ముప్పైఎనిమిదో వారం చదువు ముచ్చట్లు గొర్తి సాయిబ్రహ్మానందంతో…

సాధారణం

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం రెగ్యులర్ గా చదివే కథాప్రియులకు గొర్తి సాయి బ్రహ్మానందం గారి పేరు సుపరిచితం. ప్రతి ఏటా కనీసం రెండు, మూడు మంచి కథలు రాసే ఈయన వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పుట్టి పెరిగింది కోనసీమ అమలాపురంలోనే చదువు కొనసాగించింది మాత్రం విశాఖపట్నంలో. ప్రస్తుతం వుంటున్నది అమెరికాలో. ‘కంప్యూటర్ బానిసత్వంలో మగ్గుతున్న సిలికాన్ వేలీ తెలుగువాళ్లలో నేనూ ఒకణ్ని’ అని తనను తాను పరిచయం చేసుకునే సాయి బ్రహ్మానందం రాసిన కొన్ని నాటకాలు నంది నాటక పరిషత్ పోటీల్లోనూ, పరుచూరి పరిషత్తులోనూ ప్రదర్శితమయ్యాయి. ఈయన రాసిన “అపార్ట్ మెంట్” నాటకానికి బహుమతులు కూడా పొందారు. దూరదర్శన్ సప్తగిరిలో కొన్ని నాటకాలు ప్రసారమయ్యాయి. అప్పుడప్పుడూ రాస్తూన్న కథలూ వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. ఈ వారం ఆయన చదువు ముచ్చట్లు వినండి మరి…

1. మీకు ఎలాంటి రచనలు నచ్చుతాయి? ఎలాంటివి నచ్చవు?

కొత్తదనంతో కూడిన ఏ రచనయినా ఇష్టమే! చదవడం మొదలెట్టిన పాఠకుడి చిటికిన వేలు పట్టుకొని చివరి వరకూ తీసుకెళ్ళగల ఏ రచనయినా ఇష్టమే! భాషా, శైలీ ఈ రెండు విషయాల్లో బాగా పట్టింపుంది. ఇవి బావుంటే రెండో సారి చదువుతాను.  వస్తువూ, విషయమూ ఎంత గొప్పవైనా చదివించే గుణం లేకపోతే పేలవంగా వుంటాయి. అలాంటి రచనల జోలికి పోను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

సావిత్రి జీవిత చరిత్ర మీద పల్లవి రాసింది చదివడం పూర్తయ్యింది. వైదేహీ శశిధర్ నిద్రితనగరం చదివాను. బావుందా కవిత్వం. పుస్తకం చదవకండా రోజు గడవదు. నచ్చితే పూర్తిచేసేవరకూ నిద్రపోను.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

లెక్క పెట్టలేదు. చాలానే ఉన్నాయి. నాకు నచ్చితే దాచుకుంటాను. లేకపోతే ఎవరైనా చదవడానికి అరువు తీసుకొని తిరిగివ్వకపోయినా పట్టించుకోను.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

పుస్తకం దొరక్కపోతే చదవలేనేమో కానీ, ఒక్కసారి చేతికొచ్చాక పూర్తిచేయకపోవడమనే సమస్య రాదు. న్యూ యార్కర్ పత్రిక మాత్రం చాలా ఇబ్బందుల్లో పెడుతుంది. ఒక పత్రికొచ్చాక చదవడం మొదలుపెట్టి రెండు మూడు శీర్షికలు పూర్తయ్యేలోపునే మరోటొచ్చి కూర్చుంటుంది. కొత్తది చూసాక పాతవి వెనకబడి పోతాయి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

రచయితలూ అనేకంటే రచనలంటే బావుంటుందేమో? పలానా రచయిత రచనలంటే ఇష్టమని ఖచ్చితంగా చెప్పలేను. రచన ముందూ, తర్వాత రచయితనీ ఇష్టపడతాను. రచన ఎలా ఉన్నా గుడ్డిగా ఒకే రచయితని అభిమానించను. ఉదాహరణకి రంగనాయకమ్మ గారి బలిపీఠం, జానకి విముక్తి నవలలు చాలా ఇష్టం. అలా అని ఆవిడ రాసినవన్నీ నచ్చుతాయా అంటే లేదనే చెప్పాలి. కాకపోతే ఆవిడ రాసే వాక్యం నచ్చుతుంది.

నచ్చిన రచనలు చాలా వున్నాయి. కొంతమంది రచయితల శైలి ఇష్టం. రావిశాస్త్రీ, బీనాదేవి, ముళ్ళపూడి, శ్రీపాద వీళ్ళ శైలి నచ్చుతుంది. వీళ్ళు కాకుండా చివుకుల పురుషోత్తం రాసిన “ఏది పాపం?” నవలా, మంథా వెంకట రమణా రావు రాసిన “తృష్ణ” నవలలు నాకు నచ్చిన వాటిల్లో కొన్ని. విశ్వనాధ వారి చెలియల కట్ట, ఏకవీర కూడా ఇష్టమే! యండమూరి కొన్ని రచనలిష్టం. బుచ్చిబాబూ, చలంల రచనలూ ఇష్టపడతాను. బుచ్చిబాబు నవలల్లో మానసిక విశ్లేషణ చాలా గొప్పగా వుంటుంది.  హిందీలో నాకు ప్రేమ్ చంద్ రాసిన “గబన్”, సేవాసదన్ నవలలిష్టం. అలాగే అన్నమయ్యా, త్యాగయ్యల సంగీత రచనలనలూ ఇష్టపడతాను. నచ్చిన వాటి జాబితా కొల్లేటి చాంతాడంతుంది. అందులో మన సాహిత్యానికి సంబంధించినవి మాత్రమే చెప్పాను.  ఇంగ్లీషు పుస్తకాల జాబితా ఇవ్వదలుచుకోలేదు.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఎదుటివారి అభిరుచిని బట్టి పుస్తకాలు బహుమతులుగా ఇస్తాను. సాధారణంగా మంచి పుస్తకం అయితే ఇవ్వను. దాచుకుంటాను. ఇహ తీసుకోడం అంటారా, ఇస్తే కాదనను. మంచి పుస్తకం ఇచ్చారనుకోండి, ఇచ్చిన గుర్తుగా వాళ్ళ పేరూ, ఇచ్చిన తేదీ లోపల రాస్తాను ( వాళ్ళు రాయకపోతే).

7. మీ అభిప్రాయంలో ఇప్పుడొస్తున్న పత్రికల్లో మంచి సాహిత్య పత్రిక ఏది?

మంచి సాహిత్య పత్రికలంటూ ప్రత్యేకంగా ఏవున్నాయి? విపులలో కథలు బావుంటున్నాయి. సాక్షి పత్రికలో అనువాద కథలూ బావుంటున్నాయి. పలానా పత్రిక అనే కంటే అందులో వచ్చిన రచనలే నాకు ముఖ్యం. వెబ్ పత్రికల్లో నాణ్యత పరంగా ఈమాట, ప్రాణహితా బావుంటున్నాయి. కౌముది పరవాలేదు. కొన్ని వెబ్ పత్రికల్లో పాతవి పునఃముద్రణ విరివిగా వుంటోంది.

తెలుగునాటొచ్చే పుస్తకాల్లో తెలుగు ఇండియా టుడే చాలా నచ్చుతుంది. ముఖ్యంగా అందులో వాడే భాష. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రతీ నెలా “వాంఙ్మయి” అనే ఒక పుస్తకం ప్రచురిస్తారు. అందులో వచ్చిన సాహితీ వ్యాసాలు బావుంటాయి. ఇండియా వెళ్ళినప్పుడల్లా ఆ పుస్తకాలు  తెచ్చుకుంటాను.

8. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. ఇంగ్లీషయితే న్యూ యార్కరూ, తెలుగులో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు రాసిన నలభై ఏళ్ళ క్రితం నాటి వ్యాసాలూ, మధ్య మధ్యలో ఏంజిల్స్ అండ్ డీమన్స్! ఇహ ఇంటర్నెట్ అంటారా? చదవకుండా రోజు వెళ్ళదు.

9. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ప్రభావితం చేసిన రచనలు చాలానే ఉన్నాయి. వాల్మీకి రామాయణంతో మొదలు పెడితే చా…….లా పెద్ద జాబితా వుంది. గాంధీ రాసిన సత్యశోధన ( తెలుగనువాదం ) స్వామీ యోగానంద రాసిన “ఒక యోగి ఆత్మ కథ” ల ప్రభావం చాలా వుంది. అలాగే మహాభారతం అరణ్య పర్వంలో ఉన్న ధర్మవ్యాధుడి కథ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ కథనే “పంచమ ధర్మం” పేరుతో పద్యనాటకం రాసాను. నంది నాటక పోటీల్లో ప్రదర్శించారు. అలాగే రావి శాస్త్రి రాసిన కొన్ని కథల ప్రభావమూ వుంది.  రావి శాస్త్రి రాసిన “వేతన శర్మ” కథని “చినుకు” పేరుతో నాటకీకరించాను. ఇదీ ఆంధ్రాలో చాలా ప్రదర్శనలిచ్చారు.  ఇంకా ప్రేమ్ చంద్ రచనలూ నా ఆలోచనావిధానాన్ని బాగా ప్రేరేపితం చేసాయి.  నాకు నాటకాలన్నా కూడా ఎంతో ఇష్టం. వీటి ప్రభావం కూడా వుంది.

10. యువ పాఠకులకు మీరిచ్చే సలహా…

సలహాలూ, సందేశాలూ ఇచ్చేటంతటి స్థాయి నాకు లేదు. కాకపోతే నేను గమనించిన కొన్ని విషయాలు చెప్పగలను. పాత సాహిత్యాన్నీ, రచనల్నీ చదవమని చెబుతాను. తెలుగులో చక్కటి వాక్యం రాయడానికి కృషిచేయాలి. రచనలకి వస్తువు హృదయమైతే, భాష ఊపిరి. రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాసింది బ్రతికి బట్ట కడుతుంది.

ప్రకటనలు

4 responses »

  1. రాళ్ళపల్లి గారి “సారస్వతలొకం” వారి మనమరాలు ఈమధ్య మళ్ళీ ప్రచురించారు. అది చదువుతున్నారా?

  2. బ్రహ్మానందం గారు బొమ్మలు కూడా వేస్తారని చాలా మందికి తెలియదనుకుంటా.
    బ్రహ్మానందం గారు, మీ త్యాగయ్య పుస్తకం మంచి reference అవుతుంది. దాని కోసం వేచిచూస్తున్నాం.

  3. “తెలుగులో చక్కటి వాక్యం రాయడానికి కృషిచేయాలి. రచనలకి వస్తువు హృదయమైతే, భాష ఊపిరి. రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాసింది బ్రతికి బట్ట కడుతుంది.”
    చక్కగా చెప్పారు

  4. బ్రహ్మానందం గారు బొమ్మలు కూడా వేస్తారని చాలా మందికి తెలియదనుకుంటా.
    బ్రహ్మానందం గారు, మీ త్యాగయ్య పుస్తకం మంచి reference అవుతుంది. దాని కోసం వేచిచూస్తున్నాం.;. All the best!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s