మన ప్రపంచం 31… అజెండా

సాధారణం

అభిమానుల ఆనంద సందోహాల మధ్య ఆంధ్రుల ఆరాధ్య నటుడు బాలకృష్ణ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించేశారు. ఎన్టీయార్ పుత్ర రత్నాలు ఒక్కొక్కరుగా ఆపద్ధర్మంగా ఆరంగేట్రం చేస్తున్నా అందరూ పొలిటికల్ స్క్రీన్ మేద తోలుబొమ్మలే అవుతున్నారు. ఆడేదీ ఆడించేదీ అంతా బావగారే. ఇప్పుడే కాదు… నందమూరి కుటుంబంలో కథానాయకుడు ఎవరైనా కథనం చంద్రబాబుదే. ఆ మాటకొస్తే ఎన్టీయార్ కే దిక్కులేదు. హరికృష్ణ లేదంటే బాలకృష్ణ లేదంటే పానకంలో పుడక జూనియర్ ఎన్టీయార్ లేదంటే మరొకరు అంతా ఆఫ్టరాల్. చంద్రబాబుకు ఎవరైనా కేరేజాట్.

అయితే అకస్మాత్తుగా బాలయ్యబాబు ఎన్నికలకు సై అంటూ తొడగొడుతూ రావడం మాత్రం బాబు డ్రామాలో భాగంగానే తెలుగు ఓటరు అర్థం చేసుకోవాలి. ఈ విధమైన కనువిప్పు బాబుకు కలగడానికి కారణం కుర్రకుంక జగనే. వై. ఎస్. మరణాంతరం జగన్ దక్కించుకున్న ఓట్ల శాతం కళ్లు సగం తెరిపించగా, చేతిలో అన్ని పత్రికలూ ఇన్ని టీవీ చానెళ్లూ వుంచు’కొని’ కూడా సాక్షి ప్రాపగాండా ముందు నిలవలేకపోవడం మిగతా సగంగా చంద్రబాబు కళ్లు తెరిపించింది. వీటికితోడు ఓదార్పు యాత్రల్లోను దీక్షలలోను సమీకరిస్తున్న, గుమిగూడుతున్న జన బాహుళ్యాన్ని పరిశీలిస్తున్న బాబుకు ముచ్చెమటలు పోస్తున్నాయి. చాలా రోజులవరకు గుంభనంగా వున్న బాబు అప్పుడప్పుడు ఆవేశంలో మనసులో మాటను కక్కేస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో ఆంధ్రా ప్రాంతపు ఎన్నికల్లో టీడీపీ, వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ వుంటుందని కేడరుకు స్వయంగా ఉద్బోధ చేశారు. జగన్ కున్న రాజకీయ అనుభవం బొత్తిగా శూన్యమే అయినా అతది దూకుడుకు కారణం మరణించిన వై. ఎస్. పట్ల జనాలకున్న ప్రేమాదరాభిమానాలే. మరణించిన వారిపట్ల మనకున్న క్రేజ్ ను ఓట్ల రూపంలో కురిపించుకోవాలన్న తాపత్రయంలో ఇప్పుడు జగన్ కు తోడుగా చంద్రబాబు కూడా జట్టు కట్టాలనుకుంటున్నారు.

ఏవేవో కుంటిసాకులు ‘ఈనాడు’తో చెప్పించి మామను గద్దెదించి అధికారాన్ని ఆక్రమించడమే కాకుండా మహానేత మరణానికి కూడా పరోక్షంగా కారణమైన చంద్రబాబు తన సొంత మామ పేరు చెప్పుకుని జనంలోకి వచ్చినా ఎవ్వరూ నమ్మరన్న సత్యం బోధపడ్డాక సుదీర్ఘ రహస్య అజెండాకు శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజల స్మృతిపథంలోంచి చెరిగిపోతున్న నందమూరి తారక రామారావును గుర్తుకు తేవడంతో పాటు అతడి వారసుడైన నందమూరి బాలకృష్ణను తెలుగుదేశం పార్టీకి మృత సంజీవనిగా వాడదలచుకోవడం అనే ‘ఒక్క దెబ్బకు బోలెడు పిట్టలు’ కడు రమ్యమైన రమణీయ కమనీయ రంగుల చిత్రానికి పక్కా స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు. అందులో భాగంగానే తొలివిడత ఒక బియ్యం వ్యాపారి ‘శ్రీరామరాజ్యం’ సినిమా తీయడం. డబ్బంతా ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చింది కాబట్టే జనం థియేటర్ల వద్దకు రాకపోయినా రాష్ట్రమంతటా అర్థ శత దినోత్సవం పూర్తిచేసుకుని వంద రోజుల పండుగకు ఆ సినిమా పరుగులు పెట్టడం. అంతటితో ఆగక తమ అనుబంధ టీవీ చానెళ్లలో ఆ సినిమా పై ప్రత్యేక కార్యక్రమాల ప్రసార హోరు అందులో భాగమేనని ఓటరు అర్థం చేసుకోవాలి. ఇక ఎన్నికలు సమీపించేలోగా బాలయ్యబాబు ఇతర పౌరాణిక పాత్రలయిన శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు, తదితర వేషాలలో అలరించబోతున్నారు. దాంతోపాటు రాబిన్ హుడ్ తరహా సాంఘిక పాత్రలు కూడా పోషించిన సినిమాలు విడుదలైతే మన జన్మ ధన్యమవుతుంది. పైగా ఇకపై రాబోయే సినిమాలకు చంద్రబాబు ఇంటికి బియ్యం వేసినవారే కాక, పాలు పోసేవారు, పేపర్ తెచ్చేవారు, కూరగాయలమ్మేవారు.. నిర్మాతలుగా మారే అవకాశాలు లభిస్తాయి. భలే చాన్స్ కదా..!

ఒక వైపు బాలయ్యతో సినిమాలు విడుదల చేయిస్తూ, మరోవైపు చంద్రబాబుతో సంబంధం లేకుండా అతడు ప్రజలవద్దకు వెళ్లేలా పర్యటనలు ఏర్పాటు చేయిస్తూ ప్రజల స్మృతిపథంలో మళ్లీ అలనాటి ఎన్టీయార్ కదలాడేలా చేయిస్తారు. ఆ విధంగా 2014లో జరగనున్న ఎన్నికలు మనుగడలో వున్న పార్టీల మధ్య కాకుండా, లేని వై. ఎస్. ఆర్. వెర్సస్ ఎన్టీయార్ ల మధ్య జరిగేలా స్కెచ్ సిద్ధమవుతోందన్న మాట. తెలివి తెచ్చుకోవలసింది మనమే.

21.01.2012

వ్యాఖ్యలను మూసివేసారు.