ఈ గొడవ ఒక్కరిది కాదు… జనమందరిది

సాధారణం

Naa-Godava‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె 

మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు 

పతిత మానవు జూచి చితికిపోవును మనసు 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

తప్పు దిద్దగ లేను దారి చూపగ లేను

తప్పు చేసినవాని దండింపగా లేను

కష్టపడువారలను కాపాడగా లేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?

అవకతవకలు నేను సవరింపలేనప్పుడు

‘పరుల కష్టాలతో పనియేమి మాక’నెడు 

అన్యులను గనియైన హాయిగా మనలేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’

అప్పుడే నడుస్తున్న సమాజ చరిత్రను అవగతం చేసుకుంటూ, తనకున్నపాటి ఎరుకతో కవిత్వం రాయబూనిన యువకవి ఏమీ చేయలేనితనాన్ని, తనకూ కొంత బలముంటే ఏమైనా చేయాలన్న తెగువనూ పట్టిచ్చే ధ్వని ఈ కవితలో కనిపిస్తుంది కదూ! తూటాల్లాంటి మాటలువాడి అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ తనదైన ముద్రవేసి, అటు రచనలతోనే కాక, ఇటు వ్యక్తిగత జీవనాదర్శంతోనూ ప్రజల హృదయాలను చూరగొన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులివి.

మనకు కాళోజీగా సుపరిచితులైన ఈయన కవిత్వపు సంపూర్ణ సంకలనం “నా గొడవ“ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. దాశరథి రంగాచార్య అన్నట్టు కాళోజీ కవి నిరంకుశుడు. అతనికి దురాశలు లేవు. ఆశల ఉచ్చులు లేవు. అతడు దేనికీ చిక్కడు – వేదనకు ఆవేదనకు నివేదనకు తప్ప. ఏడు పదుల కాలంలో రాసిన, చెప్పిన, వినిపించిన కవితల సంకలనమే ఈ “నా గొడవ”. కవిగా కాళోజీ కవితత్వం ఏమిటని ప్రశ్నిస్తే కాళోజీ దగ్గర సమాధానం లేదు. ఎలాంటి చట్రపుటుచ్చులలోనూ ఇమడకుండా, ఏమరపాటు పడకుండా తన సుదీర్ఘ, స్వతంత్ర జీవన ఛాయలు వెలువరించిన కాళోజీ తన జీవనతత్వాన్ని కొన్ని కవితల్లో చూచాయగా చెప్తారు. ఎమర్జెన్సీ సమయంలో రోమరోలా (రొమైన్ రోలండ్) రాసిన “జా క్రిస్టోఫ్’ నవల ఇష్టంగా చదువుకున్న కాళోజీ, అందులో గ్రాండ్ డ్యూక్, క్రిస్టోఫ్ ల మధ్య జరిగిన కొన్ని మాటలను “సంభాషణ” అనే కవిత రూపంలో అనువదిస్తారు. దీన్నే మనం కాళోజీ జీవన తత్వంగా గ్రహించవచ్చు.

నీ బానిస కాను నేను 

తొత్తు కొడుకు నసలే కాదు 

నా ఇష్టం వచ్చినట్లు 

నా మనసుకు నచ్చినట్టు 

 మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా 

 నరుడు నేను, నరుడ నేను 

మనిషి బ్రతుకు బ్రతుకుతాను 

నా మతమును ప్రకటిస్తా 

అది నా స్వతసిద్ధమైన హక్కు 

జన్మ హక్కు 

ఆ మాత్రం లేకుండా 

నే బ్రతికెందుకు

సంఘాలు, నియమాలు, సిద్ధాంతాలు, నిర్మాణాలను తీవ్రంగా నిరసించడమే కాదు, రాజకీయాల్లోనూ డొల్లను అంతే తీవ్రంగా ఎండగట్టిన కాళోజీ ఒక మారు రాజకీయాల్లో పాల్గొన్నా, ఏ పార్టీలోనూ చేరకుండా ‘పార్టీవ్రత్యం’ పాటించిన నిబద్దత గల కవి. ప్రాథమిక హక్కులపట్ల ఆయనకు గల స్పష్టమైన అవగాహన ఏర్పరచిన ప్రాపంచిన దృక్పథం కాళోజీలోని సృజన కళాకారుడి ఎదుగుదలకు తోడ్పడింది. కాని కాళోజీ గాంధేయవాది. నేను పిరికితనం కన్నా హింసను బలపరుస్తానన్న గాంధీ మాటను కాళోజీ తరచి ప్రస్తావిస్తారు. దాంతోపాటే అధీకృత హింసకు ప్రతిఘటనగా ప్రతిహంసను సమర్ధిస్తారు.

ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యమే కాదు, ఇతర విధాలా ఈ భిన్న ధృవాలుగా సమాజం విడిపోవడాన్ని ‘వ్యత్యాసాలు’ కవితలో ఎత్తిచూపుతారు.

అన్నపురాశులు ఒకచోట 

ఆకలి మంటలు ఒకచోట 

హంస తూలికలొకచోట 

అలసిన దేహాలొకచోట 

సంపదలన్నీ ఒకచోట 

గంపెడు బలగంబొక చోట 

వాసన నూనియ లొక్చోట 

మాసిన తలలింకొక చోట 

….

అనుభవమంతా ఒక చోట 

అధికారంబదియొకచోట

తనను ఎంతో ప్రభావితం చేసిన కవులలో ఒకరిగా ఖలీల్ జీబ్రాన్ ను కాళోజీ గుర్తించి గౌరవిస్తారు.

నేను ప్రస్తుతాన్ని – గతానికి శిఖరాన్ని 

వర్తమానాన్ని – భావికి ఆధారాన్ని

నేను నేడనెడు దాన్ని – నిన్నటి స్వప్నాన్ని

రేపటి జ్ఞాపకాన్ని – నేను ప్రస్తుతాన్ని

ఇప్పటి క్షణాన్ని

కాళోజీ కవిత్వ తత్వ విచారం చేస్తూ వరవరరావు కాళోజీని వేమన, గురజాడలతో పోలుస్తారు. “ఈ ముగ్గురూ ప్రజాప్రయోజనాలను. లేదా సమాజం పట్ల తమ అవగాహనను, బాధ్యతను, కవిత్వం కన్నా, రచనాశైలికన్నా ప్రథమ స్థానంలో వుంచినవాళ్లు. అందువల్ల సులభంగా, సరళంగా, సందేశపూర్వకంగా చెప్పడానికి ఎంచుకున్నారు.” 1965లో అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలను ‘పొదుపు చెయ్యండి’ అని పిలుపునిచ్చారు. దానికి కాళోజీ స్పందన ఇది:

ఓయీ! భారత ప్రధానీ! 

కొవ్వు బలిసినోరికి చెప్పు – నెయ్యి మానెయ్యమని 

ధనం దాచినోలికి చెప్పు – పాతర్లు తియ్యమని 

చీకటి బజార్లకు చెప్పు – ‘నందా’ దీపం వెలిగించమని 

ముప్పూటమెక్కే బొర్రలకు చెప్పు – పస్తుండమని 

మిన్నంటిన ధరదారులకు చెప్పు – మన్నంటి దిగమని 

జల్సారాయుళ్లకు చెప్పు – రమ్ము విస్కీలు మానమని“.

ఇక కాళోజీ కవితా వస్తువు ఇదీ అదీ అని ప్రత్యేకంగా ఎంచ వీలులేదు. నైజాం వ్యతిరేక పోరాటం నుంచి, రాజ్యహింస నుంచి, స్వతంత్ర పోరాటం నుంచి, స్వతంత్ర రాజ్యంలో నెహ్రూ పాలనలో భ్రమల పొరల తెరలు చిరగడం నుంచి, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నుంచి, యుద్ధాల నుంచి, ప్రత్యేక తెలంగాణ పోరాటం నుంచి, ప్రేమ-నమ్మకం-మూఢ నమ్మకాల నుంచి, హాస్యం-వ్యంగ్యం-అధిక్షేపణల నుంచి, బోధన నుంచి…. జీవితం వరకూ… అన్నీ కాళోజీ కవితా వస్తువులే. అందుకే కాళోజీ రాజకీయ కవి. అంతకుమించి ప్రజాకీయ కవి. అన్నింటినీ మించి ప్రపంచ కవి.

పోతన పద్యాలను ఎమెర్జెన్సీలో కాళోజీ ఎలా వ్యంగ్యంగా వాడుకున్నారో చూడండి. “కలదందురు లోకసభను / కలదందురు ప్రభుతలోన పంచాయితీలో / కలదందురు రాజ్యాంగమును / కలదు ప్రజాస్వామ్యమనెడు వింత కలదో? లేదో?”. 1973లోనే పూర్తి శాంతి భద్రతలు క్షీణించినపుడు ఇలా విరుచుకుపడ్డారు. ”  ‘లా’వొక్కింతయు లేదు / ‘ఆర్డరు’ విలోలంబాయే / ‘క్రమముల్’ ఠావుల్ దప్పెను / మూర్ఛిల్లె రాజ్యాంగమున్ / రావే ‘ధీ’ క్రోధశ్రీ / సంరక్షించు పౌరాత్మకా!”

కవిత్వాన్ని కవిత్వంకోసం గాక జన చైతన్య ప్రయోజనం కోసం ప్రయోగించారు కాళోజీ. ఆద్యంతం ఆసక్తికరంగా వుండే కాళోజీ గొడవ జనమందరి గొడవ. 450 పేజీలతో ఎంతో వ్యయప్ర్రయాసలకోర్చి కాళోజీ ఫౌండేషన్ ఈ “నా గొడవ” ప్రచురించింది. ఇందులో ముందుమాటలుగా వరవరరావు, బి. తిరుపతిరావులు చెప్పిన మాటలు చదివి కవిత్వం చదవడం కన్నా కవిత్వం అంతా చదివి వీరి మాటలు చదవడం వలన మనం ఊహించుకున్న దానికన్నా కాళోజీ మనో యవనిక ఎంత విశాలమైనదో గోచరమవుతుంది. ముఖ్యంగా సంక్షుభిత తెలుగు సమాజంలో కాళోజీ మాటా పాటా ఎంత ప్రభావశీలంగా పనిచేసినాయో బోధపడుతుంది. దీని వెల 200 రూపాయలు పెట్తారు. కానీ ధరను దీనికి అన్వయించలేము. ఒక్కసారి చదవడం మొదలుపెడితే చివరిదాకా చదివిస్తుంది కాళోజీ కవిత. మీరూ తప్పక చదవండి.

అట్ట చివరి పేజీ

అట్ట చివరి పేజీ

అన్యాయాన్నెదిరిస్తే 

నా గొడవకు సంతృప్తి 

అన్యాయం అంతరిస్తే 

నా గొడవకు ముక్తి ప్రాప్తి 

అన్యాయాన్నెదిరించినోడు 

నాకు ఆరాధ్యుడు…

ప్రకటనలు

3 responses »

 1. wow! “అన్యాయాన్నెదిరిస్తే

  నా గొడవకు సంతృప్తి

  అన్యాయం అంతరిస్తే

  నా గొడవకు ముక్తి ప్రాప్తి

  అన్యాయాన్నెదిరించినోడు

  నాకు ఆరాధ్యుడు…“

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s