విమర్శ కాదు విజ్ఞానం

సాధారణం

Ramuni Krushnuni Rahasyaluభారత రాజ్యాంగ నిర్మాతగా, రాజనీతి శాస్త్రజ్ఞుడిగా, న్యాయశాస్త్ర కోవిదుడిగా, దళిత వర్గాల ఆశాజ్యోతిగా మెరుగైన భారత సమాజం కోసం పరితపించిన నిజమైన దేశభక్తుడు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్. ఆయన ఆలోచనసరళితో కాస్త పరిచయం వున్న వారెవరైనా అతడొక గొప్ప చదువరనే సంగతి తెలుసుకుంటారు. చాలా చిన్నచిన్న వివరాలు పొందుపరచడానికి, క్రాస్ రిఫరెన్సులకోసం విస్తృతంగా పురాణాలను, ఇతిహాసాలను, ఇతర గ్రంథాలను అధ్యయనం చేయడంద్వారా అంబేడ్కర్ తన అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకున్నారన్న కోపం కూడా అతడి సీరియస్ పాఠకులకు వస్తుంటుంది. లోతైన విశ్లేషణ, పదునైన పదజాలంతో, ఉన్నతమైన భావాలతో అలరారే అంబేడ్కర్ సంపూర్ణ సాహిత్యాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రచురించాలని తొలిసారి భావించింది. వెలువడిన మొదటి మూడు సంపుటాలను ప్రజలు విశేషంగా ఆదరించారు.ఆయితే నాలుగో సంపుటి మాత్రం వివాదాస్పదమైంది. హిందూ మతాన్ని విమర్శిస్తూ, దేవుళ్లను కించపరుస్తూ రాసిన వ్యాసాలన్నీ అందులో సంపుటీకరించారని శివసేన గగ్గోలు పెట్టింది. సెక్యులర్ భావాలు, ప్రజాస్వామిక దృక్పథమున్న ప్రతి భాఋఅతీయుడు చేయీచేయీ కలిపి దీన్ని ప్రతిఘటించారు. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, చేతనైతే ఆ వ్యాఖ్యలను సమర్ధంగా ఖండించాలి గాని, రచనలను, ప్రచురణలను నిషేధించకూడదని మేధావులు ప్రభుత్వానికి నచ్చజెప్పారు. “రిడిల్స్ ఇన్ హిందూయిజమ్” అనే గ్రంథంలోని ఒక వ్యాసాన్ని “రాముని కృష్ణుని రహస్యాలు” పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఆ చిన్ని పొత్తపు పరిచయమే ఈ వ్యాసం.

ఇరవై ఆరు పేజీల చిన్న వ్యాసంలో ఆదిలోనే రామాయణంలో రాముని పాత్ర చాలా నిస్సారమయిందనే వాదన ప్రతిపాదిస్తారు. ఇక అక్కడనుంచి వాల్మీకి రామాయణంలోని పద్యాలను ఉదాహరణలుగా చూపి వాదనను నిర్మిస్తారు. వ్యక్తిగా, రాజుగా రాముని శీలాన్ని (కారెక్టర్) అంచనా వేస్తారు. వాలిపట్ల, భార్యపట్ల రాముని వ్యవహార శైలి అతని వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) పట్టిస్తుందంటారు. ఎలాంటి రచయిత రచించిన రచనలోనైనా సీతపట్ల రాముని ప్రవర్తనకంటే క్రూరమైన దానిని ఊహించలేమని అంబేడ్కర్ బాధపడతారు. ‘నీ అంత సౌందర్యవతి అయిన స్త్రీని అనుభవించకుండా రావణుడు విడిచిపెట్టి వుంటాడని నేను అనుకోవడం లేదు’ అని రాముడు అన్నాడంటే మనం నమ్మలేం. విలపించి, ఆగ్రహించి, అగ్నిప్రవేశం పొంది పునీతురాలయి సీత వచ్చాకనే రాముడు అయోధ్యకు తీసుకొచ్చిన కథ మనకు తెలిసిందే. ఆ తరువాత జరిగిన కథే మానవీయ కోణం లేనిది. వాల్మీకితో సహా రామాయణ రచయితలందరూ హృదయ విదారకంగా వర్ణించినది. ఎన్నో విలువైన పద్యాలు, వివరాలను ఎవరికీ అందకుండా చేసిన (వైదిక భావజాల ప్రచారకులైన బ్రాహ్మణ) పురోహితులు సైతం విడిచిపెట్టలేకపోయారు. అనుమానంతో గర్భవతి అయిన స్త్రీని ఒంటరిగా అడవిపాలు చేయడం – అదీ మోసంతో, కపట పన్నాగంతో. నిండు గర్భిణి సీతను దిక్కూమొక్కూలేని కీకారణ్యంలో విడిచిపెడుతూ లక్ష్మణుడు సీత కాళ్లపై పడ్డాడు. వెచ్చని కన్నీళ్లు బొటబొటా కారుతుండగా, ‘ఓ మచ్చలేని మహారాణీ, నేను చేస్తున్న పనికి నన్ను క్షమించు. నిన్ను తన ఇంట్లో పెట్టుకున్నందుకు తనను ప్రజలు నిందిస్తున్నందువల్ల నిన్ను ఇక్కడ వదిలి వేయమని మా అన్నగారి ఆజ్ఞ‘ అని అంటాడు. (వ్యక్తిత్వం, మూర్తిమత్వం లేని లక్ష్మణుడు ఎలా ఎదిగిందీ మరింత వివరంగా, వ్యంగ్యంగా రంగనాయకమ్మ తన “రామాయణ విషవృక్షం”లో రాశారు.)

రాజుగా రాముని విలాస జీవితాన్ని అంబేడ్కర్ ఉదాహరణలతో వెలుగులోకి తెస్తారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ క్షత్రియులు మద్యం, మాంసం, మగువ అంటే మక్కువ చూపించడం మరీ అంత విడ్డూరమైన విషయమేమీ కాదు. దీనికి రాముడికే మినహాయింపూ ఇవ్వక్కర్లేదు. ఇంతవరకూ నిదానంగా మాట్లాడిన అంబేడ్కర్ శంభుక వధ విషయంలో రాముడ్ని దూదేకిపారేస్తారు. దీనికి కారణం అంబేడ్కర్ అపార ప్రేమ, సానుభూతులు శూద్ర ప్రతినిధి శంబుకునిపై వుండడమే.

ఇక కృష్ణుని గురించి – మహాభారతంలో కృష్ణుడి కుటిల నీతిని అంబేడ్కర్ ఎండగడతారు. చెడిపోయే బేరం చేస్తే ‘కృష్ణ రాయబారం’ చేశాడని జనపథంలో వాడుక – బహుశా ప్రజలందరికీ కృష్ణుని తీరు తెలిసే వచ్చిందేమో. కేవలం అంబేడ్కర్ చదువుకున్న పురాణ, ఇతిహాసాల జ్ఞానమే ఈ వ్యాసంలో గుప్పిస్తారు. దీనికి తన వ్యాఖ్యానం జోడించరు. అందుకు కారణం అంబేడ్కర్ ఇదివరకే స్పష్టంగా చెప్పినట్టు ప్రజలను విజ్ఞానవంతులను చేయడమే అతడి రచనోద్దేశం. అయితే విజ్ఞులైన పాఠకులు ఈ ప్రభావశీల వ్యాసం చదివాక, డి. డి. కోశాంబిని కొద్దిగా అధ్యయనం చేస్తే వలయం పూర్తవుతుంది. అప్పటికే బౌద్ధమత బోధనలు ఉజ్వలంగా వెలుగొందుతున్నాయి. పూజాపునస్కారాలు కాదు సరికదా, విగ్రహారాధనే వద్దన్న బుద్ధుడిని సమర్ధంగా ఎదుర్కోవడానికే అప్పటి పురోహిత వర్గం రాముడికి అంత సీన్ ఇచ్చిందన్న సంగతి (ఆ మాటకొస్తే ఇప్పటికీ ఇస్తోందన్న సంగతి) మనకు బోధపడుతుంది.

రాళ్లూ పూలూ అనదగ్గ కామెంట్లు అన్నీ చేర్చి 45 పేజీలలో “రాముని కృష్ణుని రహస్యాలు” పుస్తకం 12 రూపాయలకే హెచ్ బి టి అందిస్తోంది. వీలు చేసుకుని తప్పక చదవండి.

ప్రకటనలు

3 responses »

  1. మంచి పుస్తకాన్ని చక్కగా పరిచయం చేశారు.
    శాస్రి గారూ! మరేం భయం లేదు. ఆ పుస్తకం మీరూ చదవండి. శంభుకుడిని చంపిన రాముడి కథలో చాల కవిత్వం వుందనీ, గొప్ప ధర్మం వుందనీ, అందరూ చదవాలని అంటున్నారు కదా. అన్యాయంగా చంపబడిన శంభుకుని పక్షాన ఒకాయన చేసిన ఆలోచనలు న్యాయమో కాదో మీరు తెలుసుకోనక్కర్లేదా? మీరూ చదవండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s