సంస్కరణాభిలాష మంచిదే కాని…

సాధారణం

 

ఇంగ్లిషు ఎడిషన్ ముఖచిత్రం

ఇంగ్లిషు ఎడిషన్ ముఖచిత్రం

ఒక

మహమ్మదీయ చక్రవర్తి భారతదేశంలో కొన్నాళ్లు నివశించాక తన చివరి కోరికగా తనను బంధించిన బ్రిటిషువారిని దీనంగా ఒక్కటే వేడుకున్నాడట. మరణాంతరం తన భౌతికకాయాన్ని కర్మభూమి భారతగడ్డలో సమాధి చేయమన్నాడట. ఒక ఇంగ్లిషు శాస్త్రవేత్త భారతదేశం సరదాగా పర్యటనకు వచ్చి ఆజన్మాంతం ఇక్కడే స్థిరపడిపోవడం కాకుండా కట్టుబొట్టుకూడా భారత శైలిలోకి మార్చుకున్నాడట. వివేకానందుడి అనుచరురాలు సిస్టర్ నివేదిత, గాంధీ అనుచరురాలు మేరీబెన్ (మేడలిన్ స్లేడ్) భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎ. ఓ. హ్యూమ్, స్వయానా అతడి సోదరుడు సర్ ఆర్థర్ కాటన్… ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా పెరిగిపోతూనే వుంటుంది. భారతదేశపు విభిన్నత్వాన్ని, వసుధైక కుటుంబ భావనను జీర్ణించుకునే ప్రయత్నంలో భారతదేశంలోనే తమ సుదీర్ఘ జీవనకృషి కొనసాగించి, సేవలందించి చరితార్ధులయ్యారు వీరంతా.

కాని, భారతదేశాన్ని మరింత లోతుగా పరిశీలించినవారికి ఈ దేశం అభివృద్ధి చెందకుండా అగ్రరాజ్యాల సరసన ఎందుకు నిలబడలేకపోతుందో చాలా కారణాలు తెలుస్తాయి. ఏఏ లోపాలతో సమాజం కునారిల్లుతుందో పరిశీలించి ఆ ప్రాంతాలలో సంస్కరణలకు శ్రీకారం చుట్టేవారిని సంస్కర్తలని మనం పిలుస్తుంటాం. సంస్కరణలు జరిగే తీరు, జరుగుతున్న ప్రాంతాలు, సంస్కరణల వేగం ఆ సంస్కరణలను ప్రజలు సమ్మతించడం, ఆ సంస్కరణలకు అనుగుణంగా సాగడం మొదలైన విషయాల మీద సంస్కర్తల విజయం ఆధారపడివుంటుంది. సువిశాల భారతదేశంలో ఏదో ఒక మూల నెమ్మదిగా వారు అంటే ఆ మహాయోధులు నిశ్శబ్దంగా తమ ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభిస్తారు. రామన్ మెగసేసే లాంటి ఏ అవార్డో వారిని వరించినప్పుడు ప్రపంచమంతా ఆ మహనీయుల కృషి గురించి మాట్లాడడం మొదలుపెడుతుంది.

వీరికి బడా సంస్థలు ఆర్థిక విరాళాలు ప్రకటిస్తాయి. ప్రజలు అనుచరులుగా మారుతారు. సంస్కరణ తీరు వేగం అందుకుంటుంది. ఇది సహజంగా జరిగే పరిణామ ప్రక్రియ. కందుకూరి వీరేశలింగం పంతులో, రాజా రామోహనరాయ్ మరీ పాతతరం వారనుకుంటె రాజస్థాన్ ఎడారుల్లో నీటి చెలమలతో రైతుల్లో ఆనందం పండించిన రాజేంద్రసింగ్, గుజరాత్ రాష్ట్రం కార్యక్షేత్రంగా దేశంలో శ్వేతవిప్లవం సృష్టించిన వర్ఘీస్ కురియన్, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ప్రజలకెంతో ఉపయోగపడుతుందని విశ్వసించే సుందరలాల్ బహుగుణ, మేధాపాట్కర్ లు తాజా ఉదాహరణలు. అరుణారాయ్, బాలగోపాల్ లు హక్కుల ఉద్యమాల్లో చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది.

ఆలోచనలతో సుందర భారతాన్ని వీక్షించేవారిలో కె. సి. అగ్రవాల్ ఒకరు. “మన కలల దిశగా రేపటి భారత్” అన్న ఆయన విజనరీ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను. ఇంగ్లిషులో మూలరచనను అవంచ సత్యనారాయణ తెలుగులోకి అనువాదం చేసారు. ఎంతనేర్పుగా ఆయన అనువాదం చేశారంటే ఆర్థిక, గణాంక వివరాలు సైతం అత్యంత సరళంగా చెప్పారు. దురదృష్టవశాత్తూ మూల రచయిత కె. సి. అగ్రవాల్ కు స్వయం సంపూర్ణ సమృద్ధ భారత్ ఏర్పాటులో ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల (లేదా రచయిత అవగాహన నాకు నచ్చకపోవటం వల్ల) అసలు చిక్కంతా వచ్చిపడింది. నాలుగు భాగాలుగా తన మిషన్ (ధర్మలక్ష్యం)ను విభజించుకున్న  రచయిత ‘మనం ఏమిటి?’ అన్న మొదటి భాగంలో మనమెంత పిరికివాళ్లమో, మనకున్న వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, మంటకలిసిన  మానవతా విలువల గురించి ఆక్రోశిస్తారు. దీంట్లో చాలా భాగంతో మనం ఏకీభవించలేం.

రెండవపేజీలో “వ్యక్తులుగా విదేశాలలో మనం విజేతలం. కాని మన దేశంలో పరాజితులం” అంటారు. ఇది తేలిగ్గా అనేసిన మాట. సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే ఇలా అనలేం. మన అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, మన క్రీడాసుమాలు సచిన్, ధోనీ, సానియా, గోపీ, తదితరులు ఇంటగెలిచి రచ్చగెలిచిన వాళ్లే. 11వ పేజీలో “ఈ విధంగా మనం ఏమిటి? ఎందుకు? అనే విశ్లేషణకు బీజాలు నా చిన్నతనంలోనే పడ్డాయి” అంటారు. వెనుకాముందూ ఎంతవెతికినా ఆ విధం ఏమిటో మనకి కనిపించక జుత్తు పీక్కోవాలి. ఒక్క మహమ్మదీయులే మనల్ని దోచుకున్నారనడం తప్పుడు ఆరోపణ. మహమ్మదీయ రాజులలో కొందరు దోపిడీ స్వభావం వున్నా, బ్రిటీషోడి మాదిరిగా వారు వేటినీ తరలించుకుపోలేదు. అన్నీ ఇక్కడే ‘ఎంజాయ్’ చేశారు. రచయిత రాజకీయ నాయకులను అందరినీ ఒకే గాటన కట్టడం మరో తప్పిదం. ‘ఎందుకిలా వున్నామం’టూ రెండో భాగంలో కొంత విశ్లేషణ చేసిన తరువాత ‘ఏమి చేయగలమం’టూ మూడవ భాగంలో 233 పేజీల విశ్లేషణ చేస్తారు. రచయిత అగ్రవాల్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులకు కొంత బోర్ అనిపించినా మొత్తంగా ఒకసారి పరిశీలించదగ సూచనలే చేశారు. వాటిని ఎంతమేరకు పాటించగలమనేది పూర్తి సందేహాస్పదం. ఈ పుస్తకం రాయడానికి తోడుగా రచయిత ‘క్రుసేడ్ ఇండియా’ ను సైతం స్థాపించారు. ఆసక్తిగలవారు ఈ వెబ్సైటులోకి వెళ్లి 500 చెల్లించి ఈ భారత ధర్మదళంలో చేరవచ్చు.

పుస్తకంలో అయితే అలావుంది గాని, వెబ్ సైట్ లో మరోలా వుంది. పుస్తకం చదివిన తరువాత భారత యువత స్పందన చూసి నివ్వెరపోయిన నిర్వాహకులు ఇప్పుడు ఆ ధర్మదళంలో ఉ’చింత’గానే చేరవచ్చునట. పైగా ఈ పుస్తకం ఇంగ్లిషు వెర్షన్ కూడా ఫ్రీగా పొందవచ్చునట. ( www.shapingindia.org )

400 పేజీలతో, చక్కటి డిజైన్ తో, 150 రూపాయల ధరతో, సూర్య్ బుక్స్ రూపొందించిన ఈ పుస్తకం చదవడం సుమారు ఐదారు గంటల సమయం వృధాచేయడం గానే నేను భావిస్తున్నాను. మరి మీరు ఈ పుస్తకం ‘ఎక్కడైనా సంపాదించి’ చదివి మీ అభిప్రాయం చెప్పగలరా!?

ఒక స్పందన »

  1. ఆసక్తి కరంగా ఉంది. ఇంతా చేసి ఆయనొక ఎలెక్ట్రికల్ ఇంజనీరుట.
    అవునూ, మీరెలాగూ శ్రీకాకుళంలోనే ఉంటారు కదా .. ఎప్పుడైనా వైజాగులో భాగవతుల పరమేశ్వర్రావు గార్ని కలిసి మాట్లాడారా? ఆయన కూడా ఈ మధ్యని తన అనుభవాల్ని ఒక పుస్తకంగా ప్రచురించారు.

  2. ఏంటి సార్, సమయం వృధా అని మీరే చెప్పి మళ్లీ చదవమంటారా? మాకెందుకు ఆ బాధ! మీరు చదవమంటే చదువుతాం అంతే.

Leave a reply to కొత్తపాళీ స్పందనను రద్దుచేయి