మన జన జీవితానికి అసలు సిసలు ప్రతిబింబం

సాధారణం

janjhavatiతెలుగు సాహిత్య చరిత్రలో కళింగాంధ్ర అందించిన, అందిస్తున్న అసమానమైన కృషికి ప్రత్యేక గుర్తింపు వుంది. అందులోనూ శ్రీకాకుళ సాహితి సంస్థగా చేస్తున్న కృషిని తెలుగు సాహిత్యాభిమానులంతా గమనించి, గౌరవిస్తున్నారు. ఈ సంస్థ ఒక కార్యదీక్షతో సిరీసుగా వెలువరిస్తున్న కథా సంకలనాల పట్ల సాహితీ ప్రియులందరికీ ఎన్నో ఆశలు. ఆ ఆశలను తీరుస్తూ షడ్రచులతో వెలువరించిన కొత్త పుస్తకం “జంఝావతి కథలు”. శ్రీకాకుళంలో ప్రవహిస్తున్న నదీమ తల్లుల పేర్లతో ఇక్కడి జన జీవితాన్ని వారి సమస్యలను, జీవన పోరాటాన్ని అక్షరబద్దం చేయడానికి శ్రీకాకుళ సాహితి ప్రయత్నిస్తోంది. ఇదివరకు “నాగావళి కథలు”, “వంశధార కథలు” అనే పేర్లతో కథాసంకలనాలను వెలువరించారు. నిరుడు ముచ్చటగా మూడో సంకలనం “జంఝావతి కథలు”ను విడుదల చేశారు. ఆ కథల సంకలనాన్ని ఈ వారం పరిచయం చేసే ప్రయత్నమిది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్, జూనియర్ రచయితలు ఇరవై ఒక్క మంది కథనీకరించిన ఆణిముత్యాలతో ఈ కథలు వెలువడ్డాయి. ఎనభయ్యో పడిలో పడిన పండు ముసలి, కథల కురువృద్ధుడు కాళీపట్నం రామారావు మేష్టారు దాదాపు కథలు రాయడం ఆపేశారనుకున్న దశలో ఒక కథ రాసి కథాభిమానులనే కాదు కారాభిమానులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తారు. కారా మేష్టారు తన ‘అన్నెమ్మ నాయరాలు’ కథలో గ్లోబలైజేషన్ క్రమం మొదలైన రోజుల్లో దాని విష స్వభావం గ్రామాల్లో ఎలా బీజాలు వేసిందో, ప్రజానీకం అప్పుల ఊబిలో తమకు తెలియకుండానే ఎలా దిగబడడం మొదలుపెట్టారో, ఈ రోజు మనం చూస్తున్న ఆత్మహత్యల పర్వానికి అంకురం ఎలా పడిందో వివరంగా తెలియజెప్పారు. కానీ ఇదొక కథలాకాకుండా వ్యాసంలా సాగినట్టనిపిస్తే ఆ తప్పు మనది కాదు, కారాదే. పంతుల కమలకుమారి ‘భస్మ సింహాసనం’ మరో మరిచిపోలేని కథ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త టెక్నిక్ ఉపయోగించి కథనం నెరేట్ చేసేవారు కొంచెం తక్కువమందేనని చెప్పుకోవాలి. ఈ కథతో కమలకుమారి ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

అభివృద్ధి మనకు అందిస్తున్న విషఫలాలను భీతిగొలిపే తీరులో మెరుపువేగంతో రచయిత్రి మనకు వివరిస్తారు. కథకుడికొచ్చిన కల మనకూ పీడకలగా వెంటాడడం ఖాయం. చింతా అప్పలనాయుడు రచించిన ‘భూతాల సొర్గం’ (భూతాల, బూతాల ఏది వాడుకపదం?) చక్కటి జానపద కథ. జంగపు కులస్తుడి పొట్టగొట్టిన ‘అభివృద్ధి’ కథ వెనుక మనకు మరెన్నో జీవన మర్మాలు రచయిత చెప్తాడు. జానపదపు జానుతనాన్ని ఆస్వాదించక, చలనచిత్రాల మత్తులో పడిపోవడం, ఉన్న కొంప రోడ్డువెడల్పులో కోల్పోవడం, వీటిని మించి వ్యక్తిగత అసమర్ధత మనల్ని ఒక్కసారి ఆ జీవితాలను తరచి చూడమని హితవు పలుకుతాయి. అంతే స్థాయిలో మరో అసమర్ధుడి జీవిత పోరాటం పడాల జోగారావు రాసిన ‘చేదు ఫలం’లో సహకార రంగం రైతులకు సహాయమందించక పోగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేయడం చూస్తాం. తెలుగువాడైన ఇంగ్లిషు విలేకరి పాలగుమ్మి సాయినాథ్ ‘మంచి కరువును అంతా ప్రేమిస్తారు’ అన్న పుస్తకాన్ని ఇంగ్లిష్ లో రాశారు. దానిలో చెప్పినట్టుగా కరువు వుండాలని అందరూ కోరుకుంటారట. కరువు ప్రాంతాల్లో బక్కచిక్కిన రైతులే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస కూలీలుగా, రైతు కూలీలుగా పోవడంవల్ల కొంత సమతాస్థితి సాధించవచ్చంటారు. ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్ర రైతు పొట్టచేతబట్టుకుని కూలీగా రైలెక్కి పోవడం మనకు అలవాటైపోయిన మామూలు విషయం. కేవలం వలస కూలీల తరలింపునకే వేసిన రైలుబళ్లు కూడా రాజకీయ చదరంగంలో బంట్లే అని గుర్తుంచుకోవాలని తెలియజెప్తుంది కొప్పల భానుమూర్తి ‘కళింగ ఎక్స్ ప్రెస్’ కథ. భూమిపట్ల మనకున్న అనుబంధం, సంబంధాలలో రెండు తరాల మధ్య చచ్చిన ఆలోచనల్లో మార్పును ఎ.వి. రెడ్డిశాస్త్రి ‘అస్తమయం’ అనే విషాదగాథలో చిత్రించారు.

జార్జి ఆర్వెల్ తన ‘ఏనిమల్ ఫామ్’ నవలలో జంతువులతో మనుషుల కథ చెప్తారు. దానిని మాజిక్ రియలిజం అని ఏ విమర్శకుడైనా అన్నట్టు తెలీదు. దానిని వ్యంగ్యమనే పిలుస్తాం. అలాంటి కొత్త టెక్నిక్ తో కొత్తసీసాలో పాత సారా పోసి దోపీడీ స్వరూపాన్ని చెప్పే ప్రయత్నం చేశారు హిందూ బిజినెస్ లైన్ లో విలేకరిగా పనిచేస్తున్న కె.వి. కూర్మనాధ్ ‘బందెలదొడ్డి’ కథలో. గిరిజన జీవితంలో వచ్చిన, వస్తున్న మార్పులను, అవి వ్యక్తిగత జీవితంలో సృష్టిస్తున్న పెను అలజడులను మల్లిపురం జగదీష్ ‘ఉరులు’ కథ వివరిస్తే, ప్రాజెక్టు నిర్వాసితుల సాధకబాదకాలను గంటేడ గౌరునాయుడు ‘ముంపు’ కథ చెప్తుంది. ప్రైవేటు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు అరకొర వేతనాల సమస్య ఒకప్పుడు ఎదుర్కొనేవాళ్లు. ఇప్పుడు స్కూళ్లమధ్య పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి వారు పీఆర్ ఓలుగా, ప్రచారకులుగా, ఇంకా చాలా రకాల అవతారాలు ఎత్తాల్సివస్తోంది. ఈ దురవస్థను జి.ఎస్. చలం తన ‘పొగ’ కథలో వివరిస్తే, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ‘తిప్పలు’ మరోలావుంటాయి. చేయాల్సిన పని చేయకపోవడం – చేయకూడని పనులు చేస్తుండడం ఆప్తచైతన్య తన ‘చెలగాటం’ కథలో చెప్తారు. ఇలా కళింగాంధ్ర జీవితాన్నంతటినీ కొండను అద్దంలో చూపించే ప్రశంసనీయమైన ప్రయత్నం చేసింది శ్రీకాకుళ సాహితి ఈ ‘జంఝావతి కథలు’ సంపుటంతో.

ఈ పుస్తకం వెలువరించడానికి అనివార్యమైన ఆలశ్యమైంది. ఈ కాలాన్ని ఇందులో ప్రచురించిన కథలను చిత్రిక పట్టడానికి వినియోగిస్తే ఈ కథల సంకలనానికి మరింత సొబగు చేకూరేది. శిల్పపరమైన లోపాలను తొలగించుకుని, మాండలిక దోషాలను పరిహరించుకుని, భాషా, భావపరమైన మార్పులు చేర్పులు చేసుకుని కథలను మరింత పకడ్బందీగా తేవడానికి వినియోగించివుంటే తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే పుస్తకమయ్యేది. అందుకు కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. బివిఏ రామారావు నాయుడు ‘సాటింపు’ కథ ముగింపు దగ్గర అస్పష్టత పాఠకుడికి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చనిది. పైగా మరింత అపార్థానికి తావిచ్చేదిగా వుంది. గొప్పగా ప్రారంభమై మత్స్యకార జీవితాన్ని ఘనంగా చిత్రిస్తాడనుకున్న తయ్యా వెంకటరమణ మూర్తి తన ‘వేరుపాట్లు’ కథను చివరికి మానవీయ కథగా తేల్చి నీరసపరిచారనిపిస్తుంది. చింతాడ తిరుమలరావు ‘ఆటుపోటు’ కథ ఎలాంటి భావావేశాలూ పాఠకునిలో రగిలించని నిష్ప్రయోజనమైన కథ. వ్యక్తిగత విషాదానికి సాహితీ రూపమిస్తే ఎనభయ్యవ దశకంలో అయితే పాఠకుడు చదువుతాడేమో కాని ఈ నూతన సహస్రాబ్దిలో అలాంటి పప్పులుడకవని రచయితలు గుర్తుంచుకోవాలి.

పడాల జోగారావు ‘చేదు ఫలం’ ముగింపు ఎలాంటి సందేశాన్నిస్తుంది? పైగా ఆ సందేశం కూడా కాలం చెల్లిన భావజాలానిది. ఇవ్వాళ దోపిడీదారులు పోలీసులకో, అన్నలకో, అమెరికాకో చెప్తానంటే దోపిడీని అపేసే స్థితిలో లేరు. ఆశావాదం గొప్పదే కాని, అది పలాయనవాదం కాకూడదు కదా! కారా మాష్టారి సాదా కథతో ప్రారంభమైన సంకలనం అట్టాడ అప్పలనాయుడి ‘షా’ కథతో ఎక్కడి ఎత్తుల్ని దర్శించింది. ‘జంఝావతి’కి ఒక నిండుతనాన్ని సంపాదించిపెట్టింది. చదరంగం ఆట మాదిరిగా సాగిపోయే ఈ కథలో అభివృద్ధి మరో పార్శ్వం నగ్నరూపంతో ముందుకొస్తుంది. ఈ కథ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితే బాగుణ్ణు. మరింతమంది ఈ కథను చదవడంద్వారా అభివృద్ధి పేరిట సాగుతున్న రాజకీయ క్రీడ గురించి పాఠకులకు కొత్తకొత్త కోణాల్లో అర్థం చేసుకునే వీలుంటుంది.

ఈ కథలన్నీ ఒక ఎత్తుకాగా, కథలకు ముందు ప్రచురించిన నాగేటిచాలు ఒక్కటీ ఒకఎత్తు. ఈ మూడు పేజీల సారాంశం మొత్తం ఉత్తరాంధ్ర (ఆ మాటకొస్తే ఏ ప్రాంతమైనా సరే) జీవితాన్ని మన కళ్లముందు నిలబెడుతుంది. ఇరవై ఒక్క కథలు, 250 పేజీల ఈ కథాసంకలనం ఖరీదు వంద రూపాయలు మాత్రమే. కాపీలకోసం డాక్టర్ బివిఏ రామారావు నాయుడి గారిని 9441095961 నెంబరు వద్ద సంప్రదించవచ్చు.

“జంఝావతి కథలు”

price రూ.100, శ్రీకాకుళ సాహితి ప్రచురణలు, శ్రీకాకుళం.

వ్యాఖ్యానించండి