భరాగోకు తెలుగు సాహితీ ప్రపంచం రుణపడి వుండాల…

సాధారణం

ఆరేడు నెలల కిందట ఒకరోజు విశాఖపట్నం నుంచి బస్సులో వస్తుండగా ఫోన్ మోగింది. నెంబరు విశాఖపట్నానిది. చెవులకు దగ్గరగా ఫోన్ పెట్టుకుని మాటలు విందామని ప్రయత్నిస్తుంటే అవతల మాట్లాడుతున్నది భమిడిపాటి రామగోపాలం. ప్రజాసాహితి మాసపత్రికలో “ఏకాంతసేవ” పుస్తకాలు భరాగో దగ్గర దొరుకుతాయన్న మాట చదివి ఆయనకు కార్డు రాస్తే దానికి బదులుగా వచ్చిన కాల్ అది. ఆ పుస్తకాన్ని తాను ప్రచురించలేదని, ఎవరో అజ్ఞాతవ్యక్తులు ఒకరోజు ఉదయాన్నే తన ఇంటిముందర కొన్ని వందల కాపీలు పడేసి పోయారని ఎప్పుడైనా వచ్చి నా కాపీ తీసుకుపోవచ్చని అన్నారు. కేవలం ఒక గంట ముందు ఇదే ఫోన్ వస్తే తప్పక వచ్చి, తమరిని కలిసి ఆ పుస్తకాన్ని తీసుకుపోయేవాడినని, కాని అప్పటికే బస్సు విశాఖ పొలిమేరలు దాటేసిందని, పోస్టులో పంపించండని అడిగాను. అనుకున్నట్టుగానే రెండు రోజుల్లోనే పుస్తకం చేతికందింది. అలా జరిగింది మొదటిసారి భరాగో మాటలు చెవికి సోకడం.

అప్పటికే ఆ పుస్తకాన్ని నాచేత చదివించిన కణుగుల వెంకటరావుగారు భరాగో పంపిన తర్వాత ఆ పుస్తకాన్ని మళ్లీ చదవమని చెప్పారు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం (వేంకట పార్వతీశ కవులు అని అందరికీ సుపరిచితులు) సంయుక్తంగా రాసిన ఆ ప్రార్థనపూర్వక హృదయనివేదన ప్రేమ గీతాన్ని ఎన్నిసార్లయినా చదవడం దివ్యమయిన అనుభూతి. ఆ పుస్తకం చదివిన తర్వాత కలిగిన సంతోషాన్ని మరోసారి భరాగోకు మనసారా చెప్పుకోవడం, నా ఆవేశాన్ని ఆర్ద్రతతో అర్థం చేసుకున్న ఆ పెద్దమనిషి చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి. కాని ఆయన జ్యేష్ట లిటరరీ ట్రస్ట్ పేరిట వెలువరించిన స్మృతిసంచికలు, అభినందన సంచికలు ఏ ఒక్కటి చదివినా అంత సులువుగా భరాగోను మర్చిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. పైగా ఆ సంచికల్లో మన అభిమాన వ్యక్తులుంటే గనక, భరాగోకు మనం జీవితాంతం రుణపడివుండాల…

భరాగోను పాథకులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా గుర్తుపెట్టుకుంటారంటే అన్ని రకాలుగా ఆయన సాహితీ ప్రయాణం కొనసాగిందన్నమాట. కటిక బీదరికం బాల్యంలోనే అనుభవించిన భరాగో జీవితం పూలపాన్పు కాదు. రచయితగా, పాఠకుడిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా పలుపాత్రలు పోషించిన భరాగో జీవితయాత్ర మాత్రం చాలా చిత్రవిచిత్రంగా నడిచింది. 1932 ఫిబ్రవరి ఆరున ఇప్పటి విజయనగరం జిల్లా అలమండ గ్రామంలో పుట్టిన గోపాలం ఎకాఎకిన ఆరో తరగతిలో బడిలో జాయినయ్యి, ఆంధ్రా యూనివర్శిటీనుంచి ఎమ్మే తెలుగు చేయడం వరకూ తన సొంత సంపాదనతోనే బతుకుబండి లాగించారు. రామగోపాలం సత్రంలో భోజనం చేస్తూ, పిల్లాడిగా వున్నప్పుడే పిల్లలకు పాఠాలు చెప్తూ, పెద్దవుతున్న కొద్దీ రకరకాల ఉద్యోగాలు చేసి చదువు చాలించాక సెన్సస్ ఆఫీసులో, సర్వే ఆఫీసులో అనేకానేక ఉద్యోగాలు మారుకుంటూ, ఎక్కడా ఇమడక రాష్ట్రమంతటా పర్యటిస్తుండేవారు. ఆ యువకుడి మాటలో రాతలో పదునుని గమనించిన నార్లవారు పురాణం దగ్గర ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేర్చారట. రేడియోలోను, ఆ తర్వాత పలు పత్రికల్లోనూ పనిచేసిన భమిడిపాటి 1974లో విశాఖ పోర్టులో సంపాదించిన ఉద్యోగంలో మాత్రం 1990లో రిటైర్ మెంట్ వరకూ పనిచేశారు. 1978 నుంచీ ఆరోగ్యం చెడినా ఆస్టియో ఆర్త్రైటిస్ 2004లో ప్రమాదకరంగా మారింది. 2008కల్లా రెండు కాళ్లూ, రెండు చేతులూ పనిచేయని స్థితికి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ ఏడు ఆయన తుదిశ్వాస విడిచిపెట్టారు.ఆంతవరకూ ఆయన సాహితీ సేవ చేస్తూనే వున్నారు. అదే ఆయన జీవితంలో విశేషాల్లోకెల్లా విశేషం.

ఉత్తరాంధ్ర సాహితీ సృజన అంటే మనకు గుర్తుకొచ్చేది గురజాడ, రావిశాస్త్రి, కారా, పతంజలి… వీరంతా మినహాయింపులు లేకుండా జీవితాన్ని దాని చలనసూత్రాలను ఒడిసిపట్టుకుని తమదైన శైలిలో చాలా సీరియస్ గా రచనలుచేసిన మహానుభావులు. అయితే కళింగాంధ్ర జీవితంలో అలుపెరగని పోరాటంతో పాటు ముఖ్యంగా ఇక్కడి మాటలోనూ, పాటలోనూ పెనవేసుకుపోయిన వ్యంగ్య వైభవాన్ని భరాగో తన స్వంతం చేసుకున్నారు. ఎంత సీరియస్ విషయమైనా తన హాస్యరసంలో ముంచి మనకందించడం భరాగో ప్రత్యేకత. అందుకే భరాగో అందరి అభిమాన రచయిత అయ్యాడు. అందుకే పిన్నలూ పెద్దలూ నాన్-సీరియస్ పాఠకులూ సీరియస్ పాఠకులూ అందరూ భరాగో రచనలను ఇష్టంగా చదవడం సాధ్యమైంది.

ఇలా ప్రాంతాల భేదం లేకుండా, వయసు తారతమ్యం లేకుండా, మగాఆడా అన్న తేడా లేకుండా, అప్పుడే చదవడం మొదలుపెట్టిన పాఠకులనుంచి తెగ చదువుతున్న  పాఠకుల వరకూ అందరి దగ్గరనుంచి వచ్చిన విశేష ప్రోత్సాహం వల్ల 160దాకా కథలూ, మూడు నవలలు వెయ్యికిపైగా సాహిత్య వ్యాసాలు, పదిహేడు అభినందన సంచికలూ ఒక మనిషి జీవితకాలంలో తీసుకురావడం సాధ్యమైంది. మనింటికి చుట్టాలొస్తేనో, మన పాపకు జలుబు చేస్తేనో సాహిత్య సమావేశానికి హాజరుకావడం మానేసే మనుషులం మనతో కంపేర్ చేయడం కాదుగాని, రెండు కాళ్లూ పనిచేయని మనిషి, రెండు చేతులూ తిమ్మిరెక్కిపోయి సహకరించని మనిషి ఇన్ని పనులు సుసాధ్యం చేశారంటే మనం అభినందించి తీరాలి, అంతేగాని మనల్ని మనం నిందించుకోకూడదు. పైగా కొన్ని జీవితాలంతే అనుకోవాలి.

“వంట వచ్చిన మొగాడు”, “ఇట్లు మీ విధేయుడు”, “కథన కుతూహలం” వంటి కథా సంకలనాలలో ఆయన కథలు ఒక్కొక్కటిగా చదవడం దానికదే ప్రత్యేక అనుభవం. మనిషి మనసులోని రకరకాల ఛాయలను, వాటి ప్రవర్తనలను, అందుకు మనసే సంబరపడడం – సంబ్రమాశ్చర్యాలకు లోనుకావడం – అంతులేని వేదనకు గురికావడం తదితర పర్యవసానాలను ఆయన తన కథల్లో చిత్రిక పట్టారు. తన వాక్యాలలో ఆర్థిక అంశాల జోలికి వెళ్లనట్టే భరాగో కనిపించడానికి కారణం వాటికి దట్టంగా హాస్యపుపూత పూయడమే. అన్నట్టు “ఇట్లు మీ విధేయుడు” కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ప్రకటించింది. “కుండపెంకులు”, “స్పర్శరేఖ”, “నాకీ ఉద్యోగం వద్దు” అన్న మూడు నవలలు కేవలం ఆయన జీవితాన్ని చూసిన చూపును లేదంటే ఆయనకు జీవితం అందించిన దృక్పథాన్ని వెల్లడిస్తాయి. “ఆరామ గోపాలమ్” పేరుతో ఆయన ప్రచురించిన ఆత్మకథ జీవిత చరిత్ర రచనకు కొత్తదారి చూపించింది. అసలు ఆ మాటకొస్తే భరాగో ప్రచురించిన పుస్తకాలే అందానికి మారుపేరు. నాణ్యమైన కంటెంట్ తోపాటు కంటికింపైన విధంగా పుస్తకాన్ని తయారు చేస్తారు. అందుకే జ్యేష్ఠ లిటరరీ ప్రచురణలంటే ఖరీదు కూసంత ఎక్కువే అని తెలిసినా ఆ పుస్తకాలను తెలుగు పాఠకులు కొనుక్కోకుండా వుండలేకపోతున్నారు.

భరాగోకు సాహిత్యం పిచ్చితో పాటు సంగీతం (వీటితో పాటే వంట అంటేకూడానట) కూడా మరో పిచ్చి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన సంగీత సాహిత్య విషయాలపై రాసిన వ్యాసాలు వందలాది. వాటిలో ఆయన సంకలన పరిచినవి “నూట పదహార్లు”, “మరో నూట పదహార్లు”. ఈ రెండూ నిశ్సంసయంగా సినీ సంగీత సాహిత్యానికి భరాగో చేర్పులు.

ఇక సంపాదకుడిగా భరాగోను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. సుమారు పదిహేడు ప్రత్యేక సంచికలను సంపాదకుడిగా వెలువరించారు భరాగో. 1977లో సాహిత్య ఉత్సవ సంచిక తొలి సంచిక కాగా 82లో విశాఖ సాహితి సంస్థ దశాబ్ది వేడుకలను జరుపుకొంటున్న వేళ వెలువరించిన ప్రత్యేక సంచిక, 85లో చాసో సప్తతి సంచిక, 99లో తీసుకొచ్చిన రావు బాలసరస్వతీ దేవి అభినందన సంచిక, పద్మభూషణ్ డాక్టర్ పాలువాయి భానుమతి మరణాంతరం వెలువరించిన స్మృతిసంచిక “మహా మహిళ”, రావిశాస్త్రి మరణించాక పత్రికలు రాసిన సంపాదకీయ వ్యాఖ్యలు, ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ సభలలో మిత్రులు చెప్పిన కబుర్లు, ఆత్మీయులు పంచుకున్న ఆవేదనలను అన్నింటినీ గుదిగుచ్చు ప్రచురించిన ప్రత్యేక సంచిక “నివాళి”, ఇటీవల 2009లో తెచ్చిన అద్భుత గాయని పి. సుశీల అభినందన సంచిక వేటికవే ప్రత్యేకమైనవి. ఈ సంచికలలో భరాగో వాడిన పోటోలు ఎప్పటికీ పదిలపరుచుకోతగ్గవి.

మనుషులు శాశ్వతం కాకపోయినప్పటికీ వారి కృషి మాత్రం అజరామరంగా మిగిలిపోతుందనడానికి భరాగో నిలువెత్తు నిదర్శనం. కరకు గుండెలను సైతం కదిలించి నవ్వించగల కథలు చెప్పిన హాస్య కథలరేడు, సినీ పాటల సాహిత్య సౌందర్యాన్ని పునరావిష్కరించిన సంగీత సాహిత్య అభిమాని, తనకు నచ్చిన మనుషులను అందంగా పుస్తకాలలో శాశ్వతం చేయడమెలానో తెలిసిన పబ్లిషింగ్ వ్యాపార రహస్యాలు తెలిసిన అరుదైన మనిషి భరాగో గొంతు ఇక వినిపించదన్న నిజం బోధపడితే మనసు కలుక్కుమంటుంది.
//

ప్రకటనలు

3 responses »

  1. ఆయన కథలు చదివాను. కొంత హాస్యంగా ఉన్నా, చాలా మట్టుకు సుమారుగా ఉన్నాయనిపించాయి. అది పక్కన పెడితే పాత సినిమా పాటల సేకరణల్ని, అనేక సాహిత్య సంగీత చలనచిత్ర విషయాల్ని సేకరించి జ్ఞాపికల్ని సమకూర్చడంతో ఆయన తెలుగువారికి అందించిన సేవ మరువలేనిది.

  2. భరాగో గారి గొంతు (‘నూట పదహార్లు ‘ లో) ఇంకా చెవిలో తాజా గా మోగుతోంది. ఆయన కథలు దూరదర్శన్ లో చూసాను. విశాఖ లో ఆయన్ని (మద్దిలపాలెం లో) కలుసుకోవాలనుకున్నా. ఆంధ్రప్రదేశ్ పత్రిక లో కూడా ఆయన కథలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఆయన లేని లోటు తీరనిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s