మన ప్రపంచం – ౨౨

సాధారణం

మన ప్రపంచం – ౨౨

గాడ్ మెన్

 వార్తాపత్రికలన్నీ పేజీలను సాయిబాబా కథనాలతో నింపేస్తున్నాయి. కడపలో ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడిలా సాయిబాబా మన పత్రికలకు ఉపయోగపడ్డారు. దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట ఇదే సాయిబాబాపై హత్యాప్రయత్నం జరిగినప్పుడు ఆయన లుంగీ పైకెత్తి మేడమీది గదిలోకి పరిగెత్తినట్టు రాసిన ‘ఈనాడు’ ఇప్పుడు కేవలం ఆయన భక్తులకు చేరువవడానికి పేజీలకు పేజీలు కథనాలు వండివార్చుతోంది. సాయిబాబాపై కాకుండా చిల్లర బాబాలపై పదునైన మాటల తూటాలతో విరుచుకుపడే టీవీ నైన్ అకస్మాత్తుగా గత వారం రోజులుగా కాషాయరంగు ధరించింది. ఇలా వీలైనప్పుడల్లా మన మీడియా ఎంత దిగజారుడు తనానికైనా సిద్ధమని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటుంది. ఒక స్టాండు అంటూ లేకుండా ఎటుపడితే అటు నాలుకను తిప్పే ఊసరవెల్లి వ్యవహారం పత్రిక స్వప్రయోజనాలు కాపాడడం వరకూ ఏమోగాని, సమాజం నిలబడడానికి గాని, స్వయంగా ఎదగడానికి గాని ఏమాత్రం ఉపయోగపడదు.

బాల్యం నుంచే సాయిబాబా తానో దైవాంశ పంభూతుడినని ప్రచారం చేసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనాలు వీర భక్తులుగా మారడం మాత్రమే కాక్ తమ ఆస్తులు సర్వస్వాలను అన్నింటిని బాబాకు ధారపోయడాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బేలగా మనుషులు దైవాన్ని ప్రార్థించడం వేరు. తాము కష్టపడి సంపాదించిన ఆస్తులను తృణప్రాయంగా బాబాకు ధారపోయడం వేరు. ఎంతో త్యాగ గుణాన్ని తమ నాయకుడు లేదా ఆరాధ్యనీయ వ్యక్తి తమకు నేర్పకపోతే భక్తులు ఆ పని చేయలేరు. ఇందుకుగాని బాబాను ఇప్పటి రాజకీయ నాయకులందరూ ఆదర్శంగా తీసుకోవాలి. తాను ఏం చెప్తున్నారన్నది అంత ప్రధానం కాదుగాని, తన భక్తులలో పాదుకొల్పిన నిస్వార్థ గుణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. హత్యాప్రయత్నం జరిగిన తర్వాత బాబాలో తీవ్రమైన మార్పు వచ్చిందని బాబా జీవితాన్ని పరిశీలించిన వారికి స్పష్టంగా తెలిసిన విషయమే. తన చుట్టూ చేరిన సంపదే తన శతృవని ఆయన గ్రహించారు. వెంటనే కోట్లాది రూపాయలను సమాజ సేవకు వినియోగించడం మొదలుపెట్టారు. తరువాత అమలులోకొచ్చినవే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గాని, అనంతపురం మంచినీటి ప్రాజెక్టుగానీ. వాటిలో కూడా కాంట్రాక్టులు ట్రస్టు సభ్యుల బంధువులకు అప్పగించినప్పుడు మళ్లీ దుమారం చెలరేగితే, బాబా స్వయంగా తప్పులు సరిదిద్దారు. ఆశ్రిత పక్షపాతం వహించకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు.

కోటానుకోట్ల రూపాయల ట్రస్టును అంతగా చదువు లేని సాయిబాబా కేవలం భక్తి మత్తుతో నడిపించడం మేనేజ్ మెంట్ విద్యార్థులంతా పాఠాలుగా నేర్చుకోవలసిందే. వేలాది మందికి క్రమం తప్పకుండా భోజనాలు, ఇతర సదుపాయాలు నిరంతరాయంగా కల్పించడంలో గత ఆరేడు దశాబ్దాలుగా సత్యసాయి ట్రస్టుకు మంచి పేరుంది. పైగా వారెవ్వరికీ జీతభత్యాలు కూడా వుండవు. వాలంటరీలుగానే సాయి భక్తులందరూ ఈ పనులు చేస్తున్నారు. అదికూడా మెచ్చుకోదగిందే. మరి సాయిబాబా లేని ప్రశాంతి నిలయంలో ఈ పనులన్నీ ఎలా సాగుతాయోనని ప్రపంచవ్యాప్తంగా బాబా అభిమానులూ, అభిమానం లేనివారూ ఆసక్తిగా గమనిస్తున్నారు. బాబా జమానాలో ఎన్నో శవాలు పెన్నా నదీతీరంలో తేలినప్పుడు కనీసం శవ పంచనామాలు సైతం జరిగిన దాఖలాలు లేవు. స్వయంగా యూ ఎన్ ఓ సాంస్కృతిక విభాగం జారీ చేసిన అంతర్జాతీయ సర్క్యులర్ లో పుట్టపర్తి వెళ్లే భక్తులు తమ ప్రాణాలు తామే స్వయంగా కాపాడుకోవాలని తాఖీదు జారీ చేయడం ఇప్పుడు గుర్తు చేయడం బాగోదు. కానీ సాయిబాబా మరణం వెనుకనున్న మిస్టరీని మన తెలుగు దినపత్రికలు పోటీపడి తవ్విపోగేసేస్తుండడం చూస్తే ఈ మాటలు రాయాలనిపించింది. ఒక పాత తెలుగు సినిమా పాటలో ‘బాబూ ఆ గొయ్యి ఎందుకురా’ అని ప్రశ్నిస్తే, ‘తాతకు చేసిన మర్యాద మరి నీకూ చెయ్యాలి కదయ్యా’ అని సమాధానం చెప్పడం గుర్తుకు వస్తే అది మనతప్పు కాదు కదా. పుట్టపర్తిలో సంభవించిన వందలాది మిస్టరీ మరణాలలో సాయిబాబాది కూడా ఒకటి కావడమే విషాదం.

సాయిబాబా తనపై ఎవరు, ఏ స్థాయిలో, ఎన్ని విమర్శలు చేసినా కేవలం మౌనంతోనే సమాధానం చెప్పేవారు. అదే విద్యను ఇప్పుడు ట్రస్టు సభ్యులు ప్రదర్శించడం తప్పు పట్టలేం. అయితే పసలేని ఈ విషయాలతో మన పత్రికలు పేజీలను నింపుతున్నది ఎందుకంటే కడపలో జగన్ ప్రభంజనాన్ని కాసేపైనా జనం దృష్టినుంచి మళ్లించడానికే. ఒక శాసన సభ, ఒక లోక్ సభ స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలకు అంత కవరేజీ ఇస్తూ అనవసరంగా జగన్ ను మరింత హీరోను చేసేస్తున్నామేమోనన్న అనుమానంతో పత్రికలు వున్నాయి. ఇంతలో ఆపద్బాంధవుడిలా అన్నా హజారే దొరికారు. కానీ ఆ ముసలాడు ఆ ఎపిసోడ్ ను కనీసం ఒక వారమైనా టీవీ సీరియల్ లాగా లాగుతారనుకుని మన తెలుగు పత్రికలు రంగం సిద్ధం చేశాయి. మూడో రోజుకే ప్రభుత్వం దిగిరావడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో సాయిబాబా అంశం దొరికింది. ఇంకేముంది, సరిగ్గా పది రోజులు మన మీడియాకు మేత. మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ పరిశీలించకపోతే మన జీవితంలోనే ఏది ముఖ్యమో, ఏది అనవసరమో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతాం.

అన్నట్టు, నూటా ముప్పై అయిదేళ్లకు పైగా చరిత్ర వున్న ది హిందూ జాతీయ దినపత్రికకు ప్రస్తుతం ఎన్. రామ్ ఎడిటర్ గా వున్నారు. అరవై ఐదేళ్ల ఎన్. రామ్ గత ఏడాదే రిటైర్ కావాల్సివుంది. ఆయన సోదరుడు ఎన్. రవి తర్వాతి సంపాదకుడు కావాల్సిఫుంది. కానీ, నాటకీయంగా గత పక్షం రవిని ఉద్యోగం నుంచి తొలగించారు. రామ్ పదవీ విరమణను మరికొన్నాళ్లు తనకుతానే పొడిగించుకుని, తన తరువాతి స్థానానికి రాబోతున్న మరో సీనియర్ ఉద్యోగి రవిని తొలగించడమే కాకుండా ఎందుకు తొలగిస్తున్నట్టో కూడా కనీసం చెప్పలేదట. దీంతో రవి తన కష్టాన్ని లేఖలో రాసుకుని కరపత్రాలు పంచినట్టు హిందూ పత్రికలోని సీనియర్ ఉద్యోగులందరికీ పంచిపెట్టారట. ప్రస్తుతం రవి స్థానంలో హిందూ సీనియర్ రిపోర్టర్ సిద్ధార్థ వరదరాజన్ ను నియమించారట. దీనిని బట్టి తెలిసిన నీతి ఏమిటంటే ప్రజాస్వామిక విలువలు ప్రకటించుకోవడానికే గాని, పాటించడానికి కాదని మరోసారి హిందూ తెలియజెప్పిందన్న మాట. భాషా భేదమే గాని, పత్రికలన్నీ ఒక్కటే దారిలో నడుస్తున్నాయన్న మాట. ఎంత నిబద్దతో!

౨౮.ఏప్రిల్, ౨౦౧౧

ప్రకటనలు

4 responses »

  1. Sir,
    I am reading your articles posted in chaduvu, they are really inspiring. In this article you mentioned the way of Indian paper media, it is true and every body know this, not only this every thing what is going wrong in India. But we can’t do any thing except this type of criticism. What is the right solution for this?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s