మీరెటువైపు?

సాధారణం

అది త్రేతాయుగం…

నూనూగు మీసాల నూతన యవ్వనంలో పడుచు అందాల రాముడు తన తోటి సావాసగాళ్లతో రవ్వంత తుళ్లింతతో ఆటపాటలలో లీనమైవుండగా, తమ రాజసౌధానికి వచ్చిన మునులకు వంగి ప్రణమిల్లి వారికి దారిచ్చి మరలా తన ఆటలో మునిగిపోయాడు. అలా వెళ్లిన మునులు ఇలా తననే రమ్మనేసరికి ఆశ్చర్యపోతూ బిడియపడుతూ తండ్రి దశరథరాజు కొలువులోకి అడుగుపెట్టాడు. వారు చెప్పిందంతా విని మ్రాన్పడిపోయాడు. ఇంకా విలువిద్యలో తొలి అక్షరాలు దిద్దుతున్న తనను వందల ఏళ్లుగా కీకారణ్యంలో జపతపాదులు సాగిస్తున్న తమను రక్షించమని అర్థిస్తూ అడవుల్లోకి రమ్మని పిలుస్తున్న విశ్వామిత్రాది మునులను చూసి ఏమనాలో అర్థం కాలేదు. రక్షింపునర్ధిస్తూ తన తండ్రివైపు దీనంగా చూసేసరికి మునులకేసి నగుమోముతో వికసిత దశరథ వదనం కనిపించేసరికి రాముడికి గుండె లోయలోకి జారిపోతున్న అనుభూతి కలిగింది. మునులేం చేసినా, చెప్పినా వాటిని దైవవాక్కుగా భావించి పాటించడం ఆ తండ్రికి రివాజు. అదే అలవాటుతో సుకుమారుడైన రాముడివైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో లోతును అర్థమ్ చేసుకున్న రాముడు మారుమాట్లాడకుండా ఆ మునులవెంట నడిచాడు. ఎందుకో ఎక్కడికో తెలియని ఆ ప్రయాణంలో కొన్ని పగళ్లు, మరికొన్ని రాత్రులు సాగాక, దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. దారిలో మునులు చెప్పిందంతా విని, తమ తపోభంగానికి తీవ్రంగా శ్రమిస్తున్న ఆ రాక్షసుల భరతం పట్టడానికే నిర్ణయించుకున్నాడు. విశ్వమిత్రాది మునిగణ వర్గం తనకందించిన సర్వసమున్నత అస్త్రశస్త్రాదుల సాయంతో యువరాముడు మునుల తపోవన నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్న ఆటవిక వర్గాలను తరిమి తరిమి కొట్టాడు. మునులంతా శుభాశీస్సులు పలకగా తన  రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

* * *

సీన్ కట్ చేసి కలియుగంలోకి వెళ్లేముందర ఇదే కథ అసలు కోణాలను స్పృశిద్దాం.

రాజ్యాలను విస్తరింప జేసే పథకాలలో అతి భీకరమైనదీ నీచమైనది యుద్ధం. పైగా చాలా అనుకూలతలు కలిసి వచ్చినపుడు, చివరలో తీసుకునే నిర్ణయమైన యుద్ధం పేరిట మరో దేశం పైకి దండెత్తి ఆ దేశాన్ని దురాక్రమణ చేయడమనే సాహసపూరిత దుశ్చర్యలో ఇరుదేశాల ప్రజలూ సైనికులూ తమ ప్రాణాలు కోల్పోవడం మామూలే. అయితే రాజ్యవిస్తరణకు యుద్ధమే కాక ఇతర సులువైన పద్ధతులు చాలా వున్నాయి. అయితే వాటికి రాజ్య యంత్రాంగం కాకుండా రాజమంత్రాంగం కావాలి. ఒక రాజు సంతానానికి మరో రాజు సంతానంతోనో, బంధువులతోనో వివాహం తదితర ఒప్పందాలూ చేసుకోవడం ద్వారా చాలా సులువుగా సమీప భవిష్యత్తులో తమ సామ్రాజ్యలను విస్తరించుకునే వీలుంది.

వీటన్నింటికి మించి విశేషమైన రాజ్య విస్తరణ పథకాల్లో మునుల తపస్సుల తంత్రాంగం మరొకటి. మునులెవ్వరూ మన పల్లెవాసులు వేసుకునే గుడిశెల మాదిరి పదో పదిహేనో గజాల జాగాలో పాగా వేసుకుని ముక్కు మూసుకుని తపమాచరించరు. అలాగని భావిస్తే మనం తప్పులో కాలిసినట్టే. అప్పట్లో వారుకూడా ఇప్పటి మన రాజకీయ నాయకవినయకుల మాదిరిగానే, ఇప్పటి మన పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదుల మాదిరిగానే కొన్నివందల ఎకరాలలో ఆశ్రమాలు స్థాపించేవారు – అవికూడా రాజ్యనికి కాస్త దగ్గరగా. అటవీప్రాంతాన్ని చదునుచేసి ఎవరైనా ముని ఆశ్రమం స్థాపించాలనే నెపంతో మొదలుపెట్టే పనులు పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణసంకటం మాదిరిగా, అక్కడ అటవీప్రాంతంలో నివాసముంటున్న ఆదివాసులకు విస్థాపన గండం ఎదురయ్యేది. ఆ దట్టమైన కారడువుల్లో ఓ నదీతీరంలోనో, ఓ వాగువంకనో ఏ గూడనో, పల్లెనో వేసుకుని కొన్ని తరాల తరబడి గ్రామవ్యవస్థను ఏర్పాటు చేసుకుని నివశిస్తున్న ఆదివాసీలు… మునుల రాకవల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రాంతాలను విడిచి మరింత అడవి లోపలకు వెళ్లవలసివచ్చేది. దానికి విరుగుడుగా మునుల తపోదీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించడమనే ఎదురుదాడి సాగించేవారు. ఎర్రటి రసాన్ని స్రవించే పూడికపళ్లను నూరి రక్తంలా హోమంలో పడేయడమో, అందులో నీరు పోసేయడమో వంటి ఇతరత్రా అమాయక పనులు చేసేవారు. ఇదంతా సహించ(లే)ని మునులు దగ్గరలో విన్న రాజ్యం సపోర్టు కోసం వెళ్లేవారు. అంటే ఆ మునులు చేసే పనికి పూర్తి మద్దతునందించేవారికే ఆ నేలంతా సొంతం కాబోతుందని పరోక్షంగా చెప్పడమే వారిని రక్షి0చమని అర్ధించడం. అదో అలిఖిత ఒప్పందం.

వారిని ఆదుకోవడానికి రాముడు వెళ్లాడంటే అతడే అందర్నీ ఒంటిచేత్తో చంపేశాడని కాదు. రాముడి బాణం ఎవరికి తగిలినా తగలకపోయినా, రాముడివెనకనున్న రాజ్యం ప్రయోగించే వందలాది అస్త్రాలు తగిలి ఆదివాసీలు ప్రాణాలైనా వదలాల్సిందే లేదంటే వారి ప్రదేశమైనా విడిచిపెట్టాల్సిందే. పైగా రాజరికపు యుద్ధ సామగ్రిముందు ఆదివాసీల మోటు యుద్ధపరికరాలతో ఎంతసేపని నిలవగలరూ? దాంతో దాదాపు ప్రతి ముని తన తపోవ్రతాదులను యధేచ్ఛగా కొనసాగించే వీలుండేది. ఆవిధమైన అప్రకటిత యుద్ధానికి రాజ్యం తన సంపూర్ణ సహకారం అందిస్తుంటే మునులు యజ్ఞయాగాదులను అత్యంత శ్రద్ధాసక్తులతో, ప్రశామ్తంగా నిర్వహించుకునేవారు. అలా వారి జీవితాంతం అదే ఆశ్రమంలో యజ్ఞాలు చేస్తూ వుండిపోతారనుకుంతే చాలా పొరపాటు. అలా ఆటవిక రాక్షసులనబడే ఆదివాసులను తన్ని తరిమేయడమే కాకుండా అటవీప్రాంతాన్ని చదునుచేసే క్రమంలో దొరికే కలపనంతటినీ, అక్కడ దొరికే సహజ వనరులన్నింటినీ ఆ రాజ్యానికి ధారాదత్తం చేసేస్తారు. అలా చదునుగా తయారైన ప్రాంతంలో ఆ పట్టణ ప్రజలు వ్యవసాయం మొదలుపెడతారు. ఫలితంగా నూతన గ్రామాలు వెలుస్తాయి. రాజ్యాన్ని ఆనుకునివున్న అటవీప్రాంతంలో టౌన్ షిప్ మొదలవుతుందన్నమాట. అంతకుముందు ఆదివాసులు నివశించిన ప్రదేశంలో ఇప్పుడు నాగరికులు నివాసం మొదలుపెడతారు. ఇలా కొన్ని దశాబ్దాలు గదిచాక జనజీవనం రద్దీ పెరిగి మునులకు ప్రశాంతత కొరవడుతుంది. ఈసారి మరోచోట అటవీప్రాంతాన్ని ఎన్నుకుంటారు. మళ్లీ కథ మొదలు.

* * *

త్రేతాయుగం ముగిసి, ద్వాపరయుగం దాటి కలియుగం చేరి అందులో నాల్గవపాదంలోకి వచ్చాం. అయినా ఈ కథలో క్రమం మారలేదు. అప్పటికీ ఇప్పటికీ రాజ్య విస్తరణలో, సహజ వనరుల దోపిడీలో పేర్లయితే మారాయిగానీ, పద్ధతి మాత్రం అదే. ఆ రోజు యజ్ఞానికి విశ్వామిత్రుదు వచ్చాడు. ఈరోజు ఒరిస్సాలోనో, జార్ఖండులోనో, సువిశాల భారతదేశంలో మరోచోటనో ‘వేదాంత’, ‘నాగార్జున’, ‘తీరుపు తీరం’ (ఈస్ట్ కోస్ట్) లాంటి కంపెనీలు ముందుకొస్తాయి. పేర్లలో కనిపిస్తున్న సామ్యాన్ని పరిశీలిస్తే మనకు నవ్వాలో ఏడవాలో అర్థంకాని అయోమయం. ఆ రోజు రాజ్యమ్ తరపున రాముడు యుద్ధరంగానికి దుమికితే ఈ రోజు రాజ్యం తరపున చిదంబరాముడు సమరశంఖాన్ని పూరించడం యాదృచ్చికం. పాపం అమాయకులైన ఆదివాసీలకు ఆరోజు వెన్నుదన్నుగా నిలబదిన మారీచుడు, సుబాహుడు తదుతరులను రాక్షసులని నిందించి వధిస్తే, ఈరోజు కూడు, గూడు, గుడ్డలకు దూరమైన; విద్య, వైద్యం ఆరోగ్యం అనే కనీస ప్రాథమిక వసతులకు దూరమైన అదే ఆదివాసీలకు గన్నుదన్నుగా నిలిచిన వారిని అంతర్గత భద్రతా సవాళ్లని (ఇంటర్నల్ సెక్యూరిటీ త్రెట్) అని ఆందోళన చెందుతున్నాం. అన్నిటికంటే చిత్రమైన సామ్యమేమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఏమాత్రం సీన్ లేనిది ప్రజలకే. ప్రజల ఇష్టానిష్టాలతో, అంగీకారానంగీకారాలతో ప్రమేయం లేకుండానే ప్రజల యుద్ధాలు నడవడం, ఆ యుద్ధంలో ప్రజలు ప్రాణాలు సమిధలు కావడం విషాదాల్లోకెల్లా విషాదం కదా! అప్పుడు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో లాంటి విషయాలు మనకు తెలిసింది కేవలం రాజ్యమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఆదివాసుల కథనాలు, ప్రజాసమూహాల స్పందనలు ఎక్కడా రికార్డు కాలెడు. కొద్దోగొప్పో అయినా అవి చరిత్రలో బతికి బట్టకట్టలేదు.

* * *

భూమి ఏకధృవ ప్రపంచంగా మారిన తర్వాత అమెరికా వెన్నుమీద తగిలిన సెప్టెంబరు 11 దాడుల దెబ్బ తర్వాత అమెరికా అందుకున్న శృతి తప్పిన రాగాన్ని అన్ని దేశాలూ ఆలపించడం రివాజుగా మారింది. ఆ ఏకవాక్య గీతం “మేరెటు వైపు?”. మావైపు మీరున్నారు అంటే దాని అర్థం మీరు రాజ్యం వైపు వున్నారన్నమాట. అప్పుడు మీరు రాజ్యమ్ చేసే ప్రతి అరాచకాన్ని సుమధుర యుగళగీతంగా ఆలపించాలి. రాజ్యం ఆలపించే వినాశపూరిత మృత్యుసంగీతానికి ప్రభుత తొత్తుగా మారి గొంతు కలపాలి. మావైపు మీరు లేరంటే మీరు ఉగ్రవాదుల, తీవ్రవాదుల, బీభత్సకారుల, రాక్షసులవైపు వున్నారన్న మాట. మీరు హింసను సమర్ధిస్తున్నారన్న మాట. ప్రజలు ఏమైపోయినా మీకు పట్టింపు లేదన్నమాట. దేశం ఏమైపోయినా మీకు అవసరం లేదన్నమాట. ఇదీ రాజ్యమ్ చేస్తున్న వితండవాదం.

కాని ఆధునిక ప్రపంచంలో ప్రజలంతా ఒక సమూహంగా ఏర్పడగలరన్న తెలివిడిని అటు ప్రభుత్వంకాని, ఇటు పోరాట పక్షంకాని కావాలనే ప్రదర్శించడం లేదు. అభివృద్ధి దానికదే తీవ్రవాదం (డెవలప్ మెంట్ టెర్రరిజమ్)గా మారిన నేపథ్యంలో విధ్వంసమనే ఒకే ఒక్క ఫలితాన్ని ఇచ్చే అభివృద్ధిని గుత్తసొత్తుగా తిరస్కరించే క్రమంలో ప్రజలంతా సంఘటితమై మరో ధృవంగా ఏర్పడనున్నారన్న వివేకం ఇరుపక్షాలకు కలగడం లేదు. అసలు అలాంటి ఆలోచన రాకుండా చేయడానికే ఇద్దరూ హింసను ఆశ్రయిస్తున్నారేమోననే అనుమానాలు ఆలోచనాపరులకు కలుగుతున్నాయి. ప్రభుత్వం అవతలి పక్షంతో జరుపుతామంటున్న చర్చల్లో ప్రజా సమూహాలను చేర్చాలనే డిమాండ్ అందుకే అంతకంతకూ ఊపందుకుంటోంది. ఒక్కమనదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ప్రజాశ్రేణులు సమూహంగా ఏర్పడి మూడో ధృవంగా ఎదుగుతున్నాయి. దీనిని విఫలం చేసేలా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెగిలిన ప్రతి గొంతునూ ఎదుటి సమూహంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ప్రభుత్వానికి పలువురితో యుద్ధం చేసే సత్తా లేదు. ఒకే శత్రువుంటే సులువుగా యుద్ధంలో జయించగలదు గనుక.

హింస – ప్రతిహింసల చక్రం విచ్చేదనం చేయడానికి వాటి నడుమ ఆలోచనపరులైన ప్రజాసమూహాలు చేరడమొక్కటే పరిష్కారమని ఇరుపక్షాలూ గ్రహించాలి. అలా సమ్మతిస్తేనే దేశ ప్రగతిరథ కదిలేది. లేదంటే చివరికి మోసపోయేది ప్రజలే. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తున్న ఇరువర్గాలూ అత్యవసరంగా గుర్తెగాల్సిన ప్రాథమిక సత్యం ఇది.

ఈ వ్యాసం అక్టోబర్, 2010 “పాలపిట్ట” సంచికలో ప్రచురితమైంది.

ప్రకటనలు

3 responses »

  1. ఈ మధ్యకాలంలో నే చదివిన వాటిల్లో మంచి పోస్ట్.. మీరన్నట్లు ప్రజలంతా (దీనర్థం సామాన్య, మధ్యతరగతి జీవులు) ఓ వైపు చేరితే రాజ్యం ఎంత బలమైనదైనా గెలుపు మనదే అవుతుంది. ఇందులో సందేహం అక్కర్లేదు. కానీ ఈ సమీకరణం జరగకుండా వుండేందుకు అనేక రకాల కుయుక్తులు పన్నుతోంది రాజ్యం. అది అందించే తాయిలాల మోజులోపడ్డ వారు శతృవులుగా మారడానికి కూడా సిద్ధపడుతున్నారన్నది అనుభవమౌతుంది. అంతిమ విజయం ప్రజల పక్షానే వుంటుందన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. చిదంబర మోహన రాముళ్ళకు కాలం చెల్లే సమయం తప్పక దగ్గరపడుతుంది..
    మీకు ధన్యవాదాలు..

  2. I agreaa that Good post(analysis) on current affiar.

    But I donot understand, why do you have tried to mislead the story of Rama.

    సనాతం గా వొస్తున్న,చాలా మంది ఆరాదించే రాముడి కధ ను,మీరు వక్రీకరించి చెప్పటానికి సరియైన రుజువు తెలపగలరు. లేక అది కేవలం ఒక Fఅషిఒన్ గా ఫీల్ అయ్యి రాసిన మీ అజ్ఞానమా ?

    It is good idea to review our posting before publish to check whther it is going to hurt anybodies religion feelings.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s