స్వేచ్ఛావలోకనమే కవి(త)త్వం – ఛాయరాజ్ ‘దర్శన’మ్

సాధారణం

శిల్పగతమైన శక్తులు ఎన్నివున్నా, కవికి వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలు, అభిప్రాయాలే. సమాజం గురించి, జీవితం గురించి స్థిరమైన అభిప్రాయాలు లేనివాడు ఎన్నాళ్లయినా తనదని చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం పొందలేడు. ఈ నిర్దిష్టమైన విలువలు తన ప్రతి రచనలోనూ మేళవించి సామాజిక ప్రయోజనం పరమావధిగా రచనలు చేస్తున్న అతి కొద్దిమంది తెలుగు కవులలో ఛాయరాజ్ ఒకరు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కవి ఛాయరాజుకు 2005లో ప్రతిష్టాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. తెలుగు కవిత్వంలో ఫ్రీవర్స్ ఫ్రంటుకు ఉత్తమ బహుమానం అన్న విలువ వుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి అభినందన సభలో, పురస్కార గ్రహీత రెండు పేజీల కృతజ్ఞతా సమర్పణ పత్రంలో తన కావ్యం “దర్శిని” గురించి, రచనా నేపథ్యం గురించి చర్చించారు. ఆ పత్రం చదివి చలించని వారుండరు. కవి నిజాయితీ నచ్చి “దర్శిని” దీర్ఘ కావ్యాన్ని చదవడం మొదలుపెట్టా. 

విశ్వంలో సౌరకుటుంబం ఆవిర్భావం, భూమి పుట్టుక, జీవోత్పత్తి, జీవ పరిణామం, అందులో సామాజిక పరిణతి, శ్రమ నిర్వహించిన పాత్ర మొదలైన విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించడం వల్ల కాబోలు కావ్యం ఒక పట్టాన సామాన్య పాఠకుడికి కొరుకుడు పడదు. అసలే కవిత్వం, ఆపై శాస్త్ర విజ్ఞానం. అయితే కవి ఊహల వెంబడి, అతని స్వాప్నిక ప్రపంచంలోకి తన చేయి పట్టుకుంటూ వెళ్లిపోగలిగితే అంతరిక్షపు ఆవలి తీరం వరకు మనను తీసుకుపోతారు ఛాయరాజ్. నాలుగు కాళ్ల జంతువు పరిణామ క్రమంలో ముందరి కాళ్లను నడకకు ఉపయోగించే అలవాటు ఎందుచేతనో వదులుకుని వానరుడు నరుడయ్యాడు. (ఈ క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్రపై ఎంగెల్స్ రాసిన చిన్న వ్యాసం మీరు చదివారా?) బాతులాగా వేళ్లమధ్య చర్మం లేకుండా, కుక్కలాగా అయిదు వేళ్లూ ఒకవైపు చూడకుండా, మనిషి బొటనవేలు మాత్రమే మిగిలిన వేళ్లవైపు చూడడం మొత్తం పరిణామ క్రమంలో ఒక మైలురాయి. ఏదైనా ఒక వస్తువు పట్టుకోవదానికి గ్రిప్ దొరకగానే మానవుడు ప్రకృతిని తన వశం చేసుకోనారంభించాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్న నాగరకత గురించి చెప్పేదేముంది? అయితే నిజంగా మనిషి ప్రగతి సాధిస్తున్నాడా? సాంఘికంగా, సమూహంగా, ఒంటరిగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్న పురోగతి ఎటువైపు పోతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ కవి సాగించిన చింతన ఫలితమే ఈ “దర్శని” దీర్ఘ కావ్యం.

‘గొప్ప వికాసానికి ముందు ఎంతో సంఘర్షణ

పెద్ద విస్తరణకు ముందు గొప్ప యుద్ధం

దు:ఖించి ఆనందించడం

కష్టించి సుఖించడం వల్ల

అగాధంలో పడవలసిన అడుగును

అందలానికి వేయగలగడం

అంతో ఇంతో అలవాటే”

వెన్నెముక లేని జీవుల నుంచి వెన్నెముక వున్న జీవులకు పరిణామం సాగే సందర్భంలో కవి వాడిన మాటలివి. అర్థం చేసుకోవడానికి ఎక్కడా ఇబ్బంది పడనక్కరలేని పదజాలం. మానవజాతి పరిణామంలో శ్రమ నిర్వహించిన పాత్ర, నాగరకత వెల్లువెత్తడంతోనే వర్గ సమాజం రావడం, స్త్రీ పురుష సంబంధాలతోపాటుగా వర్గరహిత సమాజాన్ని ఆకాంక్షించడం ఛాయరాజ్ బాధ్యతగల కవితా రుజువు చేస్తాయి.

ఈ కావ్యానికి ముందుమాట రాస్తూ డాక్టర్ బి. సూర్యసాగర్ మనిషి ప్రకృతి నియమాలను గుర్తించి వాటితో చెలిమి చేసి సుఖపడినాడని అంటారు. నిజంగా మనిషి సుఖపడుతున్నాడా? సుఖమనే భ్రమ పడుతున్నాడా? తుపానులు, వరదలు, భూకంపాలు, సునామీలు, కత్రినాలు, రాజకీయాలు, సాహిత్యాలు… ఇదంతా నిజంగా సుఖ జీవనమేనా? ఇదే ముందుమాటలో మరికొంత ముందుకెళ్లినాక ‘మానవ ప్రగతి నేటి వర్గ సమాజ సంకెళ్లను తెంచుకునే ప్రయత్నమే‘నంటారు. దీనిని అంగీకరించగలమా? గ్లోబలైజేషన్ దారి సంగతేమిటి? మన జీవితంలో అన్ని కోణాలను ప్రభావితం చేస్తున్న గ్లోబలైజేషన్ ప్రక్రియను ఎదిరిస్తున్న వాళ్లు, ఆపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లు దీనిని అంగీకరించగలరా? ఈ పరిచయ వాక్యాలు ముగించేముందర సూర్యసాగర్ అక్షరలక్షలు చేసే మాటలు చెప్తారు.

‘స్త్రీ పురుష అసమానత, వైరుధ్యం మానవ సమాజం అవశ్యంగా పరిష్కరించుకోవలసిన సమస్యలు. పరిష్కారంలో ఆలస్యంగానీ, అసంపూర్ణతగానీ సామాజిక విషాదాన్ని మరింత జటిలం చేస్తాయి’. నిజంగా నిజం కదా.

“దర్శని”  కావ్యాన్ని ముగిస్తూ ఛాయరాజ్ పుడమి తల్లిని ప్రార్థిస్తారు.

ఏ దుఖంలో ఏ ప్రేమతో

ఈ మనిషినీ

సర్వోన్నత సృష్టియైన మనస్సునీ

నిర్మూలిస్తావో

ఆ ప్రేమతోనే

మరెక్కడో వాటిని సృష్టించి తీరుతావు

అప్పుడు, అమ్మా!

నీ కడుపున పునర్ నిర్మాణమవుతాను

ఆడమగ తేడాలేని అద్భుత రూపాన్నివ్వు

ఆ రూపం స్పర్శకందనిదైనా సరే

స్త్రీ పురుష వివక్షను రూపుమాపడానికి ఏకంగా కవి ఏం కోరుకుంటున్నారో చూశారా? ఉభయలింగ జీవిగానో, లింగరహిత జీవిగానో మనిషిని మార్చేయమని కవి కోరడం స్పష్టమైన విప్లవ రాజకీయ దృక్పథంగా కనిపిస్తుంది. ప్రకృతిని, సమాజాన్ని కవి మార్క్సిస్టు భావజలపు నేపథ్యంలో తాత్వికంగా చిత్రించిన కావ్యం “దర్శిని”. మీరూ చదవండి.

One response »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s