పోటీ పరీక్ష

సాధారణం

అకస్మాత్తుగా తెలివి వచ్చింది. ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. గడియారం వైపు చూశాను. ఐదు కావస్తోంది. ‘ఇంత ఉదయాన్నే ఎవరబ్బా’ సందేహిస్తూ దుప్పటి తీసి నిద్రకళ్లతో వెళ్లి తలుపు తీశాను. ఆశ్చర్యం! ఎదురుగా పద్మనాభం. నుదురంతా చెమట పట్టివుంది. లోనికి తీసుకొచ్చాను. టెర్రస్ మీద కుర్చీ సర్ది కూర్చోబెట్టి ముఖం కడుక్కోవడానికి వెళ్లాను.

వాడూ నేనూ బాల్య స్నేహితులం. చదువంతా కలిసే అయింది. విచిత్రం ఏమిటంటే మా ఇద్దరి శ్రీమతులూ బాల్య స్నేహితులు కావడమే. ఉద్యోగాలు వేరే అయినా, వుండేది ఒకే వూర్లో కావడంతో మా స్నేహం మరింత పదిలమయింది. పద్మనాభానిది కాస్త పెద్ద కుటుంబం. చిన్నప్పటినుంచి వాడిని పద్మం అని పిలవడమే నాకు అలవాటు.

ఇంకా బాగా తెల్లవారలేదు. లైటువేసి కుర్చీలో కూర్చుని విశేషమేమిటన్నట్లు చూశాను. నా ముందు పేపరు పరిచాడు. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటముందు కవాతు చేస్తున్న సైనికుల్లా, ఒద్దికగా క్రమశిక్షణతో ఆహారాన్ని మోసుకుపోతున్న బారులుతీరిన చీమలమల్లే కొన్ని వేల నెంబర్లు అందంగా ముద్రించి వున్నాయి. చిన్న స్లిప్ మీద ఓ నెంబరు వేశాడు. చూశాను – లేదు. వెతికాను – కనిపించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పేపర్లో లేని నెంబరు ఎలా కనిపిస్తుంది? జితేంద్రకు ‘ఎమ్ సెట్’లో ర్యాంక్ రాలేదన్నమాట. పద్మం వైపు దృష్టి మరల్చాను. పాపం ఒక్కసారి వందరోగాలు మీదపడ్డట్టు ముఖం నీలుక్కుపోయింది. బాగా దెబ్బతిన్నట్టున్నాడు.

సూర్యుడింకా ఆకాశం స్క్రీన్ మీదకు రాలేదు. అయితేనేం బాగా వెలుతురు వచ్చేసింది.

నా ఆలోచనలు జితేంద్రమీదకు మళ్లాయి. పద్మం ముద్దుల గారాలపట్టి జితేంద్ర. అప్పట్లో నా కొడుకు భరత్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపు వాడే ఎంచుకున్నాడు. ఆనక ఎంట్రన్సులో కాస్త మంచి ర్యాంకు తెచ్చుకుని ఇప్పుడు ఇంజనీరింగు చదువుతున్నాడు. కానీ, పద్మం ధోరణే వేరు. పదవ తరగతి పాసయిన వయసులో వాళ్లకు కెరీర్ పై మంచి వ్యూ వుండదని, వాళ్లకే విషయమూ తెలియదని వాడి ప్రగాఢ నమ్మకం. కొడుకు వద్దన్నా వినకుండా బైపీసీలో చేర్పించాడు. గొప్పవాడు కాలేకపోయిన తన కలను కొడుకుద్వారా నిజం చేసుకోవాలనుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే పద్మం కూడా చిన్నప్పుడు డాక్టరు కావాలనే కోరికతో వుండేవాడు. చాలా డబ్బులు ఖర్చుపెట్టి జితేంద్రను లాంగ్ టెర్మ్ లో కూడా చేర్పించాడు. ఫలితం ఆశాజనకంగా లేకపోవడంతో హర్ట్ అయినట్లున్నాడు. దీనంగా కూర్చున్నాడు.

ఆప్యాయంగా భుజం మీద చెయ్యివేశాను. నావైపు చూడలేదు. “ఒరే పద్మం, నీ పరిస్థితే ఇలా ఉంటే, మరి సంవత్సరం పొడుగునా కష్టపడ్డ వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. వాడికి ధైర్యం చెప్పవలసిన నువ్వే ఇలా అయిపోతే ఎలా?” అంటూ చుబుకం పైకెత్తాను. కళ్లలో పల్చటి కన్నీటి పొర. “ఛ, ఏమిట్రా ఇది! మరీ చిన్న పిల్లాడిలా?” అన్నాను.

“ఒరేయ్, నీకు తెలుసుకదరా! వాడిమీద మేమెన్ని ఆశలు పెట్టుకున్నామో?” మాట పెగిల్చాడు. పద్మం నోరువిప్పడంతో నాకు ఉత్సాహం వచ్చింది.

పూజా కార్యక్రమం పూర్తయినట్లుంది. నా శ్రీమతి వచ్చి పలకరించబోయింది. ఆ వాతావరణపు వేడి చూసి దగ్గరగా వచ్చి పేపరు పరిశీలించింది. లోనికివెళ్లి మూడు కాఫీలతో తిరిగి వచ్చేవరకు మా మధ్య మౌనమే రాజ్యమేలింది. కదిపితే ఎక్కడ బరస్ట్ అయిపోతాడో అన్న భయం. చేతికి కాఫీ అందించాను. నెమ్మదిగా సిప్ చేయసాగాడు. నేను, నా శ్రీమతి కూడా అందుకున్నాం.

“ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. మా ఆశలన్నీ అడియాశలైపోయాయి. బంధువులందరిలో మా పరువు పోయిందిరా!” వాడే మాట్లాడాడు.

“ఎక్కడికి” సీరియస్ గానే అడిగాను.

శ్రీమతి ఖాళీ కప్పులు తీసుకుంటూ “చాల్లెండి చోద్యం. పద్మాన్ని ఓదార్చాల్సింది పోయి….” నసుగుతూ లోనికెళ్లిపోయింది.

“దానికంత ఇది కావాలంటరా? ఒరే పద్మం, నేనో విషయం చెప్పనా? మనo బిడ్డల్ని కనగలం గానీ, వాళ్ల తలరాతల్ని కనలేం రా. అందుకే మళ్లీ వాడిని కోచింగుకు పంపించు. వాడెంత డీప్ షాక్ లో వున్నాడో ఏమో! ముందు వాడిని అనునయించాలి, పద. ఈలోగా నువ్వు కాస్త తేరుకో. చిన్నది అనలేను గాని, ఈ మాత్రం అపజయానికే ఇంతలా కుంగిపోతే ఎలా చెప్పు” అంటూ వాడిని బయల్దేరదీశాను.

*          *          *

చంద్రుడు విశ్రాంతి కోసం పడే ఆరాటం చూసి గుంభనంగా నవ్వుకుంటూ బయల్దేరాడు సూర్యుడు. విటమిన్ల లోపం మాటేమో గానీ, కుటుంబ సమస్యలనేకం ఆలోచిస్తూ పీక్కోగా సగం జుట్టు రాలిన మా బట్ట తలలపై లేత కిరణాలు ప్రసరించాడు భాస్కరుడు. చుర్రుమంటేనేం చూస్తున్నకొద్దీ మరలమరలా చూడాలనిపించే అందాలు.

మళ్లీ జితేంద్ర మీద ఆలోచనలు ముసురుకున్నాయి. జితేంద్ర కాస్త చురుకైనవాడు. ఇంతవరకూ అన్నీ ఫస్ట్ మార్కులే. వాడిని డాక్టర్ చేయాలని పద్మానికి ప్రగాఢమైన కోరిక. కానీ జితేంద్ర దీనిపట్ల పెద్ద శ్రద్ధ చూపేవాడు కాదు. పద్మం బంధువులందరి ముందు కోచింగ్ విషయంలో అతిగా సలహాలడగడం, వీళ్లందరూ వీడిని ముందునుంచీ “డాక్టర్, డాక్టర్” అని పిలవడమూ, వీడు నామోషీ పడడం అదోలా ఫీలవడం నేనెరుగుదును. నాతో జితేంద్రకు కాస్త చనువెక్కువ. తనకు తెల్ల బట్టలకన్నా ఖాకీ బట్టలు తొడుక్కోవడమంటేనే ఇష్టమని ఓ సారన్నాడు కూడా! తండ్రి బైపీసీ తీయించడం, కోచింగుకు పంపించడం, ఏమీ ఎదురుచెప్పలేక వాడు తల ఒగ్గడం – శ్రద్ధగానే చదువుతున్నానని అక్కడినుండి ఉత్తరాలు రాయడం… నాకిప్పుడు అనుమానం కలిగిస్తున్నాయి.

నా ఆలోచనలను భంగపరుస్తూ పద్మం ఇల్లొచ్చింది. ఇంట్లో అంతా ‘గుండుసూది నిశ్శబ్దం’ ఆవరించుకుని ఉంది. జితేంద్ర మంచమ్మీద అటుతిరిగి పడుకుని వున్నాడు. ఎలా ప్రారంభించాలో సందిగ్ధం. ఎలాగైతేనేం నేనే ముందు నోరు తెరిచాను. “పద్మం, ఇప్పుడు నేనేం చెప్పినా సంతాపం స్పీచ్ లా ఉంటుంది. అయినా చెప్పడం నా బాధ్యత. ఈ సమస్యకు అన్ని వైపులా పదునుంది. వాడసలే పోటీపరీక్షకు వెళ్తున్నాడు. పరీక్ష తలచుకుంటేనే వాడిలో ఒక విధమైన టెన్షన్. సంవత్సరపు శ్రమని కేవలం మూడు గంటలలో తేల్చేసే భయంకర యజ్ఞం అది. దానికితోడు వాడి గురించి మీరు మీ బంధువులతో చెప్పే మాటలు వాడిలో భయాన్ని రేకెత్తించాయేమో! ‘ఒకవేళ నాకు సీటు రాకపోతేనో…’ అన్న ఆలోచన వాడిలో నెగటివ్ థాట్స్ కలిగించేదేమో ఆలోచించావా?” చెబుతున్న నన్ను మధ్యలోనే ఆపేశాడు.

“అంటే వాడిని భయపెట్టేశానంటావా? వాడి బాధ్యత వాడు గుర్తించనవసరం లేదా?” సూటిగా ప్రశ్నించాడు. “మేము పడుతున్న శ్రమేమిటీ తనకక్కరలేదా?”

నాకింక కోపం ఆగలేదు. “వాడిది బాధ్యతలు మోసే వయస్సు కాదురా. తన బాధ్యతను మీమీద మోపే వయస్సు. వాడు వద్దు మొర్రో అంటున్నా వాడికిష్టం లేని గ్రూపు తీయించావు. నీ కల వాడిద్వారా నిజం చేసుకోవాలనుకున్నావు. ఇది తప్పని అనను. గానీ, వాడి ఇంటరెస్టు ఏమైనా గుర్తించావా? వాడి ఇష్టాల్ని పట్టించుకోకుండా నీ ఇష్టాల్ని వాడిమీద రుద్ది, ఇప్పుడు తప్పంతా వాడి మీదకు నెట్టేస్తున్నావు. చాలా బావుందిరా ఇది.” అని నన్ను నేను సంభాళించుకోవడానికి కొంతసేపు ఆగాను.

ఈలోగా పద్మం భార్య రేణుక ఇచ్చిన బోర్నవిటా అందుకుని మరలా అనునయించడం ప్రారంభించాను. “ఒరే పద్మం, మీరు వాడి గురించి చెప్పే విషయాలు మంచివే కాదనట్లేదు. అవి విని మరింత శ్రమిస్తాడని మీరనుకున్నారు. కాని, అవే మాటలు వాడిలో భయాన్ని రేకెత్తించాయేమో! పోటీపరీక్షకు పోయేవాడికి ఉండాల్సింది భయం కాదు. పరీక్షమీద నమ్మకం. అతడిమీద ఆత్మవిశ్వాసం. మీరు కలగజేసిన మానసిక ఒత్తిడి వల్ల వాడికి తెలియకుండానే డిప్రెస్ అయిపోయాడు. ఎగ్జామ్ హుళక్కిమంది. నా మాట విను. మామూలు మూడ్ లోకి రా. ఈసారి జాగ్రత్తలు తీసుకో. వాడికి పరీక్షమీద ఉత్సాహం కలిగించు. సీటు రాకపోయినా నష్టం లేదు. చదవడం మాత్రం వాడి బాధ్యత అని ప్రోత్సహించు” అని పద్మాన్ని నేను సుతిమెత్తగా మందలిస్తుంటే జితేంద్ర లేచాడు. వాడిని నేను సపోర్టు చేస్తున్నాననే ధీమాతో కాబోలు, వచ్చి బోర్నవిటా కప్పు అందుకున్నాడు.

“ఏం జితేంద్రా, మీ స్నేహితులెవరికైనా మంచి ర్యాంకులొచ్చాయా?” పలకరించాను. “ఫరవాలేదంకుల్” సమాధానమిచ్చాడు. “నీకేం ఫీలింగ్ కలగట్లేదా?” ఒక్కటే చురక.

‘ఎందుకొచ్చానురా బాబూ’ అన్నట్టు దెబ్బతిన్న పావురంలా చూశాడు. భుజం మీద చేయివేసి నడిపించుకుంటూ బాల్కనీలోకి తీసుకొచ్చాను.

“ఇంట్రెస్ట్ లేనప్పుడు వెంటనే చెప్పెయ్యాలిరా! తిండి, చదువు, పెళ్లి విషయాల్లో మొహమాటపడవచ్చట్రా? అందులోనూ ఇంటర్ మీడియట్ అతి ముఖ్యమైన దశ. భవిష్యత్తును నిర్ణయించేది ఇదే. ఈ విషయాల్లో నీకు పూర్తి స్వతంత్రత ఉండాలి. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఏం చెయ్యాలనుకుంటున్నావు. నిదానంగా ప్రశ్నించాను.

“ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదంకుల్. ఏం చెయ్యమంటారు?”

“ఏం చేయమంటారు కాదు. ఏం చేస్తే బావుంటుంది అనాలి. ఎందుకంటే సలహాలు ఇవ్వడం వరకే మేము. వాటిని విశ్లేషించి, నిర్ణయించుకోవలసింది నీవే. ఇది ముందు అలవరచుకో. ఇప్పుడు వెంటనే డిగ్రీలో జాయినయిపో. మొదటి సంవత్సరం ఎంసెట్ లో ర్యాంక్ కోసం మళ్లీ ప్రయత్నించు. కొద్దికాలం అన్నింటికీ దూరంగావుండి బాగా శ్రమించు. ఈ సారి తగిలితే సరి. లేదంటే దానికి గుడ్ బై చెప్పి, డిగ్రీ మీద దృష్టి పెట్టు. దాంతోపాటు నీకెంతో ఇష్టమైన ఖాకీ డ్రస్సుకు సంబంధించిన పరీక్షలవైపు చూపు ప్రసరించు. డిగ్రీ అయినవెంటనే అయ్యేయెస్, ఐపీఎస్ లు కావాలంటే ముందునుంచే కృషి తప్పనిసరి. అర్థమవుతోందా?

“ఇదే తప్పు మరలా జరగకుందా చూసుకో. రొటీన్ స్పీచ్ లా ఉంటే నేనేం చేయలేను. బాగా ఆలోచించి నిర్ణయానికి రా జితేంద్రా. ఆట గెలిచామా ఓడామా అన్నది కాదు ముఖ్యం. ఎంత బాగా ఆడామన్నది ముఖ్యం. నువ్వు కష్టపడు, విజయం తనే వలచి మరీ వరిస్తుంది. మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలేగాని, జితేంద్రా, అసాధ్యం ఆంటూ ఏదీ ఉండదు”. ఇవి గుర్తుంచుకుంటే చాలు. తను ఆలోచించుకోవడానికి వ్యవధి కోసం ఆపేశాను.

నిశ్శబ్దంగా తనరూమ్ లోకి వెళ్లిపోయాడు. పద్మం ఆత్మీయంగా చూస్తున్నాడు. వాడిలో మునుపటి బాధ కన్పించడం లేదు. భుజం నొక్కి బయటికొచ్చాను. ఇవేవీ పద్మానికి తెలియవని కాదు. కాని, అపజయం వివేకాన్ని నొక్కేస్తుంది కదా? అందుకే చెప్పవలసిన రీతిలో చెప్పడం అవసరం.

సూర్యుడు ప్రళయకాల రుద్రుడిలా చెలరేగిపోతున్నాడు. తన శతకోటి కిరణాల జిలుగువెలుగులతో ఈ పోటీ ప్రపంచాన్ని ప్రభంజనం చేయడానికి సమాయత్త మవుతున్నాడు. జితేంద్ర కూడా అలా చెలరేగగలడా? అలోచనలతో ఇల్లు చేరాను.

*          *          *

మరో సంవత్సరం అతి సాధారణంగా అందరిలానే నాకూ గడిచిపోయింది. కానీ అదే జితేంద్రకు… … …

కేవలం తన ప్రతిభను నిరూపించుకోవడానికే ఈ ఎమ్ సెట్ రాసి మూడంకెల ర్యాంక్ తెచ్చుకున్నానని, అయినా మెడిసిన్ లో జాయినయ్యే ప్రసక్తిలేదని ఆనందంగా మెరుస్తున్న కళ్లతో ధీమాగా చెప్పుకుపోతున్న జితేంద్రను ఆపి, మరేం చేస్తావని ప్రశ్నించాను.

“డిగ్రీయే కంటిన్యూ చేస్తాను. ఖాకీ దుస్తులు తొడుక్కోవడం తప్పనిసరి” అని స్థిరంగా చెప్పాడు.

పోటీపరీక్షల వలయం ఛేదించుకుని తన ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్న జితేంద్ర వెనుక అదే ఉదయిస్తున్న సూర్యుడు దీవిస్తున్నట్టుగా!

అవునూ! ఈ కుర్రాడు పరీక్షల వలయం ఛేదించాడా? లేదు. చిన్న వలయం నుంచి, పెద్ద వృత్తంలోకి దూకాడు. అక్కడ్నించి బయటికొస్తే మరింత పెద్ద వలయం. ఉద్యోగమ్ బాధ్యతగా నిర్వహించవద్దటండీ. అయినా తప్పదు, ఎదురవబోతున్న వలయం ఎంత పెద్దదయినా, ఢీకొనడానికి, ఛేదించడానికి నేటి యువత సిద్ధంగా వుంది.

( 5 ఫిబ్రవరి 1995 “సుప్రభాతం”  సంచికలో ప్రచురితమైన కథ ఇది )

ప్రకటనలు

7 responses »

  1. sir, it’s good and requires wide publicity and it should be known to all, teachers who train the students, students who have good ambitions and students who are working hard to acheive their goals and students who have no clear ideas and passing thier time wihtout any goals and especially the parents who are working hard for thier children and some who do spend and waste thier money and ivest huge money unnecessarily for thier children without having clear vision and intention of thier children and to parents who are eagerly waiting for the success of their children. So, Let the story be known to all.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s