నాయకులకే కాదు ప్రజలకూ తెలియాలి పాలన

సాధారణం

paalanaరాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్సుకు, పాలన శాస్త్రం అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషనుకు పోలికగానీ తేడాగాని తెలియని సైన్స్ గ్రాడ్యుయేట్లను చూస్తుంటే మన చదువుల మీద చిరాకేస్తుంది. ఒకసారి పుస్తకాల పార్సిలు వి.పి.పిలో వస్తే విడిపించుకోవడానికి పోస్టాఫీసుకు వెళ్లాను. పదిహేను పదహారేళ్ల కుర్రాడొకడు స్టాంపుల కోసం కౌంటర్లో అడిగాడు. పోస్టల్ అసిస్టెంట్ ఆ కుర్రాడి మీద దయ చూపకుండా “ఏవి కావాలి? పోస్టల్ స్టాంపులా? రెవెన్యూ స్టాంపులా?” అని అడిగాడు. ఆ రెండింటికీ తేడా తెలియని ఆ కుర్రాడు బిక్కమొగం వేశాడు. ఆ కుర్రాడి దగ్గరకెళ్ళి వాటిని దేనికోసం తెమ్మన్నారో కనుక్కుని సమస్యను పరిష్కరించామనుకోండి, గాని మన యువతరం ఎలా తయారవుతుందో తెలుసుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. రెండు అట్టల మధ్యనున్న పాఠ్యపుస్తకం మినహా విద్యార్థులకు మరో విషయం తెలియడం లేదు. తెలుసుకోవడం చాలా ప్రమాదకరమన్నట్టు అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు  ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం పొందడం పాలకులకు ఇష్టం ఉండదు. పాలితులు అజ్ఞానంలో మగ్గినన్నాళ్లు పాలకుల ఠీవి కొనసాగుతుంది. ఇందుకు మనదేశంలో బీహార్ లాంటి రాష్ట్రాలు మంచి ఉదాహరణలు.  కానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తూ యువతరం పాఠ్యపుస్తకాలు తప్ప మరో పుస్తకం చదవకుండా చేసేస్తున్నారు. ఇదే సందర్భంలో చదువుకున్నా మనుకున్న వారి ఆలోచనల్లో డొల్లతనం కూడా చెప్పాలనిపిస్తోంది.

సామాజిక చైతన్యం కోసం కృషిచేస్తున్న ఒక సంస్థ నిర్వహిస్తోన్న సమావేశానికి ఇటీవల వెళ్లాను. మేనేజ్ మెంట్లో గత దశాబ్దకాలానికి పైగా బోధనరంగంలో వున్న పెద్దాయన ఉపన్యాసం దంచుతున్నాడు. శ్రోతల్ని భావావేశానికి గురిచెయ్యాలన్న ఆయన ప్రయత్నం భంగమైపోవడానికి ఆయన ఎంచుకున్న పదజాలం ఒక కారణం. దాన్నంతటినీ పక్కనపెడితే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ గురించి ఆయన ఇచ్చిన ప్రసంగం ఎంత చవకబారుగా వుందంటే కేవలం ‘సాక్షి’, ‘ఈనాడు’ లాంటి పత్రికల ఎడిటోరియల్ పేజీలు చదువుకున్న వారికైనా సంతృప్తిపరచలేని ఉపన్యాసమది. మరో మేనేజ్ మెంట్ గురువు దగ్గర నేనీ సొదంతా మొరపెట్టుకున్నాను. ఎందుకు మన ఉపాధ్యాయులైనా కనీసం “ఫ్రంట్ లైన్”, “ఇపిడబల్యు” లాంటి పత్రికలు చదవరని వాపోయాను. ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్ మెంట్ పాఠాలు బోధిస్తున్న ఆ ‘మేనేజ్డ్ గురువు‘ ‘ “ఫ్రంట్ లైన్” తెలుసు, ఆ మిగతా “ఇపిడబ్ల్యు”, “సెమినార్” లు అవేమిటవి?” అనడిగాడు. హతవిధీ!

ఈ వారం పరిచయం చేయబోతున్న పుస్తకం “పాలనా తత్త్వవేత్తలు“. ఇది అకడెమిక్ పుస్తకమయినా ఎందుకో నన్ను కట్టి పడేసి చదివించిన పుస్తకాలలో ఇదొకటి. (బ్లాగు పాఠకుల ఆసక్తులను దృష్టిలో వుంచుకుని పరిచయం చేయనుగానీ, నన్ను అలా కట్టిపడేసిన మరికొన్ని పుస్తకాలలో జె. దుర్గాప్రసాద్ గారి “చరిత్ర రచనా శాస్త్రం”, డబ్, సిన్నట్ లు రాసిన “జన్యు శాస్త్రం” పుస్తకాలు అక్షరం వదలకుండా చదివాను. ఒకటి హిస్టరీ, మరొకటి జెనెటిక్స్ పుస్తకాలు. రెండూ తెలుగు అకాడెమీ ప్రచురించినవే కావడం విశేషం.) సివిల్ సర్వీసెస్, గ్రూప్ వన్, ఇతర పోటీ పరీక్షలలో పబ్లిక్ అడినిష్ట్రేషన్ ఆప్షనల్ గా తీసుకునే వారే కాకుండా మానవ వనరులను మరింత ఉపయుక్తంగా, శక్తిమంతంగా, ప్రతిభావంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చునో తెలుసుకోదగ్గవారంతా చదవవలసిన పుస్తకం ఈ “పాలనా తత్త్వవేత్తలు”.

పాలన వేరు, నిర్వహణ వేరు. పాలన వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు రాజ్య విధానాలకు సంబంధించినవి. అయితే ఆ విధానాల అమలుకు సంబంధించిందే పాలన అని స్పష్టంగా నిర్వచనమిచ్చి పాలన శాస్త్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది ఉడ్రోవిల్సన్. అనంతరం ఫెయల్స్, టేలర్, ఉర్విక్, మాక్స్ వెబర్, లూథర్ గతిక్, ఫాలెట్, ఎల్టన్ మేయో ఇలా ఒకరేమిటి ఎందరో తత్వవేత్తలు… తమ అనుభవాలనుంచి, తమ వ్యక్తిగత సాధకబాదకాల నుంచి సిద్ధాంతీకరించిన విశేష విషయాలన్నీ కొందరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు కూడబలుక్కుని గుదిగుచ్చారు. ఆయా కాలాలలో వారి సిద్ధాంతాలను, ఆ సిద్ధాంతాల నేపథ్యాలను, ఒక సిద్ధాంతంలోని బలమైన అంశాలను అంగీకరిస్తూనే బలహీన అంశాలను ఖండిస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు వెలుగులోకి రావడమూ అవి కొన్నాళ్లు రాజ్యమేలి కాలగర్భంలో కలిసిపోవడమూ చాలా సహజంగా జరిగిపోతున్న విషయంగా ఈ ఇరవై వ్యాసాలు చదివితే అర్థమవుతుంది. కౌటిల్యుడు దగ్గర మొదలైన ఈ వ్యాస పరంపర కారల్ మార్క్స్ పాలనా సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తూ ముగుస్తుంది.

క్రీస్తుకు పూర్వం రెండువేల మూడొందల ఏళ్ల కిందట కౌటిల్యుడు రచించిన “అర్థశాస్త్రం” నిజానికి ఎకనమిక్స్ టెక్స్ట్ బుక్ కాదు. మాఖియవెల్లి రాసిన “ప్రిన్స్” లాగా రాజనీతి, పాలనకు సంబంధించిన పుస్తకం. 15 అధికరణాలు, 149 అధ్యాయాలు, 180 ప్రకరణాలుగా విస్తరించిన ఈ “అర్థశాస్త్ర” రాసిన కాలంలో రాజ్యాలన్నీ ఏకస్వామ్య రాజ్యాలు కావడం వలన రాజే సర్వం సహాధికారిగా వుండే కేంద్రీకృత పాలనాధికారాన్ని కౌటిల్యుడు ప్రతిపాదించాడు. ఒక చక్రంతో బండి నడవనట్టుగా రాజుకు ఏడు ప్రకృతులు లేదా అంగాలు ముఖ్యమైనవిగా కౌటిల్యుడు ఉపదేశిస్తాడు. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ, మిత్ర ప్రకృతులుగా వర్ణించిన కౌటిల్యుడు మిత్ర ప్రకృతిలో విదేశీ వ్యవహారాలు (ఫారిన్ పాలసీ) ఎలా నెరపాలో వివరిస్తాడు. సమహర్తగా పిలవబడే ఆర్థికమంత్రి, గోపుడనే ఆర్డీవో, గ్రామిన అనే విఏవోలు ఇప్పుడు చూస్తున్నాం గానీ గ్రామస్వాములను మనం ఎరగం. ఇవాళ గ్రామంలో తగాదాలన్నీ ఎక్కడ పరిష్కారమవుతున్నాయి? “పిలక తిరుగుడు పువ్వు”లో పతంజలి చూపించిన మాదిరిగా పోలీస్ స్టేషన్ లలో లేదంటే ఆ ఏరియా ఎమ్మెల్యే తొత్తు అనబడే కాంట్రాక్టరింట్లో తగువులు పరిష్కారమవుతుంటాయి. మరి నాలుగు వేల సంవత్సరాల కిందట కౌటిల్యుడు ఏమన్నాడో తెలుసా? గ్రామంలోని వృద్ధులంతా గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలి. సరిహద్దు వివాదాలను శాంతంగా పరిరక్షించుకోవాలి. గ్రామ రక్షణపట్ల జాగ్రత్త వహించాలి. గ్రామంలోని యువతకు జాగ్రత్తలు నేర్పించాలి” అన్నాడు. ముచ్చటేస్తుంది కదూ!

ఇక ఆధునిక పాలన తత్తవేత్తలను గురించి ఆలోచించినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నే మొదట జ్ఞప్తి చేసుకోవాలి. ఎడ్మండ్ బర్క్, వాల్టర్ బేగ్ హాట్, రిచర్డ్ ఎలీ లాంటి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ల పాఠాలు విని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ, పాలనకు సంబంధించి అనేక ప్రాథమిక, మౌలిక సూత్రీకరణలు చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు విల్సన్. ఇక పాలన (అడ్మినిస్ట్రేషన్)కు, నిర్వహణ (మేనేజ్ మెంట్) భావనను జోడించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ను కొత్తపుంతలు తొక్కించింది ఫ్రెడరిక్ టేలర్, హెన్రీ ఫేయల్. ఇంక అక్కడనుంచి పాలనా చింతనకు ఒక అద్భుతమైన అవకాశం చిక్కింది. అదేమిటంటే రాజులు, రాజ్యం, పాలితులు, ప్రజానీకం లాంటి వాటి గురించి మాట్లాడడం మానేసింది శాస్త్రం. శాస్త్రంలో ప్రజాస్వామ్య పునాదులు ఏర్పడ్డాయి. మిగిలిన విజ్ఞాన శాస్త్రజ్ఞులు, అందులో ముఖ్యంగా సోషియాలజీ, బిహేవిరియల్ సైకాలజీ స్రష్టలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకి చొరబడి శాస్త్రపరిధిని విశాలం చేశారు. పాలన విషయంలో ఉద్యోగస్వామ్యం (బ్యురాక్రసీ) గురించి మార్క్స్ కు, హెగెల్ కు దాదాపు వ్యతిరేక అభిప్రాయాలు ఉండేవని నాకీ వ్యాసాలు చదివాకే తెలిసింది.

మరి ‘దాస్ కాపిటల్’ రెండు, మూడు భాగాల సంపాదకత్వం వహించినప్పుడు హెగెల్ తన భావాలు వెలిబుచ్చకుండా వుండడానికి ఎంత ప్రయాసపడవలసి వచ్చిందో కదా? రాజ్యమే కాదు, దేశమే కాదు, రాష్ట్రమే కాదు, ఒన చిన్న సంస్థనైనా వ్యవస్థాగతంగా, సమర్ధంగా, ప్రజాహితంగా ఎలా నడపొచ్చో తెలియాలంటే ఈ “పానలా తత్వవేత్తలు” పుస్తకం చదవాల్సిందే. 19 మంది ఆలోచనాపరులు, 20 వ్యాసాలు, 350 పేజీలతో పాలనా సిద్ధాంతాలపై చక్కటి అవగాహన ఏర్పరచగలిగే ఈ పుస్తకాన్ని స్టెర్లింగ్ పబ్లిషర్స్ కేవలం రూ. 90 లకే అందిస్తున్నారు. తప్పక చదవండేం.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s