మొదటి ఫటాఫట్ దుప్పల రవికుమార్ తో…

సాధారణం

(దుప్పల రవికుమార్ అంటే ఈ బ్లాగరిగా నేనే. ముందు ఎలాంటి ప్రశ్నలు ఉండాలని ఆలోచించి ఈ ప్రశ్నలు తయారుచేశాను. కేవలం పుస్తక ప్రియులకు కిక్ ఇచ్చేవే ఈ బ్లాగులో ఉంటాయన్న సంగతి మీకు తెలిసిందే. పుస్తక పఠానాభిలాషను రెచ్చగొట్టడానికి, నోరూరించడానికి మరో చిన్న ప్రయత్నమిది. మరిన్ని ప్రశ్నలు, రచయితల, బ్లాగరుల, పాఠకుల మెయిల్ ఐడిలు నాకు  duppalaraviATgmail.com పంపించండి. ఈ శీర్షిక విజయానికి సహకరించండి. )

మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

బ్రిడా (పాల్ ఖెలో), మన కలల దిశగా రేపటి భారత్, ఇదీ చరిత్ర (ఎం.వి.ఆర్ శాస్త్రి), నా బాల్య సేవ (మక్సీం గోర్కీ)…

ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

ఇండియన్ మ్యుటినీ బ్రిటిష్ ఇమాజినేషన్ (గౌతమ్ చక్రవర్తి), ఇండియా ఆఫ్టర్ గాంధీ (రామచంద్ర గుహ) (పేపర్బ్యాక్ రాగానే కొన్నా) ఇఫ్ గాడ్ వజ్ ఏ బాంకర్ (రవి సుబ్రమణ్యన్) పుస్తకాలు మొన్ననే ఇండియాప్లాజానుంచి తెప్పించాను; రెండు వారాల కిందట చదవడం పూర్తిచేసిన పుస్తకం వేంపల్లి గంగాధర్ రాసిన “హిరణ్య రాజ్యం”.

మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ప్రస్తుతానికి మూడు వే… వద్దు చెప్పను. దిష్టి పడుతుంది.

చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

డాక్టర్ వి. చంద్రశేఖరరావు గారి “ఐదు హంసలు”, ఠామస్ ఫ్రీడ్ మాన్ రాసిన “ది వాల్డ్ ఈజ్ ఫ్లాట్”, వరవరరావు గారి ‘తెలంగాణ నవలపై సిద్ధాంత గ్రంథం’ మొదలైనవి.

మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

ఎన్. వేణుగోపాల్, కె. బాలగోపాల్, చినవీరభద్రుడు, నామిని సుబ్రమన్యం నాయుడు, మునిపల్లె రాజు, వరవరరావు, వి.చంద్రశేఖర రావు, కాత్యాయని, వల్లంపాటి, సహవాసి అనువాదాలు… వీరంతా ఏం రాసినా భలే నచ్చుతాయి. పుస్తకాలలో గుంటూరు శేషంద్రశర్మ “ఆధునిక మహాభారతం”, పాటిబండ్ల రజని “ఎర్ర జాబిళ్ల ఎరీనా”, శివసాగర్ కవిత్వం, గాంధీ ఆత్మకథ, హెర్మన్ హెస్ “సిద్ధార్థ” మరికొన్ని చచ్చేంత ఇష్టం.

మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

పదికి లోపే వుంటాయి. పుచ్చుకున్నవయితే (ఉచితంగా) ఆరో, ఏడో.. అంతే.

ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

ప్రజాసాహితి, అరుణతార, వీక్షణం, విపుల, భూమిక, Tehelka, Indian Literature, Outlook మొదలైనవి నచ్చుతాయి. అసలు నచ్చని పత్రిక “రచన”, “చినుకు”లు. సాహిత్య వ్యాపారం కిటుకులు తెలిసిన పత్రికలా నాకనిపిస్తుంది.

జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

కాళీపట్నం రామారావు గారి “యజ్ఞం” కథ. గొప్ప ప్రగతివ్యతిరేక దృక్పథం గల కథ అని తోస్తుంది. అప్పటికి విరసంలాంటి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు అప్పటి చారిత్రక అవసరాల మేరకు దాన్ని నెత్తికెత్తుకున్నారు. కాని, ఇప్పటికైనా నూతన గీటురాళ్లతో దాన్ని మళ్లీ తూచి అసలు విలువ కట్టాలి. ఇంకా విప్లవ కథలుగా చలామణి అవుతున్న చాలా కథలు నాకు నచ్చవు. తుమ్మేటి, అట్టాడ గబుక్కున ఉదాహరణలుగా గుర్తొచ్చారు. కేవలం ఒక భావజాల వ్యాప్తికోసమే రాసిన కథలుగా నాకు తోస్తాయి. కారా మిగిలిన కథలతో నాకు పేచీ లేదు.

ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

నాకు ఒక పుస్తకం పూర్తి చేసిన తర్వాత మరొకటి మొదలుపెట్టే అలవాటు లేదు. ఒకేసారి నాలుగైదు చదువుతుంటాను. “అంటరాని వసంతం” లాంటి కొద్ది పుస్తకాలు మళ్లీ మళ్ళీ చదివిస్తాయి. కన్నీళ్లు తెప్పిస్తాయి. “నాకూ వుంది ఒక కల” లాంటి పుస్తకాలు ఏకబిగిన చదివిస్తాయి. మిగిలిన చాలా పుస్తకాలు మనమే పూర్తి చేస్తుండాలి. ఎందుకంటే ఇంకా చాలా చదవాలి కదా! ప్రస్తుతానికి వరవరరావు గారి “తెలంగాణ వ్యాసాలు”, దిలావర్ కథలు “మచ్చుబొమ్మ”, హెలెన్ కెల్లర్ ఆత్మకథ, ఆస్కార్ వైల్డ్ “ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే”, 1857పైన సాహిత్యం చదువుతున్నాను.

ఒక స్పందన »

  1. చాలా బావుంది రవి గారూ. కొన్ని చిరకాలపు మిత్రుల్లాంటి పుస్తకాలు, కానీ కొన్ని బొత్తిగా ముఖ పరిచయం కూడా తెలియని ఆగంతకులు. అన్ని పుసతకాలకీ పక్కనే కనీసం రచయిత పేరు కూడా ఉంచితే బాగుంటుంది.

  2. బాగుంది రవి గారు. నేనసలు ఊహించలేదసలు! 🙂

    హమ్మ్.. కొత్తపాళీగారన్నట్టు ఆ పుస్తకాలకి లింకెలు ఇస్తే, కనీసం ఇంగ్లీషు వాటికి బాగుంటుంది.

    మీ లైబ్రరీ మాత్రం ఒకసారి చూసి, దిష్టి పెట్టాల్సింది! :-))

  3. మా తెలుగు లెక్చరర్ శ్రీమతి కందర్ప వెంకట నరసమ్మ గారు మాత్రమే గొప్ప ఒరేషియస్ రీడరని నా అభిప్రాయంగా ఉండేది. కానీ ఈ టపా చూసాకా అలాంటి వాళ్ళు ఇంకా కొంత మంది ఉన్నారని పిస్తుంది.
    మీ పఠనాశక్తికి అభినందనలు.

    బొల్లోజు బాబా

  4. పైనున్న పేర్లలో గాంధీ గారి పేరు నాకు బాగా తెలుసు 🙂 ఆ పుస్తకాన్ని ఒక కొట్లోనో ఎక్కడో లైబ్రరీలోనో మాంచి అద్దాలబీరువాలో ఉండగా చూసా.ఇక మిగిలినవి పుస్తకాలో,ఊర్లపేర్లో నాకు తెలీదు…

  5. మీరు సంఖ్య చెప్పకపొయినా మీ లైబ్రరీకి దిష్టి తగిలేట్టుంది, జాగ్రత్త మరి. మీరు రాసిన పుస్తకాలలో చాలా వాటిని చదవలేదు, అయినా మీరు పరిచయం చేస్తారుగా, మేము చదవక్కర్లేదులేండి.

  6. Dear Ravi garu,

    So far, I know you as a voracious reader and good critic. After reading your “Phata Phat”, I have realised that you are a dare-devil. There are no mincing of words in expressing your views. I like your frankness.

  7. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » నవంబరు బ్లాగుల ప్రస్థానం

వ్యాఖ్యానించండి