ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం

సాధారణం

ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం

పుస్తకాలు చదివేవారంతా అనివార్యంగా ప్రేమించేది పత్రికలను. ప్రతి వారం వారానికొక పుస్తకం చొప్పున పరిచయం చేస్తున్న ఈ బ్లాగులో ఇప్పటికే వున్న “చదువు ముచ్చట్లు” శీర్షికతో పాటు మరో సరికొత్త శీర్షికను నిర్వహించాలని ప్రయత్నం. ఈ “పత్రిక పరిచయం” శీర్షికలో  సాహిత్య, సామాజిక అంశాలకు సంబంధించిన వివిధ పత్రికలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.  ఈ శీర్షికను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.  మీకు తెలిసిన కొన్ని పత్రికల వివరాలు కూడా తెలియపరచండి.

కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ముందుగా చెప్పుకోదగ్గ పత్రిక “ప్రజాసాహితి”. రంగనాయకమ్మ గారు ముప్పై రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ పత్రికను కొన్నేళ్ల తరువాత జనసాహితి సాహిత్య సంస్థకు అప్పగించిన తరువాత కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఉద్యమ కృషిలో కొనసాగే పత్రికలు నిరాటంకంగా రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నింటిని అధిగమిస్తూ గత 32 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయాలంటే అదో యజ్ఞసమానమైన కృషి. దానిని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న జనసాహితి బాధ్యులు అభినందనీయులు. ఈ పత్రిక మరో విశేషమైన విషయమేమిటంటే కనీసం ప్రతి మూడు నెలలకొకసారైనా ఒక ప్రత్యేక సంచికను సమగ్రంగా తీసుకురావడం. “ప్రజాసాహితి” ప్రత్యేక సంచికలంటే పదిలంగా భద్రపరచుకోవలసినవి అని సాహిత్య అభిమానులందరికీ తెలిసిన సంగతే. ప్రపంచంలో ఎక్కడెక్కడి దేశాల్లో వస్తున్న ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్న పత్రికగా “ప్రజాసాహితి”కున్న ఖ్యాతినికూడా పేర్కొనితీరాలి. కథ, కవిత, వ్యాసం, సీరియల్, బాల సాహిత్యం, పుస్తక సమీక్షలు, చర్చలు, ఇలా ఒకటేమిటి సమస్త సాహిత్య ప్రక్రియల్లోనూ రచనలు మనకిందులో పలకరిస్తాయి. మన ఆలోచనను పెంచుతాయి. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి.

ఈ పత్రిక సంవత్సర చందా వంద రూపాయలు మాత్రమే. ఈ దిగువ చిరునామాకు చందా పంపి నెలనెలా ఈ పత్రికను తెప్పించుకోమని సాహిత్య అభిమానులైన బ్లాగు మిత్రులందరినీ కోరుతున్నాను.

ప్రజాసాహితి

మైత్రి బుక్ హౌస్,

జలీల్ వీధి, ఆరండల్ పేట, కారల్మార్క్స్ రోడ్,

విజయవాడ – 2.

 

ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు గారి ఫోన్ నెంబరు: 9490196890

సంపాదకులు పి. ఎస్. నాగరాజు గారి ఫోన్ నెంబరు: 9441913829

వ్యాఖ్యానించండి