‘హక్కుల’ ఊపిరి హరిస్తారా?

సాధారణం

జనవరి 13.

భోగీ పండుగ.

చెడుకు ప్రతీకగా భావించి పెద్దపెద్ద కర్ర దుంగలను ఒకచోట పేర్చి భోగీమంట పెట్టి దేశమంతటా చలి కాచుకుంటారు. కానీ మహారాష్ట్రలో పూణెకు దగ్గరలో వున్న లోనోవాలా ప్రాంతంలో నివశిస్తున్న 39 ఏళ్ల సతీష్ శెట్టికి మాత్రమ్ జీవితం చీకటయింది ఆ తెల్లవారి జామునే.

తెల్లవారి నాలుగు కాకముందే సెల్ ఫోన్ అలారమ్ మోగడం మొదలుపెట్టింది. పిల్లలకు నిద్రాభంగం కలగకుండా దాని నోరు నొక్కేసి సతీష్ శెట్టి ఎప్పటిలానే మార్నింగ్ వాక్ కు బయల్దేరాడు. ఇంకా పేపర్ వేసే కుర్రాళ్లు కూడా పనిలోకి దిగలేదు. వీధిలో కొదరు కుర్రకారు చురుగ్గా భోగీమంటకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారు జామునే ప్రకృతికూడా మనిషి మీద పగబట్టినట్టుంది. ఆకు కూడా ఆడడం లేదు. నుదుటిమీద చిరుచెమటను తుడుచుకుంటూ రైల్వే ట్రాక్ దాటి గబగబా నడుస్తున్నాడు సతీష్. అక్కడ సగం కూల్చిన బిల్డింగ్ ఒకటి కనిపించింది. ఆ భవనం పూర్తిగా నేలమట్టం కావడానికి ఇంకా రెండుమూడు రోజులు పడుతుందని ఆలోచిస్తూనే ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయాడు.

నిర్మాణమ్ పూర్తయిన భవనం జోలికి పోవడమెందుకని తన స్నేహితులు కూడా వారించారు. కానీ తన మనసే అంగీకరించలేదు. అది ఖచ్చితంగా రైల్వే స్థలం. నిక్షేపంలాంటి ఆ స్థలంలో యూనియన్ నాయకుడొకరు దర్జాగా రెండంతస్తుల మేడ కట్టేశాడు. దానికి వ్యతిరేకంగా సుమారు ఎనిమిది నెలలు పోరాడాడు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా వెనుకడుగువేసిన అధికారులే చివరకు మహరాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పుడా భవనాన్ని కూలదోస్తున్నారు.

మంచి చెడుల మధ్యనున్న విభజన రేఖ రోజురోజుకు పల్చనైపోతోంది. ధనం, బలం, బలగం ఉన్నవాడికి తానేం చేసినా చెల్లుతుందనే భావన స్థిరపడిపోతోంది. ఆ పనులన్నింటినీ సామాన్య ప్రజలు కనీస స్థాయిలోనైనా ప్రతిఘటించకుండా ఆమోదం తెలుపుతుండడం సతీష్ శెట్టికి మింగుపడడం లేదు.

ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఒకటా.. రెండా.. భూ ఆక్రమణలు, దందాలు… మహారాష్ట్రలోనే తాలెగావ్, లోనోవాలా, పింప్రి, చించివాడ ప్రాంతాలలో సుమారు పద్నాలుగు లాండ్ స్కాములను తానొక్కడే బయటపెట్టాడు. ఒక్కో కేసూ ఒక్కో రకమైనది. రాజకీయ నాయకులు, అధికారులతో కుమ్మక్కై భారత ప్రభుత్వ భూమినే దోచుకోవడం తన మనసును కలిచివేస్తోంది. కేవలం సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకుని ఒక్కొక్కటిగా తాను చేస్తున్న పోరాటాలు అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయి. తనను బెదిరించడం, పత్రికా విలేకరుల సాయంతో రాజీ బేరాలు కుదర్చడం, డబ్బు అనే కుక్క బిస్కట్లు విసిరితే కొందరు ప్రభుత్వ అధికారుల్లాగే లొంగిపోయి తానుకూడా సహకరిస్తానేమోనన్న అనేక పిచ్చి ప్రయత్నాలకు తాను లొంగని విధానాన్ని సతీష్ తనకుతానే మెచ్చుకుంటున్నాడు. ఈ ఆలొచనలతో నడుస్తున్న సతీషుకు ఎక్కడలేని ఆవేశం వచ్చిందని చెప్పడానికి అతని నడకలో వేగమే నిదర్శనం. ఆ ఆలోచనల్లో పడి తన వెనక ఒక గుంపు తనకంటే వేగంగా తనను సమీపిస్తున్న సంగతి పట్టించుకోలేదు.

ఒకవైపు రాజకీయ నాయకుల భూదందాను ప్రతిఘటిస్తూనే మరోవైపు బ్లాక్ మార్కెట్లో కిరోసిన్ వ్యాపారంపైన తాను ఒంటరిగా చేస్తున్న పోరాటం, ఇందులో బయటపడిన బోగస్ రేషన్ కార్డుల వ్యవహారం మరో మూడు నెలల్లో మరెంతమంది చీకటి జీవితాలను బయటపెట్టబోతున్నాయో తనకు తెలీదుగానీ, ప్రజలకు న్యాయంగా అందవలసిన సౌకర్యాలు కొందరి స్వార్థంవల్ల అందకపోవడమే తనను ఇన్ని సాహసకార్యాలు చేయడానికి పురికొల్పిన ఏకైక కారణం.

ఇంతలో తనను చుట్టిముట్టిన ఆజానుబాహులవైపు ఆశ్చర్యంగా చూశాడు. తనకు ఇది కొత్తకాదు. తనను బూతులు తిట్టడం, తనపై చెయ్యి చేసుకోవడం మామూలే. అందుకే సతీష్ నవ్వుతూ, ‘చెప్పండి, ఈసారి ఎవరు పంపించారు. నన్నేం చెయ్యమన్నారో కూడా చెప్పండి. నేనెలా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలో కూడా చెప్పి పంపారా? అని అడిగాడు. కానీ అకస్మాత్తుగా వాళ్లు కత్తులుతీసి తనమీద దాడి చేసేసరికి ఏంచేయాలో పాలుపోలేదు. వెంటనే ఇంటికి వెళ్లాలని మనసుకు తోచింది కాని, శరీరం సహకరించలేదు. దాంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ రోజు సతిష్ కుటుంబ సభ్యులతోపాటు ఆ కాలనీవాసులెవరూ భోగీ పండుగ చేసుకోలేదు…

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనం చేసుకున్న అనేకానేక చట్టాల్లో విప్లవాత్మకమైనదీ, ప్రజాస్వామిక పాలనకు నూతన భాష్యాన్ని చెప్పిన చట్టం సమాచార హక్కు చట్టం. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఆ చట్టం మన దేశంలో అమలులోకొచ్చి ఐదేళ్లు పూర్తవుతోంది. ఎటువంటి విషయం గురించయినా ఈ దేశ ప్రజలు కోరే ఎటువంటి సమాచారాన్నైనా వారికి అందించడాన్ని తప్పనిసరి చేసిన చట్టమిది. దురదృష్టవశాత్తూ ఈ చట్టం సహాయంతో కొందరు పెద్దల అక్రమాలను బయటపెట్టడానికి పూనుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టడం భారత సమాజానికి తలవంపుగా మారింది. సమాచార హక్కు చట్టాన్ని ఆయిధంగా చేసుకుని అన్యాయాలమీద అక్రమాల మీద పోరాడుతున్న తొమ్మిది మంది అసలుసిసలు దేశభక్తులను ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటిదాకా భారతమాత పోగొట్టుకుంది.

విప్లవాత్మకమైన చట్టమనీ, పాలనలో పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనమని, అవినీతి మార్గానికి అంతుపలకడమేనని, ప్రజలే స్వయంగా పాలనపై నిఘా సాగించవచ్చుననీ మరొకటనీ ఇంకొకటనీ ఇంతవరకు మనం ఘనంగా కిర్తిస్తున్న మన సమాచార హక్కు చట్టం మూలానే మనం ఇంతమందిని పోగొట్తుకున్నామంటే ఒక్కసారి ఈ చట్టం వైపు లోతుగా దృష్టి సారించల్సిన అవసరమెంతో ఇంది. ఈ చట్టం ఉనికిలోకి రావడానికి ముఖ్యకారకులైన సామాజిక ఉద్యమకేరిణి అరుణారాయ్ చెప్పినట్టు దేశవ్యాప్తంగా బిటి వంకాయపైన అంత రగడ జరిగిన తర్వాత ప్రభుత్వం ఆ వంకాయ విత్తనాలను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి వెనుకడుగేయడానికి కారణం నిజానికి ఈ సమాచార హక్కు చట్టమేనని చెప్తున్నారు. మరి మనకేం జరిగింది? మనపై మనమే ఎందుకింత అసహనం ప్రదర్శించుకుంటున్నాం? తోటి మనిషిని ఎందుకింత క్రూరంగా చంపుకుంటున్నాం? చట్టాన్ని అమలుపరిచే క్రమంలో ఎంతో కృషిచేస్తున్న సామాజిక ఉద్యమకారులను నిష్కారణంగా ఎందుకు పొట్టన పెట్టుకుంటున్నాం?

ఈ ఏడాది ఇప్పటివరకు ఇందుకోసం ప్రాణాలర్పించింది తొమ్మిది మందే కావచ్చు. అవినితి కార్యకలాపాలను బహిర్గతం చేయడం కోసం, ప్రభుత్వంలోని వివిధ శాఖల వ్యవహార సరళిలో పారదర్శకతకు కృషిసల్పడం కోసం, పాలనలో సరికొత్త ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం కోసం కృషి చేస్తున్న క్రమంలో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న వారు వందలాదిమంది. ఈ క్రమంలో తిట్లు తింటున్న వాళ్లు, దెబ్బలు కాస్తున్న వాళ్లు, కాళ్లుచేతులు పోగొట్టుకుంటున్న వాళ్లు దేశవ్యాప్తమ్గా కొన్ని వందలమంది వున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇప్పటివరకు హతులైన వీరుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నలుగురు, గుజరాత్ లో ఇద్దరు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో ఒక్కొక్కరు అసువులు బాసారు. చాలా విచిత్రంగా ఈ హత్యలన్నింటి వెనుక మాఫియా, రాజకీయ నాయకుల, కొందరు అధికారుల హస్తముండడం జాతి యావత్తు సిగ్గుపడాల్సిన విషయం. ఇంకా విచిత్రంగా ఈ హత్యకేసులు నడుస్తుండడం గమనిస్తే మనమీద మనకే అసహ్యం వేస్తుంది. చనిపోయిన వారిమీదే తప్పంతా తోసేసి వారికే జరిమానాలు విధించిన మన పోలీసులు, అధికారులు, వారికి వెన్నుదన్నుగా నిలిచే రాజకీయ నాయకులు… కేవలం మనకే సొంతం. అరుణారాయ్ ఏమంటారంటే ఆర్థిక సరళీకరణలు దేశంలో చోటుచేసుకున్న తరువాత దేశంలో కొత్తగా పోగవుతున్న సంపదను గుత్తసొత్తుగా దోచుకోవడానికి రాజకీయ నాయకులు, అధికారులు జరుపుతున్న కుట్రలో సామాజిక ఉద్యమకారులు సమిధలు అవుతున్నారు. ఇలా తమ అక్రమాలను బయటపెడుతున్న వారికి గుణపాఠం చెప్పడానికి కొందరిని చంపడంద్వారా తమ అక్రమాల జోలికి వస్తే ఏమవుతుందో తెలుసుకోమని వారు కొన్ని హెచ్చరికలు చేస్తారు. దీనిద్వారా వారు పంపదలచుకున్న సందేశం ప్రజలకు చేరిపోతుంది. వారి ఆగడాలకు హద్దు వుండదు.

తాజాగా జరిగిన సంఘటన ఈ విషయంలో సభ్య సమాజం ఎంత అప్రమత్తంగా ఉండాలో మరింత హెచ్చరికగా చెప్తోంది. మొన్న జులై 20నాడు పట్టపగలు గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వాను దుండగులు కాల్చి చంపారు. వన్యప్రాణి సంరక్షణలో అమిత్ పేరు ఇప్పటికే దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. గిర్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో గిర్ సింహాల భద్రతకోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న అమిత్ కూడా సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు. అక్కడ గనుల తవ్వకానికి కుయుక్తులు పన్నుతున్న భారతీయ జనతా పార్టీకి చెందిన జునాఘడ్ ఎంపీ చాలాకాలం నుంచి బెదిరిస్తున్నట్టు అమిత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ సంరక్షణ కేంద్రం ఆవరణలోనే అక్రమంగా వెలిసిన ఆశ్రమానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో అమిత్ గెలిచాడు. ఆ ఆశ్రమాన్ని ఖాళీ చేయించమని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. కాని, దానికున్న మతపరమైన మద్దతు కారణంగా ఖాళీ చేయించడానికి ఇప్పటికీ గుజరాత్ పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. అమిత్ చేసుకున్న విన్నపాల ఫలితంగానే ఆ రాష్ట్రానికి మరో ఇద్దరు సమాచార కమిషనర్లను నియమించారు. అమిత్ చొరవవల్లనే ఏడేళ్లుగా ఖాళీగావున్న లోకాయుక్తను గుజరాత్ ప్రభుత్వం నియమించాల్సివచ్చింది.

హత్యలకు గురయిన కేసుల్లో ఎక్కువ శాతం పాత కక్షలే కారణమని పోలీసులు కొట్తి పారేస్తున్నారు. బీహార్ లో సమాచార హక్కు చట్టం పని తీరును ఎప్పటికప్పుదు ప్రజలకు తెలుపుతూ బీహార్ ఆర్ టి ఐ మంచ్ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. కేసుల వివరాలతోపాటు, సమాచార హక్కుల కోసం పోరాడేవారిని ఎవరేమన్నా వెంటనే ఈ మంచ్ అందరినీ అలర్ట్ చేస్తుంది. దీని అధ్యక్షుడు ప్రవీణ్ అమానుల్లా ఏమంటారంటే ‘ఇప్పుడు బెదిరింపులు రాజకీయ నాయకులనుంచి, అధికారుల నుంచి, నేరగాళ్ల నుంచే కాకుండా కొత్తగా చట్టాన్ని అమలుపరచవలసిన అధికారుల నుంచే ఎక్కువవుతున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించిన వారందరిపైనా లేనిపోని కేసులు బనాయిస్తున్నారు’.

సమాచార హక్కు చట్టం అమలుతోపాటు, ఇప్పుడు ఆ చట్టాన్ని ఆశ్రయించినవారికి రక్షణ కల్పించడానికి కొత్త చట్టం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చట్టం ప్రధాన ఉద్దేశం పాలన విధాన నిర్ణయాలలో, అమలులో గోప్యత లేకుండా చూడడం. కాగా, ఇప్పుడు ఈ అస్త్రాన్ని వాడుకున్న వారికి రక్షణ కల్పించమని అడగడం మన దేశానికున్న విరోధాబాసనే గుర్తు తెప్పిస్తుంది. కాగా, సమాచార హక్కు చట్టాన్ని రూపొందించిన అరుణారాయ్ బృందానికే ఈ కొత్త బాధ్యతను ప్రభుత్వం అప్పగించడం కొసమెరుపు.

(అక్టోబర్, 2010 ‘సత్యం’ మాస పత్రికలో కవర్ స్టోరీగా ప్రచురితమైంది.)

ఒక స్పందన »

  1. బాగుంది మీ సమాచారం. ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్లపై దాడులు జరుగుతూనే వున్నాయి. రాజ్యాంగబద్దంగా పాలన సాగించలేని అసహాయతకు గురైన పాలక వర్గం ఓ పెద్ద లైసెన్సుడ్ మాఫియాగా మారిపోయి చాలా కాలమయ్యింది…

వ్యాఖ్యానించండి