ఒక సోంపేట – కొన్ని గుణపాఠాలు

సాధారణం

గత రెండు దశాబ్దాలుగా సర్దార్ సరోవర్ డ్యామ్ కు వ్యతిరేకంగా గిరిజనులను, ఆదివాసులను, రైతాంగాన్ని, పర్యావరణవాదులను, మానవహక్కుల పోరాటకారులను ఏకతాటిమీద నిలబెట్టి ఉద్యమ సారధ్యం చేస్తున్న మేధాపాట్కర్ శ్రీకాకుళం జిల్లా సోంపేట పోలీసుల కాల్పులలో హతులైన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినపుడు యాదృచ్ఛికంగా ఆ రోజే చనిపోయిన వారికి ఆ కుటుంబీకులు పెద్ద కర్మ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ, అరాజకీయ దన్నులు లేకుండా ప్రజలే నడుపుకొంటున్న ఈ ఉద్యమాన్ని చూసి నివ్వెరపోయిన ఆమె విస్తుపోతూ ఉద్యమకారులకు నీరాజనాలు పలికారు. నాలుగు దశాబ్దాల కిందట రైతాంగ ఆదివాసీ ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసి ఓనమాలు దిద్దించిన మహత్తర శ్రీకాకుళ పోరాటం మరో కొత్త రూపంలో దేశవ్యాప్తంగా ప్రజాఉద్యమాలకు కొంగొత్త సందేశాలను మోసుకుపోవడానికి సిద్ధమైంది.

రాజకీయ పార్టీల దన్నులేదు

నిజానికి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజానీకానికి రాజకీయ పార్టీల మద్దతు లేదు. ముందునుంచీ కాంగ్రెస్ పార్టీ దేవతావస్త్రాలవంటి అభివృద్ధి నమూనాకు మొగ్గు చూపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బృందం తరపున మాజీ పార్లమెంట్ సభ్యులు హతులైన రైతు కుటుంబీకులను పరామర్శిస్తూ ‘ప్రజల సందేహాలను తీర్చకుండా ప్లాంటులు నిర్మించడం దారుణమ’ని శెలవిచ్చారు. పాపం కొత్తగా రాజకీయాలలో చేరిన స్థానిక యువ ఎమ్మెల్యే ప్రజల గుండె చప్పుడు ఆలకించి ప్రజాబాహుళ్యపు గొంతుగా నిలబడి ఎన్ సి సి (నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ) నిర్మాణాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలో ఆయన వాదన వినే నాధుడు కరువయ్యాడు. ఇక కమ్యూనిస్టుల సంగతి చెప్పనక్కరలేదు. ఎక్కడైనా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనేవారిని ఏమంటారో మనకు తెలియదు గాని, మన రాష్ట్రంలో కమ్యూనిస్టులని అంటారని చిన్నపిల్లలని అడిగినా చెప్పేస్తారు. ఎప్పటికప్పుడు స్నేహాలు మారుస్తూ, అప్పటికి మిత్రపక్షాలు ఏమి మాట్లాడితే వాటినే తమ మాటగా చెల్లుబాటు చేసుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలు సైతం ఇక్కడి ఉద్యమ శ్రేణులకు మద్దతు పలికింది లేదు. ఇక ప్రజారాజ్యం పార్టీ గురించి శ్రీకాకుళం జిల్లావరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. గమ్మత్తుగా ఇతర విప్లవ పార్టీలు సైతం ఏకమొత్తంగా ప్రభుత్వం చేసే పనులన్నింటినీ వద్దంటున్నాయే గాని, సమగ్ర ప్రత్యామ్నాయ పథకమేమీ ప్రజలకు ఇంతవరకూ వివరించలేదు. ఇదంతా పోలీసు కాల్పులు జరిగిన ముందురోజు వరకు పరిస్థితి. పోలీసు కాల్పులు జరిగిన తర్వాత పార్టీలన్నీ పరిస్థితి తీవ్రతను గుర్తించాయి. ప్రజల హృదయస్పందన తెలుసుకుంటున్నట్టు నటిస్తున్నాయి. ఏవేవో సన్నాయిరాగాలు ఆలపిస్తున్నాయి. కానీ పాలకపక్షం ఇప్పటికీ ససేమిరా అంటుందనుకోండి.

కళ్లు తెరిపించిన పోలీసు కాల్పులు

ఒక ప్రైవేటు కంపెనీ పునాది రాయి వేసుకోవడానికో, నిలువు గొయ్యి తవ్వుకోవడానికో సిద్ధమైనప్పుడు అన్ని వేలమంది పోలీసులు పహరా కాయడమేమిటని ఎక్కడెక్కడినుంచో పరామర్శలకు వస్తున్న మేధావులు, పర్యావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మావోయిస్టుల ఏరివేతకు బయల్దేరినప్పుడు కూడా అన్ని వేలమంది బలగాలను కేంద్ర ప్రభుత్వం మోహరించిందంటే నమ్మలేం. ఆవిధంగా మన పోలీసులకు పెట్టుబడిదారులకువున్న అవ్యాజానురాగాలతో కూడిన అమలిన అలౌకిక ప్రేమబంధాన్ని చూసిన వారందరూ సెంటిమెంటుతో కంటతడి పెట్టుకుంటున్నారు. పోలీసులతో పాటు ఎన్ సి సి కూడా ప్రైవేటు వ్యక్తులను పెద్దఎత్తున మోహరించిందని స్థానికులే ఫిర్యాదు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పోలీసులమీదే కాక, ప్రైవేటు వ్యక్తుల మీద, ముఖ్యంగా వాటిని ప్రజలకు నివేదిందాల్సిన నాలుగో స్తంభమైన జర్నలిస్టులమీద తిరగబడడం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన విషయం. ఒక్కసారి పోళీసు కాల్పులు జరగగానే ప్రపంచం దృష్టిని సోంపేట ఆకర్షించగలిగింది. అప్పటికి దగ్గరదగ్గర మూడొందలు రోజులుగా దీక్షలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్న ప్రజలను పట్టించుకున్న వారేరీ? అసలు అన్ని రోజులనుంచి ఉద్యమం నడుస్తున్నప్పుడు అణిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదా? ఇలాంటి అనేక సందేహాలు మనకు రావడం సహజం.

అటునుంచి నరుక్కురండి

దేశ సహజవనరులను కొల్లగొడుతూ, స్థానిక ప్రజలను దోపిడీ చేయడానికి పూనుకున్న పెట్టుబడిదారీ వర్గం ఈ ప్రక్రియకు అభివృద్ధి అనే అందమైన పేరు పెట్టింది. ఆ అభివృద్ధి క్రమాన్ని వ్యతిరేకించేవారందరూ అభివృద్ధి వ్యతిరేకులు. ప్రగతి నిరోధకులు. ఈ అంశాలపై అప్పటికే ఆ ప్రాంతంలో చురుగ్గా తిరుగాడుతూ గ్రామగ్రామానా పర్యటించి అభివృద్ధి అసలు స్వరూపాన్ని ప్రజలకు వివరించి చైతన్య దీప్తిని వెలిగించింది దేశంలోనే పేరొందిన మానవ హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్. ఉదతమీద చారలమాదిరిగా ఉద్దానం ప్రాంతంలో సముద్రతీర ప్రాంతం, మైదాన ప్రాంతం, అటవీ ప్రాంతం కలగలుపు చూడముచ్చటగా వుంటుంది. నిజానికి ప్రకృతి వనరులపై ఆధారపడి చాలా హాయిగా బతకొచ్చు గాని, ఆ ప్రకృతే అభివృద్ధి ఆటలో పావుమాదిరిగా స్థానికేతరుల సొంతమైనప్పుడు బతుకు తెరువుకోసం ఉద్దానం ప్రజలు దూరతీర ప్రాంతాలకు కాందిశీకులుగా వలసపోయాఋ. అలా వలసపోయిన ప్రజలు ప్రపంచం చూస్తుండడం వల్ల ఎక్కడ ఏం జరుగుతున్నదీ, ఇక్కడ ఏం జరగబోయేదీ తమవారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుండడం కూడా మనం మరవకూడదు. థర్మల్ పవర్ ప్లాంటుల వల్ల బీలభూములు పోయి తమ బతుకు ఎలాగూ బుగ్గికావడం తప్పనప్పుడు అనవసరంగా యాష్ పాండ్ (పవర్ ప్లాంటులనుంచి వచ్చే ప్రధాన కాలుష్యం బూడిదను ఉంచడానికి తీసే వందల ఎకరాల మడుగులు) లలో పడి చావడమెందుకని ప్రజలు తెగించిన ఫలితమే ఈ ఉద్యమం. అయితే హైదరాబాద్ స్థాయినుంచి డబ్బులు విరజిమ్ముతూ వచ్చిన పెట్టుబడిదారుడు స్థానిక పాలకుల వరకూ వచ్చి ఆగకుండా పత్రికల ప్రతినిధులను సైతం కొనుగోలు చేసారని నమ్మడమే సోంపేట సంఘటనలో ప్రజల కోపానికి కారణమని విజ్ఞుల విశ్వాసం.

ప్రభుత గొంతులో పచ్చి వెలక్కాయ

‘సరే ప్రజలకు కోపం వచ్చింది, దాని ఫలితం అనుభవించి చచ్చారు, అంతమాత్రాన మన అభివృద్ధి అజెండా నుంచి వైదొలగడం తెలివితక్కువతనమ’ని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ సోంపేటలో వెనక్కితగ్గితే ఇంకా ఇదే జిల్లాలో మరో ఎనిమిదివరకూ మర్చంట్ పవర్ ప్లాంటులు (అంటే ఇందులో కనీసం ఒక్క వాట్ విద్యుత్తయినా మనకు దక్కదు సరికదా, వారి ప్లాంటు నడపడానికి కూడా మన విద్యుత్తే కారుచవకగా పొందేవని అర్థం) నిర్మించ తలపెట్టిన ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా పరిస్థితి తయారయ్యింది. తమ మనుగడకు కీలకాధారమైన పెట్టుబడిదారీ వర్గానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారో ఇప్పుడు తెలియాలి. ఈ ప్రత్యేక సోంపేట సంఘటనలో ఎన్ సి సి కావలిస్తే నందిగ్రామ్ వ్యవహారంలో తోకముడిచిన టాటా కంపెనీ నుంచి గుణపాఠం నేర్చుకోవచ్చు. కానీ ప్రభుత్వం తన పెట్టుబడిదారి వర్గానికి ఏ సందేశం పంపదలచుకున్నదీ ఈ దెబ్బతో తేలిపోతుంది. అందుకే రెవిన్యూ, పునరావాస శాఖామాత్యులు మేకపోతు గాంభీర్యపు మాటలు ఎన్నో పలుకుతున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే ప్రభుత్వాలకు ఏం శాస్తి జరగనుందో సోంపేట యావత్ప్రపంచానికి విస్పష్టంగా చాటిచెప్పింది. తమలో చైతన్యం రాజేసిపోయిన అమరవీరులందరూ వారసత్వంగా తమకిచ్చిన ఉద్యమబాటను వీడలేమని అది తమ రక్తమాంసాలలోనే కూడ ఆత్మలో సైతం నివురుగప్పిన నిప్పులా ఇంకిపోయిందని ప్రకటించిన వేలాదిమంది ఏ జెండా మోయకుండా ఇతరేతర ఎజెండాలేమీ లేకుండా ఒకేరోజు ఒకచోటికి చేరి గొంతులు నినదించిన వేళ… ఈ ప్రపంచానికి, ముఖ్యంగా ప్రభుత్వం అభివృద్ధి అనుకుంటూ విర్రవీగుతున్న నమూనాను వ్యతిరేకిస్తున్న ఈ దేశపు అనేకానేక సమూహాలకు అందాల్సిన గుణపాఠం అందనే అందింది. ఇప్పటికైనా బీలప్రాంతంలో పవర్ ప్లాంట్ నిర్మాణం ద్వారా పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదో గొంతెత్తి షోషిస్తున్న పర్యావరణ వేత్తల మాటలు మన నాయకవినాయకులు అలకించాలి.

నిజంగా ప్రజల దృష్టిలో అభివృద్ధి నమూనా అంటే ఏమిటో తెలుసుకోవాలంటే సదరు మంత్రివర్యులు ప్రజాశ్రేణులను కలవాలి. ఎవరి కాళ్లపై వారు నిలదొక్కుకుని, దేశప్రగతి నిలదొక్కుకునేలా చేయగలిగిన పరిశ్రమల బ్లూ ప్రింటులు అందిస్తాం. చేతనైతే వాటిని ప్రజలకు అందించాలి. పుబ్బలో పిట్టి మఖలో మాడిపోయే రాజకీయ జీవితం గడిపేకంటే ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయేలా తమ పాలనను మెరుగుపరుచుకునే అభివృద్ధి నమూనాలు ప్రజలవద్ద కూదా లభిస్తాయి.

(స్వల్ప మార్పులతో ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక 14.08.2010 (శనివారం) ఎడిట్ పేజీలో అచ్చయింది)

5 responses »

  1. రవి గారూ,ఆంధ్రజ్యోతిలో మీ వ్యాసం చదివాను.మీరన్నది నిజమే ..వినాశనం లేని అభివృద్ధిని ప్రజలు ప్రతిపాదించగలిగే స్తితి లోనూ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించక పోవడం దురదృష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s