కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి, అంతేకాని అబద్దాలాడకూడదు

సాధారణం

“కథ ఇచ్చే అనుభూతి విలువను పాఠకుడు ప్రయత్నపూర్వకంగా నిర్ణయిస్తాడు. జీవితం పట్ల అతనికున్న అభిప్రాయాలు అతని భావజాలాన్ని నిర్ణయిస్తాయి. సాహిత్యం ద్వారా అతడు ఆశించే ప్రయోజనాన్ని అతని భావజాలం నిర్ణయిస్తుంది. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠకుడు కథ విలువను నిర్ణయించటానికి ప్రయత్నిస్తాడు”. 

‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’ (పే. 46) నుంచి

1

‘వార్త’ ఆదివారం అనుబంధం (మార్చి 23, 2008)లో ప్రచురితమైన గంటేడ గౌరునాయుడు కథ “మాయ” తర్వాత ‘కథావార్షిక – 2008’లో చోటుచేసుకుంది. త్వరలో రానున్న ‘కథ-2008’లో చోటుచేసుకోబోతుంది. ఇదికాక ప్రవాసాంధ్రుల పత్రిక ‘తెలుగునాడి’లో సైతం పునర్ముద్రణ పొందింది. తెలుగు కథాప్రియుల ఆదరాభిమానాలు సైతం పొందిందనే కళింగాంధ్ర కథాభిమానిగా భావిస్తూ వచ్చాను. కథ తొలిసారి ప్రచురణ పొందిన పదిహేను నెలల తర్వాత ‘చినుకు’ మాసపత్రికలో తొలిసారి ఈ కథపై ఘాటు విమర్శ వచ్చింది. ఆ విమర్శ గురించిన పరామర్శే ఈ ప్రయత్నం…

ప్రభుత్వ సమాచార శాఖలో అధికారిగా పనిచేస్తున్న జాన్ సన్ చోరగుడి శ్రద్ధగా సాహిత్య అధ్యయనం చేయడం అభినందించదగ్గ విషయం. ఒకవైపు అధ్యయనం, మరోవైపు సాహిత్య సృజన గావిస్తున్న జాన్సన్ ఇంకోవైపు సాహితీ కృషి బాగోగులను వివేచన చేసే విమర్శకుడు కూడా కావడం తెలుగు సాహిత్య రంగానికి ఖచ్చితంగా చేర్పే.

జాన్ సన్ ‘మాయ’ కథను శ్రద్ధగా పాఠకుడి కోణంలో చదివారు. విమర్శకుడి కోణంలో అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ అధికారి కోణంలో విశ్లేషించారు. ”కథనం రీత్యా ఒక కళాఖండంగా రూపుదిద్దుకున్న ఈ ‘మాయ’ కథలోని వస్తువును విడిగా విశ్లేషించుకోవాల్సి రావడం” అని అన్నారే గానీ, తర్వాత వ్యాసంలో ఎక్కడా కథనాన్ని మెచ్చుకోవడం కన్పించదు. అన్నికథలూ అందరికీ నచ్చాలని రూలులేదు. అందరు కథకులూ అందరికీ నచ్చాలనీ రూలు లేదు. కాబట్టి ఎవరి కథనైనా మరెవరైనా పొగడొచ్చు లేదా తెగడొచ్చు. అంతవరకూ జాన్ సన్ వ్యాసంతో పేచీలేదు. కాని, వచ్చిన చిక్కల్లా ఆయన కథను తెగనాడడానికి ఎంచుకున్న పద్ధతి ప్రమాదకరమైనది. కళింగాంధ్ర అభివృద్ధితో తులతూగుతోందన్న ఫీల్ కల్పించడంతో వచ్చిన పేచీ అది. ఎందుకో గుంటూరు శేషేంద్రశర్మ చెప్పిన మాట ‘వంగేవాడికి వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు’ గుర్తుకొస్తే అది మన తప్పుకాదు.

2

రాష్ట్రమంతటా ప్రతి అంగుళం భూమికీ నీరందేలా అపర భగీరథ ప్రయత్నాన్ని తలకెత్తుకుంది ప్రభుత్వం. సమాజపు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కాని ప్రతి పనికీ భిన్న కోణాలుంటాయి.

ఒకసారి బస్సు ప్రయాణంలో ఎదురైన అనుభవం మీతో పంచుకుంటాను. ఒక బీద రైతు భార్యాబిడ్డలతో పట్టణానికి బయలుదేరాడు. కండక్టరు టికెట్టు అడిగినప్పుడు ‘నాకెంత మా ఆవిడకెంత బావూ టికెట్లు?’ అని అమాయకంగా ప్రశ్నించాడు. అతని అమాయకత్వానికి నవ్వుకోని కండక్టరు అజ్ఞానానికి నొచ్చుకుని దురుసుగా సమాధానమిచ్చాడు. ‘అదేటి బావూ, మాకిచ్చిన కూలీ పైసాలు మగోడికొకలాగా, ఆడోలికొకలాగా ఇస్తారు కదా, అందుకనడినాను‘ అని చెప్పుకొచ్చాడు. ఇక పిల్లాడి దగ్గరికొచ్చేసరికి ‘ఆడికి టికటెందుకులే బావూ, ఇంతరవ్వున్నాడు‘ అని రైతు ప్రాధేయపడతాడు. కండక్టరు కరగలేదు. మరో ఆసామీ అతడు టికెట్టు తీయాల్సిందే అని కండక్టరు సపోర్టుగా నిలిచాడు. అతడు మాత్రం స్టాఫ్ పాస్ వుందని టికెట్ తీయలేదు. నేను టీవీ చూస్తున్నట్టు, పేపర్ చదువుతున్నట్టు ఆ సంఘటన చూస్తున్నా. ఆఖరికి రెండున్నర టికెట్లు తీసుకోలేక బస్సు దిగిపోవాల్సివచ్చింది ఆ బీదరైతు – కళింగాంధ్ర నుంచి ఉపాధికోసం పోతున్న వలస కూలీ. చిన్న బీద కుర్రాడిని టికెట్టు లేకుండా ప్రయాణం చేయించలేని ప్రభుత్వ ఆర్టీసీ సంస్థ,  అర టికెట్టు కొనుక్కోలేని రైతు కూలీ బీదరికం, ప్రయాణీకులందరమూ రూపాయి విరాళమిచ్చినా వారి ప్రయాణం సాగేది — ప్రయాణీకుల ప్రేక్షక పాత్ర, కనికరం చూపించ(లే)ని కండక్టర్, ఇంకా మరెన్నో కోణాలు… మనం ఎటువైపునుంచి చూస్తున్నామో అదొక్కటే ప్రధానాంశం. అక్కడ నిలబడి వ్యాఖ్యాత తీర్పులు చెప్తాడు — సమాజంలోనైనా, సాహిత్యంలోనైనా.

భారీ ప్రాజెక్టుల నిర్మాణంవల్ల ఉపయోగం పొందేవారిలో కనీసం పదోవంతు మంది తమను తాము త్యాగం చేసుకోవలసివస్తోంది. వారి సర్వస్వపు బలిదానాలూ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. భారీ ప్రాజెక్టుల రూపంలో ప్రభుత్వం ‘డెవలప్ మెంట్ టెర్రరిజమ్’ (అభివృద్ధి పేరిట విధ్వంసం) సృష్టిస్తోందని అరుంధతీ రాయ్ లాంటి సాహితీఉద్యమకారులు – మేధాపాట్కర్ లాంటి సామాజిక ఉద్యమకారులతో కలమూ గళమూ కలుపుతున్నారు.

నిజానికి ఈ ‘మాయ’ కథలో రచయిత గౌరునాయుడు అదే వూరన్నదీ, ప్రాంతమన్నదీ చెప్పరు. కేవలం కథ ముగింపునకు పదిహేడు వాక్యాలముందర నది పేరు నాగావళిగా చెప్తారు. ఆ ఒక్కమాట కూడా రచయిత వాడకపోయుంటే ఆ వూరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా భారీ ప్రాజెక్టు కడుతున్నప్పుడు ముంపునకు గురయ్యే ప్రమాదకరమైన గ్రామమై వుండేది. కథను రచయిత అత్యంత నేర్పుగా చిత్రించి సర్వకాలికమూ సర్వజనీనమూ చేశారు.

ముంపునకు గురయ్యే ప్రాంతాలనే కాదు, మరెక్కడైనా ప్రభుత్వం చెల్లించే పరిహారానికి, ప్రజలు కోల్పోయే స్థిర, చరాస్థి అసలు విలువకు పొంతన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు – ఎక్కడా వుండదు. అలాంటి దురదృష్ట జీవుల దృష్టికోణం లోంచి వస్తువును చూడాలని రచయిత భావించారు. కేవలం ఉపాధి కోసం ఆ గ్రామంలోవున్న ఒకరిద్దరు చాకలి, మంగలి పట్నానికెళ్ళిపోతారు. చావుపుట్టుకల్లో అన్ని కులవృత్తులవారూ తలా ఒక పనిచేస్తూ కార్యక్రమాన్ని నడుపుకుపోయే మొత్తం వ్యవస్థ దెబ్బతినడం పట్ల రచయిత కలవరపడుతున్నారు. కాని, కొన్ని తరాల తర్వాత దానికి అనుగుణంగా ఆ సంప్రదాయాలు తప్పక మారుతాయి. అయినప్పటికీ, ఒకప్పుడు వాటి వైభవాన్ని చూసి, ఇప్పుడవి లేకపోవడాన్ని చూస్తున్న తరం ఆ విషయాలన్నీ రికార్డు చేసి తీరుతారు. ఉదాహరణకు పెద్దలందరూ టాల్ స్టాయ్ రచనల్లో అప్పటి రష్యన్ సమాజంలో కులీన వ్యవస్థ తెరమరుగు కావడాన్ని చిత్రించాడని చెప్తారు. ఆ పని రష్యాలో టాల్ స్టాయ్ చేస్తే ఒప్పు – తెలుగు సమాజంలో గౌరునాయుడో మరొకరో చెప్తే తప్పు. పైగా సమాజ పరిణామక్రమంలో జరుగుతున్న మార్పులను గమనించక / స్వాగతించక పాతనే పట్టుకు వేలాడుతున్నారన్న నిందలు.

ప్రభుత్వంనుంచి అరకొరగానే అందిన పరిహారం డబ్బులు సద్వినియోగం చేసుకోవాలన్న ఆదర్శంవున్నా ఆచరణలో పెట్టలేని దౌర్భాగ్య స్థితికి చేర్చింది మార్కెట్ మాయాజాలం. విశృంఖలంగా పెరిగిన వినిమయ సంస్కృతి మధ్యతరగతి మనసుల దారి మళ్లించి చేతిలో చిల్లిగవ్వ మిగల్చకుండా చేసేస్తుంది. ఆ సంగతులన్నీ రచయిత అస్పష్టంగా సూచించి వదిలేశారు. ఎందుకంటే రచయిత ఫోకస్ అంతకంటే పెద్దదైన ‘విచ్ఛిన్నమవుతున్న గ్రామం’ అనే మానవీయ విలువమీద వుందని మనం గమనించాలి. కథలోని చావు రచయితకు ఒక సాకు మాత్రమే. చావులాంటి హృదయ విదారకమైన సన్నివేశంలోనే గ్రామంలో దౌర్భాగ్యం ఇలావుంటే, మరే ఇతర సామాజిక సన్నివేశమైనా ఆ గ్రామంలో నిర్వహణ తంతు మనం సులువుగా ఊహించుకోవచ్చు. చిరంజీవులునాయుడు చనిపోకుండా కూతురి పెళ్లే చేసాడనుకున్నా ఇంతకుమించి వేరేలా జరుగుతుందని అనుకోగలమా? రచయిత ఎక్స్ ప్లాయిట్ చేసింది విమర్శకుడు జాన్సన్ అనుకున్నట్టు చావును కాదు. శిథిల గ్రామ జీవితాన్ని. చావుకు ‘లైవ్ కవరేజీ’ ఇవ్వడం కోసం కథ రాయలేదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి సృష్టిస్తోన్న మానవ విలువల విధ్వంసాన్ని చెప్పాలనుకున్నారు.

3

కథ రాసింది గంటేడ గౌరునాయుడు, కథలోని సంఘటన జరిగింది నాగావళి నది ఒడ్డు అని కథలో చదవగానే విమర్శకుడు కథ జరిగిన ప్రదేశం శ్రీకాకుళం అని భ్రమలో పడిపోయి, గవర్న’మెంటాల’టీ మైకునందుకుని తన వ్యాసంలో అవాకులూ చెవాకులూ పేలేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రపంచంలోనే సంపన్నమైన జిల్లా అయిపోయిందట అదీ గత రెండేళ్ళుగా. జాన్సన్ కు తెలియందేమిటంటే సంపన్నులమైపోయిన మేము అంటే శ్రీకాకుళంజిల్లా వాసులం అలగాజనం తినే అన్నం తినడం మానేశాం. వీధుల్లో రత్నాలు వజ్రాలు పోసి అమ్ముకుంటూ, రోజుకు అయిదారు పూటలా బంగారం కొరుక్కుతింటున్నాం. మా భావనలు సరిగ్గా లేక ఐదు నదులున్న శ్రీకాకుళాన్ని పంజాబ్ చేసుకోలేకపోయాం. యువకులంతా ప్రస్తుతం చిన్నాపెద్దా తేడాలేకుండా దేశంలోని ప్రతి పట్టణంలోనూ రిక్షాలు తొక్కుకుంటూ, భవన నిర్మాణ కార్మికులుగా, ఇతరత్రా కూలి పనులు చేసుకుంటున్నట్టు నటిస్తూ హానీమూన్ లు ఎంజాయ్ చేస్తున్నారు.

నాలుగు దశాబ్దాల కిందట అప్పటి భూస్వామ్య పీడనను వ్యతిరేకిస్తూ ఇక్కడి రైతు గూబ గుయ్యుమన్నట్టు కొట్టిన దెబ్బను దేశదేశాలూ పాఠాలుగా చదువుకుంటున్నాయి. కాని, మన జాన్సన్ మహాశయులు మాత్రం ప్రభుత్వ సమాచార ‘సాక్షి’గా బులెటిన్లు రాసుకుంటూ, తాము రాసినవి తామే చదువుకుంటూ జ్ఞానబోధలు చేస్తున్నారు. కథతో సంబంధం లేకపోయినా జాన్ సన్ లాంటి విమర్శకాగ్రేసరులకు విన్నవించుకునేదేమంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాలలో కళింగాంధ్ర ఒకటి. ఇండియాటుడే పత్రిక సర్వేచేసి ఇప్పటికి మూడు దఫాలుగా నిర్ధారించిన అంశమేమిటంటే దేశంలోనే అత్యంత వెనకబడ్డ నియోజక వర్గాలలో మూడవది శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం. తెలంగాణ పోరాట సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ తన పుస్తకాలలో స్పష్టంగా కళింగాంధ్ర ప్రాంత వెనకబాటుతనాన్ని ప్రస్తావిస్తారు. ఐదు కాదు, నదులూ నదీపాయలూ మొత్తంగా కలుపుకొని కళింగాంధ్రలో పంతొమ్మిదిదాకా ప్రవహిస్తున్నాయని ప్రముఖ పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు తల్లాప్రగడ సత్యనారాయణబు అంటారు. అయితే వాటిల్లో నీరు ప్రవహించేట్టు చేసే శ్రద్ధ, దీక్ష పాలకులకు లేవని ఆయన వాపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికీ లేని భౌగోళిక అనుకూలత కళింగాంధ్ర ప్రాంతానికి వుందని కూడా నేను విన్నవించుకుంటున్నాను. సముద్ర తీర, మైదాన, అటవీ ప్రాంతాలు ఉడుతమీద చారల మాదిరిగా కళింగాంధ్రకు సొంతం. అంటే ఇక్కడి ప్రజలు ఏ మాత్రం కష్టపడకుండా మత్స్య సంపదపైన లేదా అటవీ ఫలసాయంపైన లేదా మైదాన ప్రాంత పంటలతోనే హాయిగా జీవితాలు వెళ్లదీయవచ్చు. ఇది అందంగా కనిపించే థియరీ కానీ ఇక్కడి విషాద అనుభవం ఏమిటంటే ఆకలినీ ఆత్మవిశ్వాసాన్నీ పేగుల్లో చుట్టుకుని పలు రాష్ట్ర రాజధానులు, వివిధ దేశ రాజధానులు కళింగాంధ్ర యువత కేవలం కూటికోసమే వలస పోయింది. ఈరోజు గ్రామాలన్నీ వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలతోనే విలవిలలాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఇవీ వాస్తవాలు. దురదృష్టవశాత్తూ మరుగుజ్జు మనస్తత్వం గల రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడంతోనే కాలం వెళ్లదీస్తుండడం వల్ల కనీసం తమ దురవస్థ తెలుసుకోలేని అజ్ఞానంలోనే కళింగాంధ్ర ప్రజలు బతుకుతున్నారు. మత్స్య సంపద కొల్లగొట్టుకు పోతున్నదెవరో, గ్రానైట్ పరిశ్రమను తరలించుకు పోయిందెవరో, నేలతల్లిని ఆక్రమించుకు(oటున్న)న్నదెవరో తెలుసుకోలేనంత బిజీగా చదువుకుంటున్న యువత కెరీరిజంలో పడి నలిగిపోతోంది. జరుగుతున్న కుట్రపూరిత గాథలను ఆక్షరీకరిస్తున్న ఒకరిద్దరు కథకుల గొంతులను సైతం ఇలాంటి విమర్శలు బిగించేస్తాయి. ఆ ప్రమాదం జరక్కుండా ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యానాల అసలు స్వరూపాలను గుర్తెరగడం సాహితీపరుల తక్షణ కర్తవ్యం.

 

ప్రకటనలు

13 responses »

 1. మూలల్లోకి వెళ్లకుండా చేసే ఉపరితల వాఖ్యల వల్ల సాహిత్యానికీ జీవితానికీ జరిగే నష్టం అంతా ఇంతా కాదు. స్త్రీవాద కవిత్వాన్ని నీలికవిత్వమని ప్రారంహంలో విమర్శించటం ఇలాంటిదే. కానీ కాలమే ఆ గళాన్ని సంపూర్ణంగా తెరచుకొనేలా సహకరించింది. తెలుగు సాహిత్యంలో అదొక అధ్యాయంగా నిలిచింది.

  చేగువెరా ఒక మాటంటాడు. ఈ ప్రభుత్వాలు ప్రజలను రెందు వర్గాలుగా విడదీస్తుంటే నేను సామాన్యులుండే వర్గం వైపే ఉంటానని. ఒక మేధావి మాట అది. బహుసా ప్రతీ సృజన కారుడూ అలానే ఆశిస్తాడు. కధకుడు కావొచ్చు కవి కావొచ్చు లేక మానవత్వమున్న ఎవరైనా కావొచ్చు.

  భారీ ప్రోజెక్టుల వల్ల లాభాల మాట అటుంచండి.. కానీ ప్రస్తుతం వాటి మూలంగా ఏర్పడుతున్న వాక్యూం చాలా దారుణంగా ఉంది. అది ఇక్కడే కాదు ప్రపంచంలో ఏమూల అయినా సరే మొదటి వేటు పడేది సామాన్యునికే. వాటిని కధకులూ కవులు రికార్డు చేయకపోతే మరెవరు చేస్తారు? మఖలో పుట్టి పుబ్బలో కలిసిపోయే ఇతరులా?
  ఇక్కడేందుకో జయప్రభగారి మాటలు గుర్తుకు వస్తున్నాయి.
  తను ఒకానొక విమర్శకుడు. నేను ఒకే ఒక జయప్రభను.

  బొల్లోజు బాబా

 2. రవి గారూ,

  మీరు రాసింది బావుంది. నేను మూల కథ చదవలేదు. చదివితే కానీ ఈ విమర్శ గురించి మాట్లాడలేను. మీరు మూల కథ లింకూ, దానికింద ఈ విమర్శ రాసుంటే కాస్త సులభంగా ఉండేది. ఈ కథ సంకలనాలపై నా అభిప్రాయం. చాలావరకూ కథా సంకలనాలన్నీ ఒక రకమైన సామాజిక ప్రయోజనాన్ని మాత్రమే ఆశించి అటువంటి కథల్నే ప్రచురిస్తాయి. సమాజానికి పనికిరాని కథ కథ కాదు. సామాన్యుడి వ్యధని మాత్రమే చిత్రీకరించేవే అసలైన కథలు అన్న ధోరణి కమ్యూనిస్టు తరహా రచయితలు భుజాలమీదేసుకొని ఊరేగించారు. కథంటే ఇలానే ఉండాలి అని ఒక అదృశ్య చట్రం బిగించేసి అందులోంచే ప్రపంచాన్ని చూడాలంటూ ఒక ఒరవడి కల్పించారు. అలాంటి కథలకే పీట వేసి అతి గొప్ప కథలుగా పదిమందీ మరో పదిమందికి గట్టిగా చెప్పారు. సామాజిక ప్రయోజనం అన్నది మన చుట్టూ అల్లుకున్న పరిధిల్లేని ఒక విస్తృత జీవన వలయం. రాజ్యాలేలే రాజులకీ కథలుంటాయి. రాళ్ళెత్తే కూలీలకీ కథలుంటాయి. కథల్లేని మనుషుండడు. కథంటే ఇలాగే ఉండాలీ, ఈ రకంగానే ముగియాలి, లేదా చివర్లో సూక్తి ముక్తావళుండాలీ, లేదా కొన్ని వర్గాల వారినే మెప్పించాలీ, మేధావులనబడే వాళ్ళ చేత తప్పట్లు కొట్టించుకోవాలీ అన్న అభిప్రాయం పాఠకుల్లో కలిగించేలా చాపక్రిందనీరులా అంతః సూత్రాలు ప్రజలపై రుద్దబడ్డాయి. అందుకే మన కథల్లో వైవిధ్యం కనబడదు. ప్రతీ మనిషికీ తను పెరిగిన వాతావరణాన్ని బట్టీ, తన చుట్టూ చూసిన మనుష్యులని బట్టీ సమాజం అంటే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. తద్వారా ఒక దృక్పథం ఏర్పడుతుంది. అందువల్ల నేను చెప్పిందే కరక్టూ, నా భావజాలమే సరైంది అన్న వాదన నిలబడలేదు. కథయినా కవిత్వమైనా స్పందన్నుండే మొదలవుతుంది. ఒక సంఘటన్నుండే పురుడుపోసుకుంటుంది. ప్రతీ సంఘటనకీ అనేక కోణాలుంటాయి. కేవలం ఒకవైపు నుండి చెప్పే కథే కథ అని అందర్నీ నమ్మ బలకడం ఎంతవరకూ సబబు? అడుక్కునే వాడికీ కష్టాలూ, కథలూ ఉంటాయి, అంబానీకీ కుప్పలు కుప్పలుగా కష్టాలుంటాయి. అంబానీ కష్టాన్ని కథగా రాస్తే ఎంతమంది మెచ్చుకుంటారు? అదే అడుక్కునేవాడి గురించి ఓ కథ రాసి వాడు ఈ సమాజ సృష్టే అంటూ ఎవరైనా రాస్తే ఆ కథ మంచి కథల లిస్టులోకి చేర్చేస్తారు. అందువల్ల కథలు రాసే వాళ్ళందరూ ఇటువంటి వస్తువులూ, ఇతివృత్తాల చుట్టూనే తిరుగుతున్నారు. వెస్ట్రన్ కథల్లో వున్న విస్తృతి మన కథల్లో కనిపించదు. వల్లంపాటి వారు రాసిన కథా విమర్శా, నవలా శిల్పం వంటివి చదివాను. ఇంగ్లీషు సాహిత్యంలోంచి పుట్టిన విమర్శా పుస్తకాలే ఆయన వస్తువుకి ఆథారం. కానీ ఆయన ఎంతో తెలివిగా, తన విజ్ఞానాన్నుపయోగించి దాన్ని తెలుగు కథలకి అనునయించి చెప్పారు. అందులో కూడా సింహభాగం సామాజిక ప్రయోజనమున్న కథలపైనే దృష్టి సారించారన్నది నా ఆరోపణ. సమాజ స్వరూపం మారినట్లే కథా రూపం కూడా మారుతుంది. ప్రతీ కథకుడికీ కొంతమంది మీదా, ఓ రకమైన సాహిత్యమ్మీదా హేంగోవర్లుంటాయి. అది ఒప్పుకొని వారి వారి అభిప్రాయాలు చెబితే బావుంటుందని నా అభిప్రాయం.

 3. మిత్రుడు రవి కుమార్ గార్కి…
  మీరు ఒక ప్రణాళికా బద్దంగా రాసిన మీ వ్యాసం చదివాను. కథ, చినుకు లోని వ్యాసం కూడా చదివి నా అభిప్రాయం చెప్తాను. దీనితో సంబంధం ఉన్నా, లేకపోయినా కళింగాంధ్ర వెనుకబాటుతనాన్ని మాత్రం సాహిత్యం ద్వారా తెలియచెప్పవలసిన అవసరం ఉంది. దీనిపై ఒకరిద్దరు కృషి చేసే ప్రయత్నం చేస్తుంటే ఆదిలోనే అడ్డుకొనే ప్రయత్నం చేసేది ఎవరైనా వారికి మీలా విశ్లషణాత్మకంగా, సామరస్యంగానే వివరించవలసిన అవసరం ఉంది

 4. పింగుబ్యాకు: ఇవి మీరు తప్పక చదవాల్సిందే! « మీరు చదివారా?

 5. బ్లాగులో విమర్శ మీద విమర్శ చదివాక, ఆసక్తి పుట్టి, గౌరునాయుడు గారి కధనూ జాన్సన్ గారి విమర్శనూ చదివాను. ఒక కథ/కవిత మీద విమర్శ వస్తే దానికి రచయిత, రచయిత అభిమానులు స్పందించాల్సిన విధం ఇదేనా? ఇది ఆరోగ్య కరమా? కొందరు కథను, విమర్శను చదివకుండానే ఏదో ఒక పక్షం వహించి ఘాటుగా మాట్లాడ్డం నేరం కాదా? కొత్తపాళీ మరీనూ! కధను విమర్శించిన జాన్సన్ గారిని ‘మీడియోకర్’ అని దూషించారు. (అలాంటి మాటలు తిట్లు మాత్రమే అవుతాయి. విమర్శ కావు. అభిప్రాయ ప్రకటన అని కూడా అనిపించుకోవు. అలా మాట్లాడ్డ అప్రజాస్వామికం, నేరం).
  ‘రాజకీయార్థ శాస్త్ర’ విషయాలు పక్కన పెడితే, నిత్య జీవితానుభవాలు ఆధారంగా జాన్సన్ గారు పెట్టిన పకడ్బందీ విమర్శకు ఎవరి నుంచీ జవాబు లేదు. ‘డెవలప్మెంటు’ అనే దానికి చెడు పార్శ్వం వుంది. అది పాత నంతా తొలగంచ జూసి, మునుపటి జీవితంలోంచి జాగరత్త చేసుకోవలసిన మంచి విలివలను కూడా నాశనం చేయజూస్తుంది. ఈ విషయంలో మనం జాగరూకులమై వుండాలి. ఆ విషయాల్ని కథకుడు ముందుకు తీసుకు రాలేదు. తీసుకు వ్చ్ఇన మేరకు వదులుకోవలసిన విలువలే గాని, దేవుని గూట్లో పెట్టి పూజ్జేసుకోవలసిన మంచి విషయాలు కావు. అందువల్ల జాన్సన్ దాని గురించి, అవసరమైన మేరకే, తక్కువగానే మాట్లాడడం ( ఈ విమర్శ వ్యాసం మేరకు లోపం కాదు.
  కథకుడు వాస్తవికత కన్న తను-ఇవ్వదలిచిన-సందేశానికి, ప్రిజుడిస్ మీద ఆధారపడిన తన అవగాహనకు పెద్ద పీట వేయదల్చుకున్నాడని… దాని కోసం వాస్తవికతను వీలయినంత-కన్విన్సింగ్ గా ‘అడ్జస్ట్’ చేసి ‘వాడుకో’దలచాడనడంలో సందేహం లేదు. కధలో విపరీతంగా చోటు చేసుకున్న మెలోడ్రామా చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. కథ మొదట్లో ఆత్మ హత్య చేసుకున్న రైతు కూతురు ‘అటో వా‍డితో’ లేచిపోతుంది. కొడుకుకులు కొత్తగా వచ్చిన డబ్బుతో తాగి తందనాలాడుతారు.
  ఏం సార్! ఒకమ్మాయి ఆటో నడుపుకునే అబ్బాయితో ప్రేమలో పడి, ఇంట్లో ఒప్పుకోరనే భయంతో ఇంట్లోంచి వెళ్లిపోతే దాన్ని ‘లేచిపోవడం’ అనాలా? దానికి కినిసిన రైతు మీద నిర్విమర్శక-సానుభూతి కలిగి వుండాలా? రైతుల చేతికి డబ్బులు వస్తే వాళ్లు తాగి తందానాలాడుతారా? రచయిత/ అభిమానులలో చాల మంది సెకండ్ జెనెరేషన్ ఎడ్యుకేటెడ్ అయివుంటారు. కొత్తగా డబ్బులో ప్రవేశించిన వాళ్లే అయి వుంటారు. వీళ్లు అలా చేయరు. రైతులు కూడా అలా చేయరు. రైతులు అలా చేస్తారని అనడం వాళ్లను అవమానించడమని వూహైనా రాదు మనకు, మనం రైతుల్ని ప్రేమించే వాళ్లమా.? అలా చెడుగా ప్రవర్తించే వాళ్లు కొందరు ఎప్పుడూ వుంటారు. జనం పాత వూళ్లోనే వుండినా, (అంటే, కథకు కేంద్ర సమస్య అయిన ‘నిర్వాసిత-స్థితి లేకపోయినా), చేతిలో డబ్బు తక్కువగా వున్నప్పటికీ…‍ కొందరు యువకులు అలా దురలవ‍ట్లకు లోనవుతుంటారు. లోనవుతున్నారు. కథకుని ‘మెలో డ్రామా’కు అవసరమై చెప్పడమే గాని, కొత్త వూళ్లోని వాళ్లు ఆ వూళ్లో శవ దహనానికి అభ్యంతరం చెప్పరు. ‘వలస’ వచ్చిన వాళ్లకు చాతనయిన సాయం చేయకపోగా, తప్పని సరి అయిన శవదహనం వంటి విషాదకరక కార్యక్రమానికి ఞబ్యంతరం చెప్పరు. అలా చెప్పడం క్రూరత్వమవుతుందని వాల్లకు తెలుసు. వాళ్లు మనుషులు సార్! అసహజమైన, అవా‍స్తవికమైన విషయాల్ని సందేశంగా ఇవ్వజూపే సోకాల్డ్ ‘డైడాక్టిక్’ రచనల్లోనే ఇలాంటి మెలోడ్రామా తప్పని సరి అవుతుంటుంది.
  కథలో… కొన్ని మినహాయింపులతో… స్థానిక సంస్కృతి, భాష చక్కగా పలికాయి. అందువల్ల పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అందువల్ల కథ నిజంగా కళాత్మకంగా విజయవంతమైంది. కథకుడుగా గౌరు నాయిడు సమర్థుడని అడుగడుగునా తెలుస్తుంది. జాన్సన్ గారు అందుకే ‘కళా ఖండం’ అనే మాటను వుపయోగించారని అనుకుంటున్నాను. ‘కళా ఖండ’మైతే మాత్రం జీవితాన్ని/సత్యాన్ని వక్రీకరిస్తే ఆ సంగతి ఎవరో ఒకరు చెప్పొద్దా? చెప్పాలి. ఆలా చెప్పే అవకాశాన్ని మూసేసే ‘దాడులు’, ‘తిట్లు’ సాహిత్యానికి చాల నష్టం చేస్తాయి.గందరగోళంలొ ‘మీడియోక్రిటీ’ వేదికనెక్కి నాట్యం చేయడ‍నికి అవి దోహదం చేస్తాయి. ఈ ఆవేదనను మనసులోంచి పోగొట్టుకోడం కోసమే ఈ వ్యాఖ్య రాశాను. మితృలు ఆలోచిస్తారని ఆశిస్తాను……….. హెచ్చార్కె.

  • ‘Hrk గారికి
   మీ వాఖ్య చెపుతున్న కోణం కోసం మరో సారి చదివాను.
   జాన్సన్ గారి విమర్శలో రచయిత చేసిన వాఖ్యానం అంటూ ఉటంకించిన పంక్తులను గమనించాను.
   1. ముందుగా రైతు కొడుకులు జులాయిలవ్వటం గురించయితె,
   చిరంజీవుల్నాయుడు ఆత్మహత్య రచనకు మొదటి కుదుపు. దాన్ని సహేతుకంగా సమర్ధించాలంటే, ఎంతో కొంత అంత;సంఘర్షణ ఆ పాత్ర పొందినట్లు చెప్పాలి. అది పూర్తిగా ఊరుమారటం వలననే అనుకొంటే ఆ పాత్రపై పెద్దగా సానుభూతి ఉండదనుకొని, కుటుంబ సమస్యగా కూడా చిత్రించ యత్నించినట్లుగా అనిపించింది. మీరన్నట్లు రైతులందరూ అలాగున్నారా? అంటే సమాధానం చెప్పలేం. కధలో పాకేజీ తీసుకొన్నవారందరూ అలా లేరుగా అని మాత్రం చెప్పగలను. కూతురి లేచిపోవటం అనే ఉదంతం కూడా పైన చెప్పిన సానుభూతి కోసమే అయిఉండవచ్చు. ఈ ఉదంతంలో రచయిత వాఖ్యలేమీ కనపడవు (తాడు పుటుక్కు మనటం వంటి వి) కనుక ఇష్టపడిన వారిని పెళ్లిచేసుకొని వెళిపోవటాన్ని లేచిపోవటమని నిందించవచ్చా అన్న విమర్శనుంచి రచయిత వెంట్రుక వాసిలో ఎస్కేప్ అయినట్లే అనిపిస్తుంది. అది ఆయా పాత్రల స్వభావమని సరిపెట్టుకోవచ్చు.

   2. “‘వర్ణ వర్ణాల తాడు’ అలాంటిదే. ఇక్కడ కథకుడు వుద్దేశించింది, గ్రామీణ జీవితంలోని ‘వైవిధ్యాన్ని’ కాదు. అచ్చంగా ‘వర్ణాలు’ అనబడే కులాల గురించే కథకుడు బాధ పడుతున్నారు. ”

   ఈ విమర్శ బలమైనది. సమాధానం కూడా కధలో కనిపించటంలేదు. జాన్సన్ గారు రచయిత వాఖ్యానం అంటూ ఇచ్చిన ఉటంకింపు తప్ప కధలో మరేచోటా ఇది రచయిత అభిప్రాయమని చెప్పటానికి అవకాశం లేనట్టుగానే ఉంది. అక్కడ రచయిత కొంత పగడ్బంధీగా వాక్యనిర్మాణం సాగించినట్లయితే ఇలాంటి విమర్శకు అవకాసం లేకుండా ఉండేదనిపించింది.
   కధంతా గ్రామీణ నేపధ్యంలో జరిగింది కనుక అక్కడి వాసుల స్వభావాలు, వర్ణవ్యవస్థపై వారికున్న అభిప్రాయాలు, అలాగ ఉన్నాయన్నమాట అని అనిపించి కధ మరింత సహజంగా అనిపించేదేమో.

   ఈనాడు వర్ణ వ్యవస్థను సమర్ధిస్తూ రచనలు చేయటం (ఎంత లోలోపల ఆ సాడిస్టిక్ టెండెన్సీస్ ఉన్నప్పటికీ) అత్యంత దుస్సాహసం. రచయిత అంత సాహసానికి ఒడికడతాడని నేను ఊహించలేకపోతున్నాను. ఒకవేళ ఒడిగట్టినా ఇలా దొరికిపోయే అవకాసం ఎంత మాత్రం ఈయడు.

   నా స్పందనకు ఎంతో విజ్ఞతతో, సహృదయతో సమాధానమిచ్చినందుకు, కొత్త విషయాలు నేర్చుకొనేందుకు నాకు అవకాసమిచ్చినందుకు సదా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.

   p.s.
   రాలుతున్న ఆకుల్లో దాగిఉన్న వసంతం
   నేలలోనికి వెళ్లి తనకు తాను ఆహారమై
   వేర్లలో చేరి పచ్చని ఆకుల్లోకి పాకుతుంది
   అసలేదీ ఎక్కడకీ పోదు. — hrk

   అద్బుతమైన వాక్యాలు. ధన్యవాదములతో

 6. Hrk గారికి

  మీరు నిరసించినట్లు నేను కధను చదివాను కానీ జాన్సన్ గారి విమర్శను చదవలేదు. ఆకధను మరో సారి చదివిన తరువాతే పై కామెంటు పెట్టాను. ఎందుకంటే కధలో నాకెందుకో ఒక విచ్చిన్నమౌతున్న మానవసంబంధాలు, శిధిలమౌతున్న ఒక దృశ్యమే కనిపించింది. ఇప్పుడిచ్చిన లింకులలో జాన్సన్ గారి విమర్శను కూడా చదివే అవకాశం కలిగింది. జాన్సన్ గారు సునామీ పై వ్రాసిన ఒక కధ (పేరుగుర్తులేదు) చాలా అద్బుతంగా ఉండి చాన్నాళ్లు హాంట్ చేసింది. అప్పటినుంచి జాన్సన్ గారి పేరు పరిచయమే.

  ఈ కధలో నాకు అనిపించినవి ఇవి.
  1. అభివృద్ది మాయలో చిధ్రమైన ఒక ఊరు కనిపించింది. ఈ మాయ వలన ఎంతమందికి ప్రయోజనం అనేది ఇప్పటికిప్పుడు ఎవరూ తేల్చలేరు. కానీ మొదటగా అక్కడ జరిగే నష్టాన్ని మాత్రం స్థానికులే భరించాలి. ఇది సత్యం.

  2. అల్లా జరిగే అభివృద్దిలో తక్షణ లాభాలను పొందేది మాత్రం డబ్బున్న వారే నన్నది నిర్వివాదాంశం (కాంట్రాక్టులరూపంలో).

  రచయిత కధలో ఈ విషయాన్నే చెప్పదలచుకొని, దానికి తగ్గ పాత్రలు, వాతావరణం, సంఘటనలను సృష్టించుకొంటూ సాగారు.

  చెప్పదలచుకొన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. చెప్పిన విధానం చాలా చాలా హార్డ్ హిట్టింగ్. ఇంత హార్డ్ హిట్టింగా అనిపించటానికి ప్రధాన కారణం రెండు చావులు. చావుని మించి కదిలించేవి ఏముంటాయి. జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా.

  ఇక విమర్శ గురించి
  1. విమర్శ వ్యాసం “పేరే చూపు ఆగిన “ అంటూ పెట్టటం మొత్తం కధపై ఒక ప్రిజుడైజ్డ్ అభిప్రాయాన్ని పాఠకులపై పులమటానికి చేసిన ప్రయత్నం స్పష్టంగా తెలిసిపోతోంది.

  2. కధకుడు పఠితకు ఎమర్జెన్సీ ఎక్సిట్ ఇచ్చి ఉండాల్సింది అన్న వాదన కూడా ఈ కధకు వర్తించదేమో. ఎందుకంటే కధకుడు చదువరిని ఒక ఘాడమైన విషాదంతో ఉక్కిరిబిక్కిరిచేసి కధలోకే కుప్పకూలిపోయేలా చేసి, ఆ ఫీల్ ని అతనిలో ఒక హాంటింగ్ గా మిగల్చాలని చేసిన ప్రయత్నంగా ఎందుకనుకోరాదు?

  3. కధలలో ఒక సమస్యను చర్చించి దానికి ఒకటో రెండో పరిష్కారలను సూచించే కధన విధానం ఏనాటిదీ? ఆ కొలబద్ద నేటి పోస్ట్ మోడర్న్ కధనాలకు అన్వయించాలనుకోవటం ఎందుకో ఒప్పుకోబుద్ది కావటం లేదు. కధ ఒక వాస్తవాన్ని మనముందు ఉంచింది. ఇందులో జీవితంలో మంచీ చెడు ఉన్నట్టే అన్నీ ఉన్నాయి.
  తమ్ముని మరణం ఒంటే నడ్డివిరిచిన ఆఖరి గడ్డిపరకై అన్న తనువు చాలించటం ఈ కధలో పలికించే ఆర్ధ్రతకు పరాకాష్ట.
  రైతులు తమ డబ్బును దుర్వినియోగం చేసుకొన్నారు అనేది కూడా ఒక జీవన వైరుధ్యమే. డబ్బుని సద్వినియోగం చేసుకొని ఇస్త్రీ షాపు ఒకరు, బార్బర్ షాపు ఒకరు పెట్టుకొన్నట్టు తెలుస్తుంది కధలో. అలాగని రైతు కొడుకులు అలా జులాయిలు గా మారినట్లు చెప్పటం, మీరన్నట్లు ఆ రైతు పట్ల నిర్విమర్శక సానుభూతి కోసం తప్ప మరే విధంగానూ కధకు ఉపయోగ పడే అంశం కాకపోవచ్చు.

  4. ఒక గంభీర వాతావరణం, విషాదాన్ని సృష్టించటానికి వాడుకొన్న ప్రతీకల్ని, పోలికల్ని “లైవ్ కవరేజ్” అనటం “రాలీ” చేయటం అనటం ముమ్మటికీ రచననీ, రచయిత సామర్ధ్యాన్ని కించపరచటమే. మెలో డ్రామా అన పదం సరిపోతుందేమో.

  5. విమర్శలో సామాజికాంశాలు అని స్పృశించిన అంశాలు (బ్రాహ్మణుడు పాత్ర నాయుడు పోషించటం వంటివి) ఆశక్తికలిగించేవిగా ఉన్నప్పటికీ, కధలోకానీ కధనంలో కానీ కనిపించే గొప్ప అవకరంగా అనిపించటం లేదు. అవి ఆయా పాత్రల స్వభావాలూ, చెప్పదలచుకొన్న అంశానికి చేర్చబడ్డ “ఫ్లెష్ & బ్లడ్” లలో భాగంగానే అనిపిస్తుంది ఎన్ని సార్లు చదివినా.

  6. నాగార్జున సాగర్ నిర్మాణంలో జరిపిన పురావస్తువుల భద్రత గురించి ఈ విమర్శలో చర్చించటం, కధావస్తువును మీరి చేసిన ప్రసంగంలానే అనిపించింది. ఆ విషయాలకు ఈ కధా వస్తువుకు సంబంధం ఉందా అసలు.
  ఒక విషయాన్ని చెప్పేపుడు కధకుడో కవో చదువరిలో ఆ విషయాన్ని బలంగా, లోతుగా నాటటానికై తన శక్తియుక్తులన్నీ కూడదీసుకొని, ఆ దిశలో తన నిర్మాణం సాగిస్తాడు. ఇలాంటి చిలవలపలవలు పెట్టుకోడు. ఆ విషయాలు అతనికి తెలియవు కనుక రాయలేదు కనుక, అతను భావ వైశాల్యం పెంచుకోవాలి అని సలహాలు పడేయటం అవసరమా?

  7. అప్రస్తుతమైనా ఒక చిన్న నా వ్యక్తిగత పరిశీలన
  మా కాకినాడ సమీపంలో రిలయన్స్ రిగ్గు నిర్మాణం పనిని చేసింది శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ సుమారు మూడు సంవత్సరాలు పనిచేసిన దాదాపు యాభైవేలమంది పైబడిన వలస కూలీలు అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. నా చిన్నప్పటినుంచీ, ఈ ప్రాంతంలో కోతలకు నూర్పుళ్లకు ఎండాకాలం బంటా పనులకు, తూర్పు నుండి వచ్చిన (తూర్పోళ్లు అంటారు ఇక్కడ) అలాంటి వలసకూలీలే. ఇప్పటికీ కూడా అదే పద్దతి.

  8. దశాబ్దాలుగా అక్కడి ప్రాంతం అభివృద్ది చెందకపోవటానికి రచయితల భావసంకుచితత్వమా కారణం లేక నాయకుల వైపల్యమా? ఆ తేడాను గమనించకుండా పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్న రీతిలో ఆ ప్రాంతపు వెనుకుబాటుతనానికి ఆ యా రచయితల భావసమస్య అని తేల్చిపారేసారు.
  దీన్నే నేను మూలాల్లోకి వెళ్లకుండా చేసే విమర్శలని వాఖ్యానించటం జరిగింది.

  చివరగా ఇది అప్రస్తుతమ్ కాదనే భావిస్తున్నాను. ఇదివరలో పోలవరం నిర్వాసితులపై నేవ్రాసిన ఒక కవితను ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును. నా అభిప్రాయాలనుకూడా అక్కడ పొందుపరిచాను.

  http://sahitheeyanam.blogspot.com/2009/06/blog-post_20.html

  మంచికైనా చెడుకైనా ఆయా నిర్వాసితుల ఫీలింగ్స్ ని రికార్డు చెయ్యటమే కవుల కధకుల బాధ్యత అని నేను విశ్వసిస్తాను. దాన్ని అభివృద్ది నిరోధకమని కొంతమంది విమర్శిస్తారని తెలిసినా సరే. రికార్దు చేయాల్సిందే. ఎందుకంటే ఆ కవితలో అన్నట్టు “తడిచే వానికే తెలుస్తుంది తడి పదునెంతో”

  భవదీయుడు
  బొల్లోజు బాబా

 7. బాబా గారూ, నా కామెంట్‍ను స్నేహపూర్వకంగా తీసుకున్నందుకు కృతజ్ఙతలు. నాక్కూడా జాన్సన్ గారన్నా, గౌరునాయుడు గారన్నా, రవికుమార్ గారన్నా అభిమానమే. ఆఫ్టరాల్ ఎందరం వుంటాం మనం, ఇలా జనం గురించి, కథలూ కవిత్వం గురించి ఆలోచించే వాళ్లం? నా మట్టుకు నేను ఇది (మనం) ఒక ‘కమ్యూనిటీ’ అనుకుంటాను. ఇందులో ఒకరంటే ఒకరం అభిమానం కలిగివుండడం సహజం. మనం మాట్లాడుకోడం మనల్ని మనం సరిదిద్దుకోడానికీ, మరింత బాగా రాయడానికీ, మన మధ్య ‘కమ్యూనిటీ ఫీలింగ్’ని మరింత పెంచుకోడానికి కూడా.
  ఒక్క మీరని కాదు; కథను, విమర్శను చదవకుండా కొందరు ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. మిగిలిన వ్యాఖ్యాతల మాటలు చదవండి. అంతెందుకు, మీరు కూడా, మీ మొదటి కామెంట్ రాయడానికి ముందు జాన్సన్ గారి విమర్శను చదవలేదంటున్నారు. అది సరైంది కాదు కదా?!
  ఇక, ‘మీడియోకర్’ వంటి మాటలు నోళ్లు మూయించడానికే గాని సత్యాన్వేషణకు పనికి రావని వేరే చెప్పాలా?! నోళ్లు మూయించే ఏ పని అయినా, ఏ మాట అయినా ఖండనీయమే. సాహిత్యంలో, సాహిత్య విమర్శలో అవి మరింత ఖండనీయం.
  కథలో రచయిత ‘నిర్వాసితుల’ ఫీలింగ్స్ ను చెప్పారని మీరంటున్నారు. నేనలా అనుకోవడం లేదు. ‘’మా వూరి’ నిర్వాసితుల ఫీలింగ్స్ మీకేం తెలుస్తాయి’ అని నన్ను కోప్పడితే ఏమీ అనలేనేమో. గ్రామం నుంచి నగరానికి వచ్చి, లేదా దేశం వదిలి అమెరికాలో బతుకుతున్న వారికి కూడా బాధ వుంటుంది. ‘వున్న చోటు’ వదిలి, ‘ప్రవాసులై’ బతకడం ఎవరికైనా బాధగా‍నే వుంటుంది. వున్న వూరు మునిగిపోతే, వేరే చోటికి మారే వాళ్లకు కూడ‍ అలాంటి బాధ వుంటుంది.
  భూములు/ఆస్తిపాస్తులు లేని వాళ్లకు ఉపాధి పోతుంది గాని కాంపెన్సేషన్ రాదు. వాళ్లదే నిజమైన బాధ. వాళ్లకు వూరు వున్నప్పడు కూడ‍ బాధే. అది దారిద్ర్యం, కుల పీడనలు కల్పించే బాధ. ‘నిర్వాసిత’ స్థితిలో (వున్న ఉపాధి పోయి కాంపెన్సేషన్ రాకపోవడం వల్ల) వాళ్లకు మరింత బాధ. కాని ‘మాయ’ కథ పేర్కొనేది వీళ్ల బాధను కాదు. కథ పేర్కొన్నది ‘వున్నోళ్ల’ బాధను. పాత వూళ్లో మాదిరి పిలిస్తే పలికే చాకలి, మంగలి ఇప్పడు లేరే అనే ‘నాయుళ్ల’ బాధ ఇది. నిర్వాసితులకు పునరావా కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల కలిగే బాధ ఈ కథాంశం కాదు. ఈ ‘పెద్దోళ్ల’ది ఏమంత బాధ కాకపోయినా, రచయిత ‘బాధ’ను చిత్రించాలనుకున్నారు గనుక కథకు మెలోడ్రామా అవసరమయింది.
  బాబా గారూ! మళ్లీ అడుగుతున్నా, కూతురు ఒక ఆటో డ్రైవరుతో కలిసి జీవించాలని ఇష్టపడితే, అది చిరంజీవులు నాయుడు ఆత్మ హత్యకు హేతువు కావచ్చునా? అది గతంలో జీవించే మనిషి విషాదం. అలాంటి నొప్పి కూడా నొప్పే గాని, అది ప్రత్యేకించి పాఠకుల సానుభూతి చూపించాల్సిన నొప్పి అవుతుందా? నాయుడు లోని ఈ మనస్తత్వాన్ని మనం గౌరవించాలా? చిరంజీవులు నాయుడు కొడుకులు (అంతకు ముందు మామూలు మంచి వాళ్లై వుండి) కాస్త ఎక్కువ డబ్బులు చేతిలో పడగానే బిర్యానీలకు, తాగి తందనాలాడ్డానికి అలవాటు పడ్డారనడం మెలోడ్రామా కాదా? మనం… మీరు , నేను… అలా అవుతున్నామా? కాసిని డబ్బులు సమకూడితే రైతులు, పోనీ నిర్వాసిత రైతులు అనే వర్గం మాత్రమే అలా అవుతారు, అది వాళ్ల లక్షణం అంటారా? ఈ వైఖరి రైతులను అవమానించేది కాదంటారా? ప్రతి ‘ప్యాట్రనైజింగ్’ ఆలోచనలోనూ ‘అవమానం’ దాగి వుంటుంది.
  ‘అభివృద్ధి’ అనే దానిలో చెడు పార్శ్వం వుందన్నాను నా కామెంట్‍లో. పాత జీవితంలో కొన్ని మంచి విలువలను, ప్రిజర్వ్, చేసుకోవలసిన వాటిని… ఉదాహరణకు-. స్థానిక రైతు పరిజ్ఙానాన్ని, ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం వంటి మానవ విలువలకు ప్రోది చేసే సాంస్కృతికాంశాలను ఈ ‘అభివృద్ధి- వ్యూహం’ నాశనం చేస్తుంది. అవి మార్కెటీకరణ వ్యూహానికి అవరోధమవుతాయి కాబట్టి వాటిని తొలగించడం ‘అభివృద్ధి- వ్యూహం’లో భాగమవుతుంది. ‘మాయ’ కధలో అలా మనం కాపాడుకోవలసిన స్థానిక పరిజ్ఙానం, మానవ విలువల వంటి అంశాల ప్రస్తావన లేదు.
  ‘అబివృద్ధి వ్యుహం’ వల్ల నాశనమయ్యే వాటిలో, మనకు మనం వుద్యమించి నాశనం చేయవలసినవి కూడా కొన్ని వున్నాయి. ‘వర్ణ వర్ణాల తాడు’ అలాంటిదే. ఇక్కడ కథకుడు వుద్దేశించింది, గ్రామీణ జీవితంలోని ‘వైవిధ్యాన్ని’ కాదు. అచ్చంగా ‘వర్ణాలు’ అనబడే కులాల గురించే కథకుడు బాధ పడుతున్నారు. ‘వర్ణ వర్ణాల తాడు పుటుక్కున తెగడం’ వంటి మాటలు…. నాయుడు గారికి చాకలి, మంగలి అందుబాటులో లేకపోవడం అనే బాధలోంచి వచ్చినవే.
  జాన్సన్ గారు తమ వ్యాసం శీర్షికలో చూపు గురించి మాట్లాడడం అసమంజసం కాదు. ఆయన ప్రధానంగా ప్రశ్నించింది కథకుడి ‘చూపు’నే అయినప్పుడు ఆ మాట హెడ్డింగ్ లో రావడం సమంజసమే అనుకుంటాను …. హెచ్చార్కె.

 8. I read both the Story and critisim, plus the comments on that story as well. In general, I am a fan of Ganteda and his stand on ‘development’. But this doesnt mean that we have to praise what ever a writer writes. Here are my few cents…

  1. The first two pages of story were written in excellent manner in building the atmosphere and charecters. After that there is a sudden collapse in quality. Writer started ‘discussing’ instead of telling the story. Some times writer directly jumped and used words like ‘yuddanantara sidhila’ etc (nothing wrong in that, but the previous lines do not match with this tone and the charcter realising the seen).

  2. The melo drama in the story became a farce at the end (after second death) and reader immdeately disbelieves the writer. This is a self goal made by the writer.

  3. Criticising Jonsnon CH’s job and stating that he is a government slave is utterly rediculous. These kind of bashing critics will finally harm the writer, not the critic. Criticism on Critic should be substantiated with enough data.

  And, yes, unless the writer and his fans are open to criticim the writer can not improve his writing craft.

  -Sashank

 9. ‘Hrk గారికి
  మీ వాఖ్య చెపుతున్న కోణం కోసం మరో సారి చదివాను.
  మీ ఆరోపణా, జాన్సన్ గారి విమర్శలో రచయిత చేసిన వాఖ్యానం అంటూ ఉటంకించిన పంక్తులను గమనించాను.
  1. ముందుగా రైతు కొడుకులు జులాయిలవ్వటం గురించయితె,
  చిరంజీవుల్నాయుడు ఆత్మహత్య రచనకు మొదటి కుదుపు. దాన్ని సహేతుకంగా సమర్ధించాలంటే, ఎంతో కొంత అంత;సంఘర్షణ ఆ పాత్ర పొందినట్లు చెప్పాలి. అది పూర్తిగా ఊరుమారటం వలననే అనుకొంటే ఆ పాత్రపై పెద్దగా సానుభూతి ఉండదనుకొని, కుటుంబ సమస్యగా కూడా చిత్రించ యత్నించినట్లుగా అనిపించింది. మీరన్నట్లు రైతులందరూ అలాగున్నారా? అంటే సమాధానం చెప్పలేం. కధలో పాకేజీ తీసుకొన్నవారందరూ అలా లేరుగా అని మాత్రం చెప్పగలను. కూతురి లేచిపోవటం అనే ఉదంతం కూడా పైన చెప్పిన సానుభూతి కోసమే అయిఉండవచ్చు. ఈ ఉదంతంలో రచయిత వాఖ్యలేమీ కనపడవు (తాడు పుటుక్కు మనటం వంటి వి) కనుక ఇష్టపడిన వారిని పెళ్లిచేసుకొని వెళిపోవటాన్ని లేచిపోవటమని నిందించవచ్చా అన్న విమర్శనుంచి రచయిత వెంట్రుక వాసిలో ఎస్కేప్ అయినట్లే అనిపిస్తుంది. అది ఆయా పాత్రల స్వభావమని సరిపెట్టుకోవచ్చు.

  “‘వర్ణ వర్ణాల తాడు’ అలాంటిదే. ఇక్కడ కథకుడు వుద్దేశించింది, గ్రామీణ జీవితంలోని ‘వైవిధ్యాన్ని’ కాదు. అచ్చంగా ‘వర్ణాలు’ అనబడే కులాల గురించే కథకుడు బాధ పడుతున్నారు. ”

  ఈ విమర్శ బలమైనది. సమాధానం కూడా కధలో కనిపించటంలేదు. జాన్సన్ గారు రచయిత వాఖ్యానం అంటూ ఇచ్చిన ఉటంకింపు తప్ప కధలో మరేచోటా ఇది రచయిత అభిప్రాయమని చెప్పటానికి అవకాశం లేనట్టుగానే ఉంది. అక్కడ రచయిత కొంత పగడ్బంధీగా వాక్యనిర్మాణం సాగించినట్లయితే ఇలాంటి విమర్శకు అవకాసం లేకుండా ఉండేదనిపించింది.
  కధంతా గ్రామీణ నేపధ్యంలో జరిగింది కనుక అక్కడి వాసుల స్వభావాలు, వర్ణవ్యవస్థపై వారికున్న అభిప్రాయాలు, అలాగ ఉన్నాయన్నమాట అని అనిపించి కధ మరింత సహజంగా అనిపించేదేమో.

  ఈనాడు వర్ణ వ్యవస్థను సమర్ధిస్తూ రచనలు చేయటం (ఎంత లోలోపల ఆ టెండెన్సీస్ ఉన్నప్పటికీ) అత్యంత దుస్సాహసం. రచయిత అంత సాహసానికి ఒడికడతాడని నేను ఊహించలేకపోతున్నాను. ఒకవేళ ఒడిగట్టినా ఇలా దొరికిపోయే అవకాసం ఎంత మాత్రం ఈయడు.

  నా స్పందనకు ఎంతో విజ్ఞతతో, సహృదయతో సమాధానమిచ్చినందుకు, కొత్త విషయాలు నేర్చుకొనేందుకు నాకు అవకాసమిచ్చినందుకు సదా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.

  భవదీయుడు
  బొల్లోజు బాబా
  p.s.
  రాలుతున్న ఆకుల్లో దాగిఉన్న వసంతం
  నేలలోనికి వెళ్లి తనకు తాను ఆహారమై
  వేర్లలో చేరి పచ్చని ఆకుల్లోకి పాకుతుంది
  అసలేదీ ఎక్కడకీ పోదు. — hrk

  అద్బుతమైన వాక్యాలు. ధన్యవాదములతో

 10. శ్రీకాకుళం అభివృద్ధి చెందినదే ఐతే మేమెందుకు ఇలా వూర్లు పట్టుకుని తిరుగుతాం? మిగతా అభివృద్ధి చెందిన జిల్లావాసులమాదిరిగానే, ఎవరి ఇంట్లో వాళ్లం ఉంటూ చేపల చెరువులో, రెయ్యల చెరువులో చూసుకుని ఉండేవాళ్లం. శ్రీకాకుళంను నిరాధారంగా విమర్శించే వాళ్లను ఎవరినైనా ఇలాగే ఖండించాలండీ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s