వివేచనాత్మక సాహిత్యాన్ని కొత్త దృష్టితో చూపించే వ్యాసాలు

సాధారణం

Pictureనోబెల్ బహుమతి గ్రహీత, స్విస్ భాషా రచయిత హెర్మన్ హెస్ తన “సిద్ధార్థ” నవలలో నదిని వినడం ద్వారా సమస్తం తెలుసుకోగలుగుతామని బోధిస్తాడు. అయితే అంతకు చాలాకాలం ముందునుంచే బైబిలు భూమితో మాట్లాడితే మరిన్ని విషయాలపట్ల వివేచన కలుగుతుందని చెప్తుంది. విప్లవకవి వరవరరావు తన విమర్శ వ్యాస సంపుటికి అదే పేరు “భూమితో మాట్లాడు...” అనే ఖాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఈ వారం పాఠకులకు పరిచయం చేస్తున్నాను. వరవరరావు అనగానే ఈ తరం పాఠకులకు విప్లవకవిగానే తెలుసు. కానీ వరవరరావు మరిన్ని రంగాలలో కూడా సునిశితమైన కృషి చేశారన్న విషయం వీరికి తెలియదు. ఉపన్యాసకుడు, పాఠకుడు, అనువాదకుడు, కథకుడు, విమర్శకుడు, ఉద్యమకారుడు అయిన వివి దాదాపు దశాబ్దం పాటు ‘సృజన’ మాసపత్రిక వెలువరించారు. పత్రిక సంపాదకునిగా ఎన్నోసార్లు ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. సమకాలీన సాహితీ చరిత్రలో ఉద్యమ సమానంగా సాహిత్య కృషి చేస్తోన్న వ్యక్తి వివి. తను మాత్రం గద్దర్ ను లివింగ్ లెజెండ్ అని వినమ్రంగా పేర్కొంటారు గానీ, ఆ ఉపమానానికి వరవరరావు జీవితం కూడా చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సాహిత్య విమర్శలో ప్రశంసనీయమైన కృషి సలిపిన వరవరరావు .కల్పన సాహిత్యంలో ముఖ్యంగా కథాసాహిత్యంలో ఇటీవల వెలువడిన అనేక సంపుటాలకు రాసిన ముందుమాటలు, పరిచయాలు ఒకచోట చేర్చి వెలువరించిన పుస్తకమే ఈ “భూమితో మాట్లాడు…”. ఒక పుస్తకాన్నో, రచయితనో, ప్రక్రియనో వ్యాస రచయిత పరిచయం చేసిన తీరు సాహిత్య విద్యార్థులు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయదగ్గది. అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది‘ నవలలో ప్రారంభమై ఎన్. వేణుగోపాల్ ‘కథాసందర్భం‘పై రాసిన వ్యాసంతో ముగిసిన ఈ వ్యాస సంపుటిలో 23 వ్యాసాలున్నాయి. సృజన మాస పత్రికలో ఒక నవల ప్రచురణ ఎంత కష్టసాధ్యంగా జరిగేదో మొదటి వ్యాసంలో చూచాయగా మనకు అర్థమవుతుంది. అల్లం రాజయ్యతో రాసిందే రాయించి, మళ్లీమళ్లీ తిరగ రాయించి, అప్పుడు గానీ దానిని ప్రచురించే వారు కాదన్నమాట. అందుకే ఆ నవల అప్పట్లో తెలంగాణ పల్లె ప్రాంతాలలో రేడియోలో వార్తలు వినేట్టుగా అందరూ గుమికూడి ఒక్కరిచేత చదివించుకుని వినేవారట. అలాంటి ప్రచురణలు ఇప్పుడు పూర్తిగా కరువైపోతున్నాయి. అదే సృజనలో వెలువడిందే నవీన్ ‘అంపశయ్య‘ కూడా. ‘ప్రజలమనిషి‘, ‘గంగు‘ అనే నవలలను పరిచయం చేస్తూ వట్టికోట ఆళ్వారుస్వామి రచనా జీవితాన్ని అంచనా వేస్తారు.

‘ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య వైరుధ్యాలు పరిష్కారం కావడమన్నది సాఫీగా, శాంతియుతంగా జరిగే పనికాదు. ఉత్పత్తి శక్తులమీద, ఉత్పత్తి సాధనాల మీద, ఉత్పత్తి మీద నియంత్రణ చేసే వర్గాలు పాలక వర్గాలుగా, ఉత్పత్తి శక్తులు పాలిత వర్గాలుగా జీవిస్తూ నిరంతరం అనివార్యంగా ఘర్షణ పడుతున్న వ్యవస్థ యిది’ (పే. 19). ఇలాంటి సూత్రీకరణలు అంతగా మనకెదురవని మార్క్సిస్టు సిద్ధాంతపు అన్వయ విమర్శ అధ్యయనం చేయాలనుకున్నవారికి ఈ “భూమితో మాట్లాడు…” వ్యాస సంకలనం ఎంతగానో సహకరిస్తుంది. ఉదయం దినపత్రికలో ‘మానవి’ శీర్షికలో డాక్టర్ కరుణ రాసిన వ్యాసాలు, కథలూ, కవితలూ కలిపి ‘తర్జని’గా సంకలనపరచగా దానికి రాసిన ముందుమాట అశ్రురశ్మి చదివినప్పుడు మాత్రమే కరుణ రచనలను ఎంతో చక్కగా ఆస్వాదించగలుగుతాము. ఆర్ కె పబ్లికేషన్స్ ప్రచురించిన రెండు కథా సంపుటాలు ‘శ్వేతరాత్రులు’, ‘రుతుపవనాలు’కు వివరంగా రాసిన ముందుమాటలు చదివి అర్థం చేసుకోవడం కేవలం సమకాలీన సాహిత్యాన్ని ఎంత జాగరూకతతో అవగాహన చేసుకోవాలో తెలుసుకోవడానికే. భూపాల్ రాసిన “అంబల్లబండ’ కథలకు ముందుమాట రాస్తున్న సమయంలోనే తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘పనిపిల్ల’ కథ ప్రచురణైంది. ఆ కథలో వున్న గూఢత్వాన్ని, గొప్పతనాన్ని చూచాయగా వివి ప్రస్తావిస్తారు. తరువాత తెలుగు సాహిత్య రంగంలో ‘పనిపిల్ల’ కథ పెను దుమారం రేపి, ఎంతో చర్చకు తెరతీసింది.

ఈ వ్యాసాల్లో నాకు బాగా నచ్చిన వ్యాసాలు కాళీపట్నం రామారావు సాహితీ జీవితాన్ని అంచనా వేసేదొకటి. మరొకటి జి, కళ్యాణరావు నవల “అంటరాని వసంతం” మీద రాసింది. కారా మేష్టారి కథలమీద వ్యాసం చదివాక మళ్లీ మరోసాతి మేష్టారి కథలన్నీ చదవాలనిపించింది. “సేనాపతి వీరన్న”, “వీరడు-మహావీరుడు”, “ఆర్తి”, యజ్ఞం”, “కుట్ర”, “హింస” లాంటి కథలు మళ్లీ ఈ తరం యువ రచయితలనుంచి ఆశించడం అత్యాశేనేమో. బీజరూపంలో వుండే ఆనాటి సమస్యల స్వరూపం మారిందే కానీ ఇవ్వాళ అవే సమస్యలు వటవృక్షం మాదిరిగా వేళ్లూనుకుని అందరి బతుకులను శాసిస్తూ, అవే కొత్తకొత్త రూపాలలో మన జీవన విలువలను తలకిందులు చేస్తున్నాయి. నిజానికి ఆనాటి కథలు చదువుతుంటేనే ఆ సమస్యలను అంత విశ్లేషణాత్మకంగా చిత్రించడంలో కారా, రావిశాస్త్రిలాంటి వారు ప్రదర్శించిన అత్యున్నత స్థాయి నైపుణ్యానికి ఎక్కడలేని ఆశ్చర్యం కలుగుతుందే, మరి ఇవ్వాళ్టి సంక్షుభిత సమాజాన్ని చిత్రించడానికి మరెంత పదునైన సాహిత్యం కావాలో కదా!

అలాగే ఇటీవల వెలువడిన జాన్ పెర్కిన్స్ రచన ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ చదివాక సామ్రాజ్యవాదుల చేతుల్లో కొందరు దేశాధినేతలు ఎలా కీలుబొమ్మలుగా మారుతున్నారో తేటతెల్లమైంది గానీ, 1999లోనే శేషు రచనలు “శేషవాక్యం”కు ముందుమాట రాస్తూ వివి ఇలా అనడం అతనికే చెల్లింది. ‘జానెడు కడుపుకు ఆదరువు లేకుంటే అడుక్కుంటే అది బిచ్చమెత్తడం. ప్రపంచబ్యాంకు దగ్గర అప్పుతెచ్చి అడవులు సర్వే చేయడానికి హెలికాప్టర్లు కొని, ప్రపంచ మార్కెట్ కోసం ఫ్లైఓవర్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మిస్తే అది విజన్. ఆ అంతర్జాతీయ బిచ్చగాని పీడకలల్ని పెంగ్విన్ వాళ్లు పుస్తకంగా ప్రచురిస్తారు’. ఇవి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుద్దేశించి అన్న మాటలు. ఆ పుస్తకాన్ని రాయడాంలో సాయం చేసింది సేవంతి నైనన్ అనే రచయిత్రి. ఆమె ఈ గ్లోబలైజేషన్ రహస్యాలు విప్పి చెప్పే పత్రిక (ది హిందూ)లో మీడియా డొల్లతనం విశ్లేషించే మీడియా పల్స్ అనే కాలమ్ రాస్తుంటుంది! ఈ విషయాలు అర్థం చేసుకునే కొద్దీ మతిపోతుంది కదా.

ఈ పుస్తకాన్ని టైటిల్ గా పెట్టిన పేరు కళ్యాణరావు రచించిన “అంటరాని వసంతం” నవలను సమీక్షిస్తూ వివి అన్న మాటలు. నిజానికి ఈ నవల ఏ అంతర్జాతీయ స్థాయి సాహిత్యంతోనైనా పోటీపడగలిగేది. అలెక్స్ హేలీ రాసిన “ది రూట్స్” నవలకంటే నిజంగా గొప్ప నవల. అపార్తీడ్ ల కంటే నీచమైన అంటరాని సంస్కృతి మనదేశంలో తప్ప మ్హూమ్మీద మరెక్కడా కనిపించదు. ఆ వివక్ష విషస్వభావపు విశ్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రించడంలో కళ్యాణరావు నూటికి నూరుపాళ్లు సఫలమయ్యారు. ఇది నిజానికి చదివే నవల కాదు. ఊరూరా గానం చేస్తూ చెప్పుకోవాల్సిన నిజమైన భారతీయ కథానిక్ ఈ “అంటరాని వసంతం”. ఈ నవల చదవడం ఒక దుఖం తెప్పించే, ఒళ్లు గగుర్పొడిపించే, సిగ్గుతో చితికిపోయేలాచేసే అనుభూతి కాగా, దీనికి వివి ముందుమాట నవలంతా చదివాక చదవడం మరో అద్భుతమైన అనుభూతి. ఖచ్చితంగా నవలసారం మన రక్తంలోకీ మూలుగుల్లోకీ ఇంకిపోతుంది.

కారాతోపాటు ఈ పుస్తకంలో విశ్లేషణకు చోటు దక్కించుకున్న మరో ఇద్దరు ఉత్తరాంధ్ర కథకులు అట్టాడ అప్పల్నాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు. సాహిత్య విద్యార్థులు తప్పక చదవాల్సిన ఈ 150 పేజీల “భూమితో మాట్లాడు…” వ్యాస సంకలనం ఖరీదు 35 రూపాయలే. మరి మీరూ చదువుతారుగా!

భూమితో మాట్లాడు...” కల్పనా సాహిత్యం – వస్తు వివేచన

వరవరరావు

 యుగ ప్రచురణలు 2005

పేజీలు 147, వెల. 35 రూ.లు

ప్రకటనలు

3 responses »

  1. ఎప్పటి నుండో మీ బ్లాగు చదువుతున్నాను. ఎన్నో మంచి పుస్తకాల గురించి తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు రవికుమార్ గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s