మహాకవి నోట అతి మామూలు పాటలా?

సాధారణం

sipraliఎవరైనా కాసులకు కవిత్వం రాస్తారా? సినిమా పాటలుగా చెలామణి అవుతున్న సాహిత్యమంతా డబ్బు కోసం, డబ్బువలన, డబ్బుచేత తయారవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. మరి కవిత్వం అలా డబ్బుతో పుడుతుందంటే సాహిత్యాభిమానులు ఒప్పుకుంటారా? అందులో మహాకవులు నాలుగురాళ్లకోసం కవిత్వం రాస్తారని మనం ఊహించం. మరి శ్రీశ్రీ వంటి మహాకవి గ్లాసెడు సారా కోసం కవిత రాస్తాడంటే మీరు నమ్ముతారా? కాని మీరు నమ్మక తప్పదు. ఈవారం మహాకవి శ్రీశ్రీలోని మరోరకం కవిరూప దర్శనం చేయించే “సిప్రాలి” అనబడే ‘సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరిక్కులు’ అనే కవితాసంపుటిని పరిచయం చేస్తున్నాను.

‘రాసిందేదో రాస్తాం / తీసుకొనుము తోచినంత / తీపో చేదో / సీసాపైనేగా మన / ధ్యాస హమేషా / గళాసు దాల్చిన ఏసూ / ఏ సోడా ఏ నీళ్లు / వీసంకూడా కలపక విస్కీ / సునాయాసంగా ఔపోసన / చేసేస్తానోయ్ శబాసు శ్రీమాన్ ఏసూ!” అలా మందుకోసం, సిగరెట్లు కోసం, సరదా కోసం కవిత్వం రాసిన శ్రీశ్రీ “సిప్రాలి” మొదటి పేజీనుంచి చివరి పేజీదాకా ప్రతి పద్యం మనల్ని చదవనిస్తుంది. అయితే ఝంఝామారుతం లాంటి శ్రీశ్రీ కవిత్వం మాత్రం ఈ “సిప్రాలి”లో ఆశించకూడదు. కాని కవిత్వ తీవ్రతకు ఏమాత్రం ఢోకాలేదు. హాస్యం పరమావధిగా కొనసాగే “సిప్రాలి”లో ‘సిరిసిరిమువ్వలు’, ‘మేమే’, ‘ప్రాసక్రీడలు’, ‘పంచపదులు’, ‘లిమరిక్కులు’ అనే మొత్తం ఐదు భాగాలు కలిపి శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం పద్నాలుగో భాగంగా విరసం ప్రచురించింది.

శ్రీశ్రీ, ఆరుద్రలు కలిపి రాసిన ‘రుక్కుటేశ్వర శతకం’ కూడా ఇందులో చేర్చారు. జలసూత్రం రుక్మీనాథశాస్త్రి పేపర్ కోసం రాసిన సరదా పదాల పద్యాల గారడి ఈ శతకం. ఇక ‘ప్రాసక్రీడలు’లో అప్పటి ప్రభుత్వంపై విసుర్లు, సాహిత్యవేత్తలపై కసుర్లు కనిపిస్తాయి. ‘పొడిచేస్తామని చెప్పిన / మన కాంగ్రెస్ వారు / తడిరాష్ట్రాలన్నిటిని / ‘పొడి’ చేస్తున్నారు’ అంటూ కాంగ్రెస్ పార్టీని చెడామడా తిడతారు. ఇక ఆనాటి దిగ్గజాలలాంటి రాజకీయ నాయకులను ఎవ్వరినీ వదలలేదు. వాళ్లను విమర్శిస్తూ పద్యాలు గుప్పించారు. ఆచార్య ఎన్. జి. రంగా అనుచరుడైన గౌతు లచ్చన్నను, నీలం సంజీవరెడ్డి రాజకీయ మంత్రాంగంతో మంత్రివర్గంలో చేర్పించారు. అందుకు రంగాపై కూడా శ్రీశ్రీ అక్షింతలు జల్లారు. చూడండి:

ఇలా రాజకీయాల నికృష్ట పరిస్థితిని బట్టబయలు చేస్తున్న శ్రీశ్రీపై ఎప్పటిలాగే ఏలికలు తమ కన్నెర్ర చేసేవారు. దాంతో ఆగ్రహోదగ్రుడైన శ్రీశ్రీ మరింత తీవ్రంగా విరుచుకుపడి పోయేవారు. దానికి అతడు ఇచ్చిన సంజాయిషీ ఇది: ‘వ్యక్తుల ప్రైవేటు బతుకు / వారివారి సొంతం / పబ్లికులో నిలబడితే / ఏమైనా అంటాం’ . తన కవిత్వాన్ని ఇష్టపడని రాజకీయ నాయకులకు ఇలా హితవుకూడా పలుకుతారు. ‘ఉన్నమాటలంటేనే / ఉలికిపాటు పడాలా? / యథార్ధాన్ని వాదించే / బంధువునే వీడాలా?’ ఇక ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే పత్రికారంగం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ న్యాయానికి, ధర్మానికి కట్టుబడిపోలేదు. ఎందరో పారిశ్రామికవేత్తలు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం తమ వ్యాపారాల అభివృద్ధి కోసం పత్రికను అడ్డంగా పెట్టుకుని అన్యాయాలకు, అక్రమాలకు తెగబడడం ఎప్పుడూ వుండేదే. ఆంధ్రా నుంచి అమెరికా వరకూ సర్వసాధారణమైన ఈ విషయం మీద శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా – ‘అరె యార్ ఇదరావో దేఖో / ఆంధ్రుల దినపత్రిక / పెట్టుబడికి కట్టుకథకి / పుట్టిన విషపుత్రిక’. ఇక పత్రికలు అడపాతడపా ప్రత్యేక సంచికలు ప్రచురిస్తుంటాయి. ఒక ప్రత్యేక రంగంపై దృష్టి సారించి, ఆ విషయంపై తన పాఠకులకు ఏదో చెప్పేద్దామనే తాపత్రయం ఆ ప్రత్యేక సంచికలకు వుండదని మనకిప్పుడు తెలుసనుకోండి. కాని, 1950లలోనే ఈ విషయంపై శ్రీశ్రీ ఏమన్నారంటే : ‘పండుగలకు పబ్బాలకు / ప్రత్యేక పచురణలు / వ్యాపారం సాఫీగా / సాగేందుకే ప్రకటనలు‘.

ఒక రచయిత రచన రచన బాగుందనో, బాగాలేదనో పాఠకులు ఉత్తరాలు రాయడం సహజం. పూలజల్లులాంటి ఉత్తరాలు పక్కన పెడితే, రాళ్లవర్షం కురిపించే ఉత్తరాలను కవులు, రచయితలు ఎలా స్వీకరిస్తారు? అందులో మహాకవులు ఇంక అలా స్వీకరిస్తారో తెలుసుకోవాలనుందా, అయితే, “సిప్రాలి” చదవండి. కాస్తా విమర్శను కూడా మహాకవులు భరించలేరని ఆ విమర్శకులపై విషం చిమ్ముతారని మనకు అర్థమవుతుంది. శ్రీశ్రీమీద ఆంధ్రపత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు అవాకులూ చెవాకులూ కూసారని శ్రీశ్రీ ఇలా తిట్టారు. ‘ప్రజాస్వామ్యపు పెళ్లికోసం / పండితారాధ్యుడు ఆడిన / వందకల్లల పందిపిల్లల / ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా?’ (నా ఈ అభిప్రాయాన్ని తర్వాత ఖాయపరిచింది “దొంగదాడి” పుస్తకం. దానిగురించి మరోసారి).

అన్నట్టు ఈ మాటలు ఎవరిని వుద్దేశించి అన్నవో పోల్చగలరా? ‘తొడలు విరిగిన దుర్యోధనా / తోకతెగిన గుంటనక్కా / పిచ్చిపట్టిన కొండముచ్చు / పుచ్చిపోయిన సవాయి రోగి’ ఇవి ఏ కవినో, రాజకీయ నాయకునో వుద్దేశించి అన్నవి కాదులెండి. అమెరికా దేశాన్ని వుద్దేశించి అన్నవి. ఇక కమ్యూనిజంపై వెటకారంగా కామెంట్ చేసిన దాశరథి కృష్ణమాచారిని దూదేకుతారు శ్రీశ్రీ. ‘ఏమిట్రోయ్ పొట్టికవీ / ఎందుకంత దూకుడు / నీ బతుక్కి విలువొకటా / చిల్లిగవ్వ చేయవు’ అని చీత్కరిస్తారు. సామాజిక చైతన్యం, రాజకీయ సిద్ధాంతం, ప్రయోజన దాయకమైన హాస్యం ఈ మూడింటి మేళవింపే “సిప్రాలి”. 164 పేజీల ఈ పుస్తకాన్ని 15 రూపాయలకే విరసం అందించింది. అయితే ఇప్పుడెక్కడా ప్రతులు దొరుకుతున్నట్టు లేదు. మీరు తప్పక దొరకపుచ్చుకుని చదవాల్సిన పుస్తకం.

ప్రకటనలు

One response »

  1. రవి కుమార్ గారూ “సిప్రాలి” విశ్లేషణ ద్వారా మరో కోణంలోభావోద్వేగాలలో మహాకవి పరిచయం బాగుంది. తెలియని విషయాలు తెలిపినందుకు అభినందనలు. నూతక్కి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s