తనలోకి తను చూసుకుంటూ చేసే ధ్యానమే కవిత్వం

సాధారణం

జీవితం పట్ల తనకేర్పడిన దృక్పథంతో సమాజాన్ని తానెలా దర్శిస్తాడో కవి తన కవిత్వం ద్వారా తెలియపరుస్తాడు. భవిష్యత్తులో సమాజం ఎలా వుండాలని కోరుకుంటాడో తన కవిత్వంలో కలలు కంటాడు. గతంలో జరిగిన విధ్వంసాలకు ఎవరెవరి పాత్ర ఎంతవుందో, కుట్రలెలా, ఎందుకు జరిగాయో విశ్లేషిస్తాడు. కవి ఇవే కవిత్వీకరిస్తాడని, కవిత్వీకరించాలని మనం అనుకోకూడదు. మరిన్ని ఎక్కువ విషయాల గురించి ఆశపడాలి. కవిని మరింత లోలోతుల దృష్టి సారించమని అభ్యర్థించాలి. రవిగాంచని చోటును కవిని అన్వేషించమనాలి. తన మనసు అంతర్లోక విహారం చెయ్యగలగాలి. స్వీయ జీవితానుభవాన్ని కొత్త దృష్టితో పరిశీలించమని కవిని కోరాలి.

అలా గడిచిన దశాబ్దాల జీవితాన్ని ఒక్కమారు మనోయవనికమీద మననం చేసుకుంటూ ఆ ఆలోచనల దారులవెంబడి మనల్ని తీసుకునిపోయే విశిష్ట రచన చినవీరభద్రుడి “పునర్యానం”ను ఈ వారం పరిచయం చేస్తున్నాను.

సంస్కృతి సంప్రదాయాలపట్ల ఉన్నతమైన అభిరుచి, అవగాహన గల చినవీరభద్రుడు తన స్వీయ అంతర్లోక విహారంలో మైలురాళ్లను పంచభూతాలతో నామకరణం చేస్తారు. పృథ్వి మొదటి అధ్యాయం. ఇందులో బాల్యాన్ని అక్షరబద్దం చేశారు. పల్లె అందాలు, ప్రకృతి సొబగులు తనదైన దృష్టితో మనకు చూపించడంలోనే అందమంతా ఇమిడివుంది. బాల్యాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం వల్లనేమో ఇలాంటి వర్ణనంగా లేకపోలేదు. “తొలకరి చినుకులు పడగానే విత్తనాలు చల్లినపుడు (ఆ తొలిరాత్రి నేలకు నిద్రలేదు) ఎన్నో రోజుల తరువాత చిక్కిన ప్రియ పరిష్వంగమది” అనగలిగారు. ప్రకృతి పరిసరాలు మాత్రమే కాదు, కంసాలి, మంగలి తదితర వృత్తులు కూడా కవి పదబంధాలలో ఒద్దికగా ఇమిడిపోతాయి. చల్లగాలి తెమ్మెరలా మధురస్మృతులు జలతారువలలా జాలువారుతాయి. ఒక వెన్నెల రాత్రి అడవి మధ్యలో మీరు ఎప్పుడైనా గడిపారా! కవి అలాంటి రాత్రిలో అడవి ‘వెన్నెల తాగి స్పృహ తప్పిపోయిం‘దంటారు. ఆ మధురమైన దృశ్యపు బరువు ఎలాచూస్తున్నారో తెలుసా – ‘సమస్త సంపదలొక సిబ్బెలో / ఆ నడివేసవి వెన్నెల రాత్రి అడవి దారొక సిబ్బెలో / ఎటు మొగ్గిందో ఆ రాత్రి / ఆ సిబ్బె పైకి తేలదెప్పటికీ‘. ఆ నల్లమల అడవులలో ఏదో గిరిజన గూడెంలో ఓ పెళ్లి ఎలా జరిగిందో చూడండి: ‘పూలపందిరి నీడ పెళ్లి జరిగింది / మోగింది సన్నాయి, రంగు చల్లారు / విందు పరిమళాల ఊరు తేలింది / పలికారు మంత్రాలు, అక్షంతలు జల్లి / కొత్త ఇంటికొక జంట చేరింది‘.

తీపిగుర్తుల గతమైన బాల్యంలోనే మరో ముఖ్యమైన దశ చదువుల బడి – సరస్వతి ఒడి. చినవీరభద్రుడి అమ్మానాన్నలనుంచి, పల్లెనుండి, అమాయకత్వ దశనుంచి గురుకుల పాఠశాలలో చేరడంతో రెండో అధ్యాయం అగ్ని ప్రారంభమవుతుంది. అమ్మానాన్నలకు దూరంగా, ఆత్మీయులకు దూరంగా, అనురాగానికి దూరంగా ఎక్కడో  ప్రకృతిఒడిలో, ఒంటరిగా, జట్టుగాళ్లతో చదువనే సింద్ బాద్ సాహసయాత్ర… ‘నేనప్పుడు బడి గదుల్లో నేర్చుకున్నదానికన్నా / బడిబయట సాయంకాలాలు నేర్చుకున్నదే మిన్న‘ అంటారు. సృజనశీలురైన ఉపాధ్యాయులు కవికి చేసిన మేలు మరింత వివరంగా “కొన్ని కలలు – కొన్ని మెలకువలు”లో తెలుసుకుంటాం. ఆ దయాళువులు కవిలో కవితాజ్యోతి వెలిగిస్తారు. కావ్యకన్య కోసం కవి ఎన్నిపాట్లు పడ్డాడో తెలుసా! ‘కవితకోసం నేను మనుషుల్ని ప్రేమించాను / కవిత కోసం సుడిగాలిలా మారేను / కవితకోసం నేనొక భిక్షాపాత్రిక చేతపట్టాను / కనపడ్డ ప్రతి హృదయం ముందు ఆగి పిలిచాను“. అది ఓ పట్టణమో, లేదంటే ఓ వ్యక్తో తెలీదుగాని, ఒక కమ్యూనిస్టు మిత్రుడే అనుకుంటాను, కవి గుండెలో గాయం చేసి పోతాడు. పే. 106లో ‘హారి దేవుడా’ అనే మాటను నేనైతే చులకనగా చూసినట్టే భావించాను. మరి రెండు పేజీలు దాటగానే పోరుబాటపై తన విముఖతను స్పష్టంగా వివరిస్తారు. ఇక అక్కడనుంచి ఉద్యోగ జీవితం, మనుషుల ప్రవర్తన తీరును వర్ణిస్తారు కవి. ‘వెన్నెలతాగి స్పృహ తప్పిన అడవి’ మాదిరిగా అతి కమ్మని మాటలు అక్కడక్కడా వజ్రాల్లా మెరుస్తుంటాయి.

ఉదాహరణకు చూడండి: ‘బత్తాయి పండు వలుస్తుంటే చేతుల్లోకి చిమ్ముతుంది చూడు ఆవిరి సుగంధం / అట్లాంటిది బతకడానికి వాడుపడే ఇష్టం’ (పే. 107), ‘నువ్వు నడిచిన దారుల్లో నిన్ను నమ్మిన వాళ్లకోసం / ఏం ఇచ్చావు? వాళ్లేం తీసుకున్నారు’ (పే. 122), ‘ఆకాశానికి ఉరేసుకుంది ఊరు‘ (పే. 125). విశృంఖలంగా అభివృద్ధి చెందిన నాగరకతా ఫలాలు తనకు ఎలా కలవరపరుస్తున్నాయో వర్ణిస్తూ రెండో అధ్యాయాన్ని ముగిస్తారు.

సుడిగాలిలా వచ్చి తేరుకునేలోపే మోహం మత్తుజల్లి, ఆనందం కొంత ఇచ్చి, మరింత విషాదం మిగిల్చి, ఎప్పటికీ వెలితిని ఉంచే ప్రేమికురాలి తత్వాన్ని మూడో అధ్యాయం రసంలో వర్ణిస్తారు. మనసుపెట్టి చదివితే మనసు ముక్కలయి, గుండె గాయమవుతుంది. కన్నీరు వరదవుతుంది. మనల్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేసే అధ్యాయమిది. ఇప్పటికే నా గుండె బరువెక్కింది. ఇక మిగిలిన నాలుగు, అయిదు అధ్యాయాల గురించిన ముచ్చట మరోసారి.

270 పేజీలతో వంద రూపాయల వెలకు అందిస్తూ ఈ “పునర్యానం” అనే చక్కటి చిక్కటి కవిత్వాన్ని ఎమెస్కో ప్రచురణ సంస్థ ప్రచురించింది. మరి మీరూ ఈ కవిత్వంలో నిండా తడవండి. ఒక్కసారి జీవితంలో వెనక్కి ప్రయాణం చేసి రండి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s