దోపిడీకి గురవుతున్న గిరిజనం

సాధారణం

ఐ.టి.డి.ఏ. (అంటే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) చేస్తున్న బృహత్ కార్యక్రమాలు పేపర్లలో చదువుతున్నపుడు గిరిజనులపట్ల ప్రభుత్వం చూపిస్తున్న కేర్, కన్ సర్న్ లకు మనకు సెంటిమెంటుతో కన్నీళ్లొస్తాయి. ఏదైనా గిరిజన గ్రామానికి వెళ్లి రెండ్రోజులు వాళ్లతోపాటు గడిపితే వారి కడగండ్లన్నీ గమనించాక కన్నీరు వరదవుతుంది. హైమన్ డ్వార్ఫ్ వి గాని, లెవీస్ట్రాసువి గాని ఆంత్రపాలజీ వ్యాసాలు చదువుతుంటే గిరిజనులనుంచి గిరిజన జీవన విధానాన్ని వేరు చేసి వాళ్ల సంస్కృతిని ధ్వంసం చేస్తుండడం చూసి హృదయం ఛిద్రమవుతుంది. ఇంతకూ ఆ కొండ కోనల్లో ఏం జరుగుతోంది? ప్రతి గిరిజన ప్రాంతంలో ఆ ఏరియాకు ఒక మహారాజులా వుండే పీవో, అతడి అనుచరగణం ఏం చేస్తుంటారు? అన్ని సమస్యలను తుపాకీ గొట్టంతోనే పరిష్కరించగలమని నమ్మే అన్నలు గిరిజన జీవితానికెలా ఉపకరిస్తున్నారు? ఇవన్నీ మనకు తెలియని విషయాలు. అయితే తెలుసుకోకూడని విషయాలు మాత్రం కానే కావు. గిరిజనులు జీవితం చుట్టూ ఒక వలయంలా సంఘటనలన్నింటినీ పేర్చి చక్కటి కథగా మలిస్తే ఈ తరం యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నంలో దశాబ్దం కిందటే ‘చతుర’లో ఒక నవల వచ్చింది. అది ప్రముఖ కళింగాంధ్ర రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన “పునరావాసం” నవల.

1996 నాటి ‘చతుర’ ఇప్పుడెలా దొరుకుతుందని పాఠకులు గాబరా పడక్కర్లేదు. 1999లో శ్రీకాకుళ సాహితి ఇదే నవలను తన ప్రచురణగా వెలువరించింది. ఒక తెగ ప్రజల జీవన విధానాన్ని తెలియజేయాలనుకున్న రచయిత మూడు తరాల చరిత్ర ద్వారా అది సాధించాలనుకోవడం శిల్పపరంగా బలమైన ఎత్తుగడ. అంత విశాలమైన కాన్వాస్ సిద్ధం చేసుకున్నపుడే పాఠకుల హృదయాల్లో ముద్ర వేయగలిగే సన్నివేశాలు సృష్టిం చడం వీలవుతుంది. అయితే రష్యన్, ఫ్రెంచ్, ఆంగ్ల సాహిత్యాలలో గొప్పవనదగ్గ నవలల్లో కన్పించే ఈ విశిష్ట గుణంతోపాటు మరొక్కటి అప్పలనాయుడు తన పునరావాసం నవలలో నిర్వహించి వుంటే తెలుగు సాహిత్యంలో ఆణిముత్యం కింద శాశ్వతంగా ఈ నవల మిగిలివుండేది. అది పాత్రల స్వరూప స్వభావాలతోపాటు మానసిక నేపథ్యాన్ని కూడా మరింత సునిశితంగా, వివరంగా నెరేట్ చేయడం. బహుశా ‘చతుర’ పరిధులను దృష్టిలో వుంచుకోవడం కూడా ఈ డామేజీకి కారణం కావచ్చు. శిల్పపరంగా అబ్బురపరిచే మరో విషయం నవలలో పాత్రలైన కంఠుడి కొడుకూ కోడలు గిరిజనోద్యమంలో విశేష కృషి చేస్తారు. కాని, ఈ నవలలో పాత్రలుగా ఎక్కడా కన్పించరు. నవల చదువుతున్నపుడు దృశ్య కావ్యంగా ఊహించుకుంటే ఆ రెండు పాత్రలు తమ వీరోచిత సాహస కార్యాలతో స్పష్టాస్పష్టంగా కనిపించీ కనిపించకుండా మాయమవుతుంటారు. ఫ్లాష్ బ్యాక్ ధోరణి కథనాన్ని ఎన్నుకుని ఎక్కడా బిగువు సడలకుండా జాగ్రత్తగా కథను నడిపించి సఫలీకృతులయ్యారు రచయిత.

స్వచ్ఛమైన ప్రకృతి జీవనంలో జీవితాన్ని సాగిస్తున్న కంఠుడు కొండదిగి గిరిజన జీవన విధానం తనంతట తాను విడిచి పెట్టేయలేదు. ఒక పథకం ప్రకారం జరిగిన “పరిణామ క్రమం”లో వైకుంఠపాళిలో పావులాగా కదిలాడు. సంతలు, షావుకార్లు సరుకులతో కొత్త ప్రపంచాన్ని చూపించారు. నాగరకతను మచ్చిక చేశారు. అటవీ సంపదను దోచుకున్నారు. గూడల్ని, తండాల్ని, వలసల్ని కొండలమీదే వదిలి, కొండ దిగువన కాలనీల్లోకి మారడానికి ముందు వారి బతుకు కథ మరో మలుపు తిరిగింది. పశ్చిమ బెంగాల్ లో మొదలైన నక్సల్బరీ ఉద్యమాన్ని శ్రీకాకుళ పోరాట రంగం సూదంటు రాయిలాగా ఆకర్షించింది. శ్రీకాకుళ రైతాంగ పోరాట నాయకులు కొండల్లోనే షెల్టర్ తీసుకున్న కారణంగా గిరిజనులకు జరుగుతున్న దోపిడీని చూసి తట్టుకోలేక, భరించలేక కొండపై గిరిజనులతో ఎర్రజెండాలు ఎగరేయించారు. హింసాత్మకమైన వారి పోరాటాన్ని ఆపడానికి ప్రభుత్వం గిరిజనులను ఉద్ధరించే కార్యక్రమాలు మొదలుపెట్టింది. విప్లవ నాయకుల్ని జల్లెడ పట్టే క్రమంలో గిరిజనులను పోలీసులు చిత్రహింసలు పెట్టడం ప్రపంచ చరిత్ర అంతటా నల్లటి సిరాతో రాసిన అధ్యాయాలే. ఇదే క్రమంలో గిరిజనులకు దగ్గర కావడానికి వారిని ప్రగతి పథంలో నడిపించడానికి ఐటిడిఏ అనే అందమైన అబద్దం వెలిసింది. గిరిజనాభ్యుదయానికి కావలసిన పథకాల నిధులు ఏ దేవతల లేదా గంధర్వుల చేతుల్లో పెడితే బావుండేదేమో! దురదృష్టవశాత్తూ వాటిని మనుషుల చేతిల్లో పెట్టారు. స్వార్థపరుడైన మనిషి, గిరిజనుడి అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు సొమ్మంతా మింగేసి గిరిజనులకు మొండిచెయ్యి చూపించారు.

విప్లవ పోరాటంలో కంఠుడి సంతానం సమిధలైతే మనవరాలు బంతి ఈ అధికారుల ఆగడాలకు గురవుతుంది. బంతిని ఏలుకున్న భీముడు కొంత విప్లవ స్పృహ పెంచుకున్నా, ఉద్యమంలో అప్పటికే నీరసత్వం ఆవహించడం, సమష్టి తత్వం పోయి వ్యక్తివాదం గిరిజనుల్లోనూ ప్రవేశించడంతో అతడి కథ అర్థాంతరంగా ముగిసిపోతుంది. పోలీసుల (అధికారుల) దాష్టీకం పరాకాష్టకు చేరుకున్నాక ఆఖరికి కొండ దిగువున కూడా గిరిజనుడు మనలేని పరిస్థితిలో ఒరిస్సాలోని ఆమె నాన్నమ్మ కన్నవారింటికి బంతి ఒంటరిగా చేరడంతో నవల ముగుస్తుంది. అయితే అక్కడ ఉండేది మనుషులే. దోపిడీ మామూలే. మూడు తరాల చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన బంతి ఎక్కడా ఆవేశపడకపోవడమే కాదు, కాస్త అప్పుడప్పుడూ భయపడడం కూడా రచయిత శైలిలో (ఆలోచనలో?) లోపంగానే గుర్తించాలి. (ఎందుకంటే అప్పలనాయుడు కథకుడిగా విప్లవ రచయితగా మంచి పేరుంది. కాని నా దృష్టిలో ఈ నవల మాత్రం రచయితను విప్లవ రచయితగా చూపించదు. పైగా దానికి విరుద్ధంగా గాంధేయవాద విలువలను ఆమోదించినట్టుగా కనపడుతుంది.) పైగా విఫలమవుతున్నా పదేపదే గాంధేయ మార్గాన్నే బంతి అనుసరించడం రచయిత ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారో అని అనుమానం కలిగిస్తుంది. 20వ పేజీలో ఎనిమిదో పేరాగ్రాఫులో ‘అదిగో అక్కడ్నించీ బంతి శరీరం రాజు స్పర్శ కోసం తహతహలాడేది. కొన్నాళ్లకే వాటిని పట్టించుకోని స్థితికి వచ్చేసింది‘ అంటారు. బంతి తాను సృష్టించిన పాత్ర కాబట్టి సరేననుకుంటాం. కాని తర్వాత పేరాలో ‘సవర స్త్రీ వేళ్లూ, కాళ్లే కాదు రొమ్ముల్ని తాకినా ఏ అనుభూతికీ లోనయిపోదు‘ అంటారు. ఇది న్యాయమేనా? ‘మనసు లోతుల్లోంచి కాంక్ష పుడితేనే‘ ఏ స్త్రీ అయినా దేనికైనా సిద్ధమవుతుంది. ఈ విషయం భౌగోళిక వాతావరణం బట్టో, కులాన్ని బట్టో చెప్పాల్సింది కాదు కదా. అది మనిషి మనసుకి సంబంధించింది. అయితే నవల మొత్తంలో ఈ ఒక్కచోటే రచయితలోని మేల్ చావనిస్ట్ అలా ఫ్రాయీడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ లాగా బయటపడ్డాడు. వెంపటాపు సత్యం పేరు చెప్పినంత దర్పంగా బంతికి ఉద్యోగమిచ్చిన డీటీడబ్లువో పేరు చెప్పడానికేమీ? ఆ పాత్ర చినవీరభద్రుడనుకుంటాను. పేజీ 44లో చెప్పిన వీడియోఫిలింకు మాటలు రాసింది కూడా ఈ నవలా రచయితే అయివుండొచ్చు. (ఈ ‘సంతోష చంద్రశాల’ “కొన్ని కలలు-కొన్ని మెలకువలు”లో ‘సంతోష చంద్రశాల’ ఒకటే అయితే)

సరే, గిరిజన రైతాంగ పోరాటానికి దారితీసిన వారి బతుకుల నేపథ్యం, పోరాటం, త్యాగాలు, మనుషుల స్వార్థపరత్వం, దోపిడీ విశ్వరూపం మొదలైన అంశాలను ఎంతో పకద్బందీగా, నేర్పుగా ఈ “పునరావాసం” నవలలో రచయిత అప్పలనాయుడు చిత్రించారు. 120 పేజీల ఈ నవలను 20 రూపాయలకే శ్రీకాకుళ సాహితి అందిస్తోంది. తమ చరిత్రను తెలుసుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన మంచి పుస్తకమిది. మరి మీరూ చదువుతారుగా!

ఒక స్పందన »

వ్యాఖ్యానించండి