో కథ ఉట్టిపడాల్సింది పోయి – చైతన్యమంతా హరించుకుపోయిన చెక్కబొమ్మలైపోయాయి….పోనీ మేలిముసుగేసుకున్న సుందరి అందంలాగా ఉన్నాయా అంటే అదీ లేదు…పోనీ ఒకవేళ ముసుగు లాగా ఉందనుకున్నా – ముసుగే కానీ, ముఖం అందంగా ఉన్నదా లేదా కూడా తెలియని అయోమయస్థితిలో నేటి పాఠకలోకం ఉండటం కూడా అందుకు ఒక కారణం….

  ఆపైన రచయితల “ఆత్మవిశ్వాసం” ఎక్కువపాళ్ళలో కనపడుతూన్నదీ అని ఈ మధ్య ఒక మాట విన్నాను…- నా మటుకు అది “అహంభావం” ముసుగేసుకున్న “ఆత్మ న్యూనత”…. ఇంతకు ముందు అక్కడెక్కడో రాసాను “అహం బ్రహ్మస్మి – కథాం కాకమ్మస్మి” అని – అర్థం చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత మహదేవా…

  మాటల అలంకారాల పైపూత మెరుగులు, అభూతకాల్పనిక పదాల సృష్టి ఎక్కువైపోయిన ఈ రోజుల్లో “చిక్కని మీగడ తరకలాంటి కథనం”తో రచనని పరిపుష్ఠం చేసిన రచయిత ఏడీ ? ఆలాటి రచన ఏదీ? కథ రాస్తే కొర్రెక్కి నిగిడిన నిచ్చెనలాగా ఉండాలి, అంతే కానీ ఏదో పేర్చామమ్మా, ఆ నిచ్చెన మెట్లలో ఒకటి తీసేయ్యొచ్చమ్మా అనేది పనికిరాదు…అలాటివి కోకొల్లలు ఈ ఐదేళ్ళలో..కోకొల్లలు ఏమిటిలే, అన్నీ అవే అన్నా ఆశ్చర్యం లేదు…..

  కథలో హృదయానికొచ్చే నింపాది పలకరింపులకంటే సంతలో జాతరలా కోలాహలం ఎక్కువైపోయింది… చదవటం మొదలెట్టాక, ఆపేక్షగా పలకరిస్తూ తన ఆపేక్ష ఉత్తుత్తిది కాదు, నిజమయినదే అని పాఠకుడికి అర్థమయ్యే స్థితికి తీసుకెళ్ళి అవినాభావ సంబంధం నెలకొల్పి వదిలిపెట్టాలి ఏ కథైనా….ఆ ఇది ఎక్కడుంది ?

  ఏతావాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే, అంతా చెప్పాక రాముడికి హనుమంతుడు ఏమవుతాడు ? – మీ సంకలనానికి సహాయము చెయ్యలేనివాడను….ఒకవేళ నిజంగా పైన చెప్పిన తరగతుల్లో పడ్డ పాఠ్యాంశాలు (కథలు) , నా దృష్టికి రాక తప్పిపోయినవి, ఏవన్నా మీ సంకలనంలో చేరిస్తే అందుకు “అర్బుదం” ధన్యవాదాలు తెలియచేస్తాను…

  అబ్బా సరేలేవయ్యా, సోదంతా చెప్పావుకానీ , అసలు ఈ ఐదేళ్ళ సంగతి అక్కనబెట్టి నీకు నచ్చిన కథలేమిటో చెప్పు – దాన్ని బట్టి నీ పై సోదంతా సోమిదేవమ్మ పాడిన సువ్వి పాట చెయ్యటానికి మేము కాచుకుని కూర్చుంటాం…

  నువ్వు అక్కడికొస్తావని నాకు తెలుసు నాయనా….దానికో టపా రాస్తాను త్వరలో….వేచి చూచువాడికి వెయ్యి వాతలు, చూడనివాడికి చాప మీద చద్దన్నం….

 4. సంకలనం చెయ్యాల్సినంత గొప్ప కథలొస్తున్నాయా తెలుగులో!

  పోయిన్నెల్లో తెలుగు కథల దీనావస్థ గురించి పెన్ను విరిచేశా కాబట్టి మళ్లీ ఆ సోదంతా ఇక్కడ రాయకుండా ఓ లంకె పడేస్తున్నా. ఓపికున్నవాళ్లు చదవండి.

  చెప్పొచ్చేదేంటంటే, ప్రతి పదింట్లోనూ తొమ్మిదిన్నర నేననే ‘మహా మూస’ లోనివే. అటూ ఇటూ తిప్పి అవే అవే ఇతివృత్తాలు. పరమ బోర్.

 5. @ Mahesh,
  No, the new changes in Telugu literature do not have to fit the mold defined by me. It is not about my personal approval or taste. I have no problem with you (and a hundred other people) liking it. Good for you and good for the writer. The prose is dazzling – yes. Is it trendsetting – definitely no. You and I seem to be having a repeat of the argument from your blog. I am not going to spend any more effort arguing this mediocre stuff.

 6. మహేశ్ గారు మన్నించాలి. ఒక సంగతి… అరుణగారు కథలు రాయడం ఆరంభించారు. ఆమె రాసిన కథలన్నీ రెగ్యులర్ గా చదివిన పాఠకుడిగా నా ఉద్దేశమేమిటంటే అతి త్వరలో ఆమె మంచి కథలు రాస్తారని. ఇంతవరకూ అమె ఇంకా తనను తాను స్పష్టపరచుకోలేదు. ఇప్పుడిప్పుడే తన శైలి, వాక్య విన్యాసం రూఢపరుచుకుంటున్నారు. ‘వర్డ్ కాన్సర్’ లింక్ దిలీప్ సార్ నాకు పంపిన వెంటనే చదివిన మొదటిసారి నివ్వెరపోయాను.. మీలానే సంబరపడ్డాను (తెలుగు కథకు మరో ఆశాదీపం దొరికిందని, అది నిజమేననుకోండి) గాని, ఈ కథలో గొప్పతనమంతా ఎక్కడుందని ఒకటికి రెండు సార్లు పట్టి పట్టి చదివాక, నాకు బోధపడిందేమిటంటే కథకురాలు తన పదవిన్యాస చాతుర్యంతో పాఠకుల్ని కట్టిపడేశారన్నమాట. మళ్లీ రూప-సారాల చర్చకు వెళ్లకుండా మాట్లాడుకుంటే రూపం గొప్పదే కానీ సారమేమిటి అన్నది మనం ప్రశ్నించుకోవాలి కదా… అయొనెస్కో గానీ, కాఫ్కా గానీ లేదా మరో ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఫిలసిఫికల్ రచయిత గానీ వస్తువు లేకుండా అంత ఘనమైన సాహిత్యాన్ని సృష్టించారంటారా? బహుశా కాశీభట్ల వేణుగోపాల్ కథలు చదివి నివ్వెరపోయి ఊరుకుంటాం. అంటే ఒకరకంగా షాక్ కు గురవుతాం. అదే ఇంకా ఈ కొత్త టెక్నిక్ లన్నింటిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ సాధన చేస్తున్న డా. వి. చంద్రశేఖరరావు గారి కథలను చదివి ఆలోచిస్తాం. అదే ఆ రకమైన అనే కాదు మరే రకమైన శిల్ప ప్రయోగానికైనా అసలు సిసలు ప్రయోజనం కదా!

  ఏది ఏమైనప్పటికీ, అరుణగారు త్వరలో మరిన్ని మంచి కథలు రాస్తారని నాకు ధీమాగా వుంది.

 7. @దుప్పల రవి: మీ మొదటి బిందువుతో కొంత విభేధించక తప్పదు. తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందనే అనాలజీ ఇక్కడ వర్తిస్తుందో లేదో నాకు తెలీదు. కొత్తకథకురాలైనా, పాతకథకురాలైనా రాసిన కథను వయసుతో/అనుభవంతో జడ్జిచెయ్యడం అంత సమంజసం కాదేమో!

  రెండో బిందువు ఖచ్చితంగా ఆలోచించదగినది. వర్డ్ క్యాన్సర్ వస్తువు లేని పదవిన్యాస చాతుర్యం అంటే అంగీకరించలేకున్నాను. ఆ కథలో జీవితంలో సాహిత్యం (పదాలు) ఎలా మమేకమై మనిషి అంతరాలాల్లోకి వశించాయి అనే గొప్ప ఫిలసాఫికల్ ఆలోచన నాకు కనిపించింది. ఆలోచనకు తగిన రూపం పదవిన్యాసమే. కాబట్టే ఆ పదాడంబరం “అర్థవంతంగా” అనిపించింది.అంతకంటే మించిన సారవంతమైన “ఆలొచన” ఈ మధ్యకాలంలో వచ్చిన/నేను చదివిన కథల్లో నాకు కనిపించలేదు.

  సమస్యాపూరణలు,ఇజాల ధృక్కోణాల కథల మధ్యన ఈ కథనాకు విభిన్నంగా అనిపించింది. ఆలోచనకు తగ్గశైలి, కథాంశానికి తగ్గ శిల్పం ఒక సమతుల్యాన్ని సాధించాయనిపించింది. అందుకే ఒక నూతన పోకడ అన్నాను.

  మీరు ఉటంకించిన పెద్దల పేర్ల మధ్య ఈ కథను కూర్చోబెట్టలేకపోవచ్చు. కానీ సమకాలీన రచనల సమక్షంలో దర్జాగా కూర్చోబెట్టగలిగిన కథ ఇది.

 8. మహేష్,

  ఒక కథ ఎవరికి ఎలా నచ్చుతుందనే విషయం రెలెటివ్! “కొత్త” కు స్వాగతం పలికే మీ ఆలోచనా ధోరణి వల్ల కథ మీకు నచ్చి ఉండొచ్చు!మీ అభిప్రాయాన్ని మీరుస్వేచ్ఛగా వ్యక్తీకరించారు. అలాగే కొత్త పాళీ గారు కూడా తన అభిప్రాయం వ్యక్తీకరించారు. verbal diarrhea తగదని కొత్తపాళీ గారికి మీరు సలహా ఇచ్చే ముందు మీరు వాడిన మాటల్లో ఎంత వ్యంగ్యం,అసహనం వ్యక్తమయిందో గమనించండి.

  “మీ మూసకు అనుగుణంగా ఉంటేనే మార్పా? లేక మీరు ఆమోదిస్తేనే మార్పా? మార్పు స్వరూపం ఎలా ఉండాలో మీరే నిర్దేశిస్తారా? అది కథో వాగాడంబరమో మీరు నిర్ణయిస్తే అది అందరూ ఒప్పేసుకోవాలా?” ఇవన్నీ కొత్తపాళీ తన వ్యాఖ్యలో ప్రస్తావించారా?

  ఒప్పుకోమని ఎవరన్నారు? అది ఒక వ్యక్తిగతాభిప్రాయం అనుకోవచ్చుగా!

  “అంతకు మించిన కథలుంటే మీరు ప్రతిపాదించండి. వాటిని చదివి మేమూ తరిస్తాము. ” వర్డ్ కాన్సర్ గొప్పకథే ! కానీ అంచేత అంతకు మించిన కథలు లేవని మీరు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది.

  “మేమూ తరిస్తాము…” ఎందుకింత వెటకారం!

  పెద్ద పెద్ద వివాదాలు మీ బ్లాగులో రేగినపుడే సంయమనంతో జవాబులిచ్చే మీరు ఇక్కడ ఒక కథ విషయంలో మీ అభిప్రాయంతో విభేదించినంత మాత్రాన ఇలా విరుచుకు పడటం బాగుందా? వింతగా ఉంది.

 9. @సుజాత: కొత్తపాళీ గారు వారి అభిప్రాయం చెప్పలేదు. నా వ్యాఖ్యని తగదన్నారు. నా వ్యాఖ్యని ఉటంకించి మరీ నా అభిప్రాయం తప్పన్న భావనతో వ్యాఖ్యానించారు. అందుకే నేను ప్రతిస్పందించాను. ఒకసారి వ్యాఖ్యల్ని వరుసక్రమంలో చూడండి.

  నా అభిప్రాయాలతో విభేధిస్తే నాకు సమస్యలేదు.నా అనుభవాన్ని ప్రశ్నించి ఎద్దేవాచేస్తే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను.verbal diarrhea వ్యంగ్యం ఎక్కడ ఆరంభమయ్యిందో. ఏస్థాయికి వచ్చి చేరిందో మీరే చూడండి.

  వర్డ్ క్యాన్సర్ “నేను చదివిన కథల్లో అత్యద్భుతం” అన్నాను. అంతకు మించిన కథలు లేవని నేనెప్పుడూ ప్రకటించలేదు. ఉంటే చదివి తరించడానికి నేను ఖచ్చితంగా సిద్ధమే. అందులో వ్యంగ్యం ఏమాత్రం లేదు.

 10. కాశి భట్ట శశికాంత్ ..గారి ” ఎవడేమిటి నీకు అమ్మింది ” ఆదివారం ఆంధ్ర జ్యోతి #26.04.09..
  అన్ని అస్పెక్ట్స్ లో ఉత్తమమైన కథ ..చాలా క్లుప్తంగా ..నేటి మన సమాజం కి కావలసిన స్పృహ కనిపిస్తుంది …
  అన్ని విలువలు కొట్టుకుపోయి, మనషికి ఎంత కూడ బెడితే అంత గొప్ప ..అనుకుంటున్న.,,.కన్నతల్లితండ్రులే ..బరువయిన ..,,
  ఇంట్లో వంటలు ..కష్టంగా ..టిఫిన్ సెంటర్ ల వెంట ,పూర్తిగా స్వార్ధం తో కళ్ళు మూసుకున్న జనరేషన్ కి ,,
  అర్ధం కావలసిన కథ ..
  satyam …

 11. కథలగురించి రాయమంటే కవ్వింపు మాటలతో కాలహరణం చేస్తున్నారే, యెందులకీ వృధా సొదలు. సాహిత్య పుష్టికి మీ సృజనాత్మక శక్తిని జోడించండి. నూతన సాహిత్య సృష్టికి బీజాక్షరాలు దిద్దండి .సమాజాన్ని ఎక్ష రే కళ్లతో చూసి దయగ్నోసిస్ చెసి చికిత్ష చేద్దాం . డాక్టర్ : జి.వి. కృష్ణయ్య .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s