ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక రాయబారి వివేకానందుడే

సాధారణం

పేదల, దీనుల కుత్తుకలపై పరమనీచముగా హిందూ మతమువలె కాలిడి తొక్కు మతమును లోకమున వేరు లేదు” (1).

బుద్ధుడు మొదలుకుని రామనోహనరావుల వరకును ప్రతి వ్యక్తియు వర్ణ వ్యవస్థతోపాటు మతమును – ధర్మమును – ధ్వంసము చేయబూని విఫలులైరి” (2).

ఇతరులపట్ల పరమ నికృష్టముగా అసూయపడుటలో, (హిందూ మతానికి) ఇంత పేరు ప్రతిష్ట జగత్తున లేదు” (3).

దక్షిణ (భారత)దేశమున అగ్రవర్ణాలు నిమ్నవర్ణాలను పెట్టు యమయాతనలు నా కన్నులార చూస్తినే! గుళ్లల్లో (అగ్రవర్ణజుల) ఏమి ఒడలెరగని సివము! పేదల దుఖస్థితిని తొలగింపజాలని మతము – మానవులను దేవతలుగా నొనర్పజాలని మతము – మత మనదగునా? ధర్మమనదగునా? సనాతన ధర్మమనిపించుకొనుటకు మన మతమున కేమైనా అర్హత కలదా?” (4)

ఈ మాటలన్నది ఏ ఛాందస ముస్లిం మతవాదో, క్రైస్తవ ప్రచారకుడో, భారతీయ నాస్తికుడో అనుకుంటే చాలా పొరపాటు. తన అసమాన వాక్పటిమతో భారతీయ పరంపరానుగతిక ఆధ్యాత్మిక సారాన్ని నేల నాలుగు చెరుగులా సింహగర్జన పూరిత రణన్నినాదంతో చాటిచెప్పిన వివేకానందుని మాటలివి. ఇలాంటి వ్యాఖ్యలున్నాయని తెలిస్తే సంఘ పరివారం వివేకానందుడినీ వెలివేస్తుందేమో! ఇలాంటి చెత్త వాక్యాలను వెంటనే వివేకానంద సాహిత్య సర్వస్వం నుంచి పరిహరించాలని విహెచ్ పి వీరంగం చేస్తుందేమో! ఇవి అక్కడక్కడా ఏరి కూర్చినవి. మరి అలాంటి వాక్యాలున్న ఉత్తరాలన్నీ చదివితే దేశానికీ సనాతన మతానికీ ఇంత దుర్గతి ఎందుకు పట్టిందన్న వివేకానందుని విశ్లేషణ అవగతమవుతున్న కొద్దీ భారత యువతకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి కదా!

ఈ వారం శ్రీ వివేకానంద సంపూర్ణ సాహిత్యంలో భాగంగా విడుదలైన శ్రీ వివేకానంద లేఖావళి మొదటి భాగాన్ని పరిచయం చేస్తున్నాను. భారతదేశంలో ప్రభావశీలమైన లేఖాసాహిత్యం సృజించిన అతికొద్ది మందిలో వివేకానందుడు ఒకరు. నెహ్రూ తనకు రాసిన అనేకానేక ఉత్తరాలను భవిష్యత్తు భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలన్న సదుద్దేశంతో “ది గ్లింప్సెస్ ఆఫ్ వాల్డ్ హిస్టరీ“గా సంకలన పరిచారు ఇందిరాగాంధీ. జాతీయ స్పృహ కలిగించాలనే ఉద్దేశం వివేకానందుడి లేఖావళిలోనూ ప్రతిపేజీలో కనిపిస్తుంది.

జాగ్రత్తగా పరిశీలిస్తే వివేకానందుడి జీవితమే అద్భుత కార్యం సాధించదలచిన సాహసికుడి జీవితం మాదిరిగా గోచరిస్తుంది. “దేవుడ్ని నువ్వు చూశావా” అని వివేకానందుడు అడిగినప్పుడు “నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశా” అని రామకృష్ణ పరమహంస సమాధానమివ్వడంతో ఒక ప్రత్యేక శకానికి నాంది పలికిందని చెప్పాలి. ఆ నిరక్షరాస్యుడైన బెంగాలీ బ్రాహ్మడు తనకందించిన పవిత్ర సందేశాన్ని యావత్ మానవాళికి అందివ్వాలని ఉద్యుక్తుడయ్యాడు — డిగ్రీ విద్యను కూడా పూర్తిచేయని ఆ నవయువ నరేంద్రుడు. పేరులో ఏమున్నది పెన్నిధి అని మనం సరదాగా అనుకుంటాం, కాని పేరు కోసం పడరాని పాట్లుపడతాం గాని, రకరకాల మారుపేర్లతో మొత్తం భారతదేశాన్ని ఆసేతు హిమాచల పర్యంతం ఐదుమార్లు చుట్టి వచ్చాడన్న సంగతి వివేకానందుని జీవితం జాగ్రత్తగా అధ్యయనం చేసినవారు తెలుసుకునేది. భారతీయ భిన్నత్వపు సంస్కృతికి, సనాతన హిందూ మతధర్మానికి మూలాలు కనుక్కొనే ప్రయత్నంగా ఈ పర్యటనలను అభివర్ణించవచ్చు. షికాగో వెళ్లినపుడు క్షేత్రీ మహారాజు సూచించిన వివేకానంద పేరు ఆ ఉపన్యాసాల హోరుతో మార్మోగి స్థిరపడిపోయింది. ఈ యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేట్ ఉపన్యాసాల వేదికల వద్ద తనను పొగుడుతూ రాసే ఉపమానాలలో ‘మాస్టర్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్’ అంటూ రాసేవారని రోమరోలా (రోమైన్ రోలండ్ – ఫ్రెంచ్ భాషలో వివేకానందుడి జీవిత చరిత్రకారుడు) వర్ణిస్తారు.

ఈ మొదటి సంపుటి లేఖావళిలో వివిధ సందర్భాలలో 1888 ఫిబ్రవరి నుంచి 1894 వరకు పలువురికి రాసిన లేఖలలో కొన్నింటిని శ్రీ చిరంతనానంద స్వామి అనువదించగా శ్రీరామకృష్ణ మఠం స్వయంగా ప్రచురించింది. షికాగో వెళ్లకముందర, షికాగోలో అనే రెండు దశలుగా ఇందులో జీవితాన్ని మనం విభజించుకోవచ్చు. రామకృష్ణ పరమహంస అమృత సందేశాన్ని అందరికీ పంచడమే వివేకానందుని జీవితాశయం. తానొక్కడే ఆ పని చేయలేకపోవచ్చని వివేకానందుని అంచనా. ఊరూరా తనలాంటి అచంచల దీక్షాదక్షతలుగల యువకుల నేరుకుని, సంఘటితపరిచి, వారిద్వారా యావద్భారతానికి తరతరాలుగా ఆ సందేశం పరంపరానుగతికంగా అందివ్వగలగాలన్నది వివేకానందుడి యోచన. అంతపెద్ద నెట్ వర్క్ నడపాలంటే డబ్బు కావాలి. ఇండియా బీద దేశం. అంత డబ్బు విరాళంగా సేకరించడం కష్టం. కాబట్టి డబ్బున్న దేశానికి వెళ్లి భారత సనాతన మత ధర్మ విశేషాలను వారికి తెలిపి, డబ్బు సంపాదించి, ఆ డబ్బును ఇక్కడ వినియోగించాలనేది వివేకానందుడి ఆలోచన. ఈ లేఖావళి అనేక మార్లు చదివాక నాకు అవగతమైందిదే.

భారతదేశపు మిత్రులకు, సోదర శిష్యులకు రాసిన ఉత్తరాల్లో మన మౌఢ్యాన్ని ఉతికి ఆరేసిన వివేకానందుడు విదేశీ మిత్రులకు రాసిన ఉత్తరాల్లో మన దేశపు ఘనతను మాత్రమే వర్ణించడం మనం మరవకూడదు. నిజానికి జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆరోజు వివేకానందుడు చేసిన కృషి ఫలితమే ఈ రోజుకు కూడా మన కాషాయవస్త్రానికి అంత గౌరవం లభిస్తున్నది. సాయిబాబా, రామ్దేవ్, రవిశంకర్ తదితర ఆధ్యాత్మిక ప్రవచనకారులందరికీ బయట గడ్డమీద భక్తి ప్రపత్తులు కల్పించింది వివేకానందుడే.

యువతరం తప్పక చదవాల్సిన ఈ పుస్తకంలో ఆణిముత్యాలంటి కొన్ని మాటలు చదవండి.

ఒక స్పందన »

  1. చాలా విషయాల్లో(ఓంకారం, స్నేహ బాంధవ్యాలు,మత అచరణాలు తదితర) వివేకానందుడితో విభేదించిన తీర్థరాముని గురించి మీరు విన్నారా? వచ్చే వారం నుంచి నేను మన అధ్యాత్మిక మహానుభావులను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ‘వికాసా’నికి రండి .

  2. మీరు ఒక మంచి ఆలోచనతో ముందుకు రావటం, నాకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తున్నది. కొన్ని నెలల క్రితము, ఒక మిత్రుడు నాకు ‘Selections from THE COMPLETE WORKS OF SWAMI VIVEKANANDA’ అనే పుస్తకమును అందజేసాడు. ఆ పుస్తకాన్ని కాస్త చదివిన తర్వాత నాలో ఎదో తెలియని ఉత్తేజం కలిగింది. అందులో వివేకానందులవారు, నేడు మన దేశము సామాజికముగా, నైతికముగా ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం తెలిపారు.

వ్యాఖ్యానించండి