ఈ మాసం పత్రిక “బిబ్లియో”

సాధారణం

నిజానికి కవిత్వం కన్నా నవలలంటే, వాటి కన్నా కథంటే, వాటికన్నా వ్యాసమంటే నాకు మక్కువ ఎక్కువ. అందులో పుస్తక పరిచయ వ్యాసాలన్నా, రచయితల పరిచయ వ్యాసాలన్నా పడిచస్తాను. అసలు తెలుగులో కేవలం పుస్తక పరిచయాలకోసమే ఒక పత్రిక ఎందుకులేదన్న నా పరిశోధనకు సమాధానమే ఈ “మీరు చదివారా?” బ్లాగు రూపకల్పన. (అతిత్వరలో ఈ తరహాలో ఒక మేగజీన్ కూడా తీసుకురావాలని సంకల్పం.) అయితే మన భాష సరే, ఇతర భాషలలో ఇలాంటి కేవల పుస్తక పరిచయ పత్రికలున్నాయా అని ఆరా తీస్తే ఒక ఆశ్చర్యకరమైన నిజం బోధపడింది.

విదేశాల్లో దాదాపు ప్రతి పత్రికా ఒక మాస పత్రికనో, పక్ష పత్రికనో, వార పత్రికనో కేవలం పుస్తక సమీక్షల కోసం ప్రచురిస్తోంది. కాగా దాదాపు ప్రతి విశ్వవిద్యాలయం ఇదేవిధంగా పుస్తక సమీక్షలకోసం అన్ని డిపార్ట్ మెంట్లలలో ప్రత్యేక పీరియాడికల్స్ ప్రచురిస్తున్నాయి. అంటే పొలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ కు ఒక సమీక్షా పత్రిక వుంటే అదే యూనివర్శిటీలోగల వివిధ డిపార్ట్ మెంటులన్నీ ఒక్కో సమీక్షాపత్రిక వెలువరిస్తుంటాయన్న మాట. ఇది చాలా ఆశ్చర్యకరంగా నాకు కనిపించింది. ఇక మనదేశంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అయితే మనదేశ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా వ్యవహరిస్తున్న మేధావులూ బుద్ధిజీవులందరూ దాదాపు అన్ని పత్రికలలోనూ పుస్తక పరిచయాలు చేస్తుండడం హర్షించదగ్గ విషయం. అంటే మన దేశంలో పత్రికలన్నీ కేవలం పుస్తక పరిచయాల కోసం పుస్తకం చివరన కొన్ని పేజీలు కేటాయిస్తున్నాయి. (ఒక్క ఫ్రంట్ లైన్ పక్ష పత్రిక మాత్రం పుస్తక సమీక్షలకు మధ్యలో చోటిస్తోంది.)

ఇక మనదేశంలో కేవలం పుస్తక సమీక్షలు మాత్రమే ప్రచురించే పత్రికలున్నాయా అని శోధిస్తే రెండు ఇంగ్లిషు పత్రికలు దొరికినాయి. అందులో ఒక పత్రికను ఈ మాసం పత్రికగా పరిచయం చేస్తున్నాను.

కేవలం పుస్తక పరిచయాలు, సమీక్షలు, విమర్శలు కనిపించే ఆ ద్వైమాస పత్రిక పేరు ” బిబ్లియో: ఏ రివ్యూ ఆఫ్ బుక్స్ “.

ఎన్ అరవింద్ దాస్, దిలీప్ పద్గోవంకార్, షామ్ లాల్, బృందాదత్తా, కపిల సిబాల్ తదితరులందరూ కలిపి ప్రారంభించిన ఈ పత్రికకు ప్రస్తుతం రుక్మిని భయ్యా నాయర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చాలా ఖరీదైన పేపర్ మీద అందంగా ముద్రించే పత్రిక రెండు నెలలకోసారి మనకు అందుతుంది. కేవలం పుస్తక ప్రచురణకర్తల ప్రకటనలే వుంటాయి. కాబట్టి మరిన్ని పుస్తకాల గురించి వివరాలు తెలుస్తుంటాయి. తాజా సంచికలో ఆస్ట్రేలియలో ప్రస్తుత సాహిత్యం గురించి కొన్ని పరిచయ వ్యాసాలున్నాయి. ప్రతి సంచికలోనూ ఏదో ఒక విషయం మీద ఫోకస్ లాగా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తారు. రెండు సంచికల కిందట ఇంగ్లిషు లిటరరీ బ్లాగులపై ఒక ప్రత్యేక వ్యాసం వెలువడింది. అయితే అందులో ఇతర భాషల బ్లాగుల ప్రస్తావన లేదనుకోండి.

ఈ పత్రిక బయట స్టాళ్లలో దొరకదు కాబట్టి విధిగా చందా కట్టి తెప్పించుకోవలసిందే. ఒక సంవత్సరానికైతే 400 రూపాయలు, రెండేళ్లకైతే 600 రూపాయలు, మూడేళ్లకైతే 700 రూపాయల చందా పంపించి ప్రతి రెండు నెలలకోసారి బిబ్లియోను ఆసాంతం చదువుకోవచ్చు. ఇలాంటి పత్రికలు చదవడం వల్ల ఏ పుస్తకాలు చదవాలో సంగతి తెలియడం పక్కనపెట్టండి, ఏయో పుస్తకాలు చదవకూడదో ముందుగా తెలిసిపోతుంది. అలా జాగ్రత్త పడొచ్చు. ఇంటర్నెట్ లో ఈ పత్రికను చదవొచ్చు గాని, అన్ని వ్యాసాలూ పూర్తిగా దొరకవు. అయితే చందా చెల్లించకపోయినా 85 శాతం వ్యాసాలను పూర్తిగా చదవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాకాదు నాలాగా పుస్తకం చేతిలో పట్టుకుని కూతురితో ఆడుకుంటూ, కొడుకుతో కులుకుతూ వాళ్లు పేజీలు చింపేస్తుంటే ముద్దుగా విసుక్కుంటూ, స్నేహితులకు వాళ్లు చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ మురిసిపోవాలంటే మాత్రం డబ్బులు పంపాల్సిందే.

మీరు డబ్బులు పంపవలసిన చిరునామా:

Biblio: A Review of Books
19, Bhavani Kunj
Behind D-2 Vasant Kunj
New Delhi, 110 070
India

ఒక స్పందన »

  1. రవి కుమార్ గారూ ఎలా వున్నారు? చాలాకాలం తరువాత .మీ ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతున్నందుకు ఆభినందనలు.
    “అలాకాదు నాలాగా పుస్తకం చేతిలో పట్టుకుని కూతురితో ఆడుకుంటూ, కొడుకుతో కులుకుతూ వాళ్లు పేజీలు చింపేస్తుంటే ముద్దుగా విసుక్కుంటూ, స్నేహితులకు వాళ్లు చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ మురిసిపోవాలంటే మాత్రం డబ్బులు పంపాల్సిందే”
    – బిబ్లియో: ఏ రివ్యూ ఆఫ్ బుక్స్ “. పుస్తక పరిచయం తరువాత మీరు వ్రాసిన పదాలు

    చిన్నపిల్లలున్న యింట పుస్తకాలుంటే వుండే… యింటింటి రామాయణం రెండు వాక్యాలలో విపులంగా తెలియజెప్పారు. …..ఆభినందనలు. శ్రేయోభిలాషి …నూతక్కి

  2. శ్రీ రవికుమార్ గారు, నమస్కారం.తెలుగులో బిబ్లియో లాంటి పుస్తకం రావడం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం.-గంటి లక్ష్మీనరసింహమూర్తి

వ్యాఖ్యానించండి