బాలగోపాల్ ఇకలేరు…

సాధారణం

balagopal1నేను దేవుడ్ని నమ్ముతాను. కాని, గుడ్డిగా నమ్మను. అంటే హీరో వర్షిప్ లేదు. అయితే, నా జీవితంలో కొందరు హీరోలున్నారు. వారంటే నాకు పిచ్చి భక్తి. వారి మాటల్నీ, రాతల్నీ, మొత్తంగా వారినీ ఎంతో ఇష్టంగా అభిమానిస్తాను. అలాంటి వారికి దేవుడు ఈ మధ్యన వరసగా అన్యాయం చేస్తున్నాడు. మొన్న పతంజలి బావు, నిన్న వైఎస్ సార్, ఈ రోజు బాలగోపాల్….. దరిద్రపు దేవుడా! ఇలా మన నిజజీవితంలో దేవుళ్లా కొలుచుకునేవాళ్లు ఒక్కొక్కరే మనల్ని విడిచి వెళ్లిపోతుంటే మనసు నిభాయించుకోలేకపోతోంది. గుండె తట్టుకోలేకపోతోంది. కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.

నా దృక్పథాన్ని మార్చిన మహనీయుడు బాలగోపాల్ తో అనుబంధం తలచుకుంటున్నకొద్దీ మరింత దుఖంగా వుంది. డిగ్రీలో తెలుగు లెక్చరర్ మానేపల్లి సత్యనారాయణగారు నాకో సమీక్షనిచ్చారు. అది రాగో, సరిహద్దు నవలపై బాలగోపాల్ రాసిన సమీక్ష అది. నాకు ఒక్కముక్కా అర్థం కాలేదు. అప్పుడు మానేపల్లి తన సొంత వ్యాఖ్యానం చెప్పారు. ఆలా బాలగోపాల్ ను పరిచయం చేశారు. అ తరువాత బాలగోపాల్ పేరుమీద ఏ వ్యాసం వచ్చినా శ్రద్ధగా చదవడం ఓ అలవాటు. హైదరాబాదులో ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థిగా గడుపుతున్నపుదు నిజామ్ కాలేజీలో బాలగోపాల్ మీటింగ్ వుందని తెలిసి వెళ్లాం. ఫ్రంట్ లైన్ వ్యాసకర్తలు అచిన్ వనాయక్, ప్రఫుల్ బిద్వాయ్ లు విమానంలో రావడం ఆలశ్యమైనప్పుడు వారికోసం ఆత్రంగా చూస్తున్న బాలగోపాల్ ను తొలిసారి దగ్గరగా చూసాను. సుమారు గంటసేపు జర్నలిస్టు మిత్రులతో తమ కార్యక్రమాల గురించి, తదితర విషయాల గురించి మాట్లాడుతూ గడపడం నిజంగా పండగ క్షణాలు.

తరువాత బాలగోపాల్ హింస స్వరూపాన్ని అవగతం చేసుకోవడం… ఓ వైపు పోలీసులు చేస్తున్న అకృత్యాలతో పాటు, ‘ఇతరులు’ చేస్తున్నఅమానుషాలను కూడా హింసకింద జమకట్టినప్పుడు అందరికీ కోపమొచ్చింది. అలా మొదలైన ఆయన అలోచనధోరణి అనంతరం తొందరగానే పౌరహక్కుల సంఘంనుంచి బయటకు వచ్చేసి, మానవ హక్కుల వేదిక ఏర్పాటుకు దారితీసింది. హెచ్ ఆర్ ఎఫ్ గా ప్రసిద్ధమైన ఈ సంస్థకు శ్రీకాకుళం బాధ్యులుగా ప్రముఖ క్రిమినల్ లాయర్ ఎం. ఎం. హుస్సేన్, కెవి. జగన్నాధరావుగార్లు వ్యవహరిస్తున్నారు.

వార్త దినపత్రికలో పాతశ్రీకాకుళం పార్ట్ టైమ్ కంట్రుబ్యూటర్ గా పనిచేస్తున్నప్పుడు ఎందుకో (ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు) శ్రీకాకుళం వచ్చిన బాలగోపాల్ ను హుస్సేన్ గారి కారులో ఆముదాలవలస (రైలు కోసం) దిగబెట్టాల్సివచ్చినప్పుడు చిన్న ఇంటర్వ్యూ పత్రికకోసం అడిగాను. అప్పుడే “గాంధీ రాజ్యంలో గాడ్సే ఘాతుకాలు” బులెటిన్ రిలీజ్ అయింది. మీరు క్రమక్రమంగా అహింసను అర్థం చేసుకుంటూ గాంధీ దర్శనం చేసుకుంటారనిపిస్తుంది అన్నప్పుడు దానిని ఆయన తీవ్రంగా ఖండించారు. మార్క్సిజపు సిద్ధాంతపు విలువను ఎత్తిచూపుతూ మాట్లాడారు. ఆశయాలూ ఆదర్శాలూ ఒకటి కావచ్చు, కాని మనం ఏ దారిన నడుస్తున్నామో, మనం చేసే పని ఎవరి ప్రయోజనం కోసమ్ చేస్తున్నామో నిరంతరం తనిఖీ చేసుకుంటే ఎలాంటి అయోమయమూ వుండదని చెప్పారు. పక్కనే అప్పటికి దక్కన్ క్రానికల్ లో పనిచేస్తున్న వి. ఎస్. కృష్ణ కూర్చుని నవ్వుతూ బాలగోపాల్ వైపు చూడడం ఇప్పటికీ నా మదిలోవున్న ఫోటోగ్రాఫ్.

మడ్డువలస రిజర్వాయర్ కడుతున్నప్పుడు ముంపు గ్రామాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మానవ హక్కుల వేదిక ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 22 మంది వివిధ ప్రజాసంఘాలకు చెందిన వ్యక్తులతో ఏ సంఘానికీ చెందని నేను కూడా వెళ్లాం. వంగర మండలంలో దగ్గరదగ్గర 25 గ్రామాలను పర్యటించాం. అప్పుడు బాలగోపాల్ కరీంనగర్ పర్యటనలో వుండడం వల్ల శ్రీకాకుళం చివరిక్షణంలో రాలేకపోయారు. మొత్తానికి ముగ్గురమూ కూర్చుని ఒక నివేదిక తయారుచేశాం. దానిని జగన్నాధరావు బాలగోపాల్ కు అందజేశారు.

శ్రీకాకుళం ప్రాంతానికీ బాలగోపాల్ కు మానసిక అనుబంధం ఎక్కువ. ఇక్కడి గిరిజన రైతాంగ ఉద్యమం నుంచే ఆయన తొలి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఏడాదికి కనీసం రెండు మార్లయినా ఏదో పనిమీద శ్రీకాకుళం వచ్చేవారు. ప్రతిసారీ ఒక పెద్ద లేదా చిన్న (ఆయన వచ్చిన పర్యటన ఉద్దేశం బట్టి) సమావేశాన్ని జగన్నాధరావుగారు ఏర్పాటు చేసేవారు. అందులో ఆయన చెప్పిన కబుర్లను మేమంతా ఒక పాఠంగా తీసుకునేవాళ్లం. మానవ హక్కుల వేదిక రెండవ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళంలో జరిగినప్పుడు ఆహ్వానకమిటీ సంఘంలో నన్ను కూడా ఒక సభ్యునిగా చేర్చారు. రెండు రోజులు మా స్లీపీ లిటిల్ టౌన్ లో పండగ. మాకైతే వారం రోజులూ పండగే. ఏర్పాట్లలో మునిగిపోయాం. ముందురోజు మా. హ. వే. కార్యవర్గ సమావేశ తీర్మానాల ప్రతిని టైపు చేయాలి. “సత్యం” సాయంకాల దినపత్రిక ఎడిటర్ ప్రసాద్ గారిని అడగ్గానే మా ఆఫీసులో చేసుకోండని ఆనందంగా అవకాశం ఇచ్చారు. ఆయన చెప్తుంటే కుమారిగారు శరవేగంతో టైపు చేస్తున్నప్పుడు ఆయన మధ్యమధ్యలో టీ కోసం ఆగేవారు. ఇంక కుమారిగారికి రెస్ట్ ఇద్దామని నేనుకూర్చుని టైపు చేసేవాడిని. నేను నెమ్మదిగా టైపు చేస్తుంటే ‘వద్దుబాబూ, నువ్వింక ఆపు. ఇప్పటికే ఆలశ్యమైంది. నువ్వు టైపు చేస్తే సమావేశాలు పూర్తవుతాయి’ అని మమ్మల్నందిరినీ నవ్వించడం ఎలా మరువగలం?

ఇక ఆ మహాసభలలో అతిథులు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలనుంచి అటవీ చట్టంపై, నందిగ్రామ్ లో, హక్కుల రంగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యమకారులతోపాటు అరుణారాయ్ కూడా వున్నారు. అరుణారాయ్ మాటల్ని తెలుగులోకి అనువదించింది బాలగోపాలే. ఇక అరుణారాయ్ కోసం కాస్త ఖరీదైన్ హోటల్ లో రూమ్ తీసుకోవాలని హుస్సేన్ గారు ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనను వారించి మనతోనే ఆమె వుంటారు అని బాలగోపాల్ మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. మొత్తం దేశానికి చెందిన ఎందరో ఉద్యమకారులు అప్పుడు జగన్నాధరావు గారింట్లోనే సాదాసీదా చుట్టాల్లాగా మాతోనే గడపడం ఈ జీవితంలో మర్చిపోలేని అనుభవం. మొదటిరోజు రాత్రి చిన్న ప్రొజెక్టర్ తో రకరకాల లఘుచిత్రాలు చూశాం. నందిగ్రామ్ సంఘటనలు, గుజరాత్ విధ్వంసం, పర్యావరణం… వీటన్నిటికంటే నాకు బాగా నచ్చింది అమెరికా అమెరికా అనే వీడియో సాంగ్. చాలా రోజులదాకా ఆ రిథమే నా చెవుల్లో మారుమోగేది.

balagopal2ఇక రెండవరోజు సమావేశంలో వేదిక మీద నన్ను బాలగోపాల్, బుర్రా రాముల పక్కన కూర్చోమని చెప్పడంతో భయంతో నాకు చెమట్లు పట్టేశాయి. పావుగంట సేపు మాట్లాడమని నన్ను బాలగోపాల్ అదేశించారు. కళింగాంధ్ర మీద ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను గాని, ఒక పక్క భయం వల్ల, మరోపక్క ఆనందం వల్ల ఆ బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నాను. కిందకుదిగాక, బాలగోపాల్ తో సహా కొందరు మిత్రులు మెచ్చుకున్నా నాకు తెలుసు కదా, నా ఫెయిల్యూర్. ఆ తరువాత నాలుగైదు సార్లు ఆ కసితో కళింగాంధ్ర వెతల గురించి చాలా ఆవేశంగా మాట్లాడాను గాని, బాలగోపాల్ అప్పుడు లేరు. అయితే, ఆ రోజు నా మాటలు “వీక్షణం”లో ప్రచురితమైనప్పుడు బాలగోపాల్ చదివారని తెలిసినప్పుడు పొంగిపోయాను.

ఇక మొన్నటికి మొన్న సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రోజెక్ట్ పనులను పరిశీలించాలని వెళ్లిన బృందంలో నేను కూడా వుండడం నా అదృష్టం. ఆ రోజు ఒకవైపు పవర్ ప్రాజెక్టు వలన రాబోయో నష్టాలను వివరిస్తూనే చురుగ్గా గ్రామ ప్రజలతో మాట్లాడడం, వారినుంచి రకరకాలుగా సమాచారం రాబట్టడం, మరోవైపు పవర్ ప్లాంట్ వల్ల ఏర్పడే కష్టాలు కూడా వారికి వివరించడం… నన్నయితే అబ్బురపరిచాయి. దారిలో పెద్ద పెద్ద పెలికాన్ పక్షులను చూస్తూ ఒక్కొక్క పక్షిని ఎన్ని రోజులు తినచ్చో చెప్తూ లొట్టలు వేస్తున్న హుస్సేన్ గారిని వేళాకోళమాడడం ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. సరిగ్గా మూడు రోజులకు కాకరాపల్లి పవర్ ప్రాజెక్టు గురించి ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాసినప్పుడు మళ్లీ జగన్నాధరావుగారు ఆ వ్యాసం గురించి చర్చ పెట్టారు. అందులో ఆయన సమస్యను డీల్ చేసిన పద్ధతిని మురిపెంగా పరామర్శించుకున్నాం. బాలగోపాల్ దేశంలో, రాష్ట్రంలో మిగిలిన పవర్ ప్రాజెక్టుల వల్ల ఏర్పడే నష్టాలు, ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకించడం చెప్పిన తరువాత, అప్పుడు కాకరాపల్లి పవర్ ప్రాజెక్టును స్పృశించారు. పైగా మిగతా విషయాలకంటే దానివల్ల 8 కిలోమీటర్ల దూరంలో వున్న తేలినీలాపురం బర్డ్ సాంక్చరీకి జరిగే విపత్తును చెప్పారు. (ప్రస్తుతం కోర్టు కేవలం ఈ విషయమ్మీదే ప్రాజెక్టు పనులను ఆపింది).

‘సత్యం’ సాయంకాల దినపత్రికలో ప్రారంభమైన నా “మీరు చదివారా?” వ్యాస పరంపర బాలగోపాల్ ప్రచురించిన మానవహక్కుల వేదిక బులెటిన్ పై సమీక్షతోనే మొదలైంది. “కల్లోల కాల చిత్రాలు” పై పరిచయ వ్యాసం కూడా ఈ సిరీస్ లో వచ్చింది. ఇంకా మరింత లోతుగా ఆయన ఆలోచనల మధనం జరగాలి. గణితశాస్త్రంలో పరిశోధన చేసిన ఈ మనిషి భద్ర జీవనం గడపక, మళ్లీ లా చదివి అధోజగత్తు సహోదరుల కోసం వూరనక వాడనక, ఎండనక వాననక, రేయనక పగలనక సంచార జీవనం గడుపుతూ ప్రజలకోసం పరితపించిపోయిన మనీషి. సూటిగా తన విశ్లేషణలతో బండబారిపోయిన మన మేధను క్షాళనచేసి కొత్త రక్తం నింపడానికి అహర్నిశం శ్రమించారు. వ్యక్తిగా కలిగే మార్పుకన్నా మొత్తంగా వ్యవస్థలో మార్పు కోరుకున్న బాలగోపాల్ ఇకలేరు.

మానవహక్కుల వేదిక ప్రచురించే బులెటిన్లు నాబోటి వారికి స్టైల్ షీట్లు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారి కూతురి కొడుకైన బాలగోపాల్ సోదరి మృణాళిని. బాలగోపాల్ జీవిత సహచరి వసంతలక్ష్మి. బాలగోపాల్ ఇకలేరన్న వాస్తవం ఆయన కుటుంబ సభ్యులకు తీవ్రమైన మనస్తాపం కలిగించేది. మానవ హక్కుల ఉద్యమానికి శరాఘాతం. ఇక నాబోటి పిచ్చిగా అభిమానించేవారికి గుండెకోత.

balagopal3ఓ మహామేధావి, మానవీయమూర్తి, పేదలపాలిట పెన్నిధి బాలగోపాల్ హఠాన్మరణానికి ‘మీరు చదివారా?’ బ్లాగు మౌనంగా రోదిస్తోంది. వారికి సమీక్ష క్లబ్ నివాళులర్పిస్తోంది. వారి ఆలోచనలను, ఆశయాలను పదిమందికీ పంచడానికీ పునరంకితమవుదాం. ఆయన కృషిని సజీవంగా నిలబెడదాం.

దుప్పల రవికుమార్

సమీక్ష క్లబ్ అధ్యక్షుడు,

ఆర్. శ్రీలత

సమీక్ష క్లబ్ కార్యదర్శి

ప్రకటనలు

12 responses »

 1. మా ఇంటికి బాగా దగర్లొనే వుంటారు, పొద్దున్నే వెల్లి చూసివచ్చా, కాస్త ఆలిసంగా నిద్రలేచే మనిషిలా నిద్దరొతున్నారు, మనసులొ దుక్క పడ్డం ,మనసులొ దండం పెట్టుకొడం అంతే.ఒకే ఒక బాలగొపాల్, చిట్ట చివరి బాలగొపాల్.

 2. ఈ రోజు పొద్దున్నే పేపర్ అందించిన దుర్వార్త నన్ను నిజంగా నిర్ఘాంత పరిచింది. పేదోళ్ల వకీలు గా ఎంతో మందిని ఆదుకున్న బాల గోపాల్ చిన్న వయసులోనే కన్ను మూయడం నిజంగా ఎంతో విషాదకరం! ఆయనతో మీకు ఇంత అనుబంధముందని తెలిసి ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉంది. మీ బాధను పంచుకుంటున్నాను రవి గారూ!

  ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు ఇక?అరుదైన వ్యక్తిత్వం బాలగోపాల్ గారిది. అటువంటి వ్యక్తులు సమాజానికి ఒక్కరు కాదు, వేల సంఖ్యలో కావాలి.

 3. బావున్నారు మీ దేవుళ్ళు. కానీ బాలగోపాల్ అనే దేవుణ్ణి కొలుస్తూ అదే సమయంలో వై యెస్ ఆర్ అనే దేవుణ్ణి కూడా కొలవడం కొంచెం ఘర్శ్గణతో కూడుకొన్న విషయం అని మీకనిపించడంలేదా ?

 4. పేద ప్రజల గొంతు మూగ పోయింది.మానవహక్కుల కోసం పోరాడే ఒక జ్యోతి ఆరిపోయింది.ఆ నిజమైన మానవతా వాది ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్థిగా ప్రార్థిస్తూ…

 5. మీ వ్యాసాం చదివిన తరువాత నాలాంటి వాళ్ళకు రాయటానికి ఎమీ మిగల లేదనిపిస్తుంది. నాకు నేరు గా పరిచయం లేక పోయిన ఇతను రాసే వ్యాసాలు చదివాను. నేను ఇతనిని ఒకసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర చూడటం జరిగింది. చాలా సాధారణ దుస్తుల లో ఉన్న ఒక అసాధారణ మనిషి అని నాకు అనిపించాడు. ఎందుకంటె మన దేశం గర్వించదగ్గ వాళ్ళ లో ఇటువంటి వారు మన రాష్ట్రమునకు చెందిన వారు కావటం మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఇటువంటి వారికి మీడియా లో ఊదర గొట్టె ప్రచరాం లేక పోయినా నిరంతరం తమ మనుగడని కూడా పణంగా పెట్టి ఎమీ ఆశించకుండా మనుషుల కోసం పోరాటం చేసిన వారు ఇక లేరు అంటె చాలా కష్టం గా ఉంట్టుంది.బాలగోపాల్ గారు ఒక గొప్ప కర్మ యోగి. అతని కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలియజేసేది.

 6. ఆయన రాసిన చీకటి కోణాలు అనే వ్యాసం బహుశా తెలుగు లో వచ్చిన అత్యుత్తమ రాజకీయ వ్యాసాల్లో ఒకటి .చదవకపోతే మిస్ కాకుండా చదవండి

 7. చదివింది గణిత శాస్త్రం అయినా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విశేష ప్రతిభ కనపరచిన మేధ బాలగోపాల్‌ది… సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ పేదల హక్కుల కోసం నిజాయితీతో, నిబద్ధతతో సైద్ధాంతికంగా అరమరికలు లేకుండా నిలబడిన బాలగోపాల్‌ వంటి వారు లేని లోటు తీర్చటం దుర్లభం… ప్రజల గోడును తన గొడవగా కవిత్వంలో తీవ్ర స్వరంతో వినిపించిన వాడు కాళోజీ… ప్రజల గొంతును తన గళంగా మార్చుకుని వ్యవస్థను నిలదీసిన వాడు బాలగోపాల్‌…

 8. మీ వ్యాసంలో బాలగో్పాల్ గారితో మీ అనుబంధం వివరణ బాగుంది. ఆయనలాంటి మేధావిని కోల్పోవడం నిజంగా దురదృష్టమే. కానీ ఆయన మరణాన్ని వై.ఎస్.తో పాటు దేవుడుగా చేర్చడం ఆయనను అవమానించడమే.

 9. sir aayana chanipoyarante merenta badhapadataro naku telusu naku aayana gurinchi mottamodatisari mevalle telisindi tarvata aayana gurinchi chadivanu monnane aayana varadalagurinchi matladadam kuda chusanu eeyana chanipoyina varta సార్, ఆయన చనిపోయారంటే మీరెంత బాధపడతారో నాకు తెలుసు. నాకు ఆయన గురించి మొట్టమొదటిసారి మీవల్లే తెలిసింది. తర్వాత ఆయన రచనలు చదివాను. మొన్ననే ఆయన వరదలగురించి మాట్లాడడం కూడా చూశాను. ఈయన చనిపోయిన వార్త నాకు ఒకరోజు తర్వాత తెలిసింది. నేను ట్రైన్ లో ఉండడం దానికి కారణం. నిజంగా ఈ సంవత్సరం విరోధి నామ సంవత్సరమని రుజువైంది. మీ బాధను ఈ కామెంట్ ద్వారా నేనుకూడా పంచుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 10. రవీ, మీ వ్యాసం బాగుంది. కాని, వైఎస్ కూ బాలగోపాల్ గారికీ మధ్య నక్కకూ.. నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఒకరు(వైఎస్) ప్రజా శత్రువు, మరొకరు పేదప్రజల హక్కుల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన మహామనీషి.
  -క్రిష్ణ, శ్రీకాకుళం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s